వరల్డ్ ఎయిడ్స్ డే: హెచ్ఐవీ/ఎయిడ్స్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఆలమూరు సౌమ్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రతి ఏడాది డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ దినాన్ని జరుపుకుంటారు.
హెచ్ఐవీకి వ్యతిరేకంగా పోరాటానికి, హెచ్ఐవీతో జీవిస్తున్నవారికి మద్దతు అందించేందుకు, ఎయిడ్స్‌తో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించేందుకు వరల్డ్ ఎయిడ్స్ డే ఒక సందర్భం.
ఎయిడ్స్ వ్యాధి తొలి కేసు నమోదై మూడు దశాబ్దాలు దాటినా, ప్రపంచ వ్యాప్తంగా ప్రజల్లో ఈ వ్యాధి మీద అనేక అపోహలు, సందేహాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
ఈ సందేహాలకు సమాధానమే ఈ కథనం.

ఫొటో సోర్స్, Getty Images
1. హెచ్ఐవీ అంటే ఏమిటి?
హ్యూమన్ ఇమ్యునో డెఫిషియన్సీ వైరస్ (HIV) - ఇది రోగనిరోధక వ్యవస్థపై దాడి చేసే వైరస్. శరీరానికి అంటువ్యాధులు, రోగాలతో పోరాడే సామర్థ్యాన్ని బలహీనపరుస్తుంది.
2. హెచ్ఐవీ ఎలా సోకుతుంది?
రక్షణ లేకుండా సెక్స్‌లో పాల్గొనడం, హెచ్ఐవీ ఉన్నవారికి వాడిన సూదులు, సిరంజిలను ఇతరులకు వాడడం, హెచ్ఐవీ సోకినవారి రక్తాన్ని మరొకరిని ఎక్కించడం ద్వారా హెచ్ఐవీ సోకుతుంది.
అలాగే, హెచ్ఐవీ ఉన్న తల్లుల నుంచి పిల్లలకు సోకుతుంది. బిడ్డ కడుపులో ఉన్నప్పుడు, కాన్పు సమయంలో లేదా తల్లిపాల ద్వారా బిడ్డకు సోకవచ్చు.
సుఖవ్యాధులు (సెక్సువల్లీ ట్రాన్స్‌మిటెడ్ డిసీజ్- STD) ఉన్నవారికి హెచ్ఐవీ సోకే రిస్క్ ఎక్కువ.
3. ఎయిడ్స్ అంటే ఏంటి?
అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోం (AIDS) - ఇది హెచ్ఐవీ ఇంఫెక్షన్ చివరి దశ. ఈ దశలో రోగ నిరోధకశక్తి పూర్తిగా క్షీణిస్తుంది. శరీరానికి ప్రాణాంతక వ్యాధులతో పోరాడే సామర్థ్యం ఉండదు.
హెచ్ఐవీ సోకిన దగ్గర నుంచి ఎయిడ్స్ వ్యాధిగా మారడానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చని డబ్ల్యూ హెచ్‌ఓ చెబుతోంది.
4.హెచ్ఐవీ ఉన్నవారందరికీ ఎయిడ్స్ వస్తుందా?
కాదు. హెచ్ఐవీ సోకితే, అది ఎయిడ్స్‌కు దారి తీస్తుందని చెప్పలేం. హెచ్ఐవీ ఉన్నవారికి తరచూ అంటువ్యాధులు, తీవ్ర స్థాయిలో ఇంఫెక్షన్లు సోకడం, లేక రక్తంలో తెల్ల రక్తకణాలు (CD4 కణాలు) నిర్దిష్టమైన స్థాయికి మించి పడిపోతే ఎయిడ్స్ సోకినట్టు వైద్యులు నిర్థరిస్తారు.
5. హెచ్ఐవీ సోకిందని ఎలా తెలుస్తుంది?
దీనికి రక్తపరీక్ష ఒక్కటే మార్గం. హెచ్ఐవీని ఎంత తొందరగా గుర్తిస్తే అంత తొందరగా వైరస్ లక్షణాలను తగ్గించే చికిత్స ప్రారంభించవచ్చు.
6. హెచ్ఐవీ లక్షణాలు ఏమిటి?
వైరస్ సోకిన తరువాత వివిధ దశలలో వివిధ లక్షణాలు కనిపిస్తాయి. అయితే, తొలి దశలలో వైరస్ లక్షణాలు బయటపడకపోవచ్చు. చాలామందికి వైరస్ సోకినట్టు ఆలస్యంగా తెలుస్తుంది. అందుకే హెచ్ఐవీని తొందరగా గుర్తించడం అవసరమని డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిస్తోంది.
వైరస్ సోకిన తరువాత కొంతమందిలో జ్వరం, తలనొప్పి, శరీరంపై దద్దుర్లు, గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపించవచ్చు.
ఈ వైరస్ క్రమంగా రోగ నిరోధక శక్తిని తగ్గిస్తుంది కాబట్టి, గొంతులో గగ్గలు దిగడం, బరువు తగ్గడం, జ్వరం, విరేచనాలు, దగ్గు లాంటి లక్షణాలు కనిపించవచ్చు.
హెచ్ఐవీని త్వరగా గుర్తించి చికిత్స అందించకపోతే, క్షయ రోగం (టీబీ), క్రిప్టోకోకల్ మెనింజైటిస్, తీవ్ర బ్యాక్టీరియా ఇంఫెక్షన్లు, కొన్ని రకాల క్యాన్సర్లు సోకవచ్చు.
7. హెచ్ఐవీకి చికిత్స ఉందా?
దీనికి చికిత్స లేదు. నివారణ ఒక్కటే మార్గం. కానీ, వైరస్‌ను అదుపుచేస్తూ, దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించేందుకు మార్గాలు ఉన్నాయి.
యాంటీరెట్రోవైరల్ థెరపీ (ART) ద్వారా వైరస్ లక్షణాలను తగ్గించవచ్చు. ఈ చికిత్సలో భాగంగా వైద్యులు యాంటీరెట్రోవైరల్ మందులు (ARD) సూచిస్తారు.
ఈ చికిత్స హెచ్ఐవీని నిర్మూలించదు. లక్షణాలను తగ్గించి, రోగ నిరోధక శక్తి మెరుగుపడేందుకు సహాయపడుతుంది.
2016 నుంచి డబ్ల్యూహెచ్‌ఓ 'ట్రీట్ ఆల్' విధానాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా, హెచ్ఐవీ సోకిన వారందరికీ దాని దశలు, తెల్ల రక్త కణాల సంఖ్యతో సంబంధం లేకుండా చికిత్స అందించాలని సిఫార్సు చేసింది.
పిల్లలు, యుక్తవయస్కులు, పెద్దలు, గర్భిణీలు, పాలిచ్చే తల్లులు సహా హెచ్ఐవీ సోకిన వారందరికీ జీవితం కాలం ART అందించాలని సూచించింది.
2022 జూన్ నాటికి 189 దేశాలు ఈ విధానాన్ని ఆమోదించాయి. అంటే, ప్రపంచవ్యాప్తంగా హెచ్ఐవీతో జీవిస్తున్న వారిలో 99 శాతానికి ART చికిత్స అందుతుంది.
8. హెచ్ఐవీలో దశలు
ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్ఐవీలో క్లినికల్ దశలను నాలుగు భాగాలుగా విభజించింది. అలాగే, పిల్లలు అంటే 15 ఏళ్ల వయసులోపు వారు, పెద్దలు అంటే 15 ఏళ్లు పైబడినవారిని రెండు విభాగాలుగా గుర్తిస్తూ నాలుగు దశలలలో ఉండే లక్షణాలను వివరించింది.
స్టేజ్ 1, స్టేజ్ 2లలో పిల్లల్లో, పెద్దల్లో కూడా లక్షణాలు కనిపించకపోవచ్చు. కొంతమందికి బరువు తగ్గడం, శ్వాసకోశ సంబంధ వ్యాధులు, కొన్ని రకాల వైరల్ ఇంఫెక్షన్లు, నోటిలో పుండ్లు, చర్మ వ్యాధులు మొదలైన లక్షణాలు కనిపించవచ్చు.
స్టేజ్ 3, స్టేజ్ 4లలో , పిల్లల్లో పోషకాహార లోపం, చికిత్సకు స్పందించకపోవడం, తరచూ విరేచనాలు, జ్వరం, నోటి వ్యాధులు, టీబీ, న్యుమోనియా, స్టమక్ అల్సర్లు, రక్తహీనత, దీర్ఘకాలిక హెచ్ఐవీ సంబంధిత ఊపిరితిత్తుల వ్యాధులు, నాడీ వ్యవస్థ దెబ్బ తినడం మొదలైన లక్షణాలు కనిపించవచ్చు.
పెద్దల్లో పై లక్షణాలతో పాటు బాగా బరువు తగ్గడం, మెనింజైటిస్, హెచ్ఐవీ సంబంధిత నెఫ్రోపతీ లేదా కార్డియోమయోపతి మొదలైన లక్షణాలు కనిపించవచ్చు.
స్టేజ్ 3 లేదా స్టేజ్ 4.. ఇవి వైరస్ బాగా ముదిరిన దశలు. హెచ్ఐవీ ఎయిడ్స్‌గా మారే దశలు. డాక్టర్లు క్లినికల్‌గా పరీక్షలు జరిపి హెచ్ఐవీ ఏ స్టేజ్‌లో ఉందో నిర్థరిస్తారు. కాబట్టి పరీక్ష చేయించుకోవడం చాలా ముఖ్యం.
9. హెచ్ఐవీ నివారణ
హెచ్ఐవీ బారిన పడకుండా తీసుకోవలసిన కొన్ని జాగ్రత్తలను డబ్ల్యూహెచ్ఓ సూచించింది.
- కండోమ్ వాడకం
- సుఖ వ్యాధులు రాకుండా చూసుకోవడం, హెచ్ఐవీ పరీక్షలు, కౌన్సిలింగ్
- పురుషులు సున్తీ చేయించుకోవడం
- యాంటీరెట్రోవైరల్ మందులు వాడడం
- తల్లి నుంచి పిల్లలకు హెచ్ఐవీ సోకకుండా చికిత్స తీసుకోవడం
మన దేశంలో హెచ్ఐవీ నివారణకు ఎన్ఏసీఓ వివిధ పద్ధతులు అవలంబిస్తోంది. రిస్క్ ఎక్కువగా ఉన్న వర్గాలకు తరచూ పరీక్షలు జరపడం, జైలు వంటి మూసి ఉన్న గదుల్లో ఉండేవారికి పరీక్షలు జరపడం, సుఖవ్యాధుల పట్ల, ఎయిడ్స్ పట్ల అవగాహన కలిగించడం, సురక్షిత రక్తమార్పిడి పద్ధతులు అవలంబించేలా ప్రోత్సహించడం మొదలైనవి .
సెక్స్ వర్కర్లు, గే, ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు, వలస కూలీలు, ట్రక్ డ్రైవర్లు మొదలైనవారికి హెచ్ఐవీ సోకే ప్రమాదం ఎక్కువ ఉందని ఎన్ఏసీఓ చెబుతోంది.
10. హెచ్ఐవీ/ఎయిడ్స్‌పై అపోహలు
హెచ్ఐవీపై ఇప్పటికీ ఇంకా ఎన్నో అపోహలు, అనుమానాలు ఉన్నాయి. శరీర ద్రవాలు అంటే రక్తం, వీర్యం, యోని ద్రవాలు, తల్లి పాలు ద్వారా తప్ప ఇతరత్రా హెచ్ఐవీ సోకదని ఇప్పటికే నిర్థరణ అయింది.
- తాకినా, ముద్దు పెట్టుకున్నా, కౌగలించుకున్నా, ఒకరి వస్తువులు ఒకరు వాడుకున్నా హెచ్ఐవీ సోకదు.
- సంప్రదాయ వైద్యం ఎయిడ్స్‌ను తగ్గించదు.
- దోమలు, ఇతర కీటకాల ద్వారా హెచ్ఐవీ వ్యాపించదు.
- ఓరల్ సెక్స్ ద్వారా హెచ్ఐవీ వ్యాపించే ప్రమాదం ఉంది. కానీ, తక్కువ.
- శృగారంలో కండోమ్ తప్పక వాడాలి. అయితే, కండోమ్ చిరిగినా, జారినా, లీక్ అయినా హెచ్ఐవీ సంక్రమించే ప్రమాదం ఉంది. కాబట్టి హెచ్ఐవీ పరీక్ష చేయించుకుని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

ఫొటో సోర్స్, Getty Images
హెచ్ఐవీ కేసుల్లో రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్
రాష్ట్రాల వారీగా 2021 గణాంకాలు పరిశీలిస్తే, హెచ్ఐవీ బారిన పడ్డవారి సంఖ్య మహారాష్ట్రలో అత్యధికంగా ఉండగా, ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో 2010 నుంచి హెచ్ఐవీ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తున్నప్పటికీ, మిగతా రాష్ట్రాలతో పోలిస్తే 2021 నాటికి ఈ సంఖ్య అధికంగా ఉంది.
దీనికి కారణం హెచ్ఐవీ/ఎయిడ్స్ నివారణకు గతంలో ఉన్నన్ని నిధులు ఇప్పుడు లేకపోవడం, కరోనా మహమ్మారి పరిస్థితులను మరింత దిగజార్చిందని విశాఖకు చెందిన ఎన్జీవో ‘గ్లోబల్ ఎయిడ్’ డైరెక్టర్ సాయి పద్మ అన్నారు.
"హెచ్ఐవీ/ఎయిడ్స్ నివారణపై 1991 నుంచి 2008, 2009 వరకు దాదాపు ఇరవయ్యేళ్ల పాటు జరిగిన కృషి ఫలాలు చేతికి వచ్చే సమయానికి ఈ కార్యక్రమాలపై నిధులు తగ్గించేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ నిధులు ఇంకా తగ్గిపోయాయి. ఏపీలో ఎయిడ్స్ కోసం పనిచేస్తున్న ఎన్జీవోలు సగానికి సగం తగ్గిపోయాయి. అంతకుముందు హెచ్ఐవీ మందులు (ART) ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసేది. కానీ, ఇప్పుడు వాటిని అందించే కేంద్రాలు బాగా తగ్గిపోయాయి. అలాగే, ఆస్పత్రుల్లో ఉచిత హెచ్ఐవీ పరీక్షలు జరపడం బాగా తగ్గిపోయింది" అని సాయి పద్మ చెప్పారు.
ఇవే కాకుండా, హెచ్ఐవీ మీద అవగాహన కలిగించడానికి ఇచ్చే కౌన్సిలింగ్ ప్రక్రియ కుంటుపడిందని ఆమె అన్నారు.
"మేం ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే డాట్ సెంటర్ల సర్వే చేశాం. ఈ కేంద్రాల్లో టీబీ, తరచుగా వచ్చే అంటురోగాలు, ఎయిడ్స్ మొదలైన వాటికి ఉచితంగా పరీక్షలు చేస్తారు. హెచ్ఐవీ/ఎయిడ్స్ కౌన్సిలింగ్ బాగా తగ్గిపోయిందని మా సర్వేలో తేలింది. గతంలో 1:10 అంటే 10 మంది హెచ్ఐవీ బాధితులకు ఒక కౌన్సిలర్ ఉండేవారు. ఇప్పుడు 1:250 ఉంది. అంటే 250 మందికి ఒక కౌన్సిలర్. ఒక బాధితుడికి ఒక నిమిషం కన్నా ఎక్కువ సమయం కేటాయించలేరు. ఒక్క నిమిషంలో ఎంత అవగాహన అందించగలరు?" అని ఆమె అన్నారు.
కరోనా మహమ్మారి వలన ఆస్పత్రుల్లో ఖాళీలు లేకపోవడం, పరీక్షలు సరిగ్గా జరగకపోవడం, రోజువారీ జీవితం దుర్లభంగా మారడంతో హెచ్ఐవీ బాధితుల పరిస్థితి మరింత దిగజారిందని సాయి పద్మ చెప్పారు.
"తల్లి నుంచి హెచ్ఐవీ సోకిన పిల్లలకు సరైన మందులు అందక, పోషకాహారం లభించక, వారి రోగ నిరోధక శక్తి మరింత క్షీణించిపోతుంది. హెచ్ఐవీతో పోరాడే సామర్థ్యం ఉండదు. హైవే మీద సెక్స్ వర్కర్లకు ఉచితంగా కండోమ్స్ ఇస్తే కొంతవరకు హెచ్ఐవీ సంక్రమణను నివారించగలం. కరోనా సమయంలో వారి పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. పూటకి ఇంత తిండి దొరికితే చాలు అన్న పరిస్థితి తప్ప, ఎయిడ్స్‌పై అవగాహన పెంచుకోవాలన్న ఆలోచన వారికి ఉండదు. ఒకవేళ తెలుసుకోవాలనుకున్నా, హెచ్ఐవీ బెనిఫిషరీస్‌కి ఎక్కడికి వెళ్లాలో తెలియట్లేదు. ఇది పెద్ద సమస్యగా మారింది" అని సాయి పద్మ అభిప్రాయపడ్డారు.
కాలంతో పాటు హెచ్ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహన కలిగించే కార్యక్రమాల వ్యూహం పద్ధతులు మారలేదని, దీనివల్ల ఫలితాలు కనిపించట్లేదని గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీతో పనిచేసిన ఒక అధికారి అన్నారు.
"పరిస్థితులు చాలా మారిపోయాయి. కొత్త కాలానికి కొత్త వ్యూహాలు అవసరం. దానికి తగ్గ పరిశోధన, పర్యవేక్షణ లేదు. ప్రజల అలవాట్లు, ప్రవర్తన, ఆలోచనా ధోరణి మారింది. అందుకు అనుగుణంగా వ్యూహాలను పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. సుమారు 1999-2000 నుంచి దాదాపు 2009-2010 వరకు అనుసరించిన పద్ధతులు, వ్యూహాలనే ఇప్పుడూ పాటిస్తున్నారు. కరోనా తరువాత పరిస్థితులు ఇంకా మారిపోయాయి. నేటి కాలానికి తగ్గ వ్యూహాలను పెంపొందించాల్సిన అవసరం ఉంది.
హెచ్ఐవీ నివారణలో నాలుగు అంశాలు చాలా ముఖ్యమైనవి.. బాధితులకు అవగాహన కలిగించడం, కండోమ్స్ ప్రమోట్ చేయడం, STDకి చికిత్స, హెచ్ఐవీ బాధితులకు సంక్షేమ పథకాలు. ఇందులో మొదటిది, ముఖ్యమైనది.. హెచ్ఐవీపై అవగాహన, ఆలోచనా ధోరణి మార్చడం. దీనికి ఇవ్వాల్సినంత ప్రాముఖ్యం ఇవ్వట్లేదు. మిగతావన్నీ చేస్తున్నారు. ఏఆర్‌టీ మందులు లభ్యమవుతున్నాయి. హెచ్ఐవీ సోకినవారు ఆరోగ్యంగా దీర్ఘకాలం జీవిస్తున్నారు. కానీ, సేఫ్ సెక్స్, హెచ్ఐవీ సంక్రమణపై అవగాహనా లోపం స్పష్టంగా కనిపిస్తోంది. కమ్యూనికేషన్ వ్యూహాలు, కమ్యూనిటీ భాగస్వామ్యం మొదలైన వాటిపై శ్రద్ధ పెట్టాలి" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
హెచ్ఐవీ - మానసిక ఆరోగ్యం
హెచ్ఐవీ బాధితులకు మానసిక ఆరోగ్యంపై కౌన్సిలింగ్ ఇవ్వడం చాలా ముఖ్యమని, వారిపై చాలా భయాలు, ఆందోళన, ట్రామా ఉంటుందని మెంటల్ హెల్త్ నిపుణురాలు డాక్టర్ విజయ భవాని అంటున్నారు. భవాని మాగ్నా కార్టా ఫౌండేషన్ ఫౌండర్ ట్రస్టీగా వ్యవహరిస్తున్నారు.
అయితే, ప్రస్తుతం ఎయిడ్స్ కౌన్సిలింగ్ అంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్న విషయాలను చెప్పి పంపించేస్తున్నారని, మానసిక ఆరోగ్యం గురించి కౌన్సిలింగ్ ఇవ్వట్లేదని ఆమె అన్నారు.
"హెచ్ఐవీ కౌన్సిలింగ్ అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న సలహాలు ఇస్తున్నారు. కానీ, వారి మానసిక ఆరోగ్యానికి అందాల్సిన సపోర్ట్ అందట్లేదు. ఒక వ్యక్తికి హెచ్ఐవీ పాజిటివ్ అని తెలిసిన తరువాత, జీవితం మొత్తం మారిపోతుంది. చాలా ట్రామా ఉంటుంది. వారికి మానసికమైన మద్దతు అవసరం. ప్రతీ క్షణం వాళ్లు రకరకాల భయాలు ఎదుర్కొంటారు. ట్రామాలోకి జారిపోతారు. హెచ్ఐవీ గురించి సలహాలు ఇవ్వడం వేరు. మెంటల్ కౌన్సిలింగ్ వేరు. ఈ రకమైన సపోర్ట్ ఇప్పుడు బాగా తగ్గిపోయింది. అలాగే, మానసిక ఆరోగ్యం దెబ్బతిన్న హెచ్ఐవీ పేషెంట్లకు ఎక్కడకు వెళ్లాలి, ఎవరిని ఆశ్రయించాలన్నది తెలియట్లేదు.
ఎయిడ్స్‌పై అవగాహన కోసం ఇంతకుముందు నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రాం ఉండేది. తరువాత దానిని నేషనల్ హెల్త్ మిషన్‌లో కలిపేశారు. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రాంను నాలుగు దశలలో నిర్వహించారు. ఇందులో హెచ్ఐవీ బాధితులకు మానసిక ఆరోగ్యంపై కౌన్సిలింగ్ ఇవ్వడం ఒక ప్రధాన భాగంగా ఉండేది. దాన్ని ‘సైకో సోషల్ సపోర్ట్’ అంటారు. దీనిపై విరివిగా ప్రచారం కూడా జరిగింది. హెచ్ఐవీ పరీక్షకు ముందు, తరువాత మెంటల్ హెల్త్‌పై కౌన్సిలింగ్ ఇచ్చేవారు. దీని కోసం సపోర్ట్ గ్రూపులను ఏర్పాటుచేశారు. ఇంత భారీగా కార్యక్రమాలు నిర్వహించి, ఫలితాలు చేతికి అందబోతున్న సమయంలో ఈ ప్రోగ్రాంలను నిలిపివేశారు. హెచ్ఐవీ కేసులు తగ్గుముఖం పట్టాయని చెబుతూ, ఎయిడ్స్ కోసం ప్రత్యేక కార్యక్రమం కాకుండా దానిని మొత్తం ఆరోగ్య విభాగంలో కలిపేశారు" అని భవాని వివరించారు.
కాగా, హెచ్ఐవీ పట్ల సమాజంలో వివక్ష, భయాలు ఇప్పటికీ అలాగే కొనసాగుతున్నాయని ఆమె అంటున్నారు.
"1990లలో ఎలాంటి వివక్ష, భయాలు ఉన్నాయో ఇప్పటికీ అలాంటివే సమాజంలో ఉన్నాయి. సామాన్య ప్రజలతో మాట్లాడినప్పుడు ఇవన్నీ బయటికొస్తున్నాయి. గతంలో హెచ్ఐవీ గురించి ప్రచారాలు, దాని గురించి బహిరంగంగా మాట్లాడడం, చర్చించడం మొదలైనవాటిని యుద్ధప్రాతిపదికన చేపట్టారు. ఇప్పుడలా జరగట్లేదు. చాలామంది హెచ్ఐవీ గురించి మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. హెచ్ఐవీ సోకిన వ్యక్తి పక్కన కూర్చోవడానికి కూడా భయపడుతున్నారు. దీని మీద మాట్లాడట్లేదు కాబట్టి, సమాజంలో హెచ్ఐవీ వివక్ష స్వరూపం ఏ స్థాయిలో ఉంది, ఎంతమందికి ఎలాంటి భయాలు ఉన్నాయి అన్నది తెలియడంలేదు" అని ఆమె అన్నారు.
ఇదే కాకుండా, గణాంకాలు వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతున్నాయని చెప్పలేమని, హెచ్ఐవీ టెస్టింగ్ బాగా తగ్గిపోయిందని భవాని అంటున్నారు.
"గతంలో హెచ్ఐవీ పరీక్షలు ఎక్కువగా జరిగేవి. ఇప్పుడు అవి తప్పనిసరి కావు. గర్భం దాల్చిన మహిళలకు టెస్ట్ చేస్తున్నారు. కానీ, పురుషులకు చేయట్లేదు. కాబట్టి పురుషుల్లో ఎంతమందికి హెచ్ఐవీ ఉందో, ఎంతమందికి సంక్రమిస్తోందో చెప్పే కొలమానాలు లేవు. హెచ్ఐవీ మొదటి దశలలో చాలామందికి లక్షణాలు కనిపించవు. ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలకు, రక్తదానం చేసినప్పుడు, లేదా సర్జరీ చేసినప్పుడు తప్ప హెచ్ఐవీ పరీక్షలు నిర్వహించట్లేదు. కాబట్టి గణాంకాలు నిర్దిష్టంగా వాస్తవ పరిస్థితిని తెలియజేస్తున్నాయని చెప్పలేం. డాటాలో కనిపిస్తున్న సంఖ్య కన్నా వాస్తవంలో హెచ్ఐవీ కేసులు ఇంకా చాలా ఎక్కువగా ఉండవచ్చు" అని విజయ భవాని అన్నారు.
భారతదేశంలో హెచ్ఐవీ/ఎయిడ్స్ గణాంకాలు
ఎన్ఐసీఓ అంచనాల ప్రకారం, 2021లో దేశవ్యాప్తంగా 24,01,284 హెచ్ఐవీ బాధితులు (PLHIV) ఉన్నారు. గరిష్టంగా ఆంధ్రప్రదేశ్‌లో 3,21,028 హెచ్ఐవీ కేసులు ఉండగా, తెలంగాణలో 1,55,991 కేసులు ఉన్నాయి.
2021 అంచనాల ప్రకారం, భారత్‌లో ఎయిడ్స్ కారణంగా చనిపోయినవారి సంఖ్య 41,968. ఎయిడ్స్ రిలేటెడ్ డెత్ (ఏఆర్‌డీ) రేటు 2010 నుంచి 2021కి 76.5 శాతం క్షీణించినట్టు గణాంకాలు చెబుతున్నాయి.
దాదాపు అన్ని రాష్ట్రాలలో ఏఆర్‌డీ తగ్గినప్పటికీ, చండీఘర్, తెలంగాణ, వెస్ట్ బెంగాల్‌లలో అత్యధికంగా తగ్గింది. కానీ, పుదుచ్చేరి, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, త్రిపురలలో ఏఆర్‌డీ పెరిగింది.
2021లో ప్రపంచవ్యాప్తంగా 3.8 కోట్లకు పైగా హెచ్ఐవీ బాధితులు ఉండగా, ఎయిడ్స్ కారణంగా 6,50,000 మంది చనిపోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు చెబుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ 3.8 కోట్లకు పైగా హెచ్ఐవీ బాధితులు ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది.
భారతదేశంలో గత పదేళ్లల్లో రక్షణ లేకుండా లైంగిక సంపర్కం (అన్‌ప్రొటెక్టెడ్ సెక్స్) వలన 17 లక్షల మందికి పైగా ప్రజలకు హెచ్ఐవీ సోకినట్టు జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ - ఎన్ఏసీఓ) తెలిపింది.
ఎన్ఏసీఓ డాటా ప్రకారం, అన్‌ప్రొటెక్టెడ్ సెక్స్ కారణంగా 2011-2021 మధ్య మొత్తం 17,08,777 మందికి హెచ్ఐవీ సోకగా, ఇందులో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది.
2011-2021 మధ్య అన్‌ప్రొటెక్టెడ్ సెక్స్ వలన ఏపీలో 3,18,814 హెచ్ఐవీ కేసులు నమోదయ్యాయి. మధ్యప్రదేశ్ (2,84,577), కర్ణాటక (2,12,982), తమిళనాడు (1,16,536) తరువాతి స్థానాల్లో ఉన్నాయి.
అయితే, 2010 నుంచి 2021కి దేశంలో ఎయిడ్స్/హెచ్ఐవీ కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయని ఎన్ఐసీఓ వెల్లడించింది.
ఇవి కూడా చదవండి:
- హాయిగా నిద్ర పట్టాలంటే ఇంట్లో ఎలాంటి మార్పులు చేయాలి?
- ఈ భారీ బిలాల రహస్యం ఏమిటి, హఠాత్తుగా భూమి ఎందుకు విస్ఫోటం చెందుతోంది?
- వర్గీస్ కురియన్: ‘అమూల్ సీక్రెట్ తెలుసుకోవడానికే ప్రధాని లాల్ బహాదుర్ శాస్త్రి ఆ ఊళ్లో రాత్రి బస చేశారు..’
- ‘లావుగా ఉన్నావని గేలి చేశారు’ అంటూ కేరళ మంత్రి పోస్ట్, ‘బాడీ షేమింగ్’పై స్కూళ్ళలో పాఠాలు చేర్చాలనే ఆలోచనలో ప్రభుత్వం
- 28 ఏళ్ల పాటు పురుషుడిగా జీవించి, మహిళగా మారిన ఒక టీచర్ కథ..
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














