Uterus Transplantation: ‘‘నేను పుట్టిన గర్భసంచి నుంచే నా బిడ్డ కూడా పుట్టబోతోంది’’

గర్భసంచి మార్పిడి చికిత్స

ఫొటో సోర్స్, Umesh Negi

    • రచయిత, సుశీలా సింగ్, భార్గవ్ పరీఖ్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఇద్దరు మహిళలు తమ కుమార్తెలకు గర్భసంచి లేదా యుటేరస్‌ను దానమిచ్చారు.

ఆ ఇద్దరి మహిళల కుమార్తెలకు గర్భసంచిలో సమస్యలు ఉన్నాయి.

సెప్టెంబరు 27న తల్లుల నుంచి గర్భసంచిని తొలగించి, వాటిని విజయవంతంగా కుమార్తెల శరీరంలో అమర్చారు.

ప్రపంచంలో తొలి గర్భ సంచి మార్పిడి చికిత్స స్వీడన్‌లో జరిగింది.

గర్భసంచి మార్పిడి చికిత్స

ఫొటో సోర్స్, Bhargav Parikh

అహ్మదాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కిడ్నీ డిసీజెస్ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో రెండు గర్భసంచి మార్పిడి చికిత్సలు విజయవంతంగా నిర్వహించారు. ఒక్కో చికిత్స నిర్వహించడానికి 12 నుంచి 14 గంటలు పట్టింది.

ఆ చికిత్స చేయించుకున్న జునాగఢ్‌కు చెందిన రీనా వాఘాసియా బీబీసీతో మాట్లాడారు. ‘‘మా అమ్మ నాకు ఆ గర్భసంచిని ఇచ్చారు. నేను పుట్టిన ఇదే గర్భసంచి నుంచి నా బిడ్డ కూడా పుట్టబోతోంది’’అని ఆమె అన్నారు.

‘‘పుట్టిన తర్వాత కొన్ని ఏళ్లకే నా గర్భసంచి విచ్ఛిత్తి అయింది. పెళ్లి తర్వాతే ఆ విషయం నాకు తెలిసింది. దీంతో నాకు పిల్లలు పుట్టలేదు. దీంతో వైద్యుల దగ్గరకు వెళ్లాను. నాకు ఇక పిల్లలు పుట్టరనే విషయం అప్పుడే తెలిసింది’’అని ఆమె వివరించారు.

ఈ చికిత్స తర్వాత రీనా భర్త కూడా చాలా సంతోషంగా ఉన్నారు.

‘‘పుణెలో ఈ గర్భసంచి మార్పిడి చికిత్స చేస్తారని మేం తెలుసుకున్నాం. కానీ, అక్కడ ఖర్చు చాలా ఎక్కువ. మా నాన్న రైతు. నేను చిన్నచిన్న పనులు చేసుకుంటాను. అహ్మదాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో మాకు ఉచితంగానే ఆపరేషన్ చేశారు. మా అత్తయ్యే నా భార్యకు గర్భసంచి ఇచ్చారు’’అని ఆయన చెప్పారు.

గర్భసంచి మార్పిడి చికిత్స

ఫొటో సోర్స్, DEV IMAGES

విజయవంతం..

ఈ ఆపరేషన్లపై ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కిడ్నీ డిసీజెస్ అండ్ రీసెర్చ్ సెంటర్ డాక్టర్ వినీత్ మిశ్ర మాట్లాడారు. ‘‘తొలిసారిగా మేం ఇద్దరు మహిళలకు గర్భసంచి మార్పిడి చికిత్సలను విజయవంతంగా నిర్వహించాం. ఇకపై గర్భసంచి సమస్యలతో బాధపడేవారికి ఇక్కడ చికిత్సలు నిర్వహిస్తుంటాం’’అని ఆయన అన్నారు.

డాక్టర్ శైలేష్ పుణతాంబేకర్ క్యాన్సర్ నిపుణుడు. భారత్‌లోని తొలి గర్భసంచి శస్త్రచికిత్స నిర్వహించింది ఆయనేనని చెబుతారు.

స్వీడన్, అమెరికా తర్వాత విజయవంతంగా గర్భసంచి మార్పిడి చికిత్సను లాప్రోస్కోపీ సాయంతో భారత్‌లోనే నిర్వహించారని ఇక్కడి వైద్యులు చెబుతున్నారు. ఈ విధానంలో సదరు మహిళ కడుపుపై పెద్ద కోత పెట్టాల్సిన అవసరం లేదు.

వీడియో క్యాప్షన్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌‌తో ఐవీఎఫ్ పద్ధతిలో మెరుగైన సంతానోత్పత్తి

ఈ చికిత్స ఎలా నిర్వహించారు?

శరీరంలో గర్భసంచి లేకపోవడం లేదా గర్భ సంచిలో సమస్యలు ఉండేవారికి ఈ గర్భసంచి మార్పిడి చికిత్స ఉపయోగపడుతుందని వైద్యులు చెబుతున్నారు.

అయితే, బాధిత మహిళలో అండాశయం లేదా అండాలు ఆరోగ్యవంతంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది.

‘‘ఇక్కడ కేవలం తల్లి, బిడ్లల మధ్య మాత్రమే గర్భసంచి మార్పిడి చికిత్స నిర్వహించగలం. ఎందుకంటే వీరిలో జన్యువులు ఇంచుమించు ఒకేలా ఉంటాయి. తల్లి గర్భసంచిని తమ కుమార్తెకు తీసుకోవడంతో ఈ సంతాన సమస్యకు పరిష్కారం లభిస్తుంది’’అని డాక్టర్ శైలేష్ వివరించారు.

వీడియో క్యాప్షన్, ఆన్‌లైన్‌లో ఈవీఎఫ్
లైను

ఎవరు గర్భసంచి దానం చేయొచ్చు?

లైను
  • తల్లి వయసు 49 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు ఉండాలి
  • వారిలో రుతుచక్రం ఇంకా కొనసాగుతూ ఉండాలి
  • ఒకవేళ వారికి పీరియడ్స్ నిలిచిపోతే, మందుల ద్వారా ఇవి మళ్లీ మొదలయ్యేలా చేయొచ్చు
లైను
వీడియో క్యాప్షన్, వీర్యం, అండం లేకుండా సృష్టించిన ఈ పిండం గుండె కొట్టుకుంటోంది
లైను

గర్భసంచిని ఎవరు తీసుకోవచ్చు?

లైను
  • వివాహమైన యువతులు
  • వారి వయసు 18 నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి
  • క్రోమోజోమ్ 46 ఎక్స్‌ఎక్స్ వారిలో తప్పకుండా ఉండాలి
లైను
డాక్టర్ శైలేష్
ఫొటో క్యాప్షన్, డాక్టర్ శైలేష్

ప్రక్రియలు ఏమిటి?

గర్భసంచి మార్పిడి చికిత్సను అర్హులైన మహిళలకు మాత్రమే నిర్వహిస్తామని డాక్టర్ శైలేష్ చెప్పారు. అసలు ఈ చికిత్స ఎలా నిర్వహిస్తారో ఆయన వివరించారు.

‘‘మొదట తల్లి కడుపు దిగువ భాగంలో రెండు అంగుళాల పొడవులో కోత పెడతాం. ల్యాప్రోస్కోప్‌ సాయంతో ఆమె శరీరం నుంచి రక్తనాళాలతోపాటు గర్భసంచిని బయటకు తీస్తాం’’అని ఆయన చెప్పారు.

‘‘ఇది కిడ్నీ లేదా గుండె మార్పిడి చికిత్స లాంటిదే. ఆ తర్వాత ఈ గర్భసంచిని శుభ్రపరుస్తాం. ఆ తర్వాత మళ్లీ వారి కుమార్తెల కడుపుపై కోత పెట్టి వారి శరీరంలోకి పంపిస్తాం. రక్త నాళాలను యోనిలోని నాళాలతో అనుసంధానిస్తాం’’అని ఆయన చెప్పారు.

ఈ చికిత్స జరిగిన 30 నుంచి 35 రోజుల తర్వాత, మళ్లీ వారికి పీరియడ్స్ మొదలవుతాయని శైలేష్ చెప్పారు.

‘‘ఆపరేషన్ తర్వాత వీరిలో పీరియడ్స్ నొప్పులు తగ్గుతాయి. అదే సమయంలో తల్లయ్యే అవకాశాలు కూడా పెరుగుతాయి’’అని ఆయన వివరించారు.

‘‘గుండె, కిడ్నీ లాంటి చికిత్సల ద్వారా ప్రజలకు కొత్త జీవితం ప్రసాదించినట్లే.. గర్భసంచి మార్పిడి చికిత్సలు కూడా జీవితంలో కొత్త ఆశలు చిగురింపజేస్తాయి’’అని శైలేష్ అన్నారు.

గర్భసంచి మార్పిడి చికిత్స

ఫొటో సోర్స్, SHYLENDRAHOODE

ఒకేరకమైన జన్యువులు

అయితే, ఎందుకు తల్లి గర్భసంచి మాత్రమే తమ కుమార్తెలకు అమరుస్తున్నారు? మిగతవారివి ఎందుకు వారి శరీరంలో ప్రవేశపెట్టడం లేదు?

ఈ అంశంపై డాక్టర్ మానసీ చౌధరి మాట్లాడుతూ.. ‘‘ఇక్కడ తల్లి, కుమార్తెల్లో కొన్ని జన్యువులు ఒకేలా ఉంటాయి. దీంతో తల్లి శరీరంలోని కణాలను బయటి కణాలుగా కుమార్తె శరీరం భావించదు. ఫలితంగా శరీరం ఆ గర్భసంచిని తిరస్కరించే అవకాశం ఉండదు’’అని ఆమె చెప్పారు.

మానసి చౌధరి
ఫొటో క్యాప్షన్, మానసి చౌధరి

సైన్స్‌లో ఈ విషయంపై చాలా పురోగతి కనిపిస్తోంది. గర్భసంచిలో జన్యుపరమైన మార్పులను కూడా ఇప్పుడు మనం మెరుగ్గా గుర్తించగలుగుతున్నాం.

మరి గర్భసంచిలో లోపాలను చిన్నప్పుడే గుర్తించలేమా? అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ‘‘ఇక్కడ ఒక బాలికకు గర్భసంచి ఉందా? లేదా అని తెలుసుకోవాలంటే జెండర్ టెస్టు చేయాలి. మన దేశంలో బిడ్డ కడుపులో ఉన్నప్పుడే జెండర్ పరీక్షలు చేయడం నేరం’’అని మానసీ తెలిపారు.

గర్భసంచి మార్పిడి చికిత్స

ఫొటో సోర్స్, SEBASTIAN KAULITZKI

చాలా అరుదు..

‘‘ప్రతి 5000 మంది ఆడ శిశువుల్లో ఒకరికి గర్భసంచి అనేది పూర్తిగా ఉండదు. జన్యుపరమైన సమస్యల వల్ల ఇలా జరుగుతుంది. అలాంటప్పుడు ఈ చికిత్స మెరుగ్గా ఉపయోగపడుతుంది’’అని శైలేష్ చెప్పారు.

‘‘కొన్నిసార్లు ఆరోగ్య సమస్యల వల్ల గర్భసంచిని పూర్తిగా తొలగిస్తారు. ఒక్కోసారి క్యాన్సర్ వల్ల కూడా దీనిని తీసేయాల్సి వస్తుంది’’అని ఆయన వివరించారు.

కేవలం సంతాన సమస్యను పరిష్కరించేందుకే తాము చికిత్సలు నిర్వహిస్తున్నామని డాక్టర్ శైలేష్ వివరించారు.

‘‘రోగ నిరోధక చర్యలను నియంత్రించే ప్రత్యేక ఔషధాలను ఆ మహిళలకు ఇస్తాం. దీంతో గర్భసంచిని శరీరం తిరస్కరించే అవకాశం తగ్గుతుంది’’అని ఆయన చెప్పారు.

‘‘కిడ్నీ లేదా గుండె మార్పిడి చికిత్సల సమయంలోనూ ఇలాంటి ఔషధాలను ఇస్తుంటారు. ఎందుకంటే అప్పుడు కూడా అవయవాలను శరీరం తిరస్కరించే అవకాశం ఉంటుంది’’అని ఆయన వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)