Rupee Fall: భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చినప్పుడు డాలర్‌తో రూపాయి విలువ 3.30.. ఇప్పుడు 82.30 రూపాయలు.. కారణాలేంటి?
రూపాయి విలువ పతనంలో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. కాలం ప్రతీ 24 గంటలు దాటి 25వ గంటలోకి ప్రవేశించే సరికి... రూపీ విలువ కొత్త అంకెల్లో కనిపిస్తోంది.
ఈ వీడియో తయారు చేసేటప్పటికి, డాలర్‌తో 82.39గా ఉన్న మారకపు విలువ ఈ నెలాఖరు నాటికి 83 రూపాయలకు చేరుతుందంటున్నారు ఆర్థిక నిపుణులు. అంతర్జాతీయ పరిణామాలను అందుకు కారణంగా చూపిస్తున్నారు.
మన కరెన్సీ వ్యాల్యూ పడిపోయిన ప్రతీసారి.. అది మన జీవితాల మీద చాలా ప్రభావం చూపిస్తోంది.

1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు అమెరికా డాలర్ విలువ 3.30 రూపాయలు
రూపాయి విలువ పడిపోయినప్పుడల్లా.. సామాజిక మాధ్యమాల్లో ఒక మెసేజ్ లేదా సందేశం రావడం కామనైపోయింది. 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ఒక రూపాయి ఒక డాలరుకు సమానంగా ఉందనేది దాని సారాంశం.
చాలా మంది ఇది నిజమని భావిస్తున్నారు. కానీ వాస్తవం ఏంటంటే.. 1947లో డాలర్‌తో రూపాయి మారకపు విలువ మూడు రూపాయల 30 పైసలు..
1948లో మూడున్నర రూపాయలుగా ఉన్న మారకపు విలువ 80ల వరకూ కాస్త అటు ఇటుగా అలాగే ఉంది.
ముఖ్యంగా, ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైన తర్వాత ఇండియన్ కరెన్సీ.. పడుతూ లేస్తూ అన్నట్లుగానే సాగుతోంది.
స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకూ అంటే ఈ 75 ఏళ్లలో రూపాయి విలువ 79 రూపాయలు పడిపోయింది.
రూపాయి విలువ పడిపోవడం అంటే మన జేబులో, బ్యాంక్ అకౌంట్లలో ఉన్న నగదు విలువ తగ్గిపోవడం లాంటిదే.
ఈ ఏడాది ఇప్పటి వరకూ ఇండియన్ కరెన్సీ విలువ 8.9 శాతం దిగజారింది.

రూపాయి విలువ ఎందుకు పడిపోతోంది?
కారణాలు సింపుల్.. పెద్ద నోట్ల రద్దు, ఆ తర్వాత కరోనా సంక్షోభం, యుక్రెయిన్ మీద రష్యా దాడి, తాజాగా ముడి చమురు ఉత్పత్తిని తగ్గించాలన్న ఒపెక్ దేశాల నిర్ణయం.. ఇవన్నీ రూపాయి విలువను కొంచెంకొంచెంగా తినేస్తూ వచ్చాయి.
ఇది ఇక్కడితో ఆగుతుందనే గ్యారంటీ కూడా లేదు. మన దేశం ముడి చమురుతో పాటు అనేక వస్తువుల విషయంలో ఎక్కువగా దిగుమతుల మీదనే ఆధారపడింది.
ప్రపంచంలో చమురు వినియోగించే దేశాల్లో మూడో స్థానంలో ఉన్న భారత్‌కు.. 85 శాతం చమురుకు దిగుమతులే దిక్కు.
ఇదొక్కటే కాక, ఫార్మా, స్టీల్, టెక్నాలజీ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, తదితర రంగాలకు అవసరమైన ముడి సరకులు, వంట నూనెలు, ఆహార ధాన్యాలు, పప్పులు, లోహాలను భారత్ దిగుమతి చేసుకుంటోంది.
దిగుమతులన్నింటికీ చెల్లింపులు డాలర్లలోనే జరపాలి. అంటే రూపాయి విలువ తగ్గినప్పుడల్లా.. దిగుమతుల కోసం చెల్లించాల్సిన మొత్తం పెరుగుతూ పోతుంది.
కరెన్సీ విలువ పడిపోతే దిగుమతుల మీద ఆధారపడిన అన్ని రకాల వస్తువుల ధరలు పెరుగుతాయన్నది తెలిసిందే.

సామాన్య ప్రజలపై పడే ప్రభావం ఎంత?
రూపాయి విలువ పడిపోవడం అంటే మన జేబులో, బ్యాంకుల్లో దాచుకున్న నగదు విలువ పడిపోవడమే కాకుండా ఖర్చులు కూడా పెరిగిపోవడం.
మన కరెన్సీ విలువ పడిపోతే దిగుమతి చేసుకునే వస్తువులకు అధిక ధర చెల్లించాలి. అంతిమంగా భారం పడేది వినియోగదారుల మీదనే.
ఇందులో మొదటి వరుసలో ఉన్నాయి పెట్రోల్, డీజిల్ గ్యాస్ ధరలు.
డీజిల్ ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరిగి, ఉప్పు, పప్పులు, ఆహార ధాన్యాల ధరలు కూడా పెరుగుతాయి.
ప్రయాణ ఖర్చులు, ఆటో చార్జీలు, బట్టలు, మొబైల్ ఫోన్లు, టీవీలు, ల్యాప్‌టాపులు, వాహనాలు స్కూలు ఫీజులు ఇలా ఒకటేమిటి.. అన్నింటి ధరలు అంతో ఇంతో పెరుగుతాయి.
కొన్ని వస్తువుల ధరలు పెరగకున్నా.. ధరలు పెంచాలని భావించేవారికి ఇదొక అవకాశాన్ని ఇస్తుంది. డీజిల్ ధరలు పెరిగితే వ్యవసాయ రంగంలో ఉత్పాదక ఖర్చు కూడా పెరుగుతుంది.
ప్రభుత్వం ఏం చేస్తుంది?
ప్రభుత్వాల దగ్గర మంత్రదండం ఏమీ లేదు... ధరలు పెరిగినప్పుడల్లా ఆర్థికమంత్రులంతా చెబుతున్న మాట ఇది.
రూపాయి విలువ పడిపోవడం వల్ల బడ్జెట్ లెక్కలు, అంచనాలు మారిపోతాయి. మౌలిక వసతుల నిర్మాణంలో బాగంగా చేపట్టిన ప్రాజెక్టుల ఖర్చు పెరుగుతుంది.
ఇలాంటి సందర్భాల్లో ద్రవ్యలోటుని అదుపులో ఉంచడాన్ని ఆర్థికమంత్రులు ప్రధాన కర్తవ్యంగా భావిస్తారు.
అందుకే పెట్రోల్, డీజిల్ మీద ఎక్సైజ్ టాక్స్ పెంచడం, అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా పన్నులు వేయడం లాంటివి, బంగారం లాంటి కొన్ని వస్తువుల దిగుమతుల మీద సెస్ విధించడం లాంటివి చేస్తున్నారు.
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగితే... మన దేశంలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం తప్ప మరో మార్గం లేదని రిసర్జెంట్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ గాడియా టైమ్స్ ఆఫ్ ఇండియాతో చెప్పారు.
అయితే, రూపాయి విలువ పడిపోతే విదేశాల్లో డాలర్లు సంపాదించి.. భారత్‌కు డబ్బులు పంపించే వారికి మాత్రం లాభమే.
విదేశాలకు ఎగుమతులు చేసే వారికి కూడా ఆదాయం పెరుగుతుంది. ఫార్మా, సాఫ్ట్ వేర్ లాంటి రంగాలకు రూపాయి పతనం మేలు చేసే అంశమే.
అయితే విదేశాలకు వెళ్లి చదువుకునే విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు మాత్రం భారం పడుతుంది.
స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే విదేశీ ఇన్వెస్టర్లకు కూడా లాభమే. వారు షేర్లను అమ్మితే మన సంస్థలు చెల్లించాల్సిన మొత్తం పెరుగుతుంది.
రూపాయి బలపడాలంటే ఏం చేయాలి?
రూపాయి విలువ పెరగాలంటే దిగుమతులపై ఆధారపడటం తగ్గించుకోవాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
అలాగే చమురుకు ప్రత్యామ్నాయ ఇంధనవనరుల వాడకం పెంచాలనేది మరో సూచన.
రెండూ సాధ్యమైతే.. అంతర్జాతీయ పరిణామాల ప్రభావం మన కరెన్సీపై తగ్గుతుందనే మాటల్లో వాస్తవం ఉంది.
ఇదంతా చెప్పడానికి తేలిగ్గా ఉన్నా.. ఇప్పటికిప్పుడు ఆచరణలో సాధ్యం కాని. దీనికి సుదీర్ఘ ప్రణాళిక అవసరం.
మనమేం చేయవచ్చు?
రూపాయి విలువ పతనం వల్ల పడే ప్రభావాన్ని తప్పించుకునేందుకు మార్గాలేమీ లేవు.
ఖర్చులు తగ్గించుకోవడం లేదా ఆదాయాన్ని పెంచుకోవడం.. సామాన్యుల ముందుంది ఈ రెండు మార్గాలే.
పరిస్థితులు చక్కబడే వరకూ అనవసరమైన ఖర్చులేవో గుర్తించడం, వాటిని దూరం పెట్టడం, జీవనశైలిని కొంత మార్చుకోవడం ద్వారా పెరిగిన ధరల ప్రభావాన్ని కొంత వరకూ తగ్గించుకోవచ్చు.
కొత్త నైపుణ్యాలను నేర్చుకుని వాటిని అదనపు ఆదాయ వనరుగా మార్చుకోవడం మరో మార్గం.
ఇవి కూడా చదవండి:
- చిన్నాన్న-పెదనాన్న, మేనత్త-మేనమామ పిల్లల్ని పెళ్లి చేసుకుంటే జరిగే జన్యు మార్పులు ఏంటి?
- PMBJP-జనరిక్ మందులు: కీళ్ల నొప్పుల నుంచి క్యాన్సర్ చికిత్స దాకా ఏ మందులైనా 50 నుంచి 90 శాతం తక్కువ ధరకే.. అయినా వీటిని ఎందుకు కొనట్లేదు?
- ముస్లిం యువతులు తరగతి గదుల్లో కూడా హిజాబ్ వేసుకునేలా అనుమతించాలన్న కేసులో ఇప్పటివరకు ఏం జరిగింది?
- ‘సౌరవ్ గంగూలీ బీజేపీలో చేరలేదు, కాబట్టే మళ్లీ బీసీసీఐ అధ్యక్షుడు కావట్లేదు’ – టీఎంసీ ఆరోపణ
- కేరళలో నరబలి వివాదం: 'మంత్రగాడి సలహాతో' ఇద్దరు మహిళలను హత్య చేసిన దంపతులు.. ఏం జరిగింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




