వి. శివన్‌కుట్టి: ‘లావుగా ఉన్నావని గేలి చేశారు’ అంటూ కేరళ మంత్రి పోస్ట్, ‘బాడీ షేమింగ్’పై స్కూళ్ళలో పాఠాలు చేర్చాలనే ఆలోచనలో ప్రభుత్వం

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, గీతా పాండే
- హోదా, బీబీసీ న్యూస్, దిల్లీ
లావుగా ఉన్నానని తనను గేలి చేస్తున్నారని కేరళ విద్యాశాఖ మంత్రి వి. శివన్‌కుట్టి ఇటీవల ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.
మలయాళ భాషలో ఆయన ‘బాడీ షేమింగ్ (శరీర ఆకృతిని గేలి చేయటం)’ బాధితుడిగా తన ఉదాహరణను వివరించారు.
కొన్ని రోజుల కిందట కొందరు విద్యార్థులు తనతో సెల్ఫీ తీసుకుంటున్న ఫొటోను ఒక దానిని తాను షేర్ చేశానని, దానిపై ఒక వ్యక్తి ‘నీ పొట్ట కొంచెం తగ్గించుకోవాలి’ అంటూ తనను ఉద్దేశించి కామెంట్ చేశారని ఆయన ఆ పోస్టులో రాశారు.
ఆ కామెంట్‌కు మంత్రి బదులిస్తూ, బాడీ షేమింగ్ అనేది ‘హీనమైన అలవాటు’ అని తప్పుపట్టారు.
‘‘బాడీ షేమింగ్ అనేది హీనం. కారణం ఏం చెప్పినా సరే. ఇది మన సమాజంలో చాలా స్థాయిల్లో జరుగుతోంది. బాడీ షేమింగ్ బాధితులు మనలో చాలా మంది ఉన్నారు. వారు మానసికంగా కూడా బాధలుపడ్డారు’’ అని ఆయన రాశారు.
‘‘బాడీ షేమింగ్‌కు మనం ముగింపు పలకాలి. ఆధునిక ప్రజలం కావాలి’’ అని పేర్కొన్నారు.
ఈ ఘటనతో బాడీ షేమింగ్ అనేది ఎంత విషపూరితంగా ఉంటుందో తనను ఆలోచించేలా చేసిందని మంత్రి శివన్‌కుట్టి తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై అవగాహన పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్పారు.
బాడీ షేమింగ్ గురించి ‘‘రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో అవగాహన కల్పిస్తుంది. ఈ అంశాన్ని స్కూలు పాఠ్యాంశాల్లో చేర్చే విషయాన్నీ పరిశీలిస్తుంది’’ అని తెలిపారు.

తోటి మనుషుల శరీర ఆకృతిని హేళన చేయటం సర్వసాధాణంగా కనిపించే భారతదేశంలో.. లావుగా ఉన్నారని గేలి చేసే బాడీ షేమింగ్ అంశాన్ని కేరళ మంత్రి వ్యాఖ్యలతో పాటు, ఇటీవల విడుదలైన బాలీవుడ్ సినిమా ‘డబుల్ ఎక్స్‌ఎల్’ కూడా.. ప్రధాన చర్చనీయాంశంగా మార్చింది.
ఆ సినిమాలో ప్రముఖ తారలు హుమా ఖురేషి, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలు పోషించారు. వారిద్దరూ గతంలో బాడీ షేమింగ్ గురించి మాట్లాడారు. సోనాక్షి లావుగా ఉన్నారంటూ ఆమెను సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. హుమా ఖురేషిని కూడా తొలి రోజుల్లో ఆమె అయిదు కిలోలు ఎక్కువ బరువు ఉన్నారని, కాబట్టి హీరోయిన్‌కు తగరని విమర్శకులు కొట్టివేశారు.
‘‘ఇద్దరు ప్లస్ సైజ్ మహిళలకు.. బరువు అనేది వారి కలలను సాకారం చేసుకోవటానికి ఎలా అవరోధంగా మారింది, దానిని వారు ఎలా అధిగమించారు అనేది ఈ సినిమా కథాంశం’’ అని ‘డబుల్ ఎక్స్ఎల్’ సినిమా దర్శకుడు సత్రామ్ రమణి బీబీసీకి చెప్పారు.
‘‘అద్భుతమైన నైపుణ్యం ఉన్న వ్యక్తులను వారి బరువు కారణంగా చిన్నచూపు చూడటం నేను చూశాను. ఇది ఏమాత్రం ఆమోదనీయం కాకూడదు’’ అని ఆయన పేర్కొన్నారు.
లావుగా ఉండటం చెడ్డవిషయమని, సన్నగా ఉండటం అందమనే భావన ఏర్పడటంలో.. ప్రజాభిప్రాయం మీద ప్రభావం చూపే, ప్రజాభిప్రాయాన్ని రూపొందించే భారతదేశపు హిందీ సినిమా రంగానిదే తప్పు అని విమర్శకులు అంటున్నారు.
విజయవంతమైన నటిల్లో అత్యధికులు పొడవుగా, సన్నగా, తెల్లగా ఉంటారు. కొన్నేళ్ల కిందట బాలీవుడ్ నటి కరీనాకపూర్ ‘సైజ్ జీరో’కు సన్నబడటం పతాక శీర్షికలకు ఎక్కింది.
‘‘ఎవరైనా సైజ్ జీరోగా ఉండటాన్ని కోరుకోవడంలో, తాము అలా కనిపించాలని అనుకోవడంలో సమస్య లేదు. కానీ ఆ భావనను ఇతరుల మీద రుద్ద కూడదు’’ అని రమణి పేర్కొన్నారు.
‘‘మీ శరీర ఆకృతి, పరిమాణం, రంగు ఏదైనా సరే మీరు అందంగా ఉన్నారని, మీరు విజయం సాధించాలంటే ఏదో ఒక సైజు లేదా ఫ్రేమ్‌లో ఇమడాల్సిన అవసరం లేదని’’ తన సినిమా ద్వారా తను ప్రజలకు చెప్పదలచుకున్నానని ఆయన తెలిపారు.
పాటలు, డ్యాన్సులతో కూడిన సగటు బాలీవుడ్ సినిమా ‘డబుల్ ఎక్స్‌ఎల్’ వాణిజ్యపరంగా పెద్దగా రాణించలేదు. అయితే ఈ సినిమా తర్వాత జనం ప్రపంచమంతటా ఉన్న సార్వజనీన సమస్య బాడీ షేమింగ్ గురించి మాట్లాడటం తనకు సంతోషాన్నిస్తోందని దర్శకుడు రమణి చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఒక భారత యూనికార్న్ కంపెనీలో పనిచేసే హర్నిధ్ కౌర్ కూడా తరచుగా ఈ అంశాన్ని తన వ్యాసాల్లోను, సోషల్ మీడియాలోను లేవనెత్తతుంటారు. ప్లస్ సైజ్ ఉండే ఆమె కవయిత్రి, రచయిత కూడా.
లావుగా ఉన్నవాళ్లని గేలి చేయటం చాలా విస్తృతంగా ఉందని ఆమె చెప్తున్నారు. ‘‘ఎందుకంటే భారతీయులు చాలా మందికి తమ పరిధిల గురించి ఏమాత్రం తెలీదు. మన కుటుంబాల్లో సైతం ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరి ఆకృతి మీదా వ్యాఖ్యలు చేస్తుంటారు’’ అని పేర్కొన్నారు.
‘‘ఈ హేళనకు లింగ బేధం లేకపోయినా కూడా మహిళల మీదే ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఎందుకంటే ఆమె పెళ్లికి ఎంత అర్హంగా ఉందనేది ప్రాతిపదికగా తీర్పు చెప్తారు. లావుగా ఉన్న మహిళలకు అట్టడుగు స్థానం ఇస్తారు’’ అని హర్నిధ్ కౌర్ వివరించారు.
హర్నిధ్ కౌర్‌కు 12 ఏళ్ల వయసులో.. పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పిసీఓఎస్) ఉన్నట్లు వైద్య పరీక్షల్లో గుర్తించారు. చిన్నప్పటి నుంచీ తనను లావుగా ఉన్నారంటూ హేళన చేసేవారని ఆమె చెప్పారు. పీసీఎస్ కారణంగా బరువు పెరగటం, రుతుక్రమం తప్పటం, జుట్టు పల్చబడటం జరగవచ్చు.
బాడీ షేమింగ్ అనేది ఎల్లప్పుడూ బాహాటంగా, ప్రతికూలంగా ఉండదని హర్నిధ్ కౌర్ చెప్తున్నారు. ‘‘ఉదాహరణకు తల్లిదండ్రులు మన బరువు గురించి మాట్లాడినపుడు.. వాళ్లు ఆందోళనతో, భయంతో మాట్లాడుతుంటారు. కానీ లావుగా ఉన్నారని గేలి చేయటం చాలా ప్రచ్ఛన్నంగా ఉండొచ్చు. నిజ జీవితంలో ఆ వివక్ష చాలా తీవ్రంగా ఉంటుంది’’ అని ఆమె పేర్కొన్నారు.
ఒక షాపులో ఒక సేల్స్‌మన్ తనతో మాట్లాడినప్పటి ఒక సంఘటన గురించి ఆమె నాకు చెప్పారు. ‘‘అతడు నా దగ్గరకు వచ్చి, ‘బరువు తగ్గటానికి ఏవైనా ఉత్పత్తులు వాడిచూశారా?’ అని నన్ను అడిగాడు’’ అని తెలిపారు.
అలాగే తను ఒక ఫుడ్ కోర్టుకు వెళ్లినపుడు ‘‘ఒక మహిళ తన కూతురుతో మాట్లాడుతూ.. ‘బిస్కెట్లు తినటం ఆపు. లేకపోతే నువ్వు కూడా ఆమెలా అవుతావు’ అంటూ నన్ను చూపిస్తూ చెప్పింది’’ అని వివరించారు.
ఇక డేటింగ్ యాప్‌లలో సైతం కొందరు పురుషులు, ‘‘ఇద్దరం కలిసి వ్యాయామం చేద్దాం. ఎందుకంటే నువ్వు సన్నబడితే ఇంకా అందంగా ఉంటావు’’ అని చెప్పేవాళ్లని ఆమె వెల్లడించారు.
అయితే, అడగకుండానే లావు తగ్గటం ఎలా అని తనకు సలహా ఇవ్వటం, ఒక గుర్తు తెలియని మహిళ తనను లావుగా ఉన్నానని చెప్పటం.. అసలు సమస్య కాదని హర్నిధ్ కౌర్ అంటారు.
‘‘లావుగా ఉన్నవాళ్లు శుభ్రంగా ఉండరని, బద్ధకస్తులని జనం భావిస్తూ ఉంటారు. దీనివల్ల ఉద్యోగాల విషయంలో వీరు వివక్ష ఎదుర్కొంటారు. ఇది ప్రధానమైన సమస్య’’ అని వివరించారు.
లావుగా ఉండటం గురించి మన సంభాషణలో ఎక్కువగా.. లావుగా ఉన్నవారిపై జోకులు వేయటంతో నిండిపోయిందని ఆమె చెప్పారు. కానీ ఈ అంశానికి చాలా వైద్య, సామాజిక, రాజకీయ కోణం ఉందని పేర్కొన్నారు.
‘‘నాకు చాలా తీవ్రమైన అలర్జీ వచ్చినపుడు ఒక డాక్టర్ దగ్గరకు వెళ్లాను. నేను బాగా లావుగా ఉన్నాను కాబట్టి నాకు శ్వాస అందటం లేదని ఆ డాక్టర్ చెప్పాడు. నా మడమకు దెబ్బతగిలి విరిగినపుడు.. నేను అంత ఎక్కువ బరువు లేకపోతే అది విరిగేది కాదని ఇంకొక డాక్టర్ అన్నాడు’’ అని హర్నిధ్ కౌర్ తెలిపారు.
అయితే.. సంభాషణా కళ గురించి వైద్యులకు మంచి శిక్షణ లేదని ఎండోక్రినాలజిస్ట్ చిత్రా సెల్వన్ అంటారు. ‘‘ఫాట్ షేమింగ్ గురించి మాట్లాడినపుడు అది అభివృద్ధి చెందిన దేశాల సమస్య అని చాలా మంది అనుకుంటారు’’ అని ఆమె చెప్పారు.
‘‘కానీ లావుగా ఉన్నారని హేళన చేయటం తీవ్రమైన సామాజిక, మానసిక ప్రభావం చూపగలదు. రోజువారీగా వివక్షను ఎదుర్కోవటం ఆత్మగౌరవాన్ని, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అది ఆహారపు అలవాట్లు గందరగోళంగా మారటానికి దారితీయవచ్చు. వారు సమాజం నుంచి దూరంగా జరిగి, మరింత ఏకాకులు అయ్యేలా చేయవచ్చు’’ అని చిత్రా సెల్వన్ వివరించారు.
ఆమె ‘ది వెయిట్ ఆఫ్ వర్డ్స్’ అనే తన పుస్తకం కోసం 900 మంది వైద్యులను సర్వే చేశారు. రోగులను గేలి చేయటం వల్ల వారు చర్యలు చేపట్టేలా కదిలిస్తుందని చాలా మంది వైద్యులు నమ్ముతున్నట్లు ఆమె గుర్తించారు.
‘‘కానీ అది పని చేయదు. అలా చేయటం వల్ల వాళ్లు భయపడి సాయం కోసం వెళ్లకుండా ఆగిపోతారు’’ అని ఆమె వివరించారు.
భారతదేశంలో అధిక బరువు, ఊబకాయం ఉన్న జనం 13.5 కోట్ల మందికి పైగా ఉన్నారు. ఈ సంఖ్య స్థిరంగా పెరుగుతూ ఉందని ప్రభుత్వ, ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు చెప్తున్నాయి. దేశంలో ‘ఒబేసిటీ ఎపిడమిక్’ (ఊబకాయ విపత్తు) వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
అలాగే.. బరువు ఎంత ఎక్కువ ఉంటే, డయాబెటిస్ వచ్చే ప్రమాదం అంత ఎక్కువగా ఉంటుందని డాక్టర్ చిత్రా సెల్వన్ చెప్పారు. ‘‘కానీ అధిక బరువుకు కారణం జీవనశైలి సరిగ్గా లేకపోవటమే కానవసరం లేదు. అదొక తీవ్ర సంక్లిష్య సమస్య. హార్మోన్లు, ఒత్తిడి సహా అనేక అంశాలు కలగలిసి ఉండవచ్చు’’ అని వివరించారు.
రోగులను వైద్యులు ఏమాత్రం గేలి చేయకూడదని ఆమె అంటున్నారు.
‘‘ఊబకాయులు కాని రోగులను మనం గేలి చేయం, తప్పుపట్టం. అయితే డయాబెటిక్ సమస్య ఉన్న ఒక బృందంతో క్లినికల్ కన్సల్టేషన్ల సమయంలో వారి అనుభవాల గురించి నేను మాట్లాడినపుడు.. వైద్యులు తమను హేళన చేశారని, అది తమను తీవ్ర ఒత్తిడికి గురి చేసిందని వారిలో ఎక్కువ మంది చెప్పారు’’ అని చిత్రా సెల్వన్ వివరించారు.
ఇవి కూడా చదవండి:
- బిడ్డ నల్లగా పుట్టిందనే అనుమానంతో డీఎన్ఏ పరీక్ష చేయించిన ఈ జంట తెలుసుకున్న ‘భయానక’ నిజం ఏంటంటే...
- తెలంగాణ: ప్రసవం మధ్యలో డ్యూటీ దిగిపోయిన డాక్టర్, అరగంట తర్వాత డ్యూటీకి మరో డాక్టర్... పురిట్లోనే బిడ్డ మృతికి బాధ్యులెవరు?
- సూపర్‌మార్కెట్ షాపింగ్‌లో ఖర్చు తగ్గించుకోవడం ఎలా? ఈ 5 చిట్కాలు పాటించండి
- సైకోపాత్ లక్షణాలు ఏమిటి? ఫిమేల్ సైకోపాత్ జీవితం ఎలా ఉంటుంది?
- టూ ఫింగర్ టెస్టు అంటే ఏంటి, దాన్ని సుప్రీంకోర్టు ఎందుకు రద్దు చేయాలని ఆదేశించింది?
















