72 మంది సభ్యుల ఉమ్మడి కుటుంబం: ‘మా ఇంట్లో ఒకపూట కూరగాయల ఖర్చు రూ.1200, నాన్ వెజ్ ఖర్చు రూ.5 వేలు.. సిలిండర్ 4 రోజుల్లో అయిపోతుంది’

వీడియో క్యాప్షన్, 72 మంది సభ్యుల ఉమ్మడి కుటుంబం: ‘మా ఇంట్లో ఒకపూట కూరగాయల ఖర్చు రూ.1200, నాన్ వెజ్ ఖర్చు రూ.5 వేలు.. సిలిండర్ 4 రోజుల్లో అయిపోతుంది’

బీబీసీ ప్రతినిధులు హర్షల్ అకుడే, రాహుల్ రణ్‌సుభే, ప్రజాక్తా దులప్ అందిస్తున్న కథనం.

మీరు పది మందో, 20 మందో ఉన్న ఉమ్మడి కుటుంబాలను చూసే ఉంటారు.

కానీ మహారాష్ట్రలోని సోలాపూర్‌లో ఉండే ఓ కుటుంబం 4 తరాలు కలిసున్న నిండైన కుటుంబం.

ఈ కుటుంబంలో మొత్తం 72మంది సభ్యులుంటారు. ఇంత మంది ఒక కుటుంబంగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉందా?

72 మంది ఉండే ఉమ్మడి కుటుంబమిది.

''మాది చాలా పెద్ద కుటుంబం. ఎంత పెద్దదంటే ప్రతి ఉదయం-సాయంత్రం 10 లీటర్ల పాలు వాడతాం.

ఒక పూట భోజనాలకు వెయ్యి నుంచి 12 వందల రూపాయల కూరగాయలు అవసరం. మాంసాహారం వండే రోజు ఈ ఖర్చులు 3, 4రెట్లు ఎక్కువగా ఉంటాయి.

72 మంది సభ్యుల ఉమ్మడి కుటుంబం

ప్రతి నెలా మాకు 40నుంచి 45వేల రూపాయల కరెంటు బిల్లు వస్తుంది.

మాకు ఇంత ఎక్కువ మొత్తంలో సరుకులు కావాలి కాబట్టి మేం అన్నీ హోల్ సేల్‌లో కొంటాం.

అప్పుడే మేం ఈ ఖర్చులను భరించగలం. మేం ఒకేసారి సంవత్సరానికి సరిపడా 40 నుంచి 50 బస్తాల బియ్యం కొనుక్కుంటాం.

ఒక గ్యాస్ సిలిండర్ 3-4 రోజుల్లో ఖాళీ అయిపోతుంది.'' అని రమేష్ దోయిజోడె బీబీసీతో చెప్పారు. ఈ కుటుంబానికి ఆయనే పెద్ద.

మహరాష్ట్రలోని షోలాపూర్‌లో దోయిజొడే కుటుంబంలోని నాలుగు తరాల వారు కలిసే ఉంటున్నారు. కర్నాటకకు చెందిన ఈ కుటుంబం వందేళ్ల కిందట షోలాపూర్ వచ్చింది.

''షోలాపూర్‌లోని తిలక్ చౌక్‌లో ఉన్న వసంత్ బిల్డింగ్ లో నేను పెరిగాను. అక్కడ మేము అద్దెకి ఉండేవాళ్లం. నేను మా అమ్మానాన్న, 8మంది అన్నదమ్ములు, ఇద్దరు అక్కచెల్లెల్లు ఉండే వాళ్ళం. అప్పట్లో మేం టోపీల వ్యాపారం చేసే వాళ్లం. తర్వాత దూదితో పరుపుల తయారీ ప్రారంభించాం. ఆతర్వాత బెడ్‌షీట్లు అమ్మడం కూడా మొదలు పెట్టాం'' అని రమేష్ దోయిజోడె తెలిపారు.

ఇంత పెద్ద కుటుంబాన్ని చూసి మొదట్లో భయపడ్డామని ఈ ఇంటి కోడళ్లు చెబుతున్నారు.

72 మంది సభ్యుల ఉమ్మడి కుటుంబం

మరి మహమ్మారి కాలంలో సామాజిక దూరాన్ని ఎలా పాటించారు?

''మహమ్మారి కాలంలో ఇంట్లో వృద్ధుల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. వారిని ఇంటినుంచి బయటకు వెళ్ళనివ్వలేదు. సాధారణంగా కుటుంబంలో ఎవరో ఒకరు ఊరు దాటి బయటకు వెళ్తుంటారు. అయితే మార్చి 2020లో లాక్ డౌన్ పెట్టినప్పటికి అదృష్టవశాత్తు మాలో ఏ ఒక్కరూ బయట లేరు. లాక్‌డౌన్‌ సమయంలో ఇంట్లోనే ఉండడం మాకు సులువైంది. నిత్యావసరాల కోసం ఇద్దరు, ముగ్గురం బయటకు వెళ్లేవాళ్లం. ఆరు నెలల పాటు ఇంటి మెయిన్ గేటు మూసివేసే ఉంది. ఎవరూ బయటకు వెళ్లలేదు'' అని రమేష్ మేనల్లుడు అశ్విన్ దొయిజోడే చెప్పారు.

ఉమ్మడి కుటుంబం వల్ల ఇబ్బందేమీ లేదని, తమకు చాలా బావుందంటున్నారు ఈ ఇంట్లోని పిల్లలు.

72 మంది సభ్యుల ఉమ్మడి కుటుంబం

దోయిజోడె కుటుంబం ఇప్పుడు అనేక వ్యాపారాలు చేస్తోంది.

అందరూ కలిసి ఉండటం వల్లే వ్యాపారంలోనూ లాభాలు వస్తున్నాయని ఈ కుటుంబం నమ్ముతోంది.

''మాకు ఇప్పుడు 8 దుకాణాలున్నాయి. ఇదంతా వసంత్ టోపీల వ్యాపారంతో మొదలైంది. తర్వాత పరుపుల తయారీ వ్యాపారం ప్రారంభించాం. ఆ తర్వాత కార్పెట్లు, కర్టెన్లు, పెట్రోల్ పంప్, విద్యుత్, సిమెంట్ రంగాల్లో వ్యాపారం చేస్తున్నాం'' అని ఉమేష్ దోయిజోడె తెలిపారు.

కుటుంబంలోని తర్వాతి తరాలు కూడా కలిసుండాలని వీరంతా కోరుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)