జయలలిత సర్జరీని ఎవరు, ఎందుకు అడ్డుకున్నారు? ఆర్ముగస్వామి నివేదికలో సరికొత్త అనుమానాలు

ఫొటో సోర్స్, Getty Images
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణంపై జస్టిస్ ఆర్ముగస్వామి కమిటీ సమర్పించిన నివేదికను ఆ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ముందుంచింది. జయలలితకు యాంజియోగ్రామ్ చేయకుండా అపోలో ఆసుపత్రికి చెందిన ఒక డాక్టర్ ప్రణాళిక ప్రకారం అడ్డుకున్నారని ఆ నివేదిక వెల్లడించింది.
చికిత్సకు సంబంధించి జయలలిత నిర్ణయం, శశికళతో పాటు విచారించదగిన మరికొందరు వ్యక్తులు, ఇతర వివరాల గురించి నివేదిక పేర్కొంది.
'చికిత్సకుజయలలిత అనుమతించారు'
అమెరికాకు చెందిన ప్రముఖ కార్డియో థోరరాసిక్ సర్జన్ సమిన్ శర్మ, జయలలితను 2016 నవంబర్ 25వ తేదీన పరీక్షించారు. జయలలిత హెల్త్ రిపోర్టులను విశ్లేషించారు. తదుపరి చికిత్సలు తీసుకోవడానికి జయలలిత స్పృహలో ఉన్నప్పుడు స్వయంగా అనుమతి ఇచ్చారు.
ఆమె గుండెలో ఏర్పడిన సమస్యతో పాటు ఇతర ఆరోగ్య రుగ్మతలను దృష్టిలో పెట్టుకుని జయలలితకు ప్రాణహాని నివారించేందుకు కార్డియాక్ సర్జరీ చేయాలని ఆ అమెరికా డాక్టర్ భావించారు.
ఈ వివరాలన్నింటీ డాక్టర్ బాబు అబ్రహం 2016 నవంబర్ 25న రాతపూర్వకంగా రికార్డు చేశారు. జయలలిత అప్పుడు తన ఆరోగ్య పరిస్థితి, చికిత్స అవసరాన్ని గుర్తించి అర్థం చేసుకోగల స్థితిలో ఉన్నారు. ఆ సమయంలోనే ఆమె ట్రీట్మెంట్‌కు ఒప్పుకున్నారు.
కానీ, రెండు నెలల తరువాత ఆ నిర్ణయాన్ని డాక్టర్లు మార్చుకున్నారు. బ్రిటన్‌కు చెందిన చెందిన డాక్టర్ రిచర్డ్ బీలే అప్పుడు జయలలిత గుండెకు శస్త్రచికిత్స అవసరం లేదని చెప్పడం వల్లే అలా జరిగిందని తెలిసింది.

ఫొటో సోర్స్, TNDIPR
బ్రిటన్ డాక్టర్ ఆ రోజు జయలలితను పరీక్షించకుండానే తన అభిప్రాయాన్ని తెలిపారు. ఆయన నోటిమాటగా ఈ విషయం చెప్పారని లిఖిత పూర్వకంగా పేర్కొనలేదని చెబుతున్నారు.
సర్జరీ అవసరం లేదని యూకే డాక్టర్ నోటి మాటగా చెప్పారనే విషయాన్ని అపోలోలో పనిచేస్తున్న డాక్టర్ అబ్రహం తెలిపారు.
సర్జరీ చేయాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం ద్వారా అమెరికా డాక్టర్‌కు మాత్రమే కాకుండా జయలలిత తరఫున వ్యక్తిగత స్థాయిలో నిర్ణయాలు తీసుకునే స్థితిలో ఉన్న శశికళతో పాటు క్లిష్ట సమయాలలో ముఖ్యమంత్రి తరఫున నిర్ణయాలు తీసుకోవాల్సిన వారు ఆమెకు కార్డియో థొరాసిక్ సర్జరీ కొనసాగించకుండా తప్పు చేసి ఉండవచ్చని నివేదిక అభిప్రాయపడింది. అమెరికా డాక్టర్ అభిప్రాయం ప్రకారం ఆ శస్త్ర చికిత్స జరిగి ఉంటే జయలలితకు ప్రాణాపాయం తప్పి ఉండేది.

ఫొటో సోర్స్, Getty Images
'డాక్టర్ తప్పిదం'
యాంజియో గ్రామ్‌కు అంతా సిద్ధమైన తర్వాత పల్మనాలజిస్ట్ డాక్టర్ బాబు అబ్రహం, డాక్టర్ రిచర్డ్ బీలేను ఎందుకు పిలిపించారు అనే దానిపై స్పష్టత లేదు. కాబట్టి డాక్టర్ అబ్రహం ఇక్కడ ఏదో ట్రిక్ చేశారని ఈ నివేదిక విశ్వసించింది. యాంజియోను నిలిపేయడం కోసం యూకే డాక్టర్‌ను తీసుకొచ్చారని అభిప్రాయపడింది.
జయలలిత మరణించిన సమయంపై సందేహాలు
జయలలిత మరణించిన సమయంపై సందిగ్ధత ఉంది. ఆమె 2016 డిసెంబర్ 5న రాత్రి 11:30కు మరణించినట్లు అధికారికంగా చెప్పారు.
అయితే, చివరి క్షణాల్లో ఆమె దగ్గర ఉన్న పారామెడికల్ సిబ్బంది వాంగ్మూలానికి ఇది చాలా విరుద్ధంగా ఉంది.
4వ తేదీ మధ్యాహ్నం 3:50 గంటలకు ఆమెకు కార్డియాక్ ఫెయిల్యూర్ జరిగిందని ఆ తర్వాత గుండె పనిచేయలేదని, రక్త ప్రసరణ కూడా జరగలేదని డ్యూటీ డాక్టర్లు, నర్సులు, టెక్నీషియన్లు చెబుతున్నారు.
తొలి వర్ధంతి
జయలలిత డిసెంబర్ 4వ తేదీన మధ్యాహ్నం 3 నుంచి 3:30 గంటల మధ్య మరణించినట్లు పరిగణించి ఆమె మేనల్లుడు దీపక్, ఆ తేదీ ప్రకారమే తొలి వర్ధంతిని నిర్వహిచించారు.
ఆమె మరణం గురించి చివరి గడియల్లో జయలలితకు సేవలు అందించిన డ్రైవర్, ఇతరులు అందించిన సమాచారం ఆధారంగా ఇలా చేసినట్లు ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, AIADMK OFFICIAL TWITTER
ఆమెను విదేశాలకు ఎందుకు తీసుకెళ్లలేదు?
జయలలిత గుండెలో సమస్య ఉన్నట్లు యూకే వైద్యుడు రిచర్డ్ బీలే, అమెరికా డాక్టర్ స్టువర్ట్ రసెల్, సామిన్ శర్మ గుర్తించారు. ఆమెకు యాంజియో చేయాలని సూచించినప్పటికీ ప్రాణం పోయేవరకు దాన్ని నిర్వహించలేదు.
చివరి రోజుల్లో రెండు ఊపిరితిత్తుల నుంచి పెద్ద ఎత్తున (రోజుకు 1000 మి.లీ) ద్రవాలు ఆవిరయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆమెపై సానుభూతి ఉండాలి. మెరుగైన చికిత్స అందాలి.
ఆమెను విదేశాలకు తీసుకెళ్లేందుకు తాను సిద్ధంగా ఉన్నానని డాక్టర్ రిచర్డ్ బీలే అన్నారు. అయితే అది ఎందుకు జరగలేదు?
యాంజియో చేయడం గురించి డాక్టర్ సమిన్ శర్మ వివరించడంతో దానికి ఆమె కూడా ఒప్పుకున్నారు. కానీ అది కూడా కార్యరూపం దాల్చలేదు.
ఎవరెవరిని విచారించాలి?
జయలలిత సన్నిహితురాలు వీకే శశికళను, ఆమెకు చికిత్స చేసిన డాక్టర్ కేఎస్ శివకుమార్‌ను, అప్పటి రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సీ విజయభాస్కర్‌ను, ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి జే రాధాకృష్ణన్‌ను విచారించాలని తమిళనాడు ప్రభుత్వానికి ఆర్ముగస్వామి కమిటీ సూచించింది.
అపోలో వైద్యులు డాక్టర్ వైవీసీ రెడ్డి, డాక్టర్ బాబు అబ్రహంలను కూడా విచారించాలని కోరింది.
'అపోలో ప్రతాప్ రెడ్డి తప్పుడు నివేదిక'
అపోలో హాస్పిటల్స్ అధినేత డాక్టర్ ప్రతాప్ రెడ్డిని విచారించాలా వద్దా అన్నది ప్రభుత్వం నిర్ణయించుకోవాలని కమిటీ పేర్కొంది.
జయలలిత ఆస్పత్రిలో ఉన్నప్పుడు, ఆమెను ఎప్పుడైనా సరే డిశ్చార్జ్ చేయవచ్చంటూ వచ్చిన రిపోర్టు, తప్పుడు రిపోర్టు అని కమిటీ నివేదిక తెలిపింది.
జయలలిత ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన బ్రీఫింగ్‌లు అన్నీ తరచుగా ఆయన గదిలోనే జరిగినప్పటికీ ఆమె అనారోగ్యం, చికిత్సకు సంబంధించిన వాస్తవాలను వెల్లడించడంలో ప్రతాప్ రెడ్డి విఫలమయ్యారని కమిషన్ భావించింది.
ఇవి కూడా చదవండి:
- గుజరాత్లో ఈసారి బీజేపీకి కష్టమేనా? ‘కాంగ్రెస్ ఏదో కొత్తగా ప్రయత్నిస్తోంది, జాగ్రత్త’ అని మోదీ ఎందుకు హెచ్చరించారు?
- ఇరాన్లో ఏం జరుగుతోంది... మహిళల నిరసనలు ఎందుకు హింసాత్మకంగా మారాయి?
- అమాసియా: ఈ కొత్త సూపర్ ఖండం ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఏర్పడుతుంది?
- డాలర్ బలపడటం అంటే ఏంటి? డాలర్ ఎందుకు బలపడుతోంది? రూపాయి బలహీనపడుతోందా లేదా?
- షీ జిన్‌పింగ్: చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీని ఎలా నియంత్రిస్తున్నారు? ‘ప్రశ్నించడానికి వీలులేని అధికారాన్ని’ ఎలా సొంతం చేసుకున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












