చిన్నాన్న-పెదనాన్న, మేనత్త-మేనమామ పిల్లల్ని పెళ్లి చేసుకుంటే జరిగే జన్యు మార్పులు ఏంటి?

కజిన్స్ పెళ్లిళ్లు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, బీబీసీ ముండో
    • హోదా, .

ప్రతి సంస్కృతిలోనూ కొన్ని ఆంక్షలు, అపోహలు, అపనమ్మకాలు, తప్పుదోవ పట్టించే విధానాలు ఉంటాయి. ఏ సంస్కృతీ దీనికి మినహాయింపు కాదు.

ఇక్కడ ఆంక్షలు అంటే, ఒకరకమైన సామాజిక నిబంధనలుగా చెప్పుకోవచ్చు. ఏది తప్పు, ఏది ఒప్పు లాంటి అంశాలను ఇవి ఒక్కోసారి నిర్దేశిస్తుంటాయి.

సంస్కృతుల్లో ఈ ఆంక్షలు భాగమై ఉంటాయి. అదే సమయంలో ఒక సంస్కృతిలో తప్పుగా భావించే విధానాలకు మరికొన్ని సంస్కృతులతో విడదీయరాని అనుబంధం ఉంటుంది.

భారతదేశంలో మేనరికపు పెళ్లిళ్లు ఎక్కువ. ఒక మతంలో మేనత్త, మేనమాన పిల్లలను పెళ్లి చేసుకుంటే, మరొక మతంలో చిన్నాన్న, పెదనాన్న, చిన్నమ్మ, పెద్దమ్మ పిల్లలను పెళ్లి చేసుకుంటుంటారు. ఈ పెళ్లిళ్ల వల్ల పుట్టే పిల్లల్లో అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయని వైద్య నిపుణులు హెచ్చరికలు చేస్తున్నారు.

అయితే, ఇది భారతదేశానికి మాత్రమే పరిమితమైనది కాదు.

ఇలానే ప్రపంచంలోని చాలాచోట్ల అత్తయ్య, చిన్నాన్న, పెదనాన్న పిల్లలను(కజిన్స్‌ను) పెళ్లి చేసుకోవడం కనిపిస్తుంది. ముఖ్యంగా పశ్చిమ, దక్షిణాసియా, ఉత్తర ఆఫ్రికాలలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది.

ప్రపంచంలోని దాదాపు పది శాతం కుటుంబాల్లోని జంటలు సెకండ్ కజిన్ లేదా కజిన్‌లను పెళ్లి చేసుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అంటే దాదాపు 75 కోట్ల మంది.

కజిన్స్ పెళ్లిళ్లు

ఫొటో సోర్స్, Thinkstock

అయితే, ఎక్కడ కజిన్స్‌ను పెళ్లి చేసుకోవడం చట్టబద్ధం అనే మ్యాప్‌ను చూస్తే, యూరప్‌లో చాలా దేశాలతోపాటు అమెరికా, ఆస్ట్రేలియాల, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలు, ఆసియా కనిపిస్తాయి.

అయితే, అమెరికా విషయానికి వస్తే, కొన్ని రాష్ట్రాల్లో ఈ కజిన్స్ వివాహాలపై ఆంక్షలు ఉన్నాయి.

న్యూయార్క్, కాలిఫోర్నియా, ఫ్లోరిడా లాంటి రాష్ట్రాల్లో ‘‘ఫస్ట్ కజిన్స్’’ను ఎలాంటి ఆంక్షలు లేకుండా పెళ్లి చేసుకోవచ్చు. కానీ, వెస్ట్ వర్జీనియా, కెంటుకీ, టెక్సస్ లాంటి చోట్ల ఇలాంటి పెళ్లిళ్లపై ఆంక్షలు అమలులో ఉన్నాయి.

ఆరిజోనా, ఇల్లినాయిస్, యూటా లాంటి రాష్ట్రాల్లో కొన్ని షరతులపై కజిన్స్ మధ్య పెళ్లిళ్లను ప్రభుత్వం అనుమతిస్తుంది. ఇద్దరిలో ఒకరికి సంతాన సమస్యలు ఉన్నా, లేదంటే వయసు పైబడినా ఈ పెళ్లిళ్లను గుర్తిస్తారు.

ఒక మెయిన్ రాష్ట్రానికి వస్తే, జెనెటిక్ కౌన్సెలింగ్‌కు హాజరైన తర్వాతే కజిన్స్‌ను పెళ్లి చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతిస్తుంది.

అసలు జెనెటిక్ కౌన్సెలింగ్ ఎందుకు? అనే ప్రశ్న చాలా మంది అమెరికన్లను వెంటాడుతుంటుంది. కొంతమందికి కొన్ని జన్యు వ్యాధుల ముప్పు ఎక్కువగా ఉంటుంది, అందుకే ఈ కౌన్సెలింగ్ తప్పనిసరని ప్రభుత్వం చెబుతోంది. ఇంతకీ ఇది నిజమేనా?

కజిన్స్ పెళ్లిళ్లు

ఫొటో సోర్స్, Getty Images

ఏమిటీ జన్యుపరమైన ముప్పులు?

జన్యుపరమైన వ్యాధులపై న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్సిటీలో వెండీ చుంగ్ పరిశోధన చేపడుతున్నారు. డీఎన్‌ఏలో అసాధారణ మార్పులతో జన్యుపరమైన వ్యాధులు వస్తాయని ఆమె చెప్పారు.

జన్యుపరమైన వ్యాధులపై జంటలకు చుంగ్ కౌన్సెలింగ్ కూడా ఇస్తుంటారు.

‘‘జెనెటిక్స్‌ అనేది మన ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు ఇస్తుంది. దీని సాయంతో మనం ప్రజలకు సాయం చేయొచ్చు. బాధిత కుటుంబాల ప్రశ్నలకు సమాధానాలు చెప్పొచ్చు’’అని ఆమె తెలిపారు.

కడుపులో పిండం పెరిగేటప్పుడు, కొన్ని జన్యువులు మార్పులకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఇవే జన్యుపరమైన వ్యాధులకు కారణం అవుతుంటాయి.

ఇక్కడ కొన్ని ‘‘కాంజెనిటల్ అనామలీస్’’ ఉంటాయి. అంటే బిడ్డ కడుపులో ఉన్నప్పుడు కొన్ని భాగాలు పూర్తిగా అభివృద్ధి చెందవు. దీని వల్ల ‘‘గ్రహణం మొర్రి’’ లాంటి రుగ్మతలు వస్తాయి.

ఐన్‌స్టీన్

ఫొటో సోర్స్, Getty Images

చిన్నాన్న, పెదనాన్న, మేనత్త, మేనమామ పిల్లలను పెళ్లి చేసుకున్నప్పుడు ఇలాంటి అరుదైన వ్యాధులు వచ్చే ముప్పు ఎంత?

‘‘కజిన్స్ మధ్య వివాహాల్లో ప్రధాన జన్యుపరమైన రుగ్మతలు వచ్చే ముప్పు మూడు నుంచి నాలుగు శాతం వరకూ ఉంటుంది. అదే ఆ కజిన్స్.. ఫస్ట్ కజిన్స్ అయితే, ఈ ముప్పు రెట్టింపు అవుతుంది’’అని చుంగ్ అన్నారు.

కజిన్స్‌ను పెళ్లి చేసుకోవడానికి చాలా కారణాలు ఉంటాయి.

  • సంపద కుటుంబం దాటిపోకుండా చూసుకోవడం.
  • బాగా తెలిసిన వారు కావడం.
  • తెలియని వ్యక్తులతో జీవితం పంచుకోవడానికి ఇష్టపడకపోవడం లాంటి కారణాలు ప్రధానంగా చెప్పుకోవచ్చు.

యూరప్, అమెరికాలలో చాలాచోట్ల ఈ కజిన్స్ పెళ్లిళ్లు మనకు కనిపిస్తాయి. చార్లెస్ డార్విన్, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ లాంటివారు కూడా తమ ఫస్ట్ కజిన్స్‌నే పెళ్లి చేసుకున్నారు.

కజిన్స్ పెళ్లిళ్లు

ఫొటో సోర్స్, Getty Images

జన్యువుల్లో అసాధారణ మార్పులు

సాధారణంగా కొన్ని జాతుల్లో ఈ కజిన్స్ మధ్య పెళ్లి అనేది సురక్షితంగానే ఉంటుంది. కాని కొన్ని జాతులు, కుటుంబాల్లో జన్యుపరమైన వ్యాధులు సంక్రమించే ముప్పు ఎక్కువగా ఉంటుంది.

దీనికి జన్యుపరమైన చరిత్ర కారణమని చుంగ్ చెబుతున్నారు.

‘‘కొన్ని పరిస్థితుల్లో జన్యుపరమైన వ్యాధులు సంక్రమించే ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు మీలో రెండు జతల జన్యువులు కనిపిస్తాయి. వీటిలో ఒకటి తండ్రి నుంచి మరొకటి తల్లి నుంచి వస్తాయి. అయితే, ఒక్కోసారి ఈ రెండు కాపీల్లోనూ మార్పుల వల్ల జన్యుపరమైన వ్యాధులు వస్తాయి’’అని ఆమె చెప్పారు.

‘‘ఇక్కడ ఆ జన్యువు 50 శాతం సాధారణంగా పనిచేసినా వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చు. కానీ, వంద శాతం మార్పులు కనిపిస్తే, జన్యుపరమైన వ్యాధుల నుంచి తప్పించుకోలేం’’అని ఆమె వివరించారు. ఇక్కడ జన్యుపరమైన వ్యాధులు అంటే ‘‘ఆటోసోమల్ రెసెసివ్ కండీషన్స్’’ గురించి ఆమె చెబుతున్నారు. ఇలాంటివి కొన్ని వేల సంఖ్యలో ఉన్నాయి.

వీటిలో కొన్ని రుగ్మతలు కాస్త తీవ్రమైనవి కూడా ఉంటాయి. ఉదాహరణకు సికెల్ సెల్ అనీమియా, సిస్టిక్ ఫిబ్రోసిస్, స్పైనల్ మస్కులర్ అట్రోఫీ.

కజిన్స్

ఫొటో సోర్స్, Getty Images

నిజానికి ప్రపంచంలోని చాలా మందిలో ఈ అసాధారణ రెసెసివ్ జన్యువులు ఉంటాయి. అయితే, ఇవి ఒక కాపీ ఉంటే ఫర్వాలేదు. అదే రెండు కాపీల్లోనూ మార్పులు ఉంటే వ్యాధులు వస్తాయి.

అయితే, ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. కొన్నిసార్లు కజిన్స్‌ను పెళ్లి చేసుకోకపోయినా, పిల్లలకు రెసెసివ్ రుగ్మత వస్తుంటుంది.

‘‘మీ జీవిత భాగస్వామితో మీ జన్యు సమాచారం 12.5 శాతం సరిపోలుతుందంటే, మీ పిల్లలకు వచ్చే జన్యువుల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ జన్యువులు మీకు ఒకే పూర్వీకుల నుంచి వచ్చాయి’’అని చుంగ్ వివరించారు.

అయితే, ఒకవేళ జంటలో ఇద్దరికీ ఒకేరకమైన రెసెసివ్ జెనిటిక్ డిజార్డర్ ఉంటే?

అప్పుడు పిల్లలకు జన్యుపరమైన రుగ్మత వచ్చే అవకాశం రెట్టింపు అవుతుంది. నిజానికి ఇలాంటివి ఎక్కువగా తమ కుటుంబాల్లోనే పెళ్లిళ్లు చేసుకునే జంటల్లో కనిపిస్తుంది.

కజిన్స్ పెళ్లిళ్లలో జన్యుపరమైన ముప్పులను నిర్ధారించేందుకు కుటుంబ చరిత్రతోపాటు చాలా అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని చుంగ్ వివరించారు.

వీడియో క్యాప్షన్, ఇండియాలో లెజ్బియన్స్ పెళ్లిళ్లు చేసుకోవడం కష్టమా?

‘‘ఇక్కడ కేవలం ఇద్దరి కజిన్స్ మధ్య పెళ్లిగా చూడకూడదు. అసలు ఆ కుటుంబాల్లో ఏం జరుగుతుంతో ముందు పరిశీలించాలి’’అని ఆమె అన్నారు.

‘‘కొన్ని జాతుల్లో తరతరాల నుంచి కుటుంబ సభ్యుల మధ్యే పెళ్లిళ్లు జరుగుతుంటాయి. ఇది ఒక దీవిలో ఉన్న ప్రజలు కావొచ్చు. లేదా పట్టణం లేదా నగరం కావొచ్చు. వీరికి జన్యుపరమైన రుగ్మతలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది’’అని ఆమె వివరించారు.

‘‘కొన్ని రాజ కుటుంబాల్లో అధికారంలో కొనసాగేందుకు, సంపద తమ కుటుంబంలోనే ఉండేందుకు ఇలా చేస్తుంటారు. అంటే ఇక్కడ కేవలం 12.5 శాతం జన్యు సమాచారం మాత్రమే కాదు.. వారి మధ్య తరతరాలుగా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. దీంతో వారి మధ్య జన్యువులు చాలావరకు ఒకేలా ఉంటాయి’’అని ఆమె అన్నారు.

ఇలాంటి కుటుంబాల్లో జన్యుపరమైన రుగ్మతలతో పిల్లలు పుట్టే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందని చుంగ్ వివరించారు. ఇక్కడ కజిన్స్ మధ్య పెళ్లిళ్లు తక్కువగా ఉంటే, వ్యాధుల ముప్పు కూడా తక్కువగా ఉంటుందని ఆమె తెలిపారు.

వీడియో క్యాప్షన్, కన్నతల్లికి మళ్లీ పెళ్లి చేసిన కూతురు

ఇక్కడ అన్ని కజిన్స్ పెళ్లిళ్లలోనూ జన్యుపరమైన ముప్పులను ముందుగానే కచ్చితత్వంతో అంచనా వేయడం కుదరడం లేదు. ఎందుకంటే ఇక్కడ ఒక్కో జంట, వారి కుటంబ నేపథ్యం భిన్నంగా ఉంటుంది.

ఒక జంట ముప్పును అంచనా వేసేందుకు మొదటగా వారిలో అసాధారణ జన్యు మార్పులు ఉన్నాయా? అనేది జన్యు వ్యాధుల నిపుణులు పరిశీలిస్తుంటారు.

జన్యుపరమైన వ్యాధులు ఎక్కువగా వచ్చే ముప్పుండే కుటుంబాల్లో ఈ పరీక్షలు కొంతవరకు ఉపయోగపడతాయి. న్యూయార్క్‌లోని యూదుల కుటుంబాలు దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. వీరిలో ముప్పు తగ్గించేందుకు చుంగ్ పనిచేస్తున్నారు.

‘‘ఆ కుటుంబాలకు చెందిన సభ్యుల్లో ఒకరైన రబ్బీ ఎకెస్టీన్‌కు టే-శాక్స్ వ్యాధితో బాధపడుతున్న పిల్లలు ఉన్నారు. ఇది చాలా ప్రమాదకరం’’అని చుంగ్ వివరించారు.

వీడియో క్యాప్షన్, భార్యను మోస్తూ తిరుమల మెట్లెక్కిన భర్త, ఈ వీడియోపై దంపతులు ఏమన్నారు?

‘‘ఈ వ్యాధికి ఇప్పటివరకు చికిత్స లేదు. సాధారణంగా ఐదేళ్లలోపే ఈ వ్యాధితో పిల్లలు చనిపోతుంటారు. మన వల్లే టే-శాక్స్ జబ్బు పిల్లలకు వస్తుందని తెలిస్తే మనకు చాలా ఆందోళన ఉంటుంది’’అని ఆమె చెప్పారు.

ఇప్పుడు తమ కుటుంబంలో మరింత మంది పిల్లలకు ఈ వ్యాధి సోకకుండా ఉండేందుకు పెళ్లికి ముందే జన్యుపరమైన వ్యాధుల పరీక్షలు చేయించుకోవడాన్ని రబ్బీ తప్పనిసరి చేశారు. అంటే కేవలం ఈ వ్యాధి ముప్పున్న వారిని వ్యాధి ముప్పు లేనివారికి ఇచ్చి పెళ్లి చేసేలా ఆయన చూస్తున్నారు.

‘‘నేడు చాలా సంస్కృతులు ఇలాంటి పరీక్షలు చేయించుకోవడానికి ముందు వస్తున్నాయి. ఇక్కడి యూదు ప్రజల జీవితాల్లో మార్పులకు ఇవి కారణం అవుతున్నాయి. ముఖ్యంగా టే-శాక్స్ వ్యాధి తమ పిల్లలకు రాకుండా వారు జాగ్రత్త వహిస్తున్నారు’’అని చుంగ్ చెప్పారు.

అందుకే కొన్ని వర్గాల్లో కజిన్స్‌ను పెళ్లి చేసుకోవడం అనేది ఇతరుల కంటే కాస్త ఎక్కువ ముప్పుగా నిపుణులు పరిగణిస్తారు.

జెనెటిక్ కౌన్సెలింగ్, ఇన్‌విర్టో ఫెర్టిలైజేషన్ లాంటి విధానాలతో ఈ ముప్పులను తగ్గించేందుకు వారు కృషి చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)