Drought: చైనా, యూరప్, అమెరికాలో దుర్భిక్షం: 2022 చరిత్రలో అత్యంత కరవు సంవత్సరమా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రియాలిటీ చెక్, విజువల్ జర్నలిజం
- హోదా, బీబీసీ న్యూస్
యూరప్ ఖండం, చైనాలోని కొన్ని ప్రాంతాలలో ఈ వేసవిలో తీవ్రమైన ఎండలు... ఆఫ్రికా ఖండంలో పొడి వాతావరణం లక్షల మందిని ఆకలి ముప్పు ముంగిట నిలిపాయి. అమెరికా పశ్చిమ ప్రాంతాలలో ఇంకా వర్షాభావ పరిస్థితులు అలాగే కొనసాగుతున్నాయి.
ముందుముందు పొడి వాతావరణ కాలం సాధారణమైపోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అయితే, గత కొన్ని నెలల్లోనే అత్యంత పొడివాతవరణం నమోదైందా? గణాంకాలు ఏం చెబుతున్నాయో చూద్దాం..
భూమి ఎంత పొడిగా ఉంటుంది?
కరవు పరిస్థితులను లెక్కకట్టడానికి నేలలోని తేమ స్థాయిని శాస్త్రవేత్తలు ఆధారంగా చేసుకుంటారు. ఉపగ్రహ చిత్రాల ఆధారంగా నేలలో తేమ స్థాయిని అంచనా వేస్తారు.
గత మూడు నెలల కాలంలో పొడి వాతవరణ పరిస్థితులను ఈ శతాబ్దపు ప్రారంభం నుంచి ఉన్న సగటు వాతవరణ పరిస్థితులతో పోల్చి చూశారు శాస్త్రవేత్తలు. ఇటీవల వాతావరణ పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నాయనేది కళ్లకు కట్టడానికి వీరు ఈ ప్రయోగం చేశారు.

సోయిల్ మోయిశ్చర్ అనామలీ మ్యాప్‌గా పిలిచే ఈ పటంలో నేల పరిస్థితులు, ఉష్ణోగ్రత డాటా రెండూ ఉంటాయి.
పైపటాన్ని చూస్తే.. 2001 నుంచి 2016 మధ్య సగటు వేసవితో పోల్చితే ఈ వేసవిలో యూరప్‌లోని అత్యధిక ప్రాంతాలు మరింత తీవ్రమైన పొడి వాతావరణాన్ని చవిచూసినట్లు అర్థమవుతుంది.
అలాగే చైనా పశ్చిమ ప్రాంతంలో కూడా పొడి వాతావరణమే ఉంది. సబ్ సహారన్ ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలు, అమెరికాలోని కొన్ని ప్రొంతాలలోనూ ఇదే వాతావరణం ఉంది.
500 ఏళ్లలో ఐరోపాలో ఇదే అత్యంత తీవ్రమైన కరవు
గత 500 ఏళ్లలో ఐరోపా ఖండంలో ఏర్పడిన కరవు పరిస్థితులలో ఇదే అత్యంత తీవ్రమైనవి కావొచ్చని 'యూరోపియన్ యూనియన్ ఎన్విరానమెంటల్ ప్రోగ్రాం కోపర్నికస్' వెల్లడించింది.
పొడివాతావరణం అత్యంత తీవ్రంగా ఉన్న ఆగస్ట్ చివరి రోజుల్లో ఐరోపాలోని అనేక ప్రాంతాలలో నేల తేమ రహితంగా మారిపోయింది.
యూరప్‌లో ముందుముందు కరవులు తరచుగా ఏర్పడనున్నాయని.. ఈ ఏడాది పొడి వాతావరణ పరిస్థితులు వ్యవసాయం, రవాణా, ఇంధన తయారీ రంగాలపై ప్రభావం చూపిందని శాస్త్రవేత్తలు చెప్పారు.
యూరప్‌లో ప్రధాన నది, సరకు రవాణ మార్గమైన రైన్‌లో నీటిమట్టం భారీగా తగ్గిపోవడంతో షిప్పింగ్‌కు తీవ్ర అంతరాయాలు ఏర్పడ్డాయి.

ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్ట్ మధ్య కాలం అత్యంత వేడి పరిస్థితులు ఏర్పడినట్లు రికార్డులు చెబుతున్నయి. మరో మూడు నెలలు వేడి, పొడి వాతావరణం ఉంటుందని యూరోపియన్ యూనియన్ ఆగస్ట్‌లో విడుదల చేసిన ఓ నివేదిక వెల్లడించింది.
యూరప్ గతంలోనూ కరవు పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ ఈ వేసవిలో అనేక సార్లు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
'గత అయిదేళ్లుగా వరుస కరవులు ఎదుర్కొంటున్నాం. అయితే, ఈ ఏడాది యూరప్ వ్యాప్తంగా ఏర్పడిన కరవు గత వందేళ్లలోనే అత్యంత తీవ్రమైనది' అని పాట్స్‌డామ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్లైమేట్ రీసెర్చ్‌కు చెందిన డాక్టర్ ఫ్రెడ్ హేటర్‌మన్ చెప్పారు.
చైనాలో కరవు, వరదలు
చైనాలో ఈ ఏడాది వేసవి తరవాతా మరో రెండు నెలలు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
1960ల తరువాత అక్కడ ఇదే సుదీర్ఘ వేసవి కాలమని చైనా వాతావరణ విభాగ అధికారులు వెల్లడించారు.

తీవ్రమైన వేడి, తీవ్ర వర్షాభావం కారణంగా చైనాలోని అతిపెద్ద నది యాంగ్ఝె బక్కచిక్కిపోయింది. ఈ నది ప్రాంతంలో ఆగస్ట్‌లో 60 శాతం తక్కువ వర్షపాతం నమోదైనట్లు చైనా అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
దక్షిణ చైనాలోని అనేక ప్రాంతాలు కరవుతో సతమతమవుతుండగా ఆ దేశంలోనే ఉత్తర ప్రాంతమంతా వరదలతో అతలాకుతలమవుతోంది.
ఉత్తర చైనాలోని లియావో నదికి 1961 తరువాత ఈ ఏడాదే అత్యధిక స్థాయిలో వరద వచ్చింది.
అంతేకాదు... చైనా దేశవ్యాప్త సగటు వర్షపాతం 2012 నుంచి స్థిరంగా పెరుగుతోందని ఆ దేశ వార్షిక వాతావరణ మార్పుల అధ్యయన నివేదిక వెల్లడించింది.
పొడి, తడి వాతావరణాలు రెండూ అత్యంత తీవ్రంగా ఉండడమనేది వాతావరణ మార్పులకు సంకేతం.
ఆఫ్రికాలో దుర్భిక్ష పరిస్థితులకు సూచనలు
2.2 కోట్ల మంది ప్రజలు ఆకలి ముప్పు ముంగిట ఉన్నట్లు ఐరాస ఇటీవల హెచ్చరించింది. తూర్పు ఇథియోపియా, ఉత్తర కెన్యా, సోమాలియాల్లో కరవు పరిస్థితులు ఐరాస ఈ హెచ్చరికలు జారీ చేయడానికి కారణమయ్యాయి.
ఈ ప్రాంతాలలో వరుసగా మూడో ఏడాది అత్యల్ప వర్షపాతాలు నమోదైనట్లు ఆక్స్‌ఫామ్ నివేదిక చెప్పింది.
సోమాలియాలో ఈ ఏడాది మార్చ్ నుంచి మే మధ్య కాలంలో కురిసన వర్షం గత 60 ఏళ్ల కాలంలోనే అత్యల్పమని రికార్డులు చెబుతున్నాయి.
డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, యుగాండాలలోని అత్యధిక ప్రాంతాలు కూడా సగటు వాతావరణ పరిస్థితుల కంటే పొడి వాతావారణాన్ని ఎదుర్కొంటున్నాయి.

అదే సమయంలో దక్షిణ సూడాన్, మారిషేనియా, సెనెగల్‌లో తీవ్ర వరదలు ఉన్నట్లు నేలలో తేమ శాతం చెబుతోంది.
ఆఫ్రికా ఖండ దక్షిణ భాగంలోని అనేక ప్రాంతాల్లోనూ సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది.
1970-79 మధ్య కాలంతో పోల్చితే 2010-2019 మధ్య కాలంలో కరవులు మూడు రెట్లు, వరదలు పది రెట్లు పెరిగినట్లు 2021లో విడుదల చేసిన ప్రపంచ బ్యాంక్ నివేదిక ఒకటి వెల్లడించింది.
అమెరికాలో కరవు పరిస్థితులు
గత కొన్నేళ్లుగా పొడి, వేడి వాతావరణం క్రమం తప్పకుండా ఏర్పడుతున్న నేపథ్యంలో అమెరికా పశ్చిమ ప్రాంతంలో కరవు పరిస్థితులు సాధారణమైపోయాయి.
అమెరికా పశ్చిమ ప్రాంతంలో గత 1200 ఏళ్లలో ఎన్నడూ లేనంతటి తీవ్ర కరవు పరిస్థితులు గత రెండు దశాబ్దాలలో ఏర్పడ్డాయని ఫిబ్రవరిలో విడుదలైన ఓ నివేదిక పేర్కొంది.
ఈ వేసవిలో అమెరికలో పొడి వాతావరణం కారణంగా వివిధ రాష్ట్రాలలో కార్చిచ్చులు వ్యాపించాయి. కొన్ని చోట్ల నీటి ఎద్దడి ఏర్పడింది.

అమెరికాలోని రెండో అతి పెద్ద జలాశయం లేక్ పావెల్‌లో నీటి మట్టం బాగా తగ్గిపోయింది. 1960లో దాన్ని నింపిన తరువాత ఇంత తక్కువ నీరు ఉండడం ఇదే తొలిసారిన నాసా చిత్రాలు చెబుతున్నాయి.
రానున్న దశాబ్దాలలో ఈ ప్రాంతమంతా వర్షాభావ పరిస్థితులను ఎదుర్కోనుందని క్లైమేట్ మోడల్స్ సూచిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
- విజయవాడ: శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థిని కాలితో తన్నుతూ దాడి చేసిన లెక్చరర్.. ఎందుకు? ఆ తర్వాత ఏం జరిగింది?
- హిజాబ్ ధరించనందుకు అరెస్ట్ చేసిన పోలీసులు, ప్రాణాలు కోల్పోయిన యువతి
- నేలకొండపల్లి: ఎస్సై స్రవంతి రెడ్డి కులం పేరుతో బహిరంగంగా దళితులను దూషించారా? లేదా? ఎస్సీ కాలనీ వాసులు ఏమంటున్నారు, పోలీసుల వాదనేంటి? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- క్వీన్ ఎలిజబెత్ 2: కోహినూర్ వజ్రం, హంసలు, డాల్ఫిన్స్, ఖరీదైన కార్లు, భూములు, బంగళాలు.. కింగ్ చార్లెస్‌కు తల్లి నుంచి వారసత్వంగా ఏం వస్తున్నాయి?
- హైదరాబాద్ సంస్థానం భారత్‌లో కలవడంపై బీజేపీ, టీఆర్ఎస్ల మధ్య మాటల యుద్ధానికి కారణమేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












