‘సలాం హారతి’ పేరు మార్పు వివాదం ఏమిటి? హిందూ దేవాలయాల్లో టిప్పు సుల్తాన్ దీన్ని ప్రవేశపెట్టారా

టిప్పు సుల్తాన్

ఫొటో సోర్స్, PRINT COLLECTOR

కర్ణాటకలో మరొకసారి ‘సలాం హారతి’ వివాదం వార్తల్లోకి వచ్చింది.

ఆ రాష్ట్రంలోని కొన్ని దేవాలయాల్లో ఉన్న ‘సలాం హారతి’ పద్ధతి పేరును కర్ణాటక ప్రభుత్వం మారుస్తున్నట్లుగా ప్రకటించడమే దీనికి కారణం.

మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్, అప్పట్లో తన రాజ్యంలోని కొన్ని ఆలయాల్లో ‘సలాం హారతి’ అనే సంప్రదాయాన్ని ప్రారంభించినట్లు చెబుతారు. ఇప్పుడు దీని పేరును ‘హారతి నమస్కార’ అని మారుస్తున్నట్లు ‘కర్ణాటక హిందూ రెలిజియస్ ఇనిస్టిట్యూషన్స్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్’ మంత్రి శశికళ జోలె తెలిపారు.

‘ఇందుకు సంబంధించి అధికారిక ఉత్తర్వులు త్వరలోనే అన్ని దేవాలయాలకు పంపిస్తాం. సలాం హారతి అనే పూజా పద్ధతి ఉంటుంది. దాని పేరును మాత్రం హారతి నమస్కారగా మారుస్తాం’ అని శశికళ జోలె తెలిపినట్లు వార్తా పత్రిక ది హిందూ పేర్కొంది.

పుత్తుర్ శ్రీమహాలింగేశ్వర టెంపుల్

ఫొటో సోర్స్, Shree Mahalingeshwara Temple, Puttur/Facebook

‘సలాం హారతి’ అంటే?

కర్ణాటకలోని కొన్ని దేవాలయాల్లో ‘సలాం హారతి’ అనే పూజా సంప్రదాయం ఉంది.

మైసూరు రాజు టిప్పు సుల్తాన్ తన రాజ్యంలోని హిందూ దేవాలయాలను సందర్శించినప్పుడు ఈ పద్ధతి ప్రవేశపెట్టారని చెబుతుంటారు.

కొల్లూరు మూకాంబికా ఆలయానికి టిప్పు సుల్తాన్ వెళ్లినప్పుడు, అక్కడి అమ్మవారికి ‘సలాం’ చేసి పూజలు చేశారనే కథలు ప్రచారంలో ఉన్నాయి. అలా ఆయన ‘సలాం’ చేశారు కాబట్టి ఆ పూజా పద్ధతికి ‘సలాం ఆరతి’ అనే పేరు వచ్చినట్లు చెబుతారు.

కొల్లూరు మూకాంబికా దేవాలయంలో పూజారిగా పని చేసిన శ్రీధర్ అడిగ దీనిపై మాట్లాడుతూ.. ‘సలాం ఆరతిలో భాగంగా అమ్మవారి కీర్తనలు పాడతారు. ప్రత్యేక సంగీత వాద్యాలు వాయిస్తారు. మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్ రాకముందు సాయంత్రం పూట జరిగే పూజా సంప్రదాయాలను ప్రదోష పూజ అనేవారు.

ఆ తరువాత వాటిని సలాం ఆరతి అని పిలిచే వారు. ఆ పూజలు సాయంత్రం జరుగుతాయి. వేదాల ప్రకారం సూర్యాస్తమయానికి చాలా పవిత్రత ఉంది. ఈ సమయంలో శివుడు తాండవ నృత్యం చేస్తాడని భావిస్తారు.’

అయితే కొల్లూరు మూకాంబిక దేవాలయానికి టిప్పు సుల్తాన్ వచ్చినట్లు తెలిపేందుకు సరైన ఆధారాలు లేవు అని కొందరు దేవాలయ అధికారులు చెప్పారు. కానీ టిప్పు సుల్తాన్ సందర్శనకు గుర్తుగా భావిస్తూనే సలాం హారతి సంప్రదాయాన్ని తరాలుగా కొనసాగిస్తూ వస్తున్నారని తెలిపారు.

కర్ణాటకలోని అనేక దేవాలయాల్లో ‘సలాం హారతి’ సంప్రదాయం ఉందని కర్ణాటక ధార్మిక పరిషత్ సభ్యుడు కషెకోడి సూర్యనారాయణ భట్ తెలిపారు. కుక్కి సుబ్రమణ్య దేవాలయం, పుత్తుర్‌లోని మహాలింగేశ్వర దేవాలయంతో పాటు కొన్ని ఇతర గుడుల్లోనూ ‘సలాం హారతి’ పూజా పద్ధతి ఉందని ఆయన వివరించారు.

టిప్పు సుల్తాన్ సందర్శించాడని చెప్పే కొల్లూరు మూకాంబికా ఆలయం

ఫొటో సోర్స్, kollurmookambika.org

ఫొటో క్యాప్షన్, టిప్పు సుల్తాన్ సందర్శించాడని చెప్పే కొల్లూరు మూకాంబికా ఆలయం

టిప్పు సుల్తాన్ కేంద్రంగా వివాదం

కొంతకాలంగా ‘సలాం హారతి’ సంప్రదాయం చుట్టూ కర్ణాటకలో వివాదం నడుస్తోంది.

‘ముస్లిం పాలకుడైన టిప్పు సుల్తాన్ పేరు మీద హిందూ దేవాలయాల్లో పూజలు ఎలా చేస్తారు’ అంటూ హిందూత్వ సంస్థలకు చెందిన కొందరు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ‘టిప్పు సుల్తాన్ హిందూ వ్యతిరేకి. ఆయన అనేక హిందూ దేవాలయాలను కూలగొట్టాడు. కాబట్టి వెంటనే ఆ సంప్రదాయాన్ని నిలిపివేయాలి’ అంటూ కొంతకాలంగా వారు డిమాండ్ చేస్తూ వస్తున్నారు.

కొల్లూరు దేవాలయంలో ‘గతంలో మాదిరిగానే సాయంత్రం చేసే పూజలను ప్రదోష పూజ’ అని పిలవాలంటూ విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేసింది. ‘సలాం హారతి అనేది బానిసత్వానికి చిహ్నం’గా ఉందని అది వాదిస్తోంది.

అయితే కొల్లూరు మూకాంబికా దేవాలయం రికార్డుల్లో ఎక్కడా ‘సలాం హారతి’ అనే పదం లేదని దేవాలయ ఎగ్జిక్యూటివ్ అధికారి అన్నారు. ప్రతిరోజూ సాయంత్రం పూట 7.15 గంటల నుంచి 8 గంటల మధ్య నిర్వహించే దాన్ని ‘ప్రదోష పూజ’ పేరుతో పిలుస్తున్నారని, గుడి ముద్రించే బ్రోచర్లలోనూ దాన్ని ‘ప్రదోష పూజ’గానే రాస్తున్నట్లు చెబుతున్నారు.

టిప్పు సుల్తాన్

ఫొటో సోర్స్, Getty Images

‘అలాగే కొనసాగించాలి’

అయితే కొందరు ‘సలాం హారతి’ పేరు మార్చడాన్ని తప్పుపడుతున్నారు. హిందువులు, ముస్లింల మధ్య సామరస్యతకు అది ప్రతీకగా ఉందని, కాబట్టి దాన్ని కొనసాగించాలని కోరుతున్నారు.

‘ఇతర మతాల వారు కూడా హిందూ దేవాలయాలకు వచ్చేవారు అని చెప్పడానికి ఇటువంటి పద్ధతులు చాలా మంచి ఉదాహరణలుగా ఉంటాయి. తన పాలనలోని హిందూ దేవాలయాలను టిప్పు సుల్తాన్ ఎలా చూశాడో ఇలాంటివి తెలుపుతాయి.

పాలకులు మారినప్పుడల్లా దేవాలయాల్లో నియమాలు మారుతూ వచ్చాయి. కొన్ని అలాగే నేటికీ కొనసాగుతున్నాయి’ అని చరిత్రకారుడు తలకడు చిక్కరంగే గౌడ ది హిందూతో అన్నారు.

‘సలాం హారతి పూజలు టిప్పు సుల్తాన్ పేరు మీద జరగడం లేదు. మూడోవ ఆంగ్లో-మైసూర్ యుద్ధం గెలిచినప్పుడు టిప్పు సుల్తాన్ మంగళూరు ప్రాంతానికి వెళ్లారు. ఆ సమయంలో ఆయన కొల్లూరు దేవాలయాన్ని సందర్శించారు. అప్పుడు అమ్మవారికి సలాం చేసి ఆయన గౌరవించారు. ఆ దేవాలయానికి అనేక రకాలుగా సాయం కూడా చేశారు.

నాటి నుంచి సలాం హారతి సంప్రదాయం కొనసాగుతోంది. అది ఒక పద్ధతి మాత్రమే. అదేమీ టిప్పు సుల్తాన్ పేరు మీద జరగడం లేదు. పేరు మార్చడం వల్ల ముస్లింలు మాత్రమే కాదు హిందువుల సెంటిమెంట్ కూడా దెబ్బతింటుంది. ఆ సంప్రదాయాన్ని అలాగే కొనసాగించాలి’ అని టిప్పు సుల్తాన్ వంశానికి చెందిన సాహెబ్‌జాదా మన్సూర్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)