Goods and Services Tax : పరోటాకు, రోటీకి, వేర్వేరు జీఎస్టీ ఎందుకు, పార్లర్ ఐస్‌క్రీమ్‌కు, హోటల్ ఐస్‌క్రీమ్‌కు తేడా ఏంటి?

పిజ్జా టాపింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పిజ్జా మీద కన్నా పిజ్జా టాపింగ్‌ల మీద ఎక్కువ పన్ను ఉంటుందని కోర్టు తీర్పు చెప్పింది

పిజ్జా ఆర్డర్ ఇస్తున్నారా? పిజ్జా మీద సరైన టాపింగ్‌ ఎంచుకోవటం ఓ సవాలే. టాపింగ్‌ ఎక్కువయితే పిజ్జా సాగిపోతుంది. మిశ్రమంలో తేడావస్తే పిజ్జా టేస్ట్ మారిపోతుంది.

అయితే పిజ్జా టాపింగ్( పిజ్జా పైన వేసే పదార్ధాలు ) విషయంలో ఓ భిన్నమైన సమస్య ఇటీవల ఓ కోర్టుకు వచ్చింది. అది టాపింగ్ రుచి గురించి కాదు. ఆ టాపింగ్ మీద వేసే వస్తువులు, సేవల పన్ను (జీఎస్‌టీ) గురించి.

దేశంలో ఐదేళ్ల కిందట ప్రవేశపెట్టిన జీఎస్‌టీతో ప్రభుత్వ ఆదాయం అమాంతం పెరిగింది. సర్కారు ఈ పన్నుతో ప్రతి నెలా దాదాపు 1,40,000 కోట్ల రూపాయలు ఆర్జిస్తోంది.

ఖేరా ట్రేడింగ్ కంపెనీ అనే సంస్థ తమ పిజ్జాలపై ఉపయోగించే మొజారెల్లా టాపింగ్‌ను చీజ్ కింద వర్గీకరించాలంటూ హరియాణాలో కోర్టుకు వెళ్లింది. ఎందుకంటే.. మొజారెల్లా టాపింగ్ మీద 18 శాతం జీఎస్‌టీ ఉంటే.. చీజ్ టాపింగ్ మీద జీఎస్‌టీ తక్కువగా (12 శాతం) ఉంది. పిజ్జా టాపింగ్‌లలో మూడొంతులకన్నా ఎక్కువ చీజ్ వంటి పాల ఉత్పత్తులే ఉంటాయని ఆ సంస్థ కోర్టులో వాదించింది.

కానీ ఆ వాదనతో కోర్టు విభేదించింది. పిజ్జా మీద టాపింగ్‌ను కేవలం చీజ్ అని మాత్రమే వర్గీకరించటం కుదరదని చెప్పింది.

టాపింగ్‌లలో వంట నూనె కూడా ఉంటుందని, కచ్చితంగా చెప్పాలంటే 22 శాతం నూనె ఉంటుందని కోర్టు పేర్కొంది. అయితే ఆ నూనె వల్ల పిజ్జాకు రంగు, రుచి వస్తుందని, ధర కూడా చౌకేనని సదరు సంస్థ చెప్పింది.

జీఎస్‌టీ బిల్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఐదేళ్ల కిందట ప్రవేశపెట్టిన జీఎస్‌టీ ద్వారా ప్రభుత్వానికి ప్రతి నెలా దాదాపు 1,44,000 కోట్ల రూపాయల ఆదాయం లభిస్తోంది

అయితే నూనె కొవ్వు అనేది చీజ్‌లోని పదార్థం కాదని కోర్టు అంది. కాబట్టి టాపింగ్‌ను చీజ్‌గా వర్గీకరించటం చెల్లదని పేర్కొంది. నూనెలు కలిసిన టాపింగ్‌ను 'ఎడిబుల్ ప్రిపరేషన్' (తినటానికి తయారు చేసిన) పదార్థంగా వర్ణించాల్సి ఉంటుందని, దాని మీద 18 శాతం పన్ను కట్టాల్సి ఉంటుందని కోర్టు స్పష్టంచేసింది. ఆ సంస్థ కేసు ఓడిపోయింది.

ఇలాంటి కోర్టు పోరాటాలతో.. భారతదేశపు జీఎస్‌టీ విధానం చాలా సంక్లిష్టమైన పన్ను విధానమని పన్ను నిపుణులు భావించే పరిస్థితి వచ్చింది. జీఎస్‌టీ కింద దాదాపు 2,000 వస్తువులు, సేవలపై 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం, ప్యాక్ చేయని ఆహారం మీద సున్నా శాతం - మొత్తం ఐదు రకాల పన్ను రేట్లు విధించారు. పెట్రోలు, డీజిల్, విద్యుత్, రియల్ ఎస్టేట్‌లను జీఎస్‌టీ పరిధిలోకి తేలేదు.

''దీనివల్ల ఏదైనా ఉత్పత్తి లేదా సేవను నిర్దేశించిన కోడ్‌లు, వాటి రేట్లతో వర్గీకరించటం మీద గందరగోళం తలెత్తుతోంది. జీఎస్‌టీ అమలులోకి వచ్చినప్పటి నుంచీ అనేక కోర్టు కేసులు, తీర్పులు వచ్చాయి'' అని పన్నుల నిపుణురాలు అనితా రస్తోగి పేర్కొన్నారు. కన్సల్టింగ్ సంస్థ ప్రైస్‌ వాటర్‌ హౌస్‌ కూపర్స్‌లో జీఎస్‌టీ, పరోక్ష పన్నుల విభాగంలో ఆమె భాగస్వామిగా ఉన్నారు.

ప్రత్యేకించి ఆహార పరిశ్రమ విషయంలో ఈ జీఎస్‌టీ పన్నుపై మరింతగా చిక్కుముడులు ఉన్నట్లు కనిపిస్తోంది.

రోటీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రోటీ మీద 5 శాతం జీఎస్‌టీ వర్తిస్తుంది
పరాఠా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పరాఠా మీద 18 శాతం జీఎస్‌టీ వసూలు చేస్తున్నారు

భారతీయులు ప్రతి రోజూ తినే ఆహారంలో రోటీలు, పరోటాలు ( ఉత్తరాదిలో పరాఠా అని పిలుస్తారు) ఒక భాగం. అయితే రోటీ మీద 5 శాతం పన్ను ఉంటే.. పరోటా మీద 18 శాతం జీఎస్‌టీ పన్ను విధించారు. దీనిపై ఏడాదిన్నర కిందట ఒక కేసు నమోదైంది. ఆ కేసులో గత సెప్టెంబరులో తీర్పు వెలువడింది.

గుజరాత్‌కు చెందిన వాడీలాల్ ఇండస్ట్రీస్ అనే సంస్థ...తన తయారు చేసే ఫ్రోజెన్ పరాఠాల మీద గత ఏడాది జూన్‌లో కోర్టుకు వెళ్లింది. ఆ సంస్థ ఎనిమిది రకాల పరోటాలు తయారు చేస్తుంది. కొన్ని సాదా పరోటాలు అయితే కొన్నిటిలో ఉడికించిన కూరగాయలు ఉంటాయి. ఈ పరోటాల మీద కూడా రోటీ తరహాలోనే తక్కువ జీఎస్‌టీ ఉండాలని ఆ సంస్థ వాదించింది. రోటీ, పరోటాల్లో ముఖ్యమైన పదార్థం గోధుమ పిండే కదా అని ప్రస్తావించింది.

కోర్టు కాదంది. ప్యాక్ చేసిన పరోటాలలో ప్రధానంగా గోధుమ పిండే ఉంటుందనే విషయాన్ని జడ్జి అంగీకరించారు. అయితే ఇంకో మాట కూడా చెప్పారు. ఆ పరోటాలో నీరు, నూనె, ఉప్పు, కూరగాయలు, రాడిష్ వంటి 'ఇతర పదార్థాలు' కూడా ఉంటాయన్నారు. సంస్థ వినతిని తిరస్కరిస్తూ.. ''కక్షిదారు సరఫరా చేసే పరోటాలు.. రోటీకి భిన్నమైనవి'' అని కోర్టు చెప్పింది.

'బుర్ర గోక్కునేలా చేసే' ఇలాంటి తీర్పులు మరిన్ని ఉన్నాయని చాలా మంది అంటున్నారు. రెస్టారెంట్లలో అమ్మే ఐస్‌క్రీముల కన్నా.. పార్లర్లు అమ్మే ఐస్‌క్రీములకు ఎక్కువ పన్ను (18 శాతం) రేటు వర్తిస్తుందని ఓ కోర్టు నిర్ణయించింది. ఎందుకంటే పార్లర్లలో అమ్మే ఐస్‌క్రీములను.. ''రెస్టారెంట్లలో చేసినట్లుగా వండటం లేదా తయారు చేయటం ఉండదని.. అప్పటికే తయారుచేసి సిద్ధంగా ఉన్న ఐస్‌క్రీములని పార్లర్లలో అమ్ముతారు'' అని చెప్పింది.

పార్లర్లు ఐస్‌క్రీమ్‌ని ''అందించటంలో కొంతవరకూ సేవ అనేది ఉన్నా కూడా.. అక్కడ ఐస్‌క్రీమ్‌ని వస్తువుగా అమ్ముతారు కానీ సర్వీసుగా కాదు'' అని వివరించింది.

అప్పడాలు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, అప్పడాలకు జీఎస్‌టీ నుంచి మినహాయింపు ఉంది.. కానీ వేయించిన వడియాలకు 18 శాతం పన్ను వర్తిస్తుంది

ఇక గుజరాత్‌లో సగ్గుబియ్యం, ఆలుగడ్డల గంజితో చేసే వేయించిన వడియాల విషయంలో ఒక కేసు నడిచింది. అప్పడాలకు జీఎస్‌టీ నుంచి మినహాయింపు ఉందని, అలాగే ఈ వేయించిన వడియాలను కూడా జీఎస్‌టీ నుంచి మినహాయించాలని కక్షిదారు కోరారు. కానీ కోర్టు అందుకు నిరాకరించింది.

వేయించిన వడియాలు తినటానికి సిద్ధంగా ఉంటాయని, అప్పడాలను వేయించాల్సి ఉంటుందని కోర్టు పేర్కొంది. ''రెండు ఉత్పత్తులూ వేర్వేరు. వాటికి వేర్వేరు గుర్తింపు ఉంది'' అని జడ్జి చెప్పారు. వేయించిన వడియాలకు 18 శాతం జీఎస్‌టీ కొనసాగుతోంది.

అలాగే.. ఫ్లేవర్డ్ మిల్క్ తయారు చేసే ఒక సంస్థ కోర్టుకు వెళ్లింది. సాధారణ పాలకు పన్ను మినహాయింపు ఉంటే తమ ఫ్లేవర్డ్ మిల్క్ పానీయం మీద 12 శాతం పన్ను విధించటాన్ని సవాల్ చేసింది. తమ ఉత్పత్తిలో 92 శాతం పాలు ఉంటే, కేవలం 8 శాతం మాత్రమే చక్కెర ఉంటుందని ఆ సంస్థ చెప్పింది. అయితే 'పాల నిర్వచనం' కిందకు ఫ్లేవర్డ్ మిల్క్ రాదని.. కాబట్టి ఆ పానీయానికి పన్ను నుంచి మినహాయింపు లేదని కోర్టు చెప్పింది.

ఆపైన.. వండటానికి సిద్ధంగా ఉండే (రెడీ టు కుక్) దోశ, ఇడ్లి మీద.. వాటిని తయారు చేయటానికి ఉపయోగించే పిండి (బాటర్) మీద కన్నా ఎక్కువ పన్ను విధించటం విషయంలో కూడా మరో కేసు నడిచింది.

జీఎస్‌టీ

ఫొటో సోర్స్, Getty Images

ఈ గందరగోళం, అయోమయాలను తొలగించటానికి ఒక దారి.. పన్ను విధానాన్ని సరళీకరించి, వేర్వేరు పన్ను రేట్లను కలిపేసి ఒకటే తక్కువ పన్ను రేటు విధించటం అని నిపుణులు భావిస్తున్నారు. (1995 తర్వాత జీఎస్‌టీ ప్రవేశపెట్టిన దేశాల్లో 80 శాతం దేశాలు ఒక్క పన్ను రేటునే అమలు చేస్తున్నాయి.)

''దేశంలో వివిధ లాబాయింగ్ బృందాలు.. ఒక రంగం మీద కానీ మరో రంగం మీద కానీ పన్నును తగ్గించాలనో, పెంచాలనో ఒత్తిడి తెస్తుంటాయి. దీనివల్ల ఆర్థికవ్యవస్థలో వనరుల కేటాయింపు గందరగోళంగా మారుతుంది'' అని ఆర్థికవేత్తలు విజయ్ కేల్కర్, అజయ్ షాలు చెప్తున్నారు.

వస్తువులు, సేవలు కొనే ప్రధాన సంస్థ ప్రభుత్వమే కాబట్టి.. తక్కువ స్థాయిలో ఉండే ఒకటే జీఎస్‌టీ అమలు చేయటం వల్ల ''ప్రభుత్వంలో అన్ని స్థాయిల్లో ఖర్చు ఆదా అవుతుంది'' అని వారు భావిస్తున్నారు.

ఒకటే తక్కువ రేటు ఉండటం వల్ల వర్గీకరణ వివాదాలన్నీ తొలగిపోయే అవకాశం ఉంది. పన్ను ఎగవేతతో వచ్చే ప్రయోజనాలు తగ్గిపోతాయి. పన్ను చెల్లించేలా చూసేందుకు అయ్యే ఖర్చులూ తగ్గుతాయి.

''పన్ను రేట్లు కలిపేయటం లేదా తగ్గించటం చేసిన వెంటనే.. వర్గీకరణ వివాదాలు తగ్గిపోతాయి. కానీ ఆదాయ వ్యత్యాసాలు అత్యధికంగా ఉండే భారత్ వంటి దేశంలో.. ఒకటే పన్ను రేటు, లేదా రెండు పన్ను రేట్ల విధానం వల్ల.. పేదల మీద ఎక్కువ భారం పడే ప్రమాదం ఉంది'' అంటారు ఉదయ్ పింప్రికార్. ఆయన అంతర్జాతీయ అకౌంటింగ్, కన్సల్టెన్సీ సంస్థ ఈవైలో ఇండియా పరోక్ష పన్ను సేవల భాగస్వామి.

జీఎస్‌టీ అంటే 'గుడ్ అండ్ సింపుల్ టాక్స్ (మంచి, సరళ పన్ను) అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒకసారి అభివర్ణించారు. కానీ అది అమలులో అలా లేదనేది స్పష్టం.

వీడియో క్యాప్షన్, జీఎస్‌టీ: నేటి నుంచి ధరలు పెరిగినవి ఇవే

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)