సారీ... డచ్ ప్రజలకు డిక్షనరీలో నచ్చని ఒకే ఒక పదం ఇదే

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మిషెల్ పాటర్స్
- హోదా, బీబీసీ రీల్
నెదర్లాండ్స్ అనేది చిన్న దేశం కావచ్చు. ఈ దేశస్థులను డచ్ ప్రజలని అంటారు. వీరికి చాలా ప్రత్యేకతలున్నాయి. సైకిళ్లు, చీజ్, కాఫీ షాపులు, గాలిమరలు ఇలాంటివెన్నో వారి జీవితాల్లో చాలా ప్రత్యేకంగా కనిపిస్తాయి. అంతేకాదు, ప్రపంచంలో అత్యంత ఎత్తయిన ప్రజలు కూడా డచ్ వారే.
ఈ ప్రజలకున్న మరో ప్రత్యేకత, 'సారీ' చెప్పకపోవడం.
డచ్ జనం సాధారణంగా 'సారీ' చెప్పనే చెప్పరు.
దీని వెనుక ఓ సాంస్కృతిక కారణం ఉందని సాంస్కృతిక నిపుణురాలైన సాస్కియా మార్సీ చెప్తారు.
''డచ్ జనం ముక్కుసూటిగా ఉంటారని పేరు. అంటే వారు తాము చెప్పదలచుకున్నది సూటిగా, సుత్తి లేకుండా ఉంటుందని. అయితే చాలా దేశాల్లో సంభాషణల మాటలు పరోక్షంగా ఉంటాయి. అంటే.. ఆ మాటలను అర్థం చేసుకోవటానికి వాటికి గల అంతర్లీన విలువలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది'' అని ఆమె పేర్కొన్నారు.
''ఉదాహరణకు బ్రిటిష్ వారి శైలి చాలా మర్యాదపూర్వకంగా, చాతుర్యంగా, యుక్తిగా ఉంటుంది. అయితే నెదర్లాండ్స్ వారి శైలి ఎక్కువగా పారదర్శకత, నిజాయితీ, నిష్కపటంగా ఉంటుంది'' అని వివరించారు.

దీనిని ఇతర సంస్కృతుల వారు ఎలా భావిస్తారు?
నెదర్లాండ్స్‌లో నివసించే విదేశీయులు ఇక్కడి ప్రజల ఈ ఆసక్తికరమైన అలవాటును అర్థం చేసుకోవటానికి కొంచెం కష్టపడాల్సి ఉంటుంది.
ఇండొనేసియా ప్రజలు ఏమాత్రం ముక్కుసూటిగా మాట్లాడరని ఆ దేశంలో జన్మించిన వెరెనా చెప్తారు.
''మేం మాట్లాడేటపుడు విషయాలను చుట్టూతిప్పి మాట్లాడుతుంటాం. డచ్ వాళ్లయితే ఏదైనా చెప్పాల్సి వస్తే ముఖం మీదే చెప్తారు. సూటిగా మాట్లాడుతారు. నేరుగా పాయింట్‌కు వస్తారు'' అని ఆమె పేర్కొన్నారు.
డచ్ వారి శైలి సంస్కృతికి సంబంధించిన అంశమని అర్థం చేసుకున్నా కూడా.. వారి మాటతీరు కొందరికి కరకుగా వినిపించవచ్చు.
ఈ విశిష్ట లక్షణం గురించి అభిప్రాయాలు తెలుసుకోవటానికి ఆమ్‌స్టర్‌డామ్ వీధుల్లోకి వెళ్లింది బీబీసీ.
''పిల్లలు తమ సైకిళ్లను చక్కగా నడుపుతుంటారు. వాళ్లు క్షమాపణ చెప్తారు. కానీ మిగతావాళ్లు, పాత తరం వాళ్లు చెప్పరు. వాళ్లు 'సారీ' అనరు'' అని రోడ్డు మీద బీబీసీ ఇంటర్వ్యూ చేసిన వారిలో ఒకరు వివరించారు.

మనసులో సారీ ఫీలయితేనే మన్నింపు కోరటం...
అయితే కొన్ని మినహాయింపులు ఉన్నాయి.
సిరియా నుంచి వచ్చిన రామి.. తాను మూడేళ్లుగా డచ్ వారితో వ్యవహారాలు నడుపుతున్నానని, వారు తరచుగానే 'సారీ' చెప్తారని అంటున్నారు.
''సాధారణంగా.. వాళ్లు నిజంగా అలా భావిస్తేనే 'సారీ' చెప్తారు. ఉదాహరణకు బ్రిటిష్ వాళ్లు మరింత వ్యవహారికంగా కానీ మరింత మర్యాదకరంగా కానీ ఉండటం కోసం 'సారీ' చెప్తుంటారు. దానిని మంచి పదంగా ఉపయోగిస్తుంటారు. అయితే డచ్ వారు నిజంగా తాము విచారిస్తున్నట్లు భావించినపుడు మాత్రమే 'సారీ' చెప్తారు'' అని మార్సీ వివరించారు.
''తప్పు నాది అని నాకు తెలిస్తే నేను 'ఐ యామ్ సారీ' అని చెప్తాను. అన్యాయాన్ని తట్టుకోలేను'' అని ఒక డచ్ పురుషుడు చెప్పారు.

చారిత్రక మూలాలు
ఈ సాంస్కృతిక శైలికి ఒక ఆసక్తికరమైన చారిత్రక మూలం ఉంది.
ముక్కుసూటిగా మాట్లాడే శైలి ఏకాభిప్రాయ సంసృతిలో భాగమని మార్సీ చెప్పారు.
''చరిత్రను చూసినపుడు.. మాకు ఒక ఉమ్మడి శత్రువు ఉంది. అది నీరు'' అన్నారామె.
శతాబ్దాల కిందట.. నీటి మట్టం పెరగటం, వరదలు వంటి నీటి సమస్యలకు పరిష్కారాలు కనుగొనటం కోసం డచ్ ప్రజలు కలిసి పనిచేయాల్సి వచ్చింది.
''వాళ్లందరూ కలిసి టేబుళ్ల చుట్టూ కూర్చునేవారు. సుదీర్ఘ చర్చలు, సంప్రదింపులు జరిపేవారు. ఉమ్మడి పరిష్కారం కావాలంటే వారి ఆలోచనలు, అభిప్రాయాల్లో నిజాయితీ ఉండాలి'' అని మార్సీ వివరించారు.
అలాగే అందరి అభిప్రాయాలను, ఆలోచనలను సీరియస్‌గా పట్టించుకోవాలంటే.. జనం ఒకరినొకరు సమానులుగా చూడాల్సి వచ్చిందని కూడా ఆమె చెప్పారు.
అలా అలవాటైన ముక్కుసూటిదనం డచ్ ప్రజల మాటతీరులో భాగంగా మారిపోయింది.

ఫొటో సోర్స్, Getty Images
అపార్థాలు
డచ్ ప్రజల ముక్కుసూటిదనం వల్ల తర్జుమా సమస్యలు తలెత్తవచ్చు. ముఖ్యంగా తమ మనసులో ఉన్న మాటను చెప్పకుండా మర్యాదపూర్వకంగా ఉండటానికి ప్రయత్నించే ఇతర సంస్కృతుల వారికి ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది.
''మేం (డచ్ ప్రజలు) ఒక ఆలోచన గురించి ఎవరికైనా (డచ్ వారు కానివారికి) చెప్పినపుడు: ''ఓ.. అది ఆసక్తికరంగా అనిపిస్తోంది' అని వారు స్పందిస్తే.. వాళ్లు నిజంగానే ఆసక్తిగా ఉన్నారని మేం అనుకుంటాం. కానీ వారి మాటకు అర్థం.. వాళ్లకు ఆసక్తి లేదని, అది చెత్త ఆలోచన అని వారు భావిస్తున్నారని కూడా కావచ్చు'' అంటారు మార్సీ.
''ఇది డచ్ వారికి అసలు సమస్య. ఆ మాటల నిజమైన అర్థం ఏమిటో తెలుసుకోవటం సమస్య. మేం ఇంగ్లిష్ కూడా మాట్లాడతాం. అలాగని అటువంటి మాటల అసలైన అర్థం మాకు అవగతమవుతందని కాదు'' అని ఆమె పేర్కొన్నారు.
అలాగే డచ్ వారి ముక్కుసూటి మాటలకు ఇతర దేశాల వారు ఖంగు తినకుండా ఉండటం కూడా ఒక సవాలేనని మార్సీ అంటారు. డచ్ వారి ఉద్దేశంలో వారు నిజాయితీగా, స్పష్టంగా మాట్లాడుతున్నప్పటికీ.. దానిని కొన్నిసార్లు కరకుగా, పొగరుగా భావిస్తుంటారని ఆమె వివరించారు.

'సారీ'కన్నా ఎక్కువ 'సారీ'
'సారీ' అనే పదానికి ఇంకా పై స్థాయి వ్యక్తీకరణ కోసం డచ్ ప్రజలు 'హెట్ స్పైట్ మె' అనే మాటను ఉపయోగిస్తారు.
''సారీ' చెప్పటం కన్నా 'హెట్ స్పైట్ మె' అనటం నాకు మరింత సీరియస్ విషయం. ఆ మాట నిజంగా మనసు నుంచి వస్తుంది'' అని దక్షిణ నెదర్లాండ్స్ లోని మాస్ట్రిచ్ట్ నగరానికి చెందిన లిన్ చెప్పారు.
''అందులో చాలా ఉంటుంది.. ఓ కథ, ఓ పరిస్థితి'' అని మార్సీ వివరించారు.
''సారీ అనేది నిజంగా సారీ. కానీ 'హెట్ స్పైట్ మె' అంటే నిజంగా నిజమైన సారీ. మీరు నిజంగా చెప్పాలనకుంటేనే క్షమాపణ చెప్పటం. మీ ఉద్దేశం మన్నింపు కోరటం కాకపోతే ఆ మాట అనవద్దు'' అని లిన్ సూచించారు.
బహుశా డచ్ ప్రజల నుంచి ఈ మాటకు ఉన్న విలువను మనం నేర్చుకోవచ్చేమో.
ఇవి కూడా చదవండి:
- మొబైల్ ఫోన్లు చోరీ అయితే పోలీసులు ఎలా వెతికి పట్టుకుంటారో తెలుసా?
- కొల్లాపూర్ మహాలక్ష్మి - అంబాబాయి ఆలయం గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
- రాజరాజ చోళుడు హిందువు కాదా, అసలు హిందూ అనే మతమే లేదా, చరిత్ర ఏం చెబుతోంది?
- బల్లి పడితే ఆహారం విషపూరితం అవుతుందా, ఇంట్లో బల్లులు లేకపోతే మనుషులకు ఏం జరుగుతుంది?
- మీరు డార్క్ చాక్లెట్‌ను ఇష్టంగా తింటారా, అది ఆరోగ్యానికి నిజంగా మంచిదేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














