మోదీ ప్రభుత్వం ముస్లిం, క్రైస్తవ దళితులకు రిజర్వేషన్లు ఇవ్వాలని నిజంగానే అనుకుంటోందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, దీపక్ మండల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇస్లాం, క్రైస్తవ మతంలోకి మారిన దళితులకు రిజర్వేషన్లను కల్పించే ప్రయత్నం మొదలయిందా? సిక్కు, బౌద్ధ మతంలోకి మారిన దళితులు రిజర్వేషన్ల లబ్ధిని పొందుతున్నప్పుడు ఇస్లాం, క్రైస్తవ మతంలోకి మారిన వారు ఈ ప్రయోజనాన్ని ఎందుకు పొందలేకపోతున్నారు?
ఇస్లాం, క్రైస్తవ మతంలోకి మారిన దళితుల సామాజిక స్థాయిని అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం త్రిసభ్య కమిషన్‌ను నియమించిన నేపథ్యంలో ఈ అంశం తిరిగి చర్చనీయాంశమయింది.
ఈ కమిషన్‌కు సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి కేజీ బాలకృష్ణన్ నేతృత్వం వహిస్తున్నారు. ఈ కమిషన్‌లో యూజీసి సభ్యులు ప్రొఫెసర్ సుష్మ యాదవ్, పదవీ విరమణ చేసిన ఐఏఎస్ అధికారి రవీందర్ కుమార్ ఉన్నారు.
ఇస్లాం, క్రైస్తవ మతం స్వీకరించిన దళితులకు షెడ్యూల్డ్ కులాల జాబితాలోకి చేర్చవచ్చో లేదో ఈ కమిషన్ పరిశీలిస్తుంది.
భారతదేశంలో షెడ్యూల్డ్ కులాల వారికి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు లభిస్తాయి.
క్రైస్తవ, ముస్లిం దళితులకు రిజర్వేషన్లను ఇవ్వడం ద్వారా ప్రభుత్వం రాజకీయ లబ్ధిని పొందాలని చూస్తోందని భావిస్తున్నారు.
సుప్రీం కోర్టులో అక్టోబరు 11న ఈ అంశం విచారణకు రానున్న సమయంలో కమిషన్ నియామకానికి నోటిఫికేషన్ వెలువడింది.
ముస్లిం, క్రైస్తవ దళితులకు షెడ్యూల్డ్ కులం స్థాయి ఎందుకు లేదు?
క్రైస్తవ, ఇస్లాం మతంలోకి మారిన దళితులకు రిజర్వేషన్లు ఇవ్వకపోవడాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్లు అక్టోబరు 11న విచారణకు రానున్నాయి. ఈ అంశం సుప్రీం కోర్టులో 2004 నుంచి ఉంది.
ఇస్లాం, క్రైస్తవ దళితులకు రిజర్వేషన్లను కల్పించకపోవడాన్ని సవాలు చేస్తూ సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ సుప్రీం కోర్టులో పిటిషన్ నమోదు చేసింది.
రాజ్యాంగంలోని 341 ఆర్టికల్ ప్రకారం - షెడ్యూల్డ్ కులాల జాబితాలో కులాలు, జాతులు, తెగలను చేర్చేందుకు రాష్ట్రపతి సూచనలు చేయవచ్చు. ఈ ఆర్టికల్ లోని అధికరణలను అనుసరించి 1950లో అంటరానివారు, బహిష్కృత హిందువులను మాత్రమే షెడ్యూల్డ్ కులాల జాబితాలోకి చేర్చారు. వీళ్ళనే దళితులని అంటారు.
కానీ, సిక్కు మతస్థుల డిమాండుతో 1956లో దళిత సిక్కులను కూడా ఈ జాబితాలో చేర్చారు. 1990లో కేంద్రంలో వీపీ సింగ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బౌద్ధ మతంలో దళితులను కూడా షెడ్యూల్డ్ కులాల జాబితాలోకి చేర్చారు.
హిందూ మతం, బౌద్ధ మతం, సిక్కు మతం కాకుండా ఇతర మతాలను పాటించే వారిని షెడ్యూల్డ్ కులాల వారిగా పరిగణించం అని ప్రభుత్వం అదే సమయంలో పేర్కొంది.
దీంతో, ముస్లింలు, క్రైస్తవ దళితులకు ఈ జాబితాలో చోటు లభించలేదు. దీంతో, ఇతర మతాల్లో దళితులకు లభించే రిజర్వేషన్లు వీరికి లభించడం లేదు.

ఇస్లాం, క్రైస్తవ దళితుల పట్ల వివక్ష
ఇస్లాం, క్రైస్తవ మతంలో కుల వివక్ష లేదని భావించడంతో ఈ మతాల్లో దళితుల పట్ల వివక్ష ఉండదని అనుకుంటారు. సామాజిక, ఆర్ధిక స్థాయిలో కూడా అందరూ సమానమే అని అనుకుంటారు.
కానీ, వాస్తవ పరిస్థితి మరోలా ఉంది. నగరాల్లో నివసించే 47 శాతం మంది దళిత ముస్లింలు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారని సతీష్ దేశ్ పాండే , గీతిక బాప్నా నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ కోసం సిద్ధం చేసిన నివేదిక లో పేర్కొన్నారు. ఈ నివేదికను 2004-05 డేటా ఆధారంగా తయారు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో 40 శాతం దళిత ముస్లింలు, 30% దళిత క్రైస్తవులు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నట్లు ఈ నివేదిక తెలిపింది.
ఆర్ధిక స్థాయిలో కూడా వెనుకబడే ఉన్నారు. క్రైస్తవ, ఇస్లాం మతం స్వీకరించినప్పటికీ వారి పట్ల సామాజిక వివక్ష కూడా కొనసాగుతుంది.
దిగువ స్థాయిలో ఉండేవారు వేరే చర్చీలు, మసీదులు, స్మశానాలకు వెళ్లాల్సి ఉంటుంది.
చాలా రోజుల పాటు ఈ విషయాన్ని అంగీకరించని క్యాథలిక్ చర్చి చివరకు వారి మధ్యలో కూడా వివక్ష ఉందని అంగీకరించింది.
ఇస్లాం, క్రైస్తవ దళితుల పట్ల జరుగుతున్న వివక్షను రూపుమాపేందుకు సుదీర్ఘకాలంగా పోరాటం జరుగుతోంది. మతంతో సంబంధం లేకుండా రిజర్వేషన్లు ఇవ్వాలని కోరుతూ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ దళిత్ క్రిస్టియన్స్ సుప్రీం కోర్టులో పిటిషన్ నమోదు చేసింది.
ఈ పిటిషన్‌ను సుప్రీం కోర్టు జనవరి 2020లో విచారణకు స్వీకరించింది.

ఫొటో సోర్స్, AFP
సచ్చర్ కమిటీ, రంగనాథ్ కమిషన్ ఏమి చెప్పింది?
ముస్లిం, క్రైస్తవ దళితులకు రిజర్వేషన్లను పొందే హక్కును కల్పించాలని సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు.
ఇలాంటి చాలా పిటిషన్లు సుప్రీం కోర్టులో నమోదయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ఈ అంశం పై అక్టోబరు 11 నాటికి తమ వైఖరిని తెలియచేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.
కానీ, ఈ సమాధానం చెప్పడానికి ముందే కేంద్ర ప్రభుత్వం ఈ అంశానికి మరో కొత్త మలుపును ఇచ్చింది.
క్రైస్తవ, ముస్లిం దళితులకు రిజర్వేషన్లు ఇచ్చే అవకాశం ఉందో లేదో పరిశీలించమని కమిషన్ ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
ముస్లింల మధ్య కూడా కుల వివక్ష ఉందని సచ్చర్ కమిటీ చెప్పినట్లు ఆల్ ఇండియా పసమందా ముస్లిం మహాజ్ మాజీ పార్లమెంట్ సభ్యులు అలీ అన్వర్ అన్సారీ చెప్పారు. "దళిత ముస్లింల పట్ల వివక్ష ఉంది. వీళ్లకు కూడా రిజర్వేషన్లు లభించాలి. రంగనాథ్ మిశ్రా కమిషన్ కూడా ఇదే విషయాన్ని చెప్పింది" అని అన్నారు.
"1950లో దళిత ముస్లింలు, క్రైస్తవులను రిజర్వేషన్ల నుంచి తొలగిస్తూ ఆర్టికల్ 341లో మూడవ పారాను జత చేస్తూ ఆర్డినెన్సును జారీ చేయడం రాజ్యాంగ విరుద్ధం అని రంగనాథ్ మిశ్రా కమిషన్ పేర్కొంది. ఈ విధానానికి ముగింపు పలకాలి. దీని కోసం ప్రత్యేకంగా రాజ్యాంగ సవరణ అవసరం లేదు. ప్రభుత్వ ఆదేశాల ద్వారా కూడా రిజర్వేషన్లను అమలు చేయొచ్చు" అని అన్నారు.
"దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లను ఇవ్వాలని కోరుతూ మొదటిసారి 2004లో సుప్రీం కోర్టులో పిటిషన్ నమోదు చేశారు. తర్వాత ముస్లిం సంస్థలు కూడా పిటిషన్లు వేసాయి. సుప్రీం కోర్టులోఈ అంశం చాలా రోజుల తర్వాత విచారణకు వస్తోంది. ఇలాంటి పరిస్థితిలో ప్రభుత్వం కమిషన్ ను నియమించాల్సిన అవసరం ఏంటి?" అని ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, Getty Images
చట్టపరమైన అంశాలు
1950లో కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్సు ప్రకారం హిందూ, సిక్కు, బౌద్ధ దళితులకు మాత్రమే షెడ్యూల్డ్ కులం స్థాయి లభిస్తుంది.
సిక్కు దళితులకు 1956లో షెడ్యూల్డ్ కులాల స్థాయి లభించగా, బౌద్ధ దళితులకు 1990లో లభించింది.
కాకా కాలేల్కర్ కమిటీ నివేదిక ఆధారంగా సిక్కు దళితులకు ఈ స్థాయి లభించింది. 1983లో ఒక కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా బౌద్ధులకు షెడ్యూల్డ్ కులాల స్థాయి లభించింది.
ముస్లిం, క్రైస్తవ దళితులకు షెడ్యూల్డ్ కులాల జాబితాలో చోటు దక్కదని కేంద్రం చెప్పింది.
ఇస్లాం, క్రైస్తవ మతంలో కుల బేధం లేనందున, షెడ్యూల్డ్ కులాల స్థాయి ఇవ్వలేమని కేంద్రం చెబుతోంది.
కమిషన్ ఎందుకు నియమించారు?
"ఈ అంశం పై కోర్టులో సమాధానం చెప్పడాన్ని ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తోంది" అని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ దళిత్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షులు వీజీ జార్జ్ ఆరోపించారు. "ఇది ప్రభుత్వ పిరికి చర్య. ఈ అంశం పై కమిషన్ ను నియమించాల్సిన అవసరమేంటి" అని ప్రశ్నించారు.
"ఇస్లాం, క్రైస్తవ మతాల్లో దళితుల పరిస్థితి దారుణంగా ఉందని అంటూ వారి మధ్యలో కూడా వివక్ష ఉందని కొన్నేళ్ల క్రితమే రంగనాథ్ మిశ్రా కమిషన్ చెప్పింది. ప్రభుత్వం కొత్తగా ఏమి తెలుసుకోవాలని అనుకుంటోంది? సతీష్ దేశ్ పాండే చేసిన అధ్యయనంలో కూడా ఈ విషయానికి సమాధానం లభించింది. ఈ అధ్యయనానికి ప్రభుత్వమే నిధులను సమకూర్చింది" అని చెప్పారు.
"రంగనాథ్ మిశ్రా కమిషన్ తో పాటు చాలా కమీషన్లు ఇస్లాం, క్రైస్తవ దళితులకు షెడ్యూల్డ్ కులాల జాబితాలో చోటు కల్పించాలని అభిప్రాయపడ్డాయి. ప్రభుత్వం కొత్తగా చేపట్టిన కమిషన్ నియామకాన్ని కూడా కోర్టులో సవాలు చేస్తాం" అని జార్జి అన్నారు.
అలీ అన్వర్ కూడా మోదీ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నిస్తున్నారు.
"2019లో ఈ అంశం సుప్రీం కోర్టులో విచారణకు వచ్చినప్పుడు రంగనాథ్ మిశ్రా కమిషన్ సూచనల పట్ల ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయమని అడిగింది. కానీ, క్రైస్తవ, ముస్లిం లలో కులం లేదని ప్రభుత్వం చెప్పింది. దీంతో, వారికి షెడ్యూల్డ్ కులాల జాబితాలోకి చేర్చే ప్రశ్న లేదని చెప్పింది" అని అన్నారు.
"ప్రస్తుతం సుప్రీం కోర్టులో ఈ అంశం పై విచారణ వచ్చిన సమయంలో మోదీ ప్రభుత్వం కమిషన్ ను నియమించింది. కమిషన్ నివేదికను సమర్పించేందుకు రెండేళ్ల గడువు ఉంటుంది" అని అలీ అన్వర్ అన్నారు.
"ఈ అంశాన్ని వాయిదా వేసేందుకు ఇదొక ప్రయత్నం. దీని గురించి ప్రభుత్వం బహిరంగంగా ఎక్కడా వాగ్ధానం చేయలేదు. దీంతో ఈ విషయం వాయిదా పడుతూనే ఉంటుంది" అని అలీ అన్వర్ అన్నారు.

ఫొటో సోర్స్, EPA
ఓటు బ్యాంకు రాజకీయాలు
అయితే, ఓట్ల లబ్ది కోసం మోదీ ప్రభుత్వం ఈ అడుగు వేసిందనే వాదన కూడా వినిపిస్తోంది.
"మోదీ ప్రభుత్వం పసమంద స్నేహ యాత్ర నిర్వహించడం, ముస్లిం, క్రైస్తవ దళితులకు షెడ్యూల్డ్ కులాల జాబితాలోకి చేర్చడం కేవలం భ్రమ మాత్రమే. ఇప్పటికే బీజేపీ మాతృ సంస్థ ఆర్ ఎస్ ఎస్ ముస్లిం, క్రైస్తవులను మరో గ్రహం నుంచి వచ్చినవారని అభివర్ణించింది.
"ఈ నిర్ణయంతో మోదీ ప్రభుత్వం రాజకీయ లబ్ది పొందాలని అనుకుంటున్నారని అనుకోవడం కూడా తప్పే.
ముస్లింలలో కూడా దళితులు ఉన్నారు. కానీ, వీళ్లంతా కలిపి ఒక శాతం ఓటర్లు కూడా ఉండరు. రాజకీయ ప్రయోజనం పొందాలని భావిస్తే ఈ నిర్ణయం వల్ల ఎవరికి ప్రయోజనాలు దక్కుతాయో అధ్యయనం నిర్వహిస్తారు. అలాంటిదేమి జరగలేదు. ఇది కేవలం అయోమయాన్ని సృష్టించేందుకు చేస్తున్న పని" అని అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
హిందూ దళితులు ఆగ్రహం చెందుతారా?
క్రైస్తవ, ముస్లిం దళితులను షెడ్యూల్డ్ కులాల జాబితాలోకి చేర్చడం ద్వారా హిందూ దళితుల హక్కులను లాగేసుకుంటున్నట్లుగా భావిస్తున్నారు.
దళిత, ఆదివాసీ సంస్థ జాతీయ సమాఖ్య అధ్యక్షులు అశోక్ భారతి మాట్లాడుతూ, "ఇస్లాం, క్రైస్తవ మతంలో వివక్ష లేదని అంటారు. వాళ్ళ దృష్టిలో అందరూ ఒకటే. ప్రస్తుతం వాళ్ళు వివక్ష ఉందని అంటున్నారు. వాళ్ళు అంటరానితనం నుంచి విముక్తులమయ్యామని చెప్పుకుంటూ ప్రస్తుతం వివక్ష ఉందని అంటున్నారు" అని అన్నారు.
" సివిల్ అపీల్ ఆఫ్ ఘాజీ సాదుద్దీన్ వెర్సస్ మహారాష్ట్ర మధ్యలో జరిగిన కేసులో ఆర్టికల్ 341ను అనుసరించి ఇస్లాం, క్రైస్తవ దళితులకు షెడ్యూల్డ్ కులాల స్థాయి ఇవ్వాలని కోరారు. ఈ కులాల వారి హక్కులను పొందేందుకు ప్రయత్నం జరిగింది" అని భారతి చెప్పారు.
సతీష్ దేశ్ పాండే 2008లో సమర్పించిన నివేదికలో ముస్లిం, క్రైస్తవ దళితుల్లో కూడా వివక్ష చోటు చేసుకున్నట్లు ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. వీళ్ళ ఆర్ధిక స్థితి ఇతర మతాల్లో దళితుల కంటే హీనంగా ఉంది. కానీ, హిందూ దళితులు ఈ విషయాన్ని ఆమోదించేందుకు సిద్ధంగా లేరు.
"ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో ఇప్పటికే క్రైస్తవ, ముస్లిం దళితులకు ఓబీసీ స్థాయి లభించింది.
ప్రజా ప్రయోజన వ్యాజ్యం ద్వారా షెడ్యూల్డ్ కులాల జాబితాలోకి చేర్చమని కోరడంలో వేరే విధమైన అర్ధం ఉండి ఉండవచ్చు.
మరి కొన్ని రోజుల్లో దీనికి సమాధానం లభించవచ్చు" అని అశోక్ భారతి అన్నారు.
ఇవి కూడా చదవండి:
- భారత రాష్ట్ర సమితి: జాతీయ పార్టీ స్థాపించడానికి అర్హతలేమిటి.? ఒక పార్టీకి జాతీయ హోదా ఎలా వస్తుంది?
- కొల్లాపూర్ మహాలక్ష్మి - అంబాబాయి ఆలయం గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
- బల్లి పడితే ఆహారం విషపూరితం అవుతుందా, ఇంట్లో బల్లులు లేకపోతే మనుషులకు ఏం జరుగుతుంది?
- మీరు డార్క్ చాక్లెట్ను ఇష్టంగా తింటారా, అది ఆరోగ్యానికి నిజంగా మంచిదేనా?
- భారత రాష్ట్ర సమితి పార్టీ లక్ష్యం ఏంటి? కేసీఆర్ 'తెలంగాణ ప్రాంతీయ ఐడెంటిటీ'ని దాటుకుని జాతీయ నాయకుడు కాగలరా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












