Rishi Sunak: ఇండియాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఫైనల్ చేస్తారా, స్కాచ్ విస్కీ ధరలకు దీనికి లింకేంటి

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జుబైర్ అహ్మద్
- హోదా, బీబీసీ ప్రతినిధి
మన దేశంలో ఆల్కాహాల్ వినియోగం చాలా ఎక్కువ. స్కాట్లాండ్ నుంచి వచ్చే స్కాచ్ విస్కీని ఎక్కువ ఇష్టపడతారు. సహజంగానే దీనికి డిమాండ్ ఎక్కువ. కానీ, దీని ధర చూస్తే మాత్రం స్థానికంగా తయారైన చౌక ధరల మద్యం తాగడమే మేలు అనుకుంటారు.
అయితే, భారతదేశం, బ్రిటన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ - ఎఫ్‌టీఏ) ఖాయమైతే భారతదేశంలో వీటి ధర గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.
గురువారం భారత ప్రధాని నరేంద్ర మోదీ, బ్రిటన్ కొత్త ప్రధాని రిషి సునక్‌తో ఫోన్‌లో మాట్లాడారు. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక ఒప్పందాలను బలపరచడం, ఎఫ్‌టీఏ పై త్వరగా నిర్ణయం తీసుకోవడం మొదలైన అంశాలపై చర్చించినట్లు మోదీ ట్విట్టర్‌లో తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఒప్పందంపై జాప్యం ఎందుకు?
ఈ అక్టోబర్‌లోనే భారత్, బ్రిటన్‌లు ఎఫ్‌టీఏ పై సంతాకాలు చేయాల్సి ఉండగా, బ్రిటన్‌లో రాజకీయ, ఆర్థిక అనిశ్చితి కారణంగా అది ఆలస్యం అవుతోంది.
బ్రిటన్ హోం మంత్రి సుయెల్లా బ్రవర్‌మన్ ఎఫ్‌టీఏ పై ఆందోళనలు వ్యక్తం చేయడం కూడా ఆలస్యానికి ఒక కారణం. భారత్‌తో వాణిజ్య ఒప్పందం వల్ల బ్రిటన్‌కు వచ్చే భారతీయుల సంఖ్య పెరుగుతుందని, బ్రెగ్జిట్ ప్రయోజనం దెబ్బతింటుందని అక్టోబర్ మొదటి వారంలో సుయెల్లా బ్రవర్‌మన్ అన్నారు.
బ్రిటన్‌లో వీసా గడువు ముగిసిన తరువాత కూడా చాలా మంది భారతీయ ప్రవాసులు అక్కడే ఉండిపోతున్నారని ఆమె ఆరోపించారు.
సుయెల్లా వ్యాఖ్యలపై భారతదేశంలో తీవ్ర స్పందన వ్యక్తమైంది. ఆ సమయంలో బ్రిటన్‌లో లిజ్ ట్రస్ ప్రధానిగా ఉన్నారు. ఆమె పదవి నుంచి తొలగాలని పలువురు టోరీలు డిమాండ్ చేశారు. ఆ తర్వత జరిగిన కొన్ని పరిణామాల్లో సుయెల్లా రాజీనామా చేశారు. అయితే, రిషి సునక్ ప్రధానమంత్రి అయిన తరువాత, మళ్లీ సుయెల్లాను హోం మంత్రిని చేశారు.
భారత్‌తో వాణిజ్య ఒప్పందాన్ని వీలైనంత త్వరగా అమలు చేయాలని ప్రధాని రిషి సునక్ కోరుకుంటున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఇప్పటికే ఇరుదేశాల మధ్య అయిదు దఫాలుగా చర్చలు జరిగాయి. తదుపరి రౌండ్ చర్చ ఎప్పుడు నిర్వహించాలనేది ఇంకా నిర్ణయించలేదు.
చివరిగా జరిగిన చర్చల్లో, ఎఫ్‌టీఏ కింద స్కాచ్ విస్కీపై భారత్ విధించిన 150 శాతం దిగుమతి సుంకాన్ని 20 శాతానికి తగ్గించాలని బ్రిటన్ కోరింది. కానీ, దీనికి భారత్ అందుకు అంగీకరించట్లేదు.
వచ్చే అయిదేళ్లలో భారత్‌కు ఎగుమతులు బిలియన్ పౌండ్లు పెరుగుతాయని స్కాటిష్ వ్యాపారులు అంచనా వేస్తున్నారు.

ఫొటో సోర్స్, PA Media
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అంటే ఏమిటి?
ఎఫ్‌టీఏ అంటే మద్యం లేదా ఇతర వస్తువులపై దిగుమతి సుంకాన్ని తొలగించడం లేదా తగ్గించడం మాత్రమే కాదు.
ఇది రెండు లేదా అంతకంటే ఎక్కువ దేశాల మధ్య జరిగే ఒక సమగ్ర వాణిజ్య ఒప్పందం. దీని ద్వారా వాణిజ్యంలో ఉన్న వివిధ వస్తువులపై సుంకాలు, నాన్-టారిఫ్ అడ్డంకులు గణనీయంగా తగ్గించడం లేదా తొలగించడం వంటి నిర్ణయాలు తీసుకుంటారు.
దీని వల్ల ద్వైపాక్షిక వాణిజ్యం పెరుగుతుంది. ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలు బలపడేందుకు దోహదం చేస్తుంది.
ఎఫ్‌టీఏలో సాధారణంగా వస్తువులు, సేవలు, మేధో సంపత్తి హక్కులు, పెట్టుబడులు మొదలైనవి భాగంగా ఉంటాయి.
భారతదేశం ఈ సంవత్సరం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియాలతో ఎఫ్‌టీఏలపై సంతకం చేసింది. వీటి కింద దిగుమతి సుంకం 85 శాతం తగ్గే అవకాశం ఉంది. ఇది కాకుండా మలేషియా, జపాన్, నేపాల్, భూటాన్, శ్రీలంక, ఆసియాన్ వంటి అనేక దేశాలతో భారతదేశానికి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు ఉన్నాయి.
బ్రిటన్ ఈ ఏడాది ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌లతో ఎఫ్‌టీఏలపై సంతకాలు చేసింది. బ్రిటన్, యూరోపియన్ యూనియన్ నుంచి నిష్క్రమించిన తరువాత, దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి అనేక దేశాలతో ఎఫ్‌టీఏలపై సంతకాలు చేసే ప్రయత్నంలో ఉంది, ముఖ్యంగా భారతదేశంతో.
ఈ సంవత్సరం మార్చిలో, భారతదేశ ఆర్థిక వ్యవస్థ 3.1 ట్రిలియన్ డాలర్ల నికర విలువతో ప్రపంచంలో అయిదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. బ్రిటన్‌ను కూడా అధిగమించింది.
భారతదేశం అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. ఇక్కడ భారీ స్థాయిలో వృద్ధికి అవకాశం ఉంది. అందుకు భారీ విదేశీ పెట్టుబడులు అవసరం.
ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే భారతదేశ ఆర్థిక వృద్ధి రేటు అత్యధికంగా ఉంది. ఇది కొన్ని సంవత్సరాల పాటు కొనసాగే అవకాశం ఉంది. అందుకే బ్రిటన్ సహా అనేక ప్రపంచ దేశాలు భారత్‌తో వణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఉవ్విళ్లూరుతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
భారత్, బ్రిటన్ వాణిజ్య ఒప్పందంలో ఏముంది?
2021 మేలో, భారత ప్రధాని నరేంద్ర మోదీ, అప్పటి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కలిసి సమగ్ర స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం మొదటి దశగా "మెరుగైన వాణిజ్య భాగస్వామ్యాన్ని" ప్రకటించారు. అప్పటి నుంచి అయిదు రౌండ్ల చర్చలు ముగిశాయి. చివరి రౌండ్ చర్చ మిగిలి ఉంది.
చివరి రౌండ్ చర్చల్లోనే సమస్యలు వస్తాయని బ్రిటన్ మద్యం వ్యాపారులు అంటున్నారు.
వారు ఇచ్చిన ఒక ప్రకటనలో, "వాణిజ్య చర్చల మొదటి దశ సాధారణంగా సులభంగా సాగిపోతుంది. అసలు విషయాన్ని చివరి దశకు నెట్టివేస్తారు. అందుకే వాస్తవ పరిస్థితులు తెలియడానికి కొంత సమయం పట్టవచ్చు" అని అన్నారు.
2022 జనవరిలో భారతదేశం, బ్రిటన్ దిల్లీలో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు ప్రారంభించాయి.
జూలైలో జరిగిన అయిదవ రౌండ్‌లో హైబ్రిడ్ తరహాలో చర్చలు నిర్వహించారు. రాజధాని దిల్లీలో కొన్ని ముఖాముఖి చర్చలు జరుగగా, వర్చువల్‌గా కొన్ని చర్చలు జరిగాయి.
ఇరు దేశాల సాంకేతిక నిపుణులు 15 విధాన రంగాలను కవర్ చేస్తూ 85 వేర్వేరు సెషన్‌లలో వివరణాత్మక ట్రీటీ డ్రాఫ్ట్ టెక్స్ట్ చర్చల కోసం సమావేశమయ్యారు.
రెండు దేశాలకూ విష్ లిస్ట్ (కోరికల జాబితా) ఉంది. వాటిపై అంతిమ నిర్ణయం తీసుకోవడంలో సమస్యలు రావచ్చు.
ఈ ఒప్పందం కింద తయారీ, సేవల పరిశ్రమల్లో భారత్ బ్రిటన్‌కు మరింత భాగస్వామ్యం కల్పించాలని ఆ దేశం కోరుతోంది. కానీ ఈ రెండు రంగాల్లో భారతదేశం సంప్రదాయకంగా విదేశీ భాగస్వామ్యాన్ని వ్యతిరేకిస్తూ వస్తోంది.
దేశీయ పరిశ్రమలు, ఉద్యోగులకు వాణిజ్య అడ్డంకులు (ట్రేడ్ బ్యారియర్స్) కల్పించే రక్షణను తొలగించడానికి భారతదేశం అంత సులభంగా సిద్ధపడదని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఉదాహరణకు, దేశంలోని విస్కీ తయారీ కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, దిగుమతి సుంకాలను తగ్గించడానికి వెనుకాడవచ్చు. దేశీయ మద్యం తయారీదారుల సుంకాన్ని తగ్గించవద్దని భారత్‌పై ఒత్తిడి కూడా ఉంది.
ఒకవేళ భారత్ దిగుమతి సుంకాలను తగ్గిస్తే, ప్రతిగా రాయితీలు ఇవ్వాల్సి ఉంటుంది. ఔషధాల వంటి భారతీయ ఉత్పత్తులను బ్రిటన్ మార్కెట్‌లో అనుమతించాలని ఆ దేశంపై ఒత్తిడి రావచ్చు. భారతీయ కార్మికులకు మరిన్ని వీసాలు జారీ చేయాల్సిన పరిస్థితి రావచ్చు.
బ్రెగ్జిట్ తరువాత, కొత్త ఇమిగ్రేషన్ పాలసీ కింద గత సంవత్సరం 60,000 మందికి పైగా భారతీయులకు స్కిల్డ్ వర్కర్ వీసా లభించింది. ఎఫ్‌టీఏ తరువాత ఈ సంఖ్య భారీగా పెరగవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
దీనికి బ్రిటన్ సిద్ధంగా ఉంటుందా?
బ్రిటన్ మరింత ముందుకు వెళ్లి, ఎక్కువ మంది భారతీయ నిపుణులు అక్కడ ఎక్కువ కాలం నివాసం ఉండేందుకు వీలు కల్పించాలని సింగపూర్ నేషనల్ యూనివర్సిటీలోని సీనియర్ రిసెర్చర్ అమితేందు పాలిత్ అన్నారు. ఆయన గతంలో భారత ఆర్థిక శాఖలో కూడా పనిచేశారు.
బ్రిటన్‌ను చెందిన ఆహార పానీయాల ఎగుమతి, దిగుమతుల సంస్థ సన్ మార్క్ సీఈఓ హర్మీత్ సింగ్ అహుజా మాట్లాడుతూ, "బ్రెగ్జిట్ తరువాత బ్రిటన్‌లో నైపుణ్యాల కొరత, ఉద్యోగుల కొరత ఏర్పడింది. బ్రిటన్‌కు వచ్చి పనిచేయాడానికి ఎంతోమంది భారతీయులు సిద్ధంగా ఉన్నారు. దీన్ని బ్రిటన్ ఆహ్వానించాలి. అలాగే, వీసా గడువు ముగిసిన తరువాత కూడా నియమాలను ఉల్లంఘిస్తూ అక్కడ ఉండవద్దని ప్రవాసులకు సూచించాలని భారత ప్రభుత్వాన్ని కోరాలి" అని అన్నారు.
తమ దేశంలో తయారైన రవాణా పరికరాలు, ఎలక్ట్రిక్ పరికరాలు, ఔషధాలు, రసాయనాలు, మోటారు వాహనాలు, వాటి విడిభాగాలు, వైన్, స్కాచ్, స్పిరిట్స్, కొన్ని పండ్లు, కూరగాయల భారతీయ మార్కెట్‌కు చేరవేయాలని బ్రిటన్ భావిస్తోంది. అయితే, ఇది స్థానిక పరిశ్రమలను, ఉద్యోగులను ప్రభావితం చేస్తుందని భారతదేశం భావిస్తోంది.
బ్రిటన్‌కు వస్త్రాలు, ఆహార పానీయాలు, ఫార్మాస్యూటికల్స్, పొగాకు, తోలు, చెప్పులు, బియ్యం వంటి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను పెంచాలని భారత్ కోరుకుంటోంది.
ఈ ఒప్పందం జరిగితే భారత్‌కు బ్రిటన్ ఎగుమతులు దాదాపు రెట్టింపు అవుతాయని, 2035 నాటికి ఇరు దేశాల మధ్య వార్షిక వాణిజ్యం 28 బిలియన్ పౌండ్లు పెరుగుతుందని బ్రిటన్ చెబుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
ఈ ఒప్పందం వల్ల ఎవరికి ఎక్కువ లాభం?
ప్రస్తుతానికి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టమని హర్మీత్ సింగ్ అహుజా అన్నారు.
"ఇది భారతదేశానికి ప్రయోజనకరంగా ఉంటుందా, బ్రిటన్‌కు ఎక్కువ ప్రయోజనాలు అందిస్తుందా అనేది చెప్పడం దాదాపు అసాధ్యం. ఎందుకంటే, నిజానికి ఎఫ్‌టీఏ ఒప్పందంలో ఏముందో మనకు తెలియదు. కానీ చివరికి ఇది రెండు దేశాలకు సమాన ప్రయోజనాలు అందిస్తుందని, ఇరు దేశాలకు గెలుపు ఉంటుందని ఆశిస్తున్నాం" అన్నారు హర్మీత్ సింగ్.
ఎఫ్‌టీఏల విషయంలో భారతదేశం న్యాయం, సమతుల్యం ఉండాలని భావిస్తుందని, పోటీ కన్నా సహకారంపై ఎక్కువ దృష్టి సారిస్తుందని విశ్లేషకులు అంటున్నారు.
అయితే, అది అంత సులువు కాదని నిపుణులు భావిస్తున్నారు. వ్యాపారం పట్ల సమతుల్య విధానం అంటే భారతీయ మార్కెట్లలో విదేశీ బ్రాండ్లు ఎక్కువగా అందుబాటులో ఉన్నప్పటికీ, వాటి ఉనికి చిన్న, మధ్యస్థ దేశీయ బ్రాండ్లకు హాని కలిగించకూడదని నిపుణులు అంటున్నారు.
బ్రిటిష్ ప్రభుత్వ అంతర్జాతీయ వాణిజ్య విభాగం భారత్‌తో ప్రతిపాదిత ఎఫ్‌టీఏపై వ్యూహాత్మక పత్రాన్ని సిద్ధం చేసింది.
"భారత్‌తో ఎఫ్‌టీఏ కింద బ్రిటన్ కోసం పనిచేయాల్సి ఉంటుంది. భారతదేశంతో ఏ వాణిజ్య ఒప్పందం అయినా బ్రిటన్ వినియోగదారులకు, ఉత్పత్తిదారులకు, వ్యాపారాలకు ప్రయోజనకరంగా ఉండాలి. భారతదేశంతో మా వాణిజ్య ఒప్పందాలలో పర్యావరణ, కార్మిక, ఆహార భద్రత, జంతు సంక్షేమ ప్రమాణాలను పాటించడానికి మేం కట్టుబడి ఉన్నాం" అని అందులో రాసి ఉంది.
బ్రిటన్‌తో వాణిజ్య ఒప్పందాలలో భారతీయ విద్యార్థులు, నిపుణులకు వీసా నిబంధనలలో ఉపశమనం ఉండాలని భారతదేశం కోరుకుంటోంది. దానికే ప్రాధాన్యం ఇస్తుంది.
భారత్‌తో వాణిజ్య ఒప్పందాన్ని బ్రిటన్ సువర్ణావకాశంగా భావిస్తోంది. మరోవైపు, బ్రిటన్‌లో భారతీయులు ఉద్యోగం చేయడానికి, నివసించడానికి మరిన్ని అవకాశాలు ఉండాలని భారతదేశం కోరుకుంటోంది.
ఈ ఒప్పందం కుదిరితే బ్రిటన్ గ్రీన్ టెక్నాలజీకి, సేవలకు భారతదేశం పెద్ద కొనుగోలుదారు అవుతుందని ఆ దేశం భావిస్తోంది.
స్వేచ్ఛా వాణిజ్యంలో సుంకాలే ప్రధానం కాదని హర్మీత్ సింగ్ అహుజా అన్నారు.
"స్వేచ్ఛా వాణిజ్యం కచ్చితంగా ఆ దేశాలలో ఎగుమతులు, దిగుమతులను చౌకగా చేస్తుంది. కానీ, వ్యాపారాన్ని సులభరతం చేయడమే ఎఫ్‌టీఏల అంతిమ లక్ష్యం" అని ఆయన వివరించారు.
వాస్తవంలో ఇది జరుగుతుందా లేదా అన్నది అసలు ప్రశ్న.
అయితే, తన అనుభవాలు దీనికి సానుకూలంగా లేవని హర్మీత్ సింగ్ అహుజా చెప్పారు.
"భారత్‌కు ఎగుమతి చేయడం కన్నా అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటున్నప్పుడు నాకు ఎల్లప్పుడూ ఆ ప్రక్రియ కఠినతరంగా మారింది. అయితే, ఈమధ్యకాలంలో కొంత మార్పు వచ్చింది. అందుకే మనం వాణిజ్యేతర అడ్డంకుల గురించి కూడా మాట్లాడాలని భావిస్తున్నాను" అన్నారాయన.

ఫొటో సోర్స్, ISABEL INFANTES/AFP VIA GETTY IMAGES
ఒప్పందంపై ఎప్పుడు సంతకాలు చేయవచ్చు?
బ్రిటన్‌లో ప్రతిపక్ష లేబర్ పార్టీ ఎంపీ తన్‌మన్‌జిత్ సింగ్ ఢేసీ బీబీసీతో మాట్లాడుతూ "మేం ఎఫ్‌టీఏకు ఇంకా చాలా దూరంలో ఉన్నాం" అని అన్నారు.
"మాకు చాలా వాగ్దానాలు చేశారు. మొదట, బోరిస్ జాన్సన్ హామీ ఇచ్చారు. రిషి సునక్ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు హామీలు ఇచ్చారు. బ్రెగ్జిట్ తరువాత అమెరికా, భారత్‌లతో త్వరత్వరగా ఎఫ్‌టీఏలపై సంతకాలు చేస్తామని అందరూ చెప్పారు. కానీ ఏమీ జరగలేదు. ఈ ఏడాది అక్టోబర్ నాటికి వాణిజ్య ఒప్పందాన్ని పూర్తిచేస్తామని బోరిస్ జాన్సన్, రిషి సునక్ కూడా వాగ్దానం చేశారు. కానీ, అదీ జరగలేదు" అని తన్‌మన్‌జిత్ సింగ్ ఢేసీ అన్నారు.
కాగా, గురువారం మోదీ చేసిన ట్వీట్‌లో త్వరలో బ్రిటన్‌తో ఎఫ్‌టీఏప్ పూర్తవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేసారు.
ఇరు దేశాలూ ఈ ఒప్పందాన్ని పూర్తిచేయాలనే సంకల్పంతో ఉన్నాయని ఇటీవల భారత పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కూడా అన్నారు.
అయితే, రెండు దేశాలూ కచ్చితమైన గడువు లోపల దీన్ని పూర్తిచేయాలన్న ఆలోచనతో లేనట్టు కనిపిస్తోంది. చివరి రౌండ్ చర్చల తేదీలను ఇప్పటివరకు ప్రకటించలేదు.
కాగా, ఈ డీల్‌ను వెంటనే పూర్తిచేయాలని, లోపాలు ఉంటే తరువాత పరిష్కరించుకోవచ్చని హర్మీత్ సింగ్ అహుజా అభిప్రాయపడ్డారు.
"వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేయడం ముగింపు కాదు. ఇది ఈ రెండు దేశాల మధ్య సహకారం, స్వేచ్ఛా వాణిజ్యానికి ప్రారంభంగా భావించాలి. దీనిపై ఎంత త్వరగా సంతకం చేస్తే అంత మంచిదని నా అభిప్రాయం" అన్నారు.
ఇరు పక్షాలు రాయితీలు ఇచ్చేందుకు అంగీకరిస్తే, వచ్చే ఏడాది ప్రారంభానికి ఒక మధ్యంతర ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్ సరిహద్దుల్లో సైనిక విమానాశ్రయం నిర్మిస్తున్న భారత్...దీని లక్ష్యాలేంటి?
- ట్రాన్స్ జెండర్ పాత్రలను కూడా మామూలు నటులతోనే చేయించాలా ? ఈ అభ్యంతరాలు ఎందుకు వినిపిస్తున్నాయి
- చర్చిలో స్నేహం చేసింది.. ఆస్తి కోసం ఆమెను చంపి తల, మొండెం వేరుచేసి దూరంగా పడేసింది
- ఇక ట్విటర్ క్రిప్టోకరెన్సీ చెల్లింపులను అంగీకరిస్తుందా
- ఇక్కడ 60 వేల మంది కోటీశ్వరులున్నారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












