డ్రైవర్ కొడుకు ముఖ్యమంత్రి అయ్యారు

సుఖ్విందర్ సింగ్ సుఖు

ఫొటో సోర్స్, @HARISHRAWATCMUK

ఫొటో క్యాప్షన్, హిమాచల్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు
    • రచయిత, పంకజ్ శర్మ
    • హోదా, బీబీసీ కోసం

హిమాచల్ ప్రదేశ్‌లోని నాదౌన్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ సుఖ్విందర్ సింగ్ సుఖు ఈ రోజు హిమాచల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఇప్పటివరకు సుఖ్విందర్ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

ఇంతకు ముందు కాంగ్రెస్ నుంచి హిమాచల్ ప్రదేశ్‌కు ముగ్గురు ముఖ్యమంత్రులు ఎన్నికయ్యారు. వారు డాక్టర్ యశ్వంత్ సింగ్ పర్మార్, ఠాకూర్ రాంలాల్, వీరభద్ర సింగ్. ముగ్గురూ రాజపుత్ కులస్థులు. ఈసారి కూడా రాజ్‌పుత్ కులానికి చెందిన సుఖునే ముఖ్యమంత్రిని చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది.

2011 జనాభా లెక్కల ప్రకారం, హిమాచల్ ప్రదేశ్ జనాభాలో 50.72 శాతం అగ్రవర్ణాలకు చెందినవారు. వీరిలో 32.72 శాతం రాజపుత్‌లు కాగా, 18 శాతం మంది బ్రాహ్మణులు. 25.22 శాతం షెడ్యూల్డ్ కులాలు, 5.71 శాతం షెడ్యూల్డ్ తెగలు, 13.52 శాతం ఓబీసీ, 4.83 శాతం ఇతర వర్గాలకు చెందినవారు ఉన్నారు.

తండ్రి బస్సు డ్రైవర్, తల్లి గృహిణి

హిమాచల్ ప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లా నాదౌన్ తహసీల్‌లోని సెరా గ్రామానికి చెందిన సుఖ్‌విందర్ సింగ్ సుఖు 1964 మార్చి 26న జన్మించారు. 

సుఖ్విందర్ సింగ్ సుఖు తండ్రి రసీల్ సింగ్ సిమ్లాలో హిమాచల్ రోడ్ రవాణా సంస్థలో డ్రైవర్‌గా పనిచేసేవారు. తల్లి సంసార్ దేవి గృహిణి. నలుగురు తోబుట్టువులలో సుఖ్విందర్ రెండవవాడు. ఆయన అన్న రాజీవ్ ఆర్మీలో పనిచేసి రిటైరయ్యారు. ఇద్దరు చెల్లెళ్లకు వివాహమైంది. 

సుఖ్విందర్ విద్యాభ్యాసం హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో సాగింది. అక్కడే ఎల్ఎల్‌బీ పూర్తి చేశారు. 

1998 జూన్ 11న కమలేష్ ఠాకూర్‌ను చేసుకున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు. దిల్లీ యూనివర్సిటీలో చదువుతున్నారు.

సుఖ్విందర్ సింగ్ సుఖు కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్‌యూఐలో చేరడం ద్వారా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు.

సిమ్లాలోని సంజౌలి కళాశాలలో క్లాస్ రిప్రజెంటేటివ్‌గా, విద్యార్థి కేంద్ర సంఘం జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. తరువాత ఈ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. క్రమంగా ఆయన యువనేతగా ఎదిగారు.

ప్రమాణ స్వీకారానికి హాజరైన సుఖ్విందర్ తల్లి సంసార్ దేవి

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, ప్రమాణ స్వీకారానికి హాజరైన సుఖ్విందర్ తల్లి సంసార్ దేవి

ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడి పదవి నుంచి అసెంబ్లీ వరకు..

కాంగ్రెస్‌కు చెందిన వీరభద్ర సింగ్, సుఖ్‌రామ్, బీజేపీకి చెందిన శాంత కుమార్ వంటి పెద్ద పెద్ద నాయకులు హిమాచల్ ప్రదేశ్ రాజకీయాలలో చక్రం తిప్పుతున్న కాలం అది. 

1988లో సుఖ్విందర్ సింగ్ సుఖు ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ తరువాత 1995లో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. ఇది పెద్ద బాధ్యత.

1998 నుంచి 2008 వరకు వరుసగా పదేళ్లపాటు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించారు. రెండు సార్లు సిమ్లా మునిసిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. 

కానీ ఆయన లక్ష్యం పెద్దది. అందుకే, 2003లో మొదటిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి, గెలిచారు.

సుఖ్విందర్ సింగ్ మొదటి నుంచి విలక్షణమైన నాయకత్వ ప్రతిభను కనబరుస్తూ వచ్చారని, తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా చెప్పేవారని సీనియర్ జర్నలిస్ట్ అర్చన ఫూల్ అన్నారు. 

సుఖ్విందర్‌కు హిమాచల్ రాజకీయాల్లో మంచి పట్టు ఉంది. తన ప్రజల మద్దతు బలంగా ఉంది. అందుకే ఎమ్మెల్యేలు అందరూ సుఖ్విందర్‌ వైపే మొగ్గు చూపారు.

సాధారణ కుటుంబం నుంచి వచ్చిన సుఖ్విందర్‌ ప్రజాదరణ కలిగిన నాయకుడని, అందరి క్షేమం కోరే వ్యక్తి అని, ఆయన వల్లనే హిమాచల్‌లోని హమీర్‌పూర్‌, ఉనా, కాంగ్రా జిల్లాల్లో కాంగ్రెస్‌ మంచి పనితీరు కనబరిచిందని ఆయన మద్దతుదారుల్లో ఒకరైన సునీల్ కశ్యప్ చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

వీరభద్ర సింగ్‌తో గొడవ

ఆ తరువాత నాదౌన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2007, 2017, ఇప్పుడు 2022లో నాల్గవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వీటి మధ్య 2008లో రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అయ్యారు. 

2012 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి పరాజయాన్ని చవిచూసినా, ఆయన కుంగిపోలేదు.

2013 జనవరి 8న హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పార్టీ పగ్గాలు చేపట్టారు.

ఆ సమయంలోనే సుఖ్విందర్‌కు రాజకీయంగా అనేక సమస్యలు ఎదురయ్యాయి. కాంగ్రెస్ నుంచి ఆరుసార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికయిన వీరభద్ర సింగ్‌తో గొడవలు మొదలయ్యాయి. 

దాదాపు ఆరేళ్లు ఆయన హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. పార్టీని బలోపేతం చేసేందుకు కృషిచేశారు. 2017-18 ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమితో 2019 జనవరి 10న అధ్యక్ష పదవి నుంచి వైదొలిగారు. 

2022 అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఏప్రిల్‌లో పార్టీ ఆయన్ను హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌గా, టిక్కెట్ పంపిణీ కమిటీ సభ్యునిగా నియమించి పెద్ద బాధ్యతలు అప్పగించింది. 

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో ముఖ్యమంత్రిపై చర్చ జోరందుకుంది. సుఖ్విందర్ మొదటి నుంచి రేసులో ఉన్నారు. దాదాపు 48 గంటల పాటు కేంద్ర పరిశీలకుల బృందంతో చర్చ జరిపిన తరువాత, హిమాచల్ సీఎంగా సుఖ్విందర్ పేరును పార్టీ ప్రకటించింది.

రేసులో ప్రతిభా సింగ్, సుఖ్విందర్ సింగ్ సుఖు, ముఖేష్ అగ్నిహోత్రి ఉన్నట్లు కాంగ్రెస్ నాయకుడు ఒకరు చెప్పారు. ఆయన తన పేరును గోప్యంగా ఉంచమని కోరారు.

ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని విడివిడిగా సేకరించినప్పుడు, 21 మందికి పైగా ఎమ్మెల్యేలు సుఖ్విందర్‌కే ఓటు వేశారని చెప్పారు.

మాజీ హిమాచల్ సీఎం జయరాం ఠాకూర్‌తో

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, మాజీ హిమాచల్ సీఎం జయరాం ఠాకూర్‌తో

ముఖ్యమంత్రిగా..

కేంద్ర పరిశీలకుల బృందం శుక్రవారం నాటి సమావేశంలో సింగిల్‌ లైన్‌ తీర్మానం చేసి, తుది నిర్ణయాన్ని కాంగ్రెస్‌ హైకమాండ్‌కే వదిలేసింది. కాగా, పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ శనివారం సిమ్లాలో తన నిర్ణయాన్ని ప్రకటించింది. 

నిర్ణయం తీసుకోవడంలో కాంగ్రెస్ ఎలాంటి జాప్యం, తప్పు చేయకపోవడం మొదటిసారి చూస్తున్నానని సీనియర్‌ జర్నలిస్టు ప్రదీప్‌ చౌహాన్‌ అన్నారు. 

పంజాబ్ లాంటి పరిస్థితి హిమాచల్ ప్రదేశ్‌లో రాకూడదన్న ఉద్దేశంతో త్వరితగతిన నిర్ణయం తీసుకున్నారని, కాంగ్రెస్ వ్యూహ స్పష్టంగా ఉందని ఆయన అన్నారు. 

సుఖ్విందర్ సింగ్ సుఖు హిమాచల్ ప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా డిసెంబర్ 11న సిమ్లాలోని చారిత్రక రిడ్జ్ గ్రౌండ్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. పలువురు కాంగ్రెస్ జాతీయ నాయకులు ఈ వేడుకలో పాల్గొన్నారు. 

ఇప్పుడు హిమాచల్ ముఖ్యమంత్రిగా ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చడం, హిమాచల్‌ను అప్పుల నుంచి బయటపడేయడం వంటి పెద్ద బాధ్యతలు ఆయనపై ఉన్నాయి.

వీడియో క్యాప్షన్, వైరల్ వీడియో: హిమాచల్ ప్రదేశ్‌లో కొండచరియ ఎలా విరిగిపడిందో చూశారా?

ఇవి కూడా చదవండి: