తెలంగాణ బీజేపీ ‘ప్రజా సంగ్రామ యాత్ర’కు హైకోర్టు అనుమతి...అసలు వివాదం ఏంటి

బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్

ఫొటో సోర్స్, Bandi Sanjay Kumar/Facebook

    • రచయిత, ప్రవీణ్ శుభం
    • హోదా, బీబీసీ కోసం

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ 5వ విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’కు తెలంగాణ హై కోర్టు అనుమతులు జారీ చేసింది.

అయితే కొన్ని షరతులు విధించింది. భైంసా పట్టణంలోకి యాత్ర వెళ్లకూడదని, దానికి మూడు కిలోమీటర్ల దూరంలో సభ నిర్వహించాలని ఆదేశించింది.

ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ పార్లమెంట్ స్థానాల పరిధిలో ఈ యాత్ర సాగుతుంది. అయితే అనుమతి లేదంటూ యాత్ర చేపట్టడాన్ని తెలంగాణ పోలీసులు అంతకు ముందు అడ్డుకున్నారు.

‘ప్రజా సంగ్రామ యాత్ర’ కోసం నిన్న అంటే ఆదివారం భైంసాకు బయల్దేరిన బండి సంజయ్‌ను జగిత్యాల జిల్లా కోరుట్ల సమీపంలో పోలీసులు అరెస్ట్ చేసి, కరీంనగర్‌లోని ఆయన నివాసానికి తరలించారు.

బండి సంజయ్‌ను అరెస్టు చేస్తున్న పోలీసులు

ఫొటో సోర్స్, Bandi Sanjay Kumar/Facebook

ఫొటో క్యాప్షన్, బండి సంజయ్‌ను అరెస్టు చేస్తున్న పోలీసులు

ఇందుకు నిరసనగా వీధుల్లోకి వచ్చిన బీజేపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్ జ్యోతినగర్‌లోని బండి సంజయ్ నివాసం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున బండి సంజయ్ నివాసం వద్దకు చేరుకున్నారు.

ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్... ఈ మూడు పార్లమెంటు నియోజకవర్గాల్లో ప్రస్తుతం బీజేపీ ఎంపీలే ఉన్నారు. ఇక్కడ యాత్ర వల్ల పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వస్తుందని బీజేపీ భావిస్తోంది.

బీజేపీ గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ రోజు (నవంబర్ 28), నిర్మల్ జిల్లా భైంసా నుంచి ‘ప్రజా సంగ్రామ యాత్ర’ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఈ యాత్ర చేపట్టడానికి అనుమతులు లేవని పోలీసులు తెలిపారు.

నిరసనలకు దిగిన బీజేపీ కార్యకర్తలు

ఫొటో సోర్స్, UGC

ముందు అనుమతి ఇచ్చి ఇప్పుడు రద్దు చేయడం ఏంటని బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు.

‘యాత్రకు ముందు అనుమతి ఇచ్చి ఇప్పుడు హఠాత్తుగా క్యాన్సిల్ చేయడం ఏంటీ? భైంసా ఏమైనా నిషేధిత ప్రాంతమా? అక్కడికి ఎందుకు వెళ్లొద్దు? భైంసాను కాపాడలేని ముఖ్యమంత్రి ఇక రాష్ట్రాన్ని ఏం కాపాడతాడు?’ అంటూ అరెస్ట్ సందర్భంగా బండి సంజయ్ కుమార్ తన నిరసన వ్యక్తం చేశారు.

గత పది రోజుల నుంచి యాత్రకు ఏర్పాట్లు చేస్తుంటే చివరి నిమిషంలో అనుమతి లేదని చెప్పడం ఏంటని బీజేపీ శ్రేణులు మండిపడ్డాయి. కోర్టు ద్వారా అనుమతులు తెచ్చుకొని యాత్ర కొనసాగిస్తామని చెప్పాయి.

కరీంనగర్‌లోని తన నివాసంలో బీజేపీ పార్టీ న్యాయ సలహా బృందంతో బండి సంజయ్ కుమార్ చర్చించారు.

‘కోర్టు ద్వారా అనుమతి వచ్చిన తరువాత, మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభం కావాల్సిన భైంసా సభ, సాయంత్రం 3-4 గంటలకు ప్రారంభమవుతుంది. పర్మీషన్ కోసం 10 రోజుల ముందే అప్లై చేశాం. చివరి నిమిషంలో అనుమతి లేదని చెప్పారు.

మహారాష్ట్ర ఉప మఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, భైంసా సభకు అతిథిగా వస్తున్నారు’ అని ‘ప్రజా సంగ్రామ యాత్ర’ ప్రముఖ్ డాక్టర్.గంగిడి మనోహర్ రెడ్డి బీబీసీతో అన్నారు.

అయితే భైంసాలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ప్రజాసంగ్రామ యాత్రకు అనుమతి ఇవ్వలేదని నిర్మల్ జిల్లా ఎస్పీ చెప్పారు.

‘గత అనుభవాల నేపథ్యంలో భైంసాలో ఉన్న సున్నిత పరిస్థితుల దృష్ట్యా బండి సంజయ్ పాదయాత్రకు అనుమతి నిరాకరించాం. ప్రస్తుతం భైంసాలో సాధారణ పరిస్థితులు ఉన్నాయి. అనుమతి కోసం అప్లికేషన్ ఇచ్చిన 28 గంటల్లోనే అనుమతి నిరాకరిస్తున్నట్టుగా విషయం చెప్పాం. చివరి నిమిషంలో నిరాకరించామనడం అవాస్తవం’ అని నిర్మల్ జిల్లా ఎస్పీ చల్ల ప్రవీణ్ కుమార్ బీబీసీతో అన్నారు.

20 రోజుల పాటు 220 కి.మీ సాగే 5వ విడత పాదయాత్ర డిసెంబర్ 18న కరీంనగర్‌లో బహిరంగ సభతో ముగుస్తుంది.

ఈ సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా ముఖ్య అతిథిగా హాజరవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)