టూ ఫింగర్ టెస్టు అంటే ఏంటి, దాన్ని సుప్రీంకోర్టు ఎందుకు రద్దు చేయాలని ఆదేశించింది?

సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సుచిత్ర మొహంతి
    • హోదా, బీబీసీ కోసం

అత్యాచార కేసుల దర్యాప్తుకు ఉపయోగించే 'టూ ఫింగర్ టెస్ట్'కు సంబంధించి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వైద్య పుస్తకాల నుంచి ఈ దర్యాప్తు పద్ధతిని తొలగించాలని కోర్టు ఆదేశించింది. అది "పితృస్వామ్య భావజాలంతో కూడినదని, అశాస్త్రీయమైనదని" పేర్కొంది.

వైద్య కళాశాలలో స్టడీ మెటీరియల్‌ నుంచి టూ ఫింగర్ టెస్ట్‌ సిలబస్‌ను తొలగించాలని కోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

అత్యాచార కేసుల విచారణకు అవలంబించే ఈ పద్ధతి అశాస్త్రీయమని, లైంగిక వేధింపులకు గురైన బాధితురాలిని మళ్లీ హింసించినట్టు అవుతుందని కోర్టు పేర్కొంది.

ఒక అత్యాచారం కేసు విచారణలో జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ హిమ కోహ్లీలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది.

నేటికీ రెండు వేళ్ల పరీక్షను నిర్వహించడం మహిళల పట్ల వివక్ష చూపడమేనంటూ కోర్టు విచారం వ్యక్తం చేసింది. ఇకపై టూ ఫింగర్ టెస్ట్ నిర్వహించినవారిని దోషులుగా పరిగణిస్తారని, శిక్ష పడుతుందని హెచ్చరించింది.

"ఒక స్త్రీ తనపై అత్యాచారం జరిగిందని చెబితే నమ్మకుండా, గతంలో ఆమె లైంగిక సంబంధాలు ఉన్నాయో లేదో పరిశీలించడం పితృస్వామ్యం అని, సెక్సిస్ట్ వైఖరి’’ అని జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు.

"అత్యాచారం, లైంగిక వేధింపుల కేసుల్లో టూ ఫింగర్ టెస్ట్‌ను వినియోగించవద్దని ఈ కోర్టు పదే పదే చెప్పింది. ఈ పరీక్షకు ఎటువంటి శాస్త్రీయ ఆధారం లేదు. ఇది మళ్లీ బాధితురాలిని హింసించడమే అవుతుంది. టూ ఫింగర్ టెస్ట్ జరపకూడదు. లైంగికంగా చురుగ్గా ఉండే స్త్రీలపై అత్యాచారం జరగదన్న అపోహపై ఆధారపడిన పరీక్ష ఇది. ఇంతకన్నా అవాస్తవం ఉండదు" అని ధర్మాసనం పేర్కొంది.

ఒక అత్యాచారం-హత్య కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో మొదట ట్రయల్ కోర్టు నిందితుడిని దోషిగా నిర్ధరించింది. తరువాత, తెలంగాణ హైకోర్టు ఆ తీర్పును తోసిపుచ్చి, నిందితుడిని విడుదల చేసింది.

సుప్రీంకోర్టు సోమవారం నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.

అత్యాచారం

టూ ఫింగర్ టెస్ట్ ఏమిటి?

అత్యాచారం ఆరోపణలను పరిశోధించడానికి టూ ఫింగర్ టెస్ట్‌ను ఉపయోగిస్తారు.

బాధితురాలి జననాంగంలోకి రెండు వేళ్లను చొప్పించి ఈ పరీక్షను నిర్వహిస్తారు. గతంలో ఆమెకు శారీరక సంబంధాలు ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు వైద్యులు ఈ పరీక్ష జరుపుతారు.

అత్యాచార ఘటనలో 'పెనెట్రషన్' జరిగిందో లేదో తెలుసుకోవడమే దీని ఉద్దేశ్యం.

ఇందులో జననేంద్రియంలోని కండరాల ఫ్లెక్సిబిలిటీ, హైమెన్‌ను పరీక్షిస్తారు. హైమెన్ ఉన్నట్లయితే, ఎలాంటి శారీరక సంబంధం లేదని అర్థం. హైమెన్ దెబ్బతింటే, ఆ స్త్రీ లైంగిక సంబంధంలో పాల్గొన్నట్టు అర్థం.

అయితే హైమన్ దెబ్బతినడానికి వేరే కారణాలు కూడా ఉండవచ్చని, టూ ఫింగర్ టెస్ట్‌ను విమర్శించేవారి వాదన.

యుక్తవయసుకు వచ్చిన అమ్మాయిలకు యోనిలో ఒక పొర ఉంటుంది. దానినే హైమెన్ అంటారు. సెక్స్‌లో పాల్గొన్నప్పుడు ఈ పొర చిరిగిపోతుంది. క్రీడలలో పాల్గొనే అమ్మాయిలకు లేదా శారీరకంగా చురుకుగా ఉన్నవారికి కూడా హైమన్ దెబ్బతింటుందని వైద్యులు చెబుతున్నారు.

టూ ఫింగర్ టెస్ట్

ఫొటో సోర్స్, Getty Images

నిర్భయ కేసు తరువాత నిషేధం

2013లో నిర్భయ పై అత్యాచారం తరువాత లైంగిక హింసకు సంబంధించిన పలు చట్టాలను సవరించారు. అప్పుడే ఈ రెండు వేళ్ల పరీక్షను కూడా నిషేధించారు.

ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని 'డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్', లైంగిక హింసకు గురైన వారికి జరపగలిగే ఫోరెన్సిక్ పరీక్ష కోసం మార్గదర్శకాలను విడుదల చేసింది.

"ఇకపై టూ ఫింగర్ టెస్ట్ చట్టవిరుద్ధం. ఎందుకంటే ఇది శాస్త్రీయమైన పద్ధతి కాదు. దీనిని ఉపయోగించకూడదు. ఈ పద్ధతి వైద్యపరంగా పనికిరానిది. మహిళలను కించపరిచేది" అని అందులో పేర్కొన్నారు.

లైంగిక హింస చట్టాలను సమీక్షించేందుకు ఏర్పాటైన వర్మ కమిటీ కూడా "రేప్ జరిగిందా లేదా అనేది చట్టపరమైన విచారణ, వైద్యపరమైన అంచనా కాదు" అని స్పష్టం చేసింది.

2013లోనే, కర్ణాటకలో లైంగిక హింస కేసుల విచారణకు ఏర్పాటు చేసిన ఫాస్ట్ ట్రాక్ కోర్టుల తీర్పులను 'సెంటర్ ఫర్ లా అండ్ పాలసీ రీసెర్చ్' అధ్యయనం చేసింది.

20 శాతం కంటే ఎక్కువ తీర్పులలో టూ ఫింగర్ టెస్ట్ ప్రస్తావన, గతంలో బాధితురాలి లైంగిక ప్రవర్తనపై వ్యాఖ్యలు చేసినట్లు ఈ అధ్యయనంలో కనుగొన్నారు.

(అదనపు సమాచారం: కమలేశ్)

వీడియో క్యాప్షన్, లఖీంపుర్ ఖీరీ: దళిత అక్కాచెల్లెళ్ళు చెట్లకు వేలాడుతూ కనిపించారు, అసలేం జరిగింది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)