వీర్యం శరీరంపై పడితే దురద వస్తుందా... సెమెన్ అలర్జీ నుంచి బయటపడటం ఎలా?

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, పద్మ మీనాక్షి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

విశాఖపట్నానికి చెందిన 26 ఏళ్ల ప్రణతి (పేరు మార్చాం) ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ, ఆమె దాంపత్య జీవితం ఊహించినట్లుగా సాగలేదు.

మొదటి రాత్రి నుంచే భర్తతో సెక్స్‌లో పాల్గొన్న వెంటనే యోనిలో విపరీతమైన మంట, దురద రావడం మొదలుపెట్టింది. ఆమెకు ఏమి చేయాలో అర్ధం కాలేదు.

"ఇంట్లో వారితో చెప్పినప్పుడు పెళ్ళైన కొత్తలో ఇలాంటివి సాధారణమే అని కొట్టిపారేశారు. ఆందోళన చెందాల్సిన పని లేదు" అని చెప్పారు.

కానీ, ఆమెకు సెక్స్ అనగానే ఆమడ దూరం పారిపోయేంత భయం మొదలయింది.

ప్రణతి పరిస్థితి నరకంలా మారింది. తనకు ఎదురవుతున్న సమస్య భర్తకు కూడా అర్ధమయ్యేది కాదని, సెక్స్ అంటే అయిష్టత చూపిస్తున్నానని విసుక్కునేవారని ఆమె చెప్పారు.

ఆమె పెళ్ళైన కొన్ని రోజులకే భర్తతో కలిసి లండన్ వెళ్లారు. ఆమె ఎదుర్కొంటున్న సమస్య మరింత పెరిగిందే కానీ, తగ్గుముఖం పట్టలేదు.

లండన్‌లో డాక్టర్ దగ్గరకు వెళ్లినప్పుడు కూడా ఆమెకు యూరినరీ ఇన్ఫెక్షన్ కోసం చికిత్స చేసినట్లు చెప్పారు. ఎన్ని మందులు వేసుకున్నా, ఆయింట్ మెంట్లు వాడినా పరిస్థితిలో ఏ మాత్రం మార్పు కనిపించలేదు.

"దాంపత్య జీవితం మర్చిపోవాల్సిందే అనే నిర్ణయానికి వచ్చేసాను" అని ఆమె అన్నారు.

సెక్స్

ఫొటో సోర్స్, Getty Images

లండన్‌లో ఎమర్జెన్సీ కానీ ఆరోగ్య సమస్యలకు జనరల్ ప్రాక్టీషనర్ అపాయింట్మెంట్ లభించడం సులభం కాదు. దీంతో, డాక్టర్ అపాయింట్మెంట్ కోసం కొన్ని వారాల పాటు ఎదురు చూడాల్సి వచ్చేది. ఆ దేశంలో మందుల షాపుకు వెళ్లి మందులు కొనుక్కునే పరిస్థితి కూడా లేదు. ఎన్ని రోజులైనా డాక్టర్ అపాయింట్మెంట్ కోసం వేచి చూడాల్సిందే. వారు రాసిన మందులను మాత్రమే కొనుక్కోగలిగే వీలుంటుంది.

"ఇది ఎవరికీ చెప్పుకోలేని సమస్య. స్నేహితులతో చర్చించినా అర్ధం అయ్యేది కాదు. నా చుట్టు పక్కల ఎవరూ గతంలో ఇటువంటి సమస్యను అనుభవించిన వారు లేరు"అని ఆమె వివరించారు.

"నన్ను చాలా ప్రశ్నలు చుట్టుముట్టేవి. ఒక వైపు భర్త లైంగిక సుఖం కోసం వేరే వారి దగ్గరకు వెళతారేమోననే భయం, మరోవైపు మానసిక, శారీరక ఒత్తిడితో ఎటూ తోచేది కాదు" అని చెప్పారు.

"పెళ్ళైన కొత్తలో తీపి జ్ఞాపకాలకు బదులు ఆరోగ్య సమస్యతో చేదు గుర్తులే మిగిలాయి"అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

రోజురోజుకీ ఈ సమస్య తీవ్రంగా మారడంతో, ఆమె కేవలం ఈ సమస్యకు చికిత్స చేయించుకోవడం కోసం ఇండియా బయలుదేరి వచ్చారు.

డాక్టర్లు ఆమెకు అన్ని పరీక్షలు చేసి ఇది ‘‘వజైనైటిస్’’ లేదా ‘‘సెమెన్ అలర్జీ’’ అయి ఉంటుందని తేల్చారు. దీని గురించి మొదటి సారి విన్న ఆమె ఆశ్చర్యపోయారు.

ఇటువంటి కేసునే ఇటీవల హైదరాబాద్‌లో డాక్టర్లు గుర్తించినట్లు వార్తలొచ్చాయి. ఇది హైదరాబాద్‌లో మొదటి కేసు, భారతదేశంలో ఆరవ కేసు కావచ్చని డాక్టర్లు చెబుతున్నారు.

సెమెన్ అలర్జీ

ఫొటో సోర్స్, Thinkstock

సెమెన్ అలర్జీ అంటే ఏంటి?

సెమెన్ అలర్జీ గురించి ఆంధ్రా యూనివర్సిటీలో మైక్రో బయాలజీ ప్రొఫెసర్, కేజీహెచ్‌ ఇమ్యునాలజీ మాజీ విభాగాధిపతి డాక్టర్ అప్పారావు బీబీసీకి వివరించారు.

"సెమెన్ అలర్జీ లేదా హ్యూమన్ సెమినల్ హైపర్ సెన్సిటివిటీ అంటే పురుషుల వీర్యంలో ఉండే ప్రోటీన్.. యోని భాగాన్ని తాకినప్పుడు కలిగే అలర్జీ. దీనిని యాంటీబాడీ, యాంటీజెన్ రియాక్షన్ అని చెప్పవచ్చు. ఇది మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది"అని ఆయన చెప్పారు.

సెమెన్ అలర్జీ ఉన్నవారికి యోని మార్గంలో ఎక్కువగా లక్షణాలు కనిపిస్తాయి.

ఫొటో సోర్స్, Getty Images

లక్షణాలు ఎలా ఉంటాయి?

సెమెన్ అలర్జీ ఉన్నవారికి యోని మార్గంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.

లైంగికంగా కలిసినప్పుడు యోని దగ్గర చర్మం ఎర్రబడటం, వాపు, నొప్పి, దురద, మంట కలుగుతాయి. లైంగిక కలయిక జరిగిన 10- 30 నిమిషాల లోపు ఈ లక్షణాలు కనిపించడం మొదలుపెడతాయి.

హైదరాబాద్‌లో బయట పడిన కేసులో లైంగిక కలయిక తర్వాత 30 నిమిషాల నుంచి 6 గంటల లోపు తీవ్రమైన ప్రతికూల ప్రభావాలు కనిపిస్తున్నట్లు తెలిసింది.

‘‘ఈ లక్షణాలు కేవలం యోని భాగానికే పరిమితం కాదు. చేతులు, నోరు, మూత్ర ద్వారం, ఛాతీ లాంటి ఏ భాగంపై వీర్యం పడినా కూడా అలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది’’అని డాక్టర్ అప్పారావు వివరించారు.

కొంత మందికి జలుబు, తుమ్ములు లాంటి ఇతర సమస్యలు కూడా వచ్చే అవకాశముంది.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Thinkstock

ఈ అలర్జీ ప్రభావం తీవ్రంగా ఉన్నవారిలో…

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, పిల్లి కూతలు, నాలుక, గొంతు వాపు, పల్స్ రేటులో తగ్గుదల, కళ్లు తిరగడం, వికారం, వాంతులు , విరోచనాలు లాంటి సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉంటుందని చెప్పారు.

"చాలా మందికి సెమెన్ అలర్జీ ఉన్నట్లు కూడా గ్రహించరు. ఈ సమస్య బయటకు చెప్పుకునేందుకు ఇష్టం లేక చికిత్స తీసుకోవడానికి కూడా సంశయిస్తారు" అని డాక్టర్ అప్పారావు చెప్పారు.

గ్రాఫిటీ

సమస్య ఉందని ఎలా తెలుస్తుంది?

భాగస్వాములతో మొదటి సారి సెక్స్‌లో పాల్గొన్నప్పుడే వీర్యంతో అలర్జీ ఉందనే విషయం తెలుస్తుంది. కానీ, సాధారణంగా ఇది యూరినరీ ఇన్ఫెక్షన్ లేదా వజైనైటిస్ అని చాలా మంది భావిస్తూ ఉంటారని వైద్యులు చెప్పారు.

సెమెన్ అలర్జీ ఒకరితోనే ఉంటుందా? లేదా ఎవెరితో కలిసినా ఉంటుందా?

‘‘ఒక్కొక్కసారి భర్తతో సెమెన్ అలర్జీ ఉన్న మహిళకు మరొక వ్యక్తితో సెక్స్‌లో పాల్గొన్నప్పుడు అలర్జీ కలగకపోవచ్చు. అటువంటి సమయంలో భర్త ఆరోగ్య చరిత్రను కూడా పరిశీలించి అందుకు తగిన చికిత్స చేయాల్సి ఉంటుంది’’అని అప్పారావు చెప్పారు.

సాధారణంగా ఇలాంటి సమస్యలకు వజైనైటిస్ అని చికిత్స చేస్తూ ఉంటారు.

వజైనైటిస్‌లో కూడా యోనిలో వాపు ఏర్పడి దురద, మంట రావడం, డిశ్చార్జ్ అవ్వడం లాంటివి జరుగుతాయని మయో క్లినిక్ సమాచారం చెబుతోంది. యోనిలో ఇన్ఫెక్షన్ ఏర్పడటం వల్ల ఈ సమస్య వస్తుంది.

కానీ, సెమెన్ అలర్జీ సెక్స్‌లో పాల్గొన్న తర్వాత మాత్రమే వస్తుంది. సెమెన్ అలర్జీ ఉందో లేదో తెలుసుకోవడం కోసం వీర్యాన్ని భాగస్వామి శరీరంలోకి ప్రవేశపెట్టి అలర్జీ ఉందో లేదో పరిశీలిస్తారు.

సెమెన్ అలర్జీ లైంగిక సాంక్రమిక వ్యాధి కాదు.

కండోమ్

ఫొటో సోర్స్, Getty Images

సెమెన్ అలర్జీకి చికిత్స ఏమిటి?

సెమెన్ అలర్జీ తీవ్రంగా ఉంటే దానికి కండోమ్ వాడటమే సత్వర పరిష్కారమని డాక్టర్ అప్పారావు చెప్పారు.

సెక్స్‌కు ముందు యాంటీ హిస్టమైన్ టాబ్లెట్ వేసుకోవచ్చని ఆయన సూచించారు. అయితే, ఇది వైద్య పరీక్షల తర్వాత డాక్టర్ సలహా మేరకే వాడాలని చెప్పారు.

అలర్జీని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి డాక్టర్‌ను సంప్రదించాలని ఆయన చెప్పారు. అలర్జీ స్క్రీనింగ్ పరీక్షను చేయించుకుని సంబంధిత నిపుణులు, లేదా ఇమ్యునాలజీ నిపుణులను సంప్రదించాలని సూచించారు.

అలర్జీ తీవ్రత అందరిలో ఒకేలా ఉండదని, వ్యక్తుల రోగ నిరోధక శక్తిపై కూడా ఆధారపడి ఉంటుందని డాక్టర్ అప్పారావు వివరించారు.

‘‘ఈ సమస్య ఉన్నవారు పిల్లల్ని కనాలని అనుకున్నప్పుడు గైనకాలజిస్ట్ లేదా అలర్జీ నిపుణులను సంప్రదించాలి. లేదా ప్రత్యామ్నాయ విధానాల కోసం సంతానోత్పత్తి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది’’అని అప్పారావు సూచించారు.

పిల్లల్ని కనడం పై ప్రభావం ఉంటుందా?

ఫొటో సోర్స్, DEV IMAGES

లైంగిక జీవితం పై ప్రభావం చూపిస్తుంది.

హైదరాబాద్‌కు చెందిన దంపతులు పెళ్ళైన ఆరేళ్ల వరకు పిల్లలు కలగకపోవడంతో వైద్య పరీక్షలకు వెళ్ళినప్పుడు ఆమెకు సెమెన్ హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్ ఉన్నట్లు తెలిసింది.

ఆమె చేతిని స్టెరిలైజ్ చేసి ఆమె భర్త నుంచి 0.5 ఎంఎల్ సెమెన్‌ను సేకరించి ఆమె శరీరంలోకి ప్రవేశపేట్టినట్లు డాక్టర్లు తెలిపారు. వైద్య పరీక్షల్లో ఆమెకు సెమెన్ అలర్జీ ఉన్నట్లు తెలిసినట్లు వార్తా కథనాలు పేర్కొన్నాయి.

అయితే, ఈ కేసులో ఆమె భాగస్వామికి కూడా చిన్నప్పటి నుంచి ఉబ్బసం, దురదలు, దద్దుర్ల లాంటి అలర్జీలు ఉన్నట్లు తెల్సింది. ఈ అలర్జీ ముదిరితే అలర్జీక్ ఆంజియోఎడీమా లేదా అలర్జీ వల్ల కలిగే అనాఫిలాక్టిక్ షాక్‌కు గురయ్యే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరించినట్లు "తెలంగాణ టుడే" పత్రికలో ప్రచురితమయిన సమాచారంలో పేర్కొన్నారు.

ప్రాణాపాయం కలిగించే రియాక్షన్‌లు రాకుండా కొన్ని ఇంజక్షన్లు ఇంట్లో ఉంచుకోమని వైద్యులు ఆ దంపతులకు సూచించారు.

ప్రణతి, ఆమె భర్త ఈ సమస్యకు చికిత్స తీసుకున్నారు. రెండు నుంచి మూడు నెలల పాటు కోర్సు వాడిన తర్వాత అలర్జీ తగ్గింది. ఈ చికిత్స తీసుకున్న తర్వాత ప్రణతి ఇద్దరమ్మాయిలకు జన్మనిచ్చారు.

వీడియో క్యాప్షన్, సంతానలేమికి దోశ పెనం, పిజ్జా బాక్స్ కూడా కారణం అవుతోందా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)