సోమాలియా: కరవు కోరల్లో చిక్కుకున్న జనం, మనుగడ కోసం అనుక్షణం పోరాటం

ఫొటో సోర్స్, BBC/ ED HABERSHON
- రచయిత, ఆండ్రూ హార్డింగ్
- హోదా, బీబీసీ న్యూస్, సోమాలియా
దాహిర్ ఎండిపోయిన బుగ్గల మీద కన్నీళ్లు కారాయి. అతడి వయసు 11 సంవత్సరాలు. ''దీని నుంచి బయటపడితే చాలు'' అని నెమ్మదిగా చెప్పాడు.
''నీ కన్నీళ్లతో నీ తమ్ముడు తిరిగి రాడు. మున్ముందు అంతా బాగుంటుంది'' అని ఊరడించింది అతడి తల్లి.
సోమాలియాలోని బాయిడోవా నగరం వెలుపల ఒక తాత్కాలిక టెంటులో తలదాచుకుంటోంది అతడి కుటుంబం. ఆ టెంటు పక్కన కూర్చుని ఉన్న అతడి తల్లి ఫాతుమా ఒమర్.. ఏడవద్దని తన కొడుకుకు చెప్పింది.
ఫాతుమా రెండో కొడుకు సాలాత్ వయసు పదేళ్లు. రెండు వారాల కిందట చనిపోయాడు. ఫాతుమా కుటుంబం తమ గ్రామం నుంచి మూడు రోజులు నడుచుకుంటూ ఈ శిబిరానికి వచ్చింది. వచ్చిన కొన్ని రోజులకే సాలాత్ ప్రాణాలు కోల్పోయాడు.
వీరి టెంటుకు కొన్ని మీటర్ల దూరంలో రాళ్ల నేలలో అతడి మృతదేహాన్ని పాతిపెట్టారు. అతడి సమాధి మీద చెత్త పేరుకుపోయింది. మరింత మంది కరవు బాధితులు వచ్చి కొత్త టెంట్లు వేసుకుండటంతో ఆ సమాధి కనిపించకుండా పోతోంది.
''నా కొడుకు చనిపోయాడని ఏడవటానికి నాకు టైం లేదు. మిగతా పిల్లల ప్రాణాలు పోకుండా చూడటానికి ఏదో పని వెదుక్కుంటూ, తిండి సంపాదిస్తూ ఉండాలి'' అని చెప్పింది ఫాతుమా.
ఆమె ఒళ్లో చిన్న కూతురు బిల్లి ఉంది. పక్కన ఆరేళ్ల కూతురు మరియం పెద్దగా దగ్గుతూ ఉంది.
పక్కనే ఉన్న మట్టి రోడ్డు.. తీరం దిశగా, రాజధాని మొగదిషు వైపు దారితీస్తుంది. ఆ రోడ్డుకు అవతలివైపు ఉన్న ఇతర నిర్వాసిత కుటుంబాలు మరిత విషాదకర కథలు చెప్పాయి. ఎండి పోయిన నేలపై తిండి కోసం వెదుకుతూ ఎంత దూరం నడుస్తూ వచ్చామో వివరించారు.

ఫొటో సోర్స్, BBC/ ED HABERSHON
'కూతురును పాతిపెట్టే ఓపిక కూడా లేకపోయింది'
ఈ శిబిరాల్లో ఉన్న పిల్లలు, గర్భిణుల్లో దాదాపు మూడింట రెండు వంతుల మంది తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్నారని ఒక కొత్త సర్వే చెప్పింది. అధికంగా ఉన్న మరణాల రేటును కూడా దీనికి కలిపి చూస్తే.. ఈ ప్రాంతంలో కరవు తాండవిస్తోందని ఇప్పటికే అధికారికంగా ప్రకటించి ఉండాల్సిందని సూచిస్తోంది.
''నా కూతురు మూడేళ్ల ఫార్హిర్. నా కళ్ల ముందే చనిపోయింది. నేను ఏమీ చేయలేకపోయాను'' అని ఫాతుమా చెప్పారు. ఆమె తన తొమ్మిది మంది పిల్లలతో కలిసి.. బ్యూలో సీర్ అనే గ్రామం నుంచి 15 రోజుల పాటు నడిచి బాయిడోవా చేరుకున్నారు.
''నా కూతుర్ని పది రోజుల పాటు ఎత్తుకుని నడిచాను. ఆమెను రోడ్డు పక్కనే వదిలేయాల్సి వచ్చింది. ఆమెను సమాధి చేసే శక్తి కూడా మాకు లేకుండా పోయింది. హైనాలు దగ్గరకు వస్తున్న చప్పుళ్లు మాకు వినిపించాయి'' అని ఫాతుమా వివరించారు.
''నాతో ఏమీ తేలేదు. ఇంటి దగ్గర ఏమీ మిగలలేదు. పశువులు చచ్చిపోయాయి. పొలాలు ఎండిపోయాయి'' అని 50 ఏళ్ల హబీబా మొహముద్ చెప్పారు. ఇక తమ గ్రామానికి ఎన్నడూ తిరిగి వెళ్లబోనన్నారు.
హార్న్ ఆఫ్ ఆఫ్రికా అంతటా శతాబ్దాల తరబడి మనుగడ సాగించిన పశుపోషణ జీవన విధానానికి.. ఇప్పుడు వాతావరణ మార్పు వల్ల శరవేగంగా వరుసబెట్టి కాటేస్తున్న కరవులు ముగింపు పలుకుతున్నాయి.

ఫొటో సోర్స్, BBC/ ED HABERSHON
కొత్తగా వచ్చిన వారితో పాటు హబీబా తన కుటుంబం కోసం చెట్టు కొమ్మలు, ఆకులు, చెత్తలో ఏరుకొచ్చిన ప్లాస్టిక్ రేకుల ముక్కలతో టెంటు కట్టటంలో తలమునకలయ్యారు. రాత్రి చలి ముంచుకొచ్చే సమయానికి ఆ పని పూర్తి చేయాలని ఆశిస్తున్నారు. అది ముగిసిన తర్వాతే తన ఐదుగురు పిల్లలకు తిండి కోసం, వైద్య సాయం కోసం ఆమె వెదుక్కోగలరు.
నగరంలోని ప్రధాన ఆస్పత్రిలో అడ్మిషన్ల వార్డులో డాక్టర్ అబ్దుల్లాహి యూసుఫ్ కలియదిరుగుతున్నారు. బక్కపల్చగా చిక్కిశల్యమై ఉన్న రోగులను తనిఖీ చేస్తున్నారు. వారిలో ఎక్కువ మంది రెండు నెలల నుంచి మూడేళ్ల వయసున్న పిల్లలే.
అందరూ తీవ్ర పోషకాహార లోపంతో శుష్కించిపోయారు. కొందరికి న్యుమోనియా (నెమ్ము) ఉంది. కొందరు కొత్తగా విజృంభిస్తున్న ‘తట్టు’ జబ్బుతో కూడా బాధపడుతున్నారు.
అతికొద్ది మంది శిశువుల్లో మాత్రమే ఏడవటానికి శక్తి ఉంది. కొందరు పిల్లల చర్మం బాగా దెబ్బతిన్నది. అతి తీవ్రమైన ఆకలి వల్ల వచ్చే వాపుల కారణంగా వారి చర్మం పగుళ్లు బారింది.
''చాలా మంది ఆస్పత్రికి చేరటానికి ముందే చనిపోతున్నారు'' అని చెప్పారు డాక్టర్ అబ్దుల్లాహి.

ఫొటో సోర్స్, BBC/ ED HABERSHON
'చిన్న పిల్లలు చచ్చిపోతున్నా సాయం చేయలేకపోతున్నాం'
నైరుతి ప్రాంతంలో కరవు ముంచుకురాబోతోందని సోమాలీ అధికారులు, అంతర్జాతీయ సంస్థలు కొన్ని నెలలుగా హెచ్చరికలు చేస్తున్నప్పటికీ.. తమ ఆస్పత్రిలో పిల్లలకు న్యూట్రిషన్ సప్లిమెంట్లు సహా కనీస ఔషధాలకు కూడా చాలా కాలంగా కొరత ఉందని డాక్టర్ అబ్దుల్లాహి చెప్పారు.
''కొన్నిసార్లు మాకు సరఫరాలు రావు. అది నిజంగా భయంకరమైన పరిస్థితి. ఎందుకంటే పిల్లలు చచ్చిపోతున్నారు. వారికి మేం సాయం చేయలేకపోతున్నాం. మా స్థానిక ప్రభుత్వం సరిగా పని చేయడం లేదు. కరవును ఎదుర్కోవటానికిగానీ, వలసవచ్చే కుటుంబాల కోసంగానీ ప్రణాళికలేవీ సిద్ధం చేయలేదు'' అని ఆయన నిస్పృహగా వివరించారు.
ఈ విషయంలో వైఫల్యాలు ఉన్నాయని స్థానిక ప్రభుత్వ మంత్రి ఒకరు అంగీకరించారు.
''మేం ఇంకా చాలా వేగంగా, చాలా కచ్చితంగా, మరింత సమర్ధవంతంగా పనిచేయాల్సిన అవసరం ఉంది'' అని బాయిడోవా పరిసరాల్లోని ఒక శిబిరాన్ని సందర్శించిన సౌత్ వెస్ట్ రాష్ట్ర మానవతా వ్యవహారాల మంత్రి నసీర్ ఆరుష్ చెప్పారు.
అయితే.. అంతర్జాతీయ సాయం మరింత అవసరమని పేర్కొన్నారు.

''మాకు అవసరమైన సాయం అందకపోతే వేలాది మంది జనం చనిపోతారు. ఇప్పుడు మేం చేస్తున్న పనులను మూడు నెలల కిందటే చేసి ఉండాల్సి ఉంది. వాస్తవానికి మేం అంధులమయ్యాం'' అని వ్యాఖ్యానించారు.
అయితే.. దుర్భిక్షం నెలకొన్నదని అధికారికంగా ప్రకటించే ప్రక్రియ సంక్లిష్టమైనది. సమాచార సేకరణ కష్టమవటంతో పాటు రాజకీయ అంశాలూ దీనికి ముడిపడి ఉన్నాయి.
''2011 కరవు సమయంలో 2,60,000 మరణాల్లో సగం మరణాలు దుర్భిక్షం ప్రకటన చేయటానికి ముందే సంభవించాయి'' అని మొగదిషులో బ్రిటన్ రాయబారి కేట్ ఫాస్టర్ పేర్కొన్నారు.
అమెరికా తాజాగా ఇచ్చిన సాయం ''మాకు కొత్త ఆశ కల్పించింది'' అని సోమాలియా అధ్యక్షుడి దూత అబ్దిరహ్మాన్ అబ్దిషాకూర్ చెప్పారు. అయితే మరింత సాయం అందకపోతే దేశంలో ప్రాంతంలో నెలకొన్న సంక్షోభం వేగంగా అదుపుతప్పి పోగలదని హెచ్చరించారు.
''మేం ప్రమాదఘంటికలు మోగిస్తూనే ఉన్నాం. కానీ అంతర్జాతీయ సమాజం నుంచి తగినంత స్పందన రాలేదు'' అని ఆయన బీబీసీతో ఫోన్‌లో మాట్లాడుతూ చెప్పారు.

ఫొటో సోర్స్, BBC/ ED HABERSHON
వలసపోతున్న మహిళలు.. ఊళ్లలోనే ఉండిపోతున్న పురుషులు
బాయిడోవా నగర జనాభా గత కొద్ది నెలల్లో నాలుగు రెట్లు పెరిగి 8,00,000కు చేరుకుందని అంచనాలు చెప్తున్నాయి.
అయితే.. కొత్తగా వచ్చిన వారు దాదాపుగా అందరూ మహిళలే కావటం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న వాస్తవం.
సోమాలియా తీవ్రవాదులతో యుద్ధం చేస్తోంది. మూడు దశాబ్దాల కిందట కేంద్ర ప్రభుత్వం కూలిపోయినప్పటి నుంచీ.. సంఘర్షణ వివిధ రూపాల్లో కొనసాగుతూనే ఉంది. దేశంలోని అన్ని ప్రాంతాల మీదా దాని ప్రభావం ఉంది. అనేక సాయుధ బృందాల తరఫున పోరాడటానికి పురుషులు తమ కుటంబాలకు దూరమైపోతున్నారు.
బాయిడోవాకు చేరుకున్నారిలో చాలా మందికి లాగానే.. హదీజా అబుబకర్ కూడా తీవ్రవాద ఇస్లామిక్ బృందం అల్-షాబాబ్ నియంత్రణలో ఉన్న ప్రాంతం నుంచి పారిపోయి వచ్చారు.
''మా దగ్గర ప్రభుత్వానికి, అల్-షాబాబ్‌కు మధ్య పోరు జరుగుతోంది. నా బంధువులు పారిపోయి అడవిలో దాక్కున్నారు'' అని ఆమె చెప్పారు. బాయిడోవాలోని ఒక చిన్న ఆస్పత్రి వద్ద ఆమె, ఆమె పక్కన జబ్బుపడ్డ ఆమె పిల్లవాడు కూర్చుని ఉన్నారు.

ఫొటో సోర్స్, Reuters
తీవ్రవాదుల నియంత్రణలో ఉన్న ప్రాంతాల నుంచి తమ భర్తలు, ఎదిగిన మగపిల్లలు వేలాది మందిని బయటకు వెళ్లకుండా ఈ అల్-షాబాబ్ బృందం అడ్డుకుంటోందని చాలా మంది మహిళలు చెప్పారు.
బాయిడోవాను అల్-షాబాబ్ పూర్తిగా చుట్టుముట్టలేదు. అయితే పారిపోయి వచ్చిన వారు తలదాచుకుంటున్న ఈ ప్రాంతం కూడా ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది.
అంతర్జాతీయ సహాయ సంస్థలు, విదేశీ జర్నలిస్టులు సంచరించటానికి భారీ భద్రత అవసరమవుతోంది. నగర పరిధి దాటి బయటకు ప్రయాణించటం అత్యంత ప్రమాదకరంగా పరిగణిస్తారు.
ప్రస్తుత కరవు వల్ల ప్రభావితమైన జనాభాలో సగం మందికి పైగా అల్-షబాబ్ నియంత్రణలో ఉన్న ప్రాంతాల్లోనే ఉన్నారని కొన్ని అంచనాలు చెప్తున్నాయి.
ఇక అమెరికా తను అందించే సాయం వల్ల.. తాము టెర్రరిస్టు గ్రూపులుగా ప్రకటించిన సంస్థలు లబ్ధి పొందకుండా అడ్డుకోవటానికి విధించిన కఠిన నిబంధనల వల్ల.. దారుణ పరిస్థితుల్లో ఉన్న ప్రజలకు ఆ సాయాన్ని అందించే ప్రయత్నాలు సంక్లిష్టంగా మారాయి.
అయితే మరింత ఎక్కువ మందికి సాయం అందేలా చూడటానికి అంతర్జాతీయ సంస్థలు, సోమాలీ అధికారులు.. స్థానిక భాగస్వాములతో కలిసి పనిచేస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో గగన తలం నుంచి సాయం జారివిడిచే ఆలోచనలూ చేస్తున్నాయి.
అయినప్పటికీ.. అల్-షాబాబ్‌కు ఆహారం కానీ, నిధులు కానీ అందకుండా చూడటం దాదాపు అసాధ్యమని ఒక కార్యకర్త చెప్పారు.
''వాళ్లు ప్రతి దాని మీదా పన్నులు వేస్తారు. నగదు విరాళాల మీద కూడా'' అని పేర్కొన్నారు.
ఈ మిలిటెంట్ గ్రూపు కొన్నేళ్లుగా కేవలం హింసకు, బెదిరింపులకు మాత్రమే కాదు.. అధికారిక అవినీతికి పేరుపడ్డ ఈ దేశంలో 'న్యాయం అందిస్తుంద'నే పేరు కూడా సంపాదించుకుంది.
బాయిడోవాకు సమీపంలో ఉన్న నాలుగు గ్రామాల్లో అల్-షాబాబ్ షరియా కోర్టుల వ్యవస్థను నడుపుతోంది. నగర నివాసులు తమ వ్యాపారాల, ఆస్తుల గొడవలను పరిష్కరించుకోవటానికి ఆ కోర్టులను తరచుగా వినియోగిస్తుంటారు. మొగదిషు, ఆ పై ప్రాంతాల జనం కూడా ఆ కోర్టులకు వెళుతుంటారని చెప్తున్నారు.
అయితే ఈశాన్యం పైభాగాన.. స్థానిక సమాజాలు, జాతి మిలీషియాలు అకస్మాత్తుగా అల్-షాబాబ్‌కు ఎదురు తిరిగాయి. ఆ మిలీషియాలకు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం భారీగా మద్దతు అందిస్తోంది. దీంతో ఇటీవలి వారాల్లో అనేక పట్టణాలు, గ్రామాల నుంచి అల్-షాబాబ్‌ను తరిమివేశారు.
సైన్యం సాధించిన విజయాలతో సానుకూల దృక్పథం పెరిగింది. కానీ ఈ స్ఫూర్తి.. కరవు మీద పోరాటానికి సాయపడుతుందా, లేకపోతే సోమాలీ ప్రభుత్వం దృష్టి మళ్లేలా చేస్తుందా అనేది ప్రశ్నార్థకమైంది.
''అది సాయం చేయొచ్చు, చేయకపోవచ్చు. కానీ దానివల్ల మరింత మంది పౌరులు నిరాశ్రయులు కావచ్చునని నేను భావిస్తున్నాను. లేదంటే ప్రభుత్వం మరిన్ని ప్రాంతాలను విముక్తి చేయటం వల్ల ఎక్కువ మంది జనానికి సాయం అందవచ్చు. ఈ అంశాన్ని అన్ని వైపుల నుంచీ గమనిస్తున్నాం'' అని స్థానిక మంత్రి నాసిర్ ఆరుష్ పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మరోవైపు.. దశాబ్దాల సంఘర్షణకు, నిర్లక్ష్యానికి గురైన బాయిడోవా నగరంలో బియ్యం వంటి కనీస నిత్యావసరాల ధరలు గత నెలలో రెట్టింపయ్యాయి. కరవు దీనికి కారణమని చాలా మంది పౌరులు అంటున్నారు. కొందరు ఇంకా సుదూర ప్రభావాలను కూడా చూస్తున్నారు.
''పిండి, చక్కెర, నూనె - అన్నిటి ధరలూ ఒకే రకంగా పెరిగాయి. కొన్నిసార్లు మేం భోజనం మానేసి పస్తులు ఉంటున్నాం. రష్యా, యుక్రెయిన్‌ల మధ్య యుద్ధం గురించి నేను విన్నాను. ఈ సమస్యలకు మూల కారణం అదేనని కొందరు చెప్తున్నారు'' అన్నారు 38 ఏళ్ల షుక్రీ మోలిమ్ అలీ. ఆమె తన ఎండిపోయిన కూరగాయల మడి, వట్టిపోయిన బావి దగ్గరకు వెళ్లారు.
అంతకంతకూ వ్యాపిస్తున్న తీవ్ర కరవును అరికట్టడం ఈ ప్రాంతంలో తక్షణ కర్తవ్యం. అయితే సోమాలియాలో కొత్త ప్రభుత్వం భవిష్యత్తు మనుగడకు సంబంధించిన సమస్యలను కూడా పరిష్కరించటం మీద దృష్టి పెట్టింది.
''ఇది సవాళ్లతో కూడుకున్న పని. కరవు మీద స్పందించటం. అల్-షాబాబ్ మీద పోరాడటం, అంతర్జాతీయ వాతావరణ న్యాయ నిధులు( ఇంటర్నేషనల్ క్లైమేట్ జస్టిస్ ఫైనాన్స్ ) పొందటానికి ఉద్యమించటం.. అన్నీ ఒకేసారి చేయాలి'' అన్నారు అబ్దిరహమాన్ అబ్దిషాకుర్.
''మాది యువ జనాభా. విదేశాల్లోనూ విస్తారంగా ఉన్నారు. ఉజ్వలమైన పారిశ్రామిక నైపుణ్యాలున్నాయి. అవి మాకు ఆశనిస్తున్నాయి. ఇది సవాలుతో కూడుకున్నదే. కానీ మాకు మరో దారి లేదు'' అని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
- మొబైల్ ఫోన్లు చోరీ అయితే పోలీసులు ఎలా వెతికి పట్టుకుంటారో తెలుసా?
- కొల్లాపూర్ మహాలక్ష్మి - అంబాబాయి ఆలయం గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
- రాజరాజ చోళుడు హిందువు కాదా, అసలు హిందూ అనే మతమే లేదా, చరిత్ర ఏం చెబుతోంది?
- బల్లి పడితే ఆహారం విషపూరితం అవుతుందా, ఇంట్లో బల్లులు లేకపోతే మనుషులకు ఏం జరుగుతుంది?
- మీరు డార్క్ చాక్లెట్ను ఇష్టంగా తింటారా, అది ఆరోగ్యానికి నిజంగా మంచిదేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













