మునుగోడు ఉపఎన్నిక : ‘ఇక్కడ ఓటుకు ఎంఆర్‌పీ రేటును ఎలా నిర్ణయిస్తున్నారంటే...’’

బీజేపీ నేత కోమటి‌రెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి

ఫొటో సోర్స్, Facebook/Komatireddy Raj Gopal Reddy

    • రచయిత, జింకా నాగరాజు
    • హోదా, బీబీసీ కోసం...

మునుగోడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వాహనంలో కోటి రుపాయల నగదును పోలీసులు పట్టుకోవడం, ఒక కారులో రు.19 లక్షలు దొరకడం వంటి సంఘటనలు మీడియాకు పెద్ద వార్తలు అయ్యాయి.

ఎందుకంటే, మునుగోడు ఎన్నికల సందర్భంగా కట్టలకట్టల నోట్లు దొరుకుతాయని సెన్సేషనల్ వార్త కోసం చాలామంది ఎదురు చూసి చూసి బేజారయినపుడు, ఈ వార్త దొరికింది. అందుకే కోటి రుపాయల పట్టివేత వార్త మీడియాలో సంచలనమైంది.

అయితే, లెంకలపల్లి రైతు వేల్పుల వెంకటేశ్ ఈ వార్త విని అవాక్కవలేదు. ఎందుకంటే, ఊరూర పారుతున్న మద్యం, విందుల చిందుల ఖర్చు ఎన్ని కోట్లో చెప్పగలరా? అంటూ ఆయన ఎదురు ప్రశ్న వేశాడు. ఈ ఖర్చులో నూరో వంతు పెట్టినా, తమ ఊరికి మంచినీళ్లు వచ్చేవి అనేది ఆయన వాదన.

ఆయన నివసించే ఊరి దగ్గర ఎత్తయిన మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ ఉంది. దాన్ని చూపిస్తూ దీన్నుంచి ఒక్కపూట కూడా మాకు మంచినీళ్లు రాలేదు. ట్యాంక్ మీద 40 వేల లీటర్ల కెపాసిటీ అని రాసి ఉన్న అక్షరాలను చూపిస్తూ నలభైవేలు కాదు, నాలుగు లీటర్ల నీళ్లు కూడా రావడం లేదని ఆయన చెప్పారు. లెంకలపల్లి కూడా ఫ్లోరైడ్ బెల్ట్‌లోనే ఉంది.

మునుగోడు ఎన్నికల ప్రచారంలో కేటీఆర్

ఫొటో సోర్స్, Facebook/KTR

ఊరూర పండగ వాతావరణం

ఉపఎన్నిక జరుగుతున్న తెలంగాణలోని నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో ఊరూర పండగ వాతావరణం కనిపిస్తుంది. చినుకుల వల్ల చిత్తడి, లేత చలిగా వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. ఊరూర ఉన్న రాజకీయ పార్టీల బూత్ కమిటీలు, ఊరి వానాకాలపు 'సంక్షేమం' చక్కగా చూసుకుంటున్నాయి. చుక్క ముక్క అవసరాలు తీరుస్తున్నాయి. ఒక్క మాటలో చెబితే, నియోజకవరం మద్యం గుభాళింపులో తూగుతూ ఉంది.

ఏ మూలన రోడ్డు మీద ఒక గంటసేపు నిలబడినా కనీసం వందకు తగ్గకుండా లగ్జరీ కార్లు తటస్థపడతాయి. ఇందులో కొన్ని బ్రాండ్ న్యూ వాహనాలున్నాయి. ఇలాంటి ఎన్నికల దృశ్యం ఇంతకు ముందెపుడూ లేదు.

ఈ ఆర్భాటం వల్ల ఈ సారి ఓటు రేటు భారీగా పెంచేందుకు వీలుందని చెబుతున్నారు. ఈ ఎన్నిక అత్యంత ఖరీదైన ఎన్నికగా రికార్డు సృష్టిస్తుందని చండూరులోని బీజేపీ అభ్యర్థి క్యాంపు ఆఫీసు దగ్గిర పార్టీ నాయకుడొకరు అన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన 'ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్'ను అపుడే తయారు చేసుకున్నారు. దాని చుట్టూర తనకోసం వచ్చే నేతల కోసం ఆయన గుడారాలు వేశారు.

ఇదొక చారిత్రక సినిమా సెట్టింగ్‌లాగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అలాగే ఓటర్ ఎక్స్‌పెక్టేషన్ కూడా ఎక్కువగా ఉంటుందని ఆ బీజేపీ నేత అనుమానం వ్యక్తం చేశారు.

‘‘ఎన్నికల మీద పార్టీలు పెడుతున్న ఖర్చు గురించి జనంలో బాగా అవేర్‌నెస్ వచ్చింది. సోషల్ మీడియా వల్ల మునుగోడు ఎన్నిక ప్రాధాన్యం ఓటర్లందరికి బాగా తెలిసిపోయింది. ఈ సీటు కోసం పార్టీలు ఎంతయిన ఖర్చు చేసేందుకు వెనకాడవనే విషయం మూలమూలల పాకింది. తమ ఓటుకు ఎంఆర్‌పీలాగా ఒక రేటు నిర్ణయించుకుని అంతే ఇవ్వాలని పార్టీలను నిలదీసే వాతావరణం కనిపిస్తున్నది’’ అని గోపిరెడ్డి సంపత్ కుమార్ అనే జర్నలిస్టు వ్యాఖ్యానించారు.

ఒక యూట్యూబ్ చానెల్‌కు పనిచేస్తున్న సంపత్ ఈ ఎన్నికల కోసం నియోజకవర్గంలో తిరగని గ్రామం లేదు. కలవని పార్టీ నాయకుడు లేడు.

తన అనుభవం గురించి చెబుతూ ‘‘మునుగోడుకు ఈ ఎన్నిక కొత్త అనుభవం. పార్టీలకు కూడా కొత్త పాఠం' అవుతుందని అన్నారు. ఓటర్లు వోటుకు ఎమ్ఆర్‌పీ నిర్ణయించుకుని అంతే ఇచ్చితీరాలని గొడవ చేసే రోజు ఎంతో దూరంలో లేదని ఆయన అన్నారు.

మునుగోడు ప్రజలు

ఫొటో సోర్స్, Facebook/KTR

ఎవరిని పలకరించినా ఒక్కటే మాట

నేషనల్ హైవే-65 మీద ఉన్న చౌటుప్పల్ దగ్గర నుంచి 40 కి.మీ దూరాన ఉన్న మునుగోడు దాకా ఎక్కడ ఎవరిని పలకరించినా ఎన్నికల్లో పార్టీలు పెడుతున్న ఖర్చు ప్రస్తావనే వినబడుతుంది. పైకి మునుగోడు అభివృద్ధి, ఫ్లోరైడ్ సమస్య లాంటి మాటలు వినబడుతున్నా, లోన జనంలోగాని, పార్టీ కార్యాలయాల్లో గాని జరిగే చర్చంతా డబ్బు పంచడం గురించే.

ఈసారి దండిగా తీసుకోవాలని ఓటర్లు తర్జన భర్జన పడుతుంటే...ఏ నాయకుడిని లాక్కోవాలి, ఎంత డబ్బివ్వాలనే వ్యూహాల్లో పార్టీలు ఉన్నాయి.

ఈ ఎన్నికలు డబ్బు సంచుల చుట్టూ తిరుగుతున్నందున ఓటు రేటు కూడా ఈ సారి ఎక్కువగానే ఉంటుందని సంస్థాన్ నారాయణ్‌ పూర్‌లోని ఒక కిరాణ కొట్టు యజమాని చెప్పారు. ఎందుకని ప్రశ్నిస్తే, టీవీలో ఏం కనబడుతున్నదో మీరు చూస్తున్నారుగా అన్నారు.

బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీద తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ చేసిన రూ.18,000 కోట్ల క్విడ్ ప్రో క్వో ట్వీట్‌ను ఆయన గుర్తు చేస్తున్నారు. ఇంగ్లిష్‌లోఉన్న కేటీఆర్ ట్వీట్‌ను ఆయన చూళ్లేదు గాని ట్వీట్ ఆధారంగా వాట్సాప్‌లో షేర్ అయిన అనేక కథనాలు చదివారు, విన్నారు, నమ్ముతున్నారు.

‘‘కాంగ్రెస్ పార్టీకి, అసెంబ్లీకి రాజీనామా చేసి ఉపఎన్నిక వచ్చేందుకు సహకరించిన రాజగోపాల్‌కు బీజేపీ రూ.18000 వేల కోట్ల కాంట్రాక్టు ముట్ట చెప్పిందని' ఇది ఒక క్విడ్ ప్రో క్వో అని కేటీఆర్ చేసిన ఆరోపణ నియోజకవర్గ ప్రజల్లో బాగా చర్చనీయాంశమైంది. మంత్రులు, ఎమ్మెల్యేలు దీన్ని బాగా ప్రచారం చేశారు. రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు కొట్టేసినపుడు ఓటు రేటు కూడా పెంచాల్సి ఉంటుందనేది కిరాణ షాపు ఓనర్ వాదన. ఈ ఆరోపణను రుజువు చేయాలి, లేదంటే పరువు నష్టం దావావేస్తానని రాజగోపాల్ రెడ్డి చేసిన బెదిరింపులను ఇక్కడి ఓటర్లు ఎవరూ సీరియస్‌గా తీసుకోవడం లేదు.

అయితే, దీన్ని కౌంటర్ చేయడంలో బీజేపీ కూడా విజయం సాధించింది. 'దిల్లీ లిక్కర్ స్కామ్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్ బిడ్డ, ఎమ్మెల్సీ కవితకు సంబంధం ఉందని... దిల్లీలోని ఆరువందల లిక్కర్ షాపుల్లో ఆమెకు వాటా ఉందని ఆమెను తీహార్ జైలుకు పంపడం గ్యారంటీ' అని రాజగోపాల్ రెడ్డి చేసిన విమర్శను కూడా మునుగోడు ఓటర్లు తీవ్రంగా తీసుకుంటున్నారు. ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాడుల మధ్య రాజగోపాల్ రెడ్డి చేసిన ఆరోపణ గుప్పున మండింది.

మునుగోడు ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి

ఫొటో సోర్స్, Facebook/Telangana Congress

ఈ ఎన్నిక చాలా కీలకం

ఇలా లీడర్లంతా బాగా సంపాదిస్తున్నపుడు ఓటరుకు కూడా భారీగానే ఈసారి ముట్ట చెప్పాల్సి ఉంటుందని చౌటుప్పల్‌లో ఒక ఓటరు వ్యాఖ్యానించాడు. వ్యక్తిగతంగా బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డితో టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సరితూగడం కష్టం. టీఆర్ఎస్ అభ్యర్థికి రూలింగ్ పార్టీ అందించే ఎడ్వాంటేజ్‌ని కోమటిరెడ్డి తన డబ్బుతో, ఉధృతమయిన ప్రచారంతో అధిగమించగలిగారు.

కోమటిరెడ్డి స్వయాన సంపన్నుడయితే, కూసుకుంట్ల దేశంలోనే బాగా డబ్బున్న ప్రాంతీయ పార్టీ అభ్యర్థి. బీజేపీ క్యాంపెయిన్ మూలమూలలకు విస్తరించి పోయింది. కాంగ్రెస్ మహిళా అభ్యర్థి పాల్వాయి స్రవంతిని నిలబెట్టినా ఈ పార్టీ ప్రచారం మిగతా పార్టీలకు ధీటుగా ఉధృతం కావలసి ఉందేమో అనిపిస్తుంది.

ఈసారి మునుగోడులో ఓటు రేటు భారీగా ఉండొచ్చనేందుకు చాలా కారణాలున్నాయి. మునుగోడు ఎన్నిక గెలవడం అన్ని పార్టీలకు చాలా అవసరం. మునుగోడులో టీఆర్ఎస్ గెలిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ చేయబోతున్న భారత్ రాష్ట్ర సమితి ఏర్పాటుకు ప్రజామోదంగా దాన్ని చెప్పుకోవచ్చు. మునుగోడులో రాజ్‌గోపాల్ రెడ్డి గెలిస్తే 2023లో కాషాయ జెండా ఎగురుతుందనే ధీమా బీజేపీలో పెరగొచ్చు. టీఆర్ఎస్ నీరసపడొచ్చు.

మునుగోడులో ఈసారి కాంగ్రెస్ గెలిస్తే పార్టీ పునర్జన్మ ఎత్తినట్లే. ఆ పార్టీ పతనం ఆగిపోతుంది. అందువల్ల ఈ ఎన్నికల్లో గెలిచేందుకు ఎంతయినా ఖర్చు చేసేందుకుకు పార్టీలు ముఖ్యంగా టీఆర్ఎస్, బీజేపీ వెనకాడవు. దీనికి అవసరమయన వనరులు రెండు పార్టీల దగ్గర సమృద్ధిగా ఉన్నాయి.

బీజేపీ కార్యకర్తల ర్యాలీ

ఫొటో సోర్స్, Facebook/Komatireddy Raj Gopal Reddy

డబ్బు సంచుల మధ్య పోటీ

నియోజకవర్గంలో జరుగుతున్న విందులు, వినోదాలు, స్థానిక నేతల కొనుగోళ్లు, పార్టీలు చేస్తున్న ఖర్చు చూస్తే మునుగోడు ఎన్నిక... డబ్బు సంచుల మధ్య పోటీ అనిపిస్తుంది.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాష్ట్రంలో ఒక సంపన్న రాజకీయ నాయకుడు. 2018లో ఆయన ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఆయన ఆస్తుల విలువ రు.341 కోట్లు. అసెంబ్లీలోని పది మంది ధనవంతుల్లో ఆయన టాపర్. ఇప్పుడు ఆయనకు రు.18,000 కోట్ల కాంట్రాక్టు వచ్చిందనేది ఆరోపణ.

ఇక ఆయన కోసం ప్రచారం చేస్తున్న వాళ్లు కూడా సంపన్నులే. టీఆర్ఎస్ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరెడ్డి, బీజేపీ విజయానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. 2014లో ఎంపీగా ఎన్నికయినపుడు పార్లమెంటులోని అత్యంత సంపన్న ఎంపీలలో ఆయన ఒకరు.

కోమటిరెడ్డి కోసం కృషి చేస్తున్న మరొక నాయకుడు గెడ్డం వివేక్ వెంకటస్వామి. మాజీ ఎంపీ అయిన వివేక్ కూడా రాష్ట్రంలోని సంపన్న రాజకీయ నాయకుల్లో ఒకరు. ఇదేవిధంగా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కూడా ఈ జాబితాలోకే వస్తారు. ఈ వాస్తవం ఓటర్లు గమనించకుండా ఉంటారా?

ఇలాంటిదే టీఆర్ఎస్ పరిస్థితి కూడా. స్వయాన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 'మన టీఆర్ఎస్ వేయికోట్ల సంపన్నురాలు' అని మొన్న ఏప్రిల్లో జరిగిన పార్టీ ప్లీనరీలో హర్షద్వానాల మధ్య ప్రకటించారు.

టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల కమిషన్‌కు తాజాగా సమర్పించిన డొనేషన్ వివరాల ప్రకారం, దేశంలో అత్యధిక డోనేషన్లు పొందిన రెండో ప్రాంతీయ పార్టీ టీఆర్‌ఎస్. ఈ పార్టీకి 2021-2022లో రూ.193 కోట్ల విరాళాలు అందాయి. ఇందులో రూ.153 కోట్లు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో వస్తే, రూ.40 కోట్లు ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్టు నుంచి వచ్చాయి.

ఈ కారణాలతో మునుగోడులో బీజేపీ-టీఆర్ఎస్ ఎన్నికల డబ్బు సంచుల మధ్య పోటీ కాదా అని చౌటుప్పల్‌కు చెందిన ఒక కాలేజీ లెక్చరర్ వ్యాఖ్యానించారు. ఈ కారణంతోనే ఓటుకు పెద్ద రేటు ఓటరు డిమాండ్ చేస్తాడంటే ఆశ్చర్యం కాదని ఆయన అన్నారు. భారీ రేటు చెల్లించక తప్పదని ఆయన వత్తాసు పలికారు.

బీజేపీ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి

ఫొటో సోర్స్, Facebook/Konda Vishweshwar Reddy

‘చికెన్, మటన్‌కు కొరత’

నియోజకవర్గంలో చికెన్, మటన్ కొరత వచ్చిందని... పక్క జిల్లాల నియోజకవర్గాల నుంచి తెప్పిస్తున్నారని స్థానిక పత్రికల్లో ప్రముఖంగా వచ్చిన వార్త. ఇక్కడ జరిగే తీరు చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది.

ప్రతి మండలంలో భారీగా వర్కర్లు పార్టీ క్యాంపెయిన్లో పాల్గొంటున్నారు. ఎవరో బయటి నుంచి వచ్చిన సంఘ్ పరివార్ వ్యక్తులు, నేతల కుటుంబ సభ్యులు తప్ప మిగతా వారంతా కూలీ కోసం పని చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే, చాలా సందర్భాలలో క్యాంపెయిన్ నుంచి వెళ్లిపోతూ వెళ్లిపోతూ జెండాలను కంపచెట్లలోకి పడేయడం బీబీసీ తెలుగు ప్రతినిధి కంటపడింది.

‘‘రోజుకు అయిదొందల కూలీ, ఒక క్వార్టర్ బాటిల్. మధ్యాహ్నం భోజనం ఇస్తారు. ఇది సాధారణంగా మాంసాహారమే అయి ఉంటుంది. ముక్క లేకపోతే ఒక్క అడుగు ముందుకు పడదు’’ అని ఒక వర్కర్ వ్యాఖ్యానించారు.

ఈ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఈసారి టీఆర్ఎస్ తరఫున పని చేసేందుకు వర్కర్ల అవసరం బాగా పెరిగింది. పార్టీ తరఫున 86 మంది ఎమ్మెల్యేలు గ్రామగ్రామాన మకాం వేశారు. మరొక 14 మంది మంత్రులు కూడా క్యాంపెయిన్‌ను పర్యవేక్షిస్తున్నారు. వీళ్లు కాకుండా ఎంపీలు, ఎంఎల్‌సీలు, ఇతర పార్టీ నేతలు, లోకల్ బాడీల ప్రజాప్రతినిధులు... ఇలా నియోజకవర్గమంతా టీఆర్ఎస్ సైన్యంతో కిక్కిరిసి పోతున్నది.

వనపర్తి జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు, టీఆర్ఎస్ నాయకుడు వామన గౌడ్ ఒక బృందాన్ని వెంటేసుకుని చర్లగూడెం ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో తిరగడం కనిపించింది. ఆయన వెంబడి దాదాపు ఇరవై మంది ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు. ఇలా నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలతోపాటు ఇతర నాయకుల కాన్వాయ్‌లు సృష్టిస్తున్న సందడి అంతా ఇంతా కాదు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్

ఫొటో సోర్స్, Facebook/KCR

ఓటు రేటు పెరగవచ్చు

ఈ ఆర్భాటాన్ని చూసే ఈ సారి ఓటు రేటు పెరగవచ్చని ఓటర్లు ఆశిస్తున్నారు. పార్టీలు భావిస్తున్నాయి. ఇంత ఖర్చు చేస్తూ తమకు భారీగా ఇవ్వకపోతే ఎలా అని ఓటర్లు ప్రశ్నిస్తున్నారు. కొన్ని చోట్ల అప్పుడే కులాలకు హోల్ సేల్‌గా చెల్లించడం మొదలయింది. కొన్నిచోట్ల ఎడ్వాన్స్ చెల్లించారు. మిగతాది పోలింగు ముందు రోజున చెల్లిస్తారు. చెల్లింపుల్లో వ్యత్యాసం వస్తే గొడవలవుతున్నాయి. ఇలాంటి గొడవలో మంత్రి మల్లారెడ్డి చిక్కుకోవడం బాగా చర్చనీయాంశమయింది.

చౌటుప్పల్ సమీపంలోని ఆరె గూడెంలో 'గౌడ' కులానికి చెందిన ఓటర్లు కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డిని డబ్బు కోసం నిలదీశారు. తమ కుల ఓట్ల కోసం రూ.12 లక్షలు ఇస్తామన్నారని, అదింకా ఇవ్వలేదని ఓటర్లు మంత్రిని నిలదీసి ఇబ్బందికి గురి చేశారు.

ఎన్నిక చాలా కీలకమైంది కావడంతో కులసంఘాలను, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను, మాజీ ప్రతినిధులను కూడా భారీగా డబ్బులు ఇచ్చి కొనేస్తున్నారనే వార్త అందరికీ తెలిసిపోయింది. నాలుగు ఓట్లు తెచ్చే శక్తి ఉందని తెలిస్తే చాలు పార్టీలు వాలిపోయి పోటీపోటీగా లీడర్లను కొనేస్తున్నాయి. పొద్దున ఒక పార్టీ కొన్న లీడర్‌ను సాయంకాలానికి మరొక పార్టీ లాగేసుకుంటున్నది.

ఒక సర్పంచు పార్టీ మారితే... బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీలు రెండు కోట్ల రుపాలయ దాకా ఇస్తున్నాయని ప్రజాశాంతి పార్టీ నాయకుడు, క్రైస్తవ మత ప్రచారకుడు కేఎ పాల్ చండూరులో మీడియాతో మాట్లాడుతూ ఆరోపించారు. కోటా, రెండు కోట్లా అనేది తేలడం కష్టమయినా, ఇప్పుడు ఊరూర జరుగుతున్న ఫిరాయింపులు చూస్తే ఏ ప్రలోభం లేకపోతే ఇప్పుడే పార్టీ ఎందుకు మారాలి అని చండూరులోని ఒక మెడికల్ షాపు యజమాని ప్రశ్నించారు.

‘‘ఇలా పైనుంచి కింది దాకా లీడర్లు అంతా కోట్ల నుంచి లక్షల దాకా తీసుకుంటున్నారు కాబట్టే, ఈ సారి ఓటుకు పార్టీలు భారీగా చెల్లించాల్సి ఉంటుంది. లేకపోతే, అందరికి షాకిచ్చే లాగా తీర్పు ఉంటుంది’’ అని ఆయన అన్నారు.

మునుగోడు నియోజకవర్గ ప్రజలు

ఫొటో సోర్స్, Facebook/TRS

ఓటుకు ఎంత చెల్లించవచ్చు?

ఓటుకు ఎంత చెల్లించవచ్చు? ఈ ప్రశ్నకు నేరుగా రాజకీయపార్టీల కార్యకర్తలు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఇప్పుడే ఊహించడం కష్టం. ఎందుకంటే, ఇప్పుడు లీడర్లను తమ పార్టీ వైపు తిప్పుకోవడం మీద నేతలు ఖర్చు చేస్తున్నారు. ఇది లీడర్ల కొనుగోలు దశ. ఓటర్లకు పంచే దశ ఒక వారంలో మొదలవుతుంది. ఓటుకు ఎంతివ్వాలనేది నిర్ణయించేందుకు ఇంకా టైముంది అని టీఆర్ఎస్ తరఫున ప్రచారం చేస్తున్న ఒకరిద్దరు నేతలు అభిప్రాయపడ్డారు.

‘‘ఓటుకు ఎంతివ్వాలనేది రకరకాల అంశాల మీద ఆధార పడి ఉంటుంది. ఊరును బట్టి మారుతుంది. పదివేలు కనీసం ఉండేలా ఇండికేషన్స్ కనబడుతున్నాయి. ప్రజలు అసంతృప్తిగా ఉన్న చర్లగూడెం ప్రాజక్టు ప్రాంతాల్లో రేటు రూ.25 వేల దాకా వెళ్లినా ఆశ్చర్యం లేదు’’ అని ఒక నాయకుడు సూచాయగా చెప్పారు.

చర్లగూడెం ప్రాజెక్ట్ నిర్వాసితులకు పూర్తి న్యాయం జరగలేదని గత 45 రోజులుగా ధర్నా చేస్తున్నారు. వారిలో కొంత మంది టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ కూడా వేశారు.

ఎన్నికల ఖర్చు గురించి ఒక బీజేపీ నేత చిన్న లెక్క చెప్పారు.

‘‘నియోజవర్గంలో 2.40 లక్షల మంది ఓటర్లున్నారు. డబ్బు బాగా ఇస్తారు అనే నమ్మకం ఉన్నందున పోలింగ్ 80 నుంచి 90శాతం దాకా వెళ్లే అవకాశం ఉంది. అంటే దాదాపు రెండు లక్షల ఓట్లు పోలవుతాయి. ఇందులో కనీసం లక్ష మంది డబ్బు ఆశిస్తారు. ఎంతివ్వాలన్నది ఇంకా తేలలేదు. పోలింగ్‌కు రెండు మూడు రోజుల ముందు మాత్రం ఇది తెలుస్తుంది. ఓటుకు పదివేల చొప్పున లక్షల ఓట్లకు ఎంత ఖర్చవుతుంది. దానికి అంతే మొత్తం పైఖర్చుగా వేసుకుంటే ఈ ఎన్నిక ఆర్థిక స్వరూపం తెలుస్తుంది’’ ఆయన చెప్పారు.

కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకుడు భట్టి విక్రమార్క ఈ ఎన్నికల్లో డబ్బు పాత్ర గురించి మాట్లాడుతూ తన జీవితంలో ఇలాంటి నికృష్టమయిన తీరు చూడలేదని అన్నారు. ‘‘టీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు వందల కోట్లు ఖర్చు పెడుతున్నాయి. ఎన్నికలను డబ్బు మయం చేసేస్తున్నాయి. మిడతల దండుల్లా డబ్బు సంచులతో ఈ రెండు పార్టీల నేతలు ఊర్ల మీద వాలుతున్నారు’’ అని భట్టి అన్నారు.

‘‘ఖర్చు విషయంలోనే కాదు, చాలా విషయాల్లో ఈ ఎన్నిక చరిత్రలో మిగిలిపోతుంది. చరిత్ర గతి మారుస్తుంది గమనిస్తూ ఉండండి’’ అని బీజేపీ తరఫున ప్రచారం చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ అన్నారు.

వీడియో క్యాప్షన్, రామప్ప పట్టు చీరలు... వీటి ప్రత్యేకత ఏమిటో తెలుసా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)