ముస్లింలు మెజారిటీగా ఉన్న ఈ దేశంలో కరెన్సీ నోట్ల మీద వినాయకుని బొమ్మ ఎందుకు ఉంది?

ఇండోనేసియా కరెన్సీ మీద వినాయకుని బొమ్మ

ఫొటో సోర్స్, Twittter/Saurbh_Mlagk

    • రచయిత, అనంత్ ప్రకాశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారత కరెన్సీ మీద లక్ష్మీ దేవి, వినాయకుడి బొమ్మలను ముద్రించాలంటూ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్రాన్ని కోరారు.

ప్రపంచంలోనే ముస్లిం జనాభా ఎక్కువగా ఉండే ఇండోనేసియాలో కరెన్సీ నోట్ల మీద హిందూ దేవుడైన వినాయకుని బొమ్మను ముద్రించగా లేనిది మనం ఎందుకు చేయలేమని కేజ్రీవాల్ అన్నారు.

ఇండోనేసియా జనాభాలో 85శాతం ముస్లింలు కాగా హిందువులు ఉన్నది రెండు శాతం మాత్రమే. అయినప్పటికీ వినాయకుని బొమ్మను వారి కరెన్సీ మీద ముద్రించారని ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ చెప్పారు.

అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఈ వ్యాఖ్యల మీద అటు టీవీ చానెల్స్‌లోనూ ఇటు సోషల్ మీడియాలోనూ బాగా చర్చ జరిగింది.

కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేసిన తరువాత 'ముస్లిం దేశమైన ఇండోనేసియా కరెన్సీ మీద వినాయకుని బొమ్మను ఎందుకు ముద్రించారు?' అన్న సందేహంపై నెటిజన్లు ఎక్కువ సెర్చ్ చేసినట్లు కనిపించింది.

ఇండోనేసియా జాతీయ చిహ్నం గరుడ పక్షి

ఫొటో సోర్స్, Getty Images

ఇండోనేసియా కరెన్సీ-వినాయకుడి బొమ్మ

ఇండోనేసియా తన కరెన్సీ మీద వినాయకుని బొమ్మను ముద్రించింది వాస్తవమేనని బీబీసీ పరిశోధనలో తేలింది. కాకపోతే 1998లో ఒక ప్రత్యేక సందర్భంలో ఆ నోటును తీసుకొచ్చారు. ప్రస్తుతం వినాయకుడు బొమ్మ ఉన్న కరెన్సీ చలామణీలో లేదు.

వినాయకుడి బొమ్మ ఉన్న ఇండోనేసియా కరెన్సీ అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోను చూస్తే ఒక వైపు వినాయకుని బొమ్మ ఉంటే మరొక వైపు ఒక వ్యక్తి చిత్రం ఉంది.

రెండో వైపు తిప్పి చూస్తే చదువుకుంటున్న పిల్లల బొమ్మ ఉంది.

ఇండోనేసియా కరెన్సీ మీద వినాయకుడి బొమ్మ అనేది ఇక్కడ భిన్న సంస్కృతికి అద్దం పడుతోందని బీబీసీ ఇండోనేసియాతో పని చేస్తున్న సీనియర్ జర్నలిస్టు అస్తుదేస్త్ర అజెంగరస్త్రీ అన్నారు.

‘‘1998లో విడుదలైన ఆ నోట్లు విద్య అనే థీమ్‌కు చెందినవి. ఇక్కడ వినాయకున్ని కళలు, జ్ఞానం, విద్యకు ప్రతీకగా చూస్తారు. ఇండోనేసియాలోని చాలా విద్యాసంస్థల్లో వినాయకుని బొమ్మలు కనిపిస్తాయి.

ఆ నోటు మీద ఇండోనేసియా 'నేషనల్ హీరో' కి హజర్ దేవాంతర ఫొటో కూడా ఉంది. డెన్మార్క్‌ పాలన కాలంలో ఇండోనేసియా ప్రజలకు చదువుకునే హక్కు కల్పించాలంటూ దేవాంతర పోరాటం చేశారు. నాడు సంపన్నులు, డచ్ వారికి మాత్రమే బడికి వెళ్లే అవకాశం ఉండేది’’ అని అస్తుదేస్త్ర తెలిపారు.

ఇప్పటికీ ఇండోనేసియాలో చలామణీ అవుతున్న ఒక కరెన్సీ నోటు మీద బాలీ ద్వీపంలోని హిందూ దేవాలయం బొమ్మ ఉంది.

‘‘50వేల నోటు మీద బాలీ ద్వీపంలోని హిందూ దేవాలయం బొమ్మ ఉంది. బాలీ ద్వీపంలో హిందువులు ఎక్కువుగా ఉంటారు’’ అని అస్తుదేస్త్ర అన్నారు.

ఇండోనేసియా కరెన్సీ నోట్ల మీద హిందూ దేవుళ్ల బొమ్మలు మాత్రమే కాదు ఇతర మతాలకు చెందిన చిహ్నాలు కూడా కనిపిస్తాయి.

ఆ దేశ కరెన్సీని ‘రుపయ్య’ అంటారు. ఈ పదం కూడా సంస్కృతం నుంచి తీసుకున్నదే. వెండిని సంస్కృతంలో ‘రూప్యకం’ అంటారు.

ఇండోనేసియా కరెన్సీ మీద బాలీలోని హిందూ దేవాలయం బొమ్మ

ఫొటో సోర్స్, Bank Indonesia

ఫొటో క్యాప్షన్, ఇండోనేసియా కరెన్సీ మీద బాలీలోని హిందూ దేవాలయం బొమ్మ

ఇండోనేసియాలో వినాయకుడు ఎందుకు ఫేమస్?

దేశం మొత్తం మీద హిందువుల సంఖ్య 2శాతమే అయినప్పటికీ బాలీ ద్వీపంలో మాత్రం 90శాతం మంది హిందువులు నివసిస్తున్నారు.

1960, 1970లలో జావా ద్వీపంలో వేలాది మంది హిందూ మతంలోకి మారారని రిపోర్టులు చెబుతున్నాయి.

ఇండోనేసియాలో తిరిగినా అక్కడి ప్రజల సంస్కృతి చూసినా ఏదో ఒక రూపంలో హిందూ మతానికి చెందిన ఆనవాళ్లు కనిపిస్తూ ఉంటాయి. గతంలో అనేక హిందూ రాజవంశాలు ఇండోనేసియాను పాలించడమే ఇందుకు కారణం.

7-16 శతాబ్దాల మధ్య అనేక హిందూ, బౌద్ధ రాజవంశాలు ఇండోనేసియాను పాలించాయి. ఇందులో మజాపహిత్, శ్రీ విజయ సామ్రాజ్యాలు ముఖ్యమైనవి. వీరి ద్వారా ఇండోనేసియా దీవుల్లో హిందూ మతం వ్యాపించింది.

హిందూ, బౌద్ధం, అనిమిజంతోపాటు ఇతర మతాలు కూడా ఉండేవి. అయితే సంస్కృతం మతపరమైన భాషగా ఉంది. 7-12 శతాబ్దాల మధ్య ఉన్న శ్రీ విజయ సామ్రాజ్యంలో సంస్కృతంతో పాటు 'పాత మలయ్' భాష కూడా ఉంది.

నేటికి ఇండోనేసియా జానపద కథలు, వివిధ రకాల చిహ్నాల్లో ఆ చరిత్ర వినిపిస్తూ కనిపిస్తూ ఉంటుంది.

ఇండోనేసియా జాతీయ చిహ్నం గరుడ పక్షి. హిందూ పురాణాల్లో దీనికి చాలా చరిత్రే ఉంది. రావణాసురుడు ఎత్తుకెళ్లిన సీతను తీసుకు రావడంలో రామునికి గరుడ పక్షి సాయం చేసిందనే కథ రామ్‌చరిత్ మానస్‌లో ఉంది.

బండుంగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లోగోలో వినాయకుని బొమ్మ

ఫొటో సోర్స్, Facebook/ITB

ఫొటో క్యాప్షన్, బండుంగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లోగోలో వినాయకుని బొమ్మ

ఇండోనేసియాలోని ప్రముఖ యూనివర్సిటీ బాండుంగ్ ఇన్‌స్టిటిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లోగోలోనూ వినాయకుని బొమ్మ కనిపిస్తుంది.

ఇండోనేసియా విమానయాన సంస్థ పేరు గరుడ ఎయిర్‌లైన్స్. దాని లోగోలో గరుడ పక్షి బొమ్మ ఉంటుంది.

1961 నుంచి ఇండోనేసియాలోని ఒక ప్రాంతంలో తరచూ రామాయణం నాటకాన్ని ప్రదర్శిస్తుంటారు. ఇందులో హిందువులే కాక ఇతర మతాలకు చెందిన వారు కూడా నటిస్తుంటారు.

అంతేకాక ఇండోనేసియాలో హిందూ మతానికి చెందిన పేర్లు కూడా ఎక్కువగా కనిపిస్తుంటాయి.

వీడియో క్యాప్షన్, ఉత్తరాంధ్ర గిరిజన కళల్ని ప్రపంచానికి చూపిస్తున్న యువ యూట్యూబర్స్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)