పాకిస్తాన్ సరిహద్దుల్లో సైనిక విమానాశ్రయం నిర్మిస్తున్న భారత్...దీని లక్ష్యాలేంటి?

ఫొటో సోర్స్, AFP
భారత ప్రధాని నరేంద్ర మోదీ గత వారం గుజరాత్‌లో పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలోని 'డీసా'లో సైనిక విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారు. ఇది దేశ వైమానిక భద్రతకు ముఖ్యమైనదని చెబుతున్నారు.
ఈ సైనిక విమానాశ్రయం ఉత్తర గుజరాత్‌లోని బనాస్కాంఠా జిల్లాలో ఉంది. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పూర్తవుతుంది.
దేశ రక్షణకు ఇది ముఖ్యమైన కేంద్రంగా మారుతుందని శంకుస్థాపన సందర్భంగా మోదీ అన్నారు.
"అంతర్జాతీయ సరిహద్దు (పాకిస్తాన్) ఇక్కడికి కేవలం 130 కి.మీ దూరంలో ఉంది. మన బలగాలు, ముఖ్యంగా వైమానిక దళం డీసాలో ఉంటే, పశ్చిమ సరిహద్దులో ఎలాంటి సవాళ్లనైనా మనం మరింత సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతాం" అని మోదీ అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
రక్షణ రంగ విశ్లేషకుడు రాహుల్ బేడీ ఈ విమానాశ్రయం నిర్మించడం వెనుక ఉద్దేశాన్ని విశ్లేషించారు.
"మొదటగా, రక్షణ వ్యూహాల్లో చొరవగా దీన్ని భావించవచ్చు. రెండవది, మోదీ భారతదేశ 'ఫార్వర్డ్ పాలసీ'ని ముందుకు తీసుకెళ్తున్నారు అనుకోవచ్చు. ఆయన దూకుడు విధానాలను అనుసరించేందుకు ప్రయత్నిస్తున్నారు. భారతదేశం కూడా ఆధిపత్యాన్ని చేతిలోకి తీసుకోగలదని, వెనుకబడి ఉండదని నిరూపించడమే లక్ష్యం. ఇది మోదీ 'ధైర్యసాహసాలను' సూచిస్తుంది.
ఇది గుజరాత్‌లోని ఐదవ సైనిక విమానాశ్రయం. వడోదర, జామ్‌నగర్, భుజ్, నాలియా (కచ్)లలో భారతీయ వైమానిక స్థావరాలు ఉన్నాయి. వీటిలో కచ్, భుజ్ స్థావరాలు పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్నాయి.
అయితే, కొత్తగా మరొక వైమానిక స్థావరాన్ని నిర్మించడం పాకిస్తాన్‌పై ప్రత్యేక ప్రభావం చూపించదని రాహుల్ బేడీ అభిప్రాయపడ్డారు. దానికి బదులు ఉన్నవాటినే అప్‌గ్రేడ్ చేయవచ్చని అన్నారు.
డీసాలో కొత్త సైనిక విమానాశ్రయాన్ని అత్యాధునిక సాంకేతికతతో, కృత్రిమ మేధస్సుకు అవసరమయ్యే పరికరాలు, ఉపకరణాలతో నిర్మిస్తున్నారు.
4519 ఎకరాల్లో ఈ విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నారు. ఇది భారత వైమానిక దళానికి చెందిన భూమి. ఇప్పటికే ఇక్కడ 20 నిఘా టవర్లు ఉన్నాయి. ఈ ప్లాట్ చుట్టూ 22 కిలోమీటర్ల పొడవైన గోడ ఉంది.

ఫొటో సోర్స్, ANI
భారత వైమానిక దళానికి సంబంధించిన సమాచారం
భారత వైమానిక దళం వద్ద ప్రస్తుతం 1645 విమానాలు ఉన్నాయి.
"అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో ఈ పథకాన్ని ప్రారంభించడంపై కొంత చర్చ జరిగింది. కానీ, ఆ ప్రాజెక్ట్ పని ప్రారంభించకముందే ఆయన ప్రభుత్వ కాలం ముగిసింది. ఆ తరువాత 20 సంవత్సరాల వరకు ఇది ముందుకు కదల్లేదు. మోదీ రెండవసారి అధికారంలోకి వచ్చిన ఏడాది తరువాత, ఈ సైనిక విమానాశ్రయానికి రూ.1000 కోట్ల బడ్జెట్ కేటాయించారు" అని రాహుల్ బేడీ చెప్పారు.
ఎయిర్ ఫోర్స్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ స్థావరాన్ని రెండు దశల్లో నిర్మిస్తారు. మొదటి దశలో, యుద్ధ విమానాల కోసం రన్‌వే, సమాంతర టాక్సీవే, లూప్ టాక్సీ ట్రాక్, ఫైటర్ స్క్వాడ్రన్ డిస్పర్సల్ ఏరియా మొదలైనవి సిద్ధమవుతాయి. రెండవ దశలో, ఆధునిక సాంకేతిక నియంత్రణ భవనం, వైమానిక దళ సిబ్బంది కోసం ఇళ్లు నిర్మిస్తారు.
2023 డిసెంబర్ నాటికి మొత్తం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రాజెక్ట్ ఇంజనీర్ ఇన్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్‌కు తెలిపారు.
వివిధ వనరుల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం, గుజరాత్‌లో భుజ్ జిల్లాలోని నాలియా, రాజస్థాన్‌లోని ఫలోడి మిలిటరీ ఎయిర్‌పోర్ట్ మధ్య వ్యూహాత్మకంగా ఖాళీగా ఉన్న స్థలాన్ని డీసా మిలిటరీ విమానాశ్రయం భర్తీ చేస్తుంది.
డీసా ఒక ఆధునిక స్థావరం (ఫార్వర్డ్ బేస్) అవుతుందని, పాకిస్తాన్‌లోని జాకోబాబాద్, ఉత్తర ప్రాంతంలోని ఇతర సైనిక విమానాశ్రయాల నుంచి దాడి జరిగితే, డీసా స్థావరం మొదటి రక్షణ కవచంగా నిలుస్తుందని, ఘర్షణలు తలెత్తినప్పుడు హైదరాబాద్ (పాకిస్తాన్), కరాచీ, సక్కర్ వంటి నగరాలు దాడి పరిధిలో ఉంటాయని నిపుణులు అంటున్నారు.
భవిష్యత్తులో గుజరాత్ లేదా ఉత్తర పశ్చిమ (నార్త్ వెస్ట్) సెక్టార్, అంటే మహారాష్ట్ర లేదా ఆపై ప్రాంతాల్లో ఏదైనా తీవ్రవాద దాడి జరిగినప్పుడు, పాకిస్తాన్‌పై ప్రతీకార చర్యలకు దీనిని ఉపయోగించవచ్చని ఎయిర్ ఫోర్స్ నిపుణులు చెబుతున్నట్లుగా మీడియాలో కథనాలు వచ్చాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఇటీవలే కొత్త విమానాలు..
"డీసా సైనిక విమానాశ్రయం దాడి స్థావరం కాదు. అది ఒక రక్షణాత్మక స్థావరం. ఇక్కడ మిగ్-29, భారతదేశంలో తయారయ్యే లైట్ ఎయిర్ కంబాట్ 'తేజస్' ఎయిర్‌క్రాఫ్ట్‌లను ముందు వరుసలో ఉంచుతారు. భారతదేశ ప్రధాన దాడి విమానం రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ సైనిక విమానాశ్రయంలో ఉంది. అది డీసా స్థావరానికి చేరుకోవడానికి అయిదు నుంచి ఆరు నిమిషాలు పడుతుంది" అని రాహుల్ బేడీ వివరించారు.
"డీసా స్థావరం నిర్మాణానికి ఒక ముఖ్యమైన కారణం జామ్‌నగర్‌లోని రిలయన్స్ ఆయిల్ రిఫైనరీ రక్షణ. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ ఫ్యాక్టరీ. దీనిపై దాడి జరిగితే, భారతదేశం చాలా కష్టాల్లో పడుతుంది. ఈ ఫ్యాక్టరీ రక్షణ పరంగా డీసా స్థావరం ప్రాముఖ్యం సంతరించుకుంటుంది" అని రాహుల్ బేడీ చెప్పారు.

ఫొటో సోర్స్, @Rajnathsingh
రెండేళ్ల క్రితం లద్దాఖ్‌లో చైనాతో ఘర్షణ తరువాత భారతదేశం వైమానిక దళాన్ని పెద్ద ఎత్తున ఆధునీకరించే పనిలో పడింది.
భారత వైమానిక దళానికి యుద్ధ విమానాలు చాలావరకు రష్యా నుంచి వచ్చేవి. వాటిలో ముఖ్యమైనవి మిగ్-21, మిగ్-29, సుఖోయ్ యుద్ధ విమానాలు. వీటిలో అత్యంత పురాతనమైనది మిగ్-21. ఇప్పుడు క్రమంగా ఈ విమానాల స్థానంలో రాఫెల్, మిరాజ్, జాగ్వార్ వంటి కొత్త యుద్ధ విమానాలు వస్తున్నాయి.
భారత వైమానిక దళం వద్ద ప్రస్తుతం 632 యుద్ధ విమానాలు, 438 హెలికాప్టర్లు, 250 రవాణా విమానాలు, 304 శిక్షణ విమానాలు సహా మొత్తం 1645 విమానాలు ఉన్నాయి.
ఇటీవల, దేశీయంగా తయారైన లైటర్ కంబాట్ యుద్ధ విమానం 'తేజస్', 'ప్రచండ' హెలికాప్టర్‌లు భారత వైమానిక దళంలోకి వచ్చి చేరాయి. భవిష్యత్తులో వీటి సంఖ్య మరింత పెరుగుతుంది.
ప్రస్తుతం భారత్ వద్ద 31 ఫైటర్ స్క్వాడ్రన్లు అందుబాటులో ఉన్నాయి. వచ్చే పదేళ్లల్లో వీటి సంఖ్యను 42కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వైమానిక దళం ఆధునీకరణతో పాటు, రాబోయే సంవత్సరాలలో మరిన్ని సైనిక విమానాశ్రయాలు, సరిహద్దుకు సమీపంలో కొత్త ఎయిర్‌స్ట్రిప్‌లను నిర్మించాలనే లక్ష్యం కూడా ఉంది.
ఇవి కూడా చదవండి:
- అయోధ్యలో రామ మందిరం నిర్మాణం, ధన్నీపూర్‌లో మసీదు నిర్మాణం ఎంతవరకు వచ్చాయంటే... గ్రౌండ్ రిపోర్ట్
- కరెన్సీ నోట్ల మీద లక్ష్మీ దేవి, వినాయకుడి బొమ్మలు ముద్రించడం సాధ్యమేనా, కేజ్రీవాల్ వ్యాఖ్యలపై నెటిజన్లు ఏమంటున్నారు
- మోదీ ప్రభుత్వం ముస్లిం, క్రైస్తవ దళితులకు రిజర్వేషన్లు ఇవ్వాలని నిజంగానే అనుకుంటోందా?
- మునుగోడు ఉపఎన్నిక : ‘ఇక్కడ ఓటుకు ఎంఆర్పీ రేటును ఎలా నిర్ణయిస్తున్నారంటే...’’
- వీర్యం శరీరంపై పడితే అలర్జీ వస్తుందా, ఈ సమస్య నుంచి బయటపడటం ఎలా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













