తెలంగాణ - గద్వాల: ప్రసవం మధ్యలో డాక్టర్ వెళ్ళిపోయారని ఆరోపణలు... పురిటిలోనే బిడ్డ మృతికి కారకులెవరు?

ఖలీఫా
ఫొటో క్యాప్షన్, సరిగ్గా ప్రసవం మధ్యలో బిడ్డ తల బయటకు కనిపిస్తున్న సమయంలో డాక్టర్లు డ్యూటీ మారి, నర్సులకు అప్పగించి వెళ్లిపోయారని బాధిత బిడ్డను కోల్పోయిన తల్లి ఖలీఫా బంధువులకు చెప్పారు.
    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా పురిట్లోనే బిడ్డ మరణించిందన్న ఆరోపణలు వచ్చాయి. ఆసుపత్రి వైద్యులు ఈ ఆరోపణలను తిరస్కరిస్తున్నారు. కానీ, బాధితులు అడుగుతున్న అనేక ప్రశ్నలకు సమాధానం లేదు.

గద్వాల జిల్లా రాజోలి మండలం పచ్చర్ల గ్రామానికి చెందిన ఖాజా హుస్సేన్, మైబూనా దంపతుల కుమార్తె ఖలీఫాను కర్నూలు జిల్లా గంగవరానికి చెందిన చాంద్ బాషాకి ఇచ్చి వివాహం చేశారు. మొదటి పురుడు కోసం పుట్టింటికి వచ్చారు ఖలీఫా.

ఆమె బంధువుల్లో ఒకరు ఆశా వర్కర్ ఉండడంతో, సదరు ఆశా వర్కర్ ఖలీఫాను గద్వాల జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. సాధారణ వైద్య పరీక్షల కోసం వెళితే, అప్పటికే ప్రసవం సమయం దగ్గరకు వచ్చిందని వెంటనే అడ్మిట్ అవ్వాలని సూచించారు ప్రభుత్వ వైద్యులు. దీంతో ఈ నెల 16వ తేదీన ఆసుపత్రిలో చేరారు ఖలీఫా.

‘‘ఆసుపత్రిలో చేరినా నొప్పులు రాకపోవడంతో 18వ తేదీ డిశ్చార్జి అన్నారు. ఇలా అర్థాంతరంగా పంపడం గురించి అడిగితే, మళ్లీ వెంటనే చేర్చుకున్నారు. మళ్లీ 19న డిశ్చార్జి అని చెప్పి, మళ్లీ అడ్మిషన్ తీసుకున్నారు’’ అంటూ అడ్మిషన్ ప్రక్రియలో గందరగోళాన్ని వివరించారు ఖలీపా తల్లి మైబూనా.

ఈ నెల 20వ తేదీ ఆదివారం తెల్లవారుజాామున ఖలీఫాను ప్రసూతి గదికి తీసుకెళ్లారు.

గద్వాల ప్రభుత్వ ఆస్పత్రి
ఫొటో క్యాప్షన్, ఆస్పత్రిలో అడ్మిషన్ సమయంలోనూ చాలా గందరగోళం తలెత్తిందని బంధువులు చెప్పారు

‘నర్సులకు అప్పగించేసి వెళ్లిపోయారు’

‘‘ఆమెకు నొప్పులు ఎక్కువ వచ్చినా సరిగా వైద్యం చేయలేదు. మేం ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్తామంటే ఒప్పుకోలేదు. సర్జరీ చేయాలని అడిగితే చేయలేదు. కంగారు పడవద్దు సాధారణ ప్రసవం అవుతుంది అని నాలుగున్నర ప్రాంతంలో చెప్పారు’’ అని మైబూనా తెలిపారు.

అలా చెప్పిన డాక్టర్ ఉదయం 8 గంటల సమయంలో అక్కడ ఉన్న నర్సులకు అప్పగించేసి వెళ్లిపోయారు. ‘‘మేం ఆవిడని ఉండమని అడిగినా ఉండలేదు. ఆ తరువాత ఆ నర్సులు వెళ్లిపోయి వేరే నర్సులు వచ్చారు. కాసేపటికి వేరే డాక్టర్ వచ్చారు. చివరకు ఉదయం పదిన్నర ప్రాంతంలో బాబును బయటకు తీశారు. 10.40 గంటలకి పిల్లల వార్డులో బాబు చనిపోయాడని చెప్పాడు. బాబు పుట్టినప్పుడే కదల్లేదు. అప్పటికే చనిపోయాడు’’ అని ఆమె తెలిపారు.

‘‘మా అక్కకు స్కాన్ చేసినప్పుడు గర్భంలో బిడ్డ మూడున్నర కేజీల బరువు ఉంది అన్నారు. ఆ రిపోర్టులు గవర్నమెంటు ఆసుపత్రిలో ఇచ్చాం. అంత బరువున్నప్పుడు నార్మల్ డెలివరీ కాదు అని నాకు తెలిసిన వారు చెప్పారు. అయినా డాక్టర్లు నార్మల్ డెలివరీకి ప్రయత్నించారు’’ ఖలీఫా తమ్ముడు నజీర్ బీబీసీకి చెప్పారు.

‘‘బిడ్డ తల 8 గంటల ప్రాంతంలో బయటకు కనిపిస్తే, పూర్తిగా బయటకు రావడానికి పదిన్నర అయింది. చివరకు పట్టకారు వేసి లాగారు (ఫోర్సెప్స్ డెలివరీ). సిజేరియన్ చేయాలని అడిగినా చేయలేదు. ముందు నుంచీ కేసు చూసిన డాక్టర్ డ్యూటీ టైం అయిపోయిందని వెళ్లిపోయారు. బిడ్డను బయటకు తీయడంలో ఆలస్యం అవడంతో ఊపిరి ఆడక బాబు చనిపోయాడు’’ అని ఆయన తెలిపారు.

ఖలీఫా కుటుంబం
ఫొటో క్యాప్షన్, ఖలీఫా బంధువులు జిల్లా కలెక్టరును కలసి నిర్లక్ష్యం చూపిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు

న్యాయం కోసం కలెక్టరుకు విన్నపం

సోమవారం ఖలీఫా బంధువులు గద్వాల జిల్లా కలెక్టరును కలసి తమకు న్యాయం చేయాలని, నిర్లక్ష్యం చూపిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

‘‘తరువాత వచ్చిన డాక్టర్ సర్జరీ చేయాలనుకున్నప్పటికీ చేసే వీలు లేకుండా, అంతకుముందు నర్సులు గాటు పెట్టారు. దానివల్ల సర్జరీ కుదర్లేదు. సరిగ్గా డెలివరీ మధ్యలో, బాబు గర్భం నుంచి బయటకు వచ్చి తల కనిపిస్తోన్న టైంలో డాక్టర్లు డ్యూటీ మారి, నర్సులకు అప్పగించడం, ఆ నర్సులకు అనుభవం లేక గాటు పెట్టడం... అన్నీ కలసి బాబు చనిపోయాడు’’ అని ఆరోపించారు నజీర్.

అయితే, డాక్టర్ల వాదన మరోలా ఉంది. సిజేరియన్‌కి పేషెంట్ బంధువులే ఒప్పుకోలేదని వారు చెబుతున్నారు. మొదట్లో ఇది కాంప్లికేటెడ్ కేసు కాదనీ, తరువాత పరిస్థితి మారిపోయిందనీ వారన్నారు.

అంతకుముందున్న డాక్టర్ 24 గంటల డ్యూటీ చేయడం వల్ల షిఫ్టు మారినప్పటికీ, కొత్త డాక్టరుతో కేసు గురించి మాట్లాడారని బీబీసీతో చెప్పారు గద్వాల ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నవీన్ క్రాంతి.

వీడియో క్యాప్షన్, ఇండియాలో అబార్షన్ చేయించుకోవడానికి నిబంధనలేమిటి

‘సిజేరియన్ వద్దని కుటుంబ సభ్యులు అన్నారు’

‘‘ఖలీఫాకి ఇది మొదటి డెలివరీ కాబట్టి నార్మల్ ప్రయత్నం చేశాం. పైగా ఆమెకు ఏ కాంప్లికేషనూ లేదు. అందుకే సిజేరియన్ తీసుకోవడానికి లేదు. 20వ తేదీ ఉదయం 7 గంటలకు కూడా ఆమెకు పెయిన్స్ లేవు. 8 గంటల సమయంలో ఫుల్ డైలటేషన్ అయింది. బాబు తల సాగి ఎడిమా ఫామ్ అయింది. అప్పటికి బేబీ హార్ట్ బాగానే ఉంది. కానీ అటువంటి సమయాల్లో బేబీ పరిస్థితి ఎలా మారుతుందో చెప్పలేం. 8.40 గంటల సమయంలో సిజేరియన్ చేయాలని కుటుంబ సభ్యుల పర్మిషన్ అడిగాం. కానీ వారు మాత్రం నార్మల్ డెలివరీయే ప్రయత్నం చేయాలని చెప్పారు. దాంతో ఎపిసోటమీ ప్రయత్నం చేశారు’’ అన్నారు డాక్టర్ నవీన్.

‘‘డ్యూటీ డాక్టర్ అప్పటికే 24 గంటలు డ్యూటీ చేశారు. ఆమె తరువాత వచ్చే డాక్టర్‌తో మాట్లాడారు. ఇద్దరూ కలసి సిజేరియన్ గురించి చర్చించుకున్నారు. కానీ, బేబీ బయటకు రావడంలో ఇబ్బంది అయింది. అప్పుడు ఫోర్సెప్స్ డెలివరీ చేయాల్సి వచ్చింది. ఊపిరి సమస్యతో బాబు చనిపోయాడు. లేబర్ వరకూ అన్నీ బాగానే జరిగాయి. కేవలం డెలివరీ ప్రాసెస్ సమయంలో రెస్పిరేటరీ సమస్య వల్లే బాబు చనిపోయాడు’’ అని చెప్పారు.

అయితే, వైద్యుల మాటల్లో నిజం లేదని ఖలీఫా బంధువులు చెబుతున్నారు. మొదటి డాక్టర్ వెళ్లిన అరగంట వరకూ మరో డాక్టర్ రాలేదని వారు ఆరోపిస్తున్నారు. అంతేకాదు, తాము సిజేరియన్ వద్దనలేదనీ, తామే కోరినా డాక్టర్లే సిజేరియన్ చేయలేదనీ వారు ఆరోపిస్తున్నారు.

తెలంగాణ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవం సమయంలో మరణాలు జరగడం ఇదే మొదటిసారి కాదు. సెప్టెంబరు చివర్లో నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం తరువాత తల్లి చనిపోవడానికి కూడా వైద్యుల నిర్లక్ష్యమే కారణం అని ఆరోపణలు వచ్చాయి. అక్కడ కూడా సిజేరియన్ చేయడానికి ప్రభుత్వ వైద్యులు నిరాకరించడం వల్లనే తల్లి మరణించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

ఇవి కూడా చదవండి: