దళిత విద్యార్థినిని టీచర్ క్లాసులో బట్టలు విప్పించారా, ఆ బాలిక కిరోసిన్ పోసుకుని ఎందుకు నిప్పంటించుకుంది?

ఫొటో సోర్స్, iStock
- రచయిత, మొహ్మాద్ సర్తాజ్ ఆలం
- హోదా, బీబీసీ హిందీ కోసం
జార్ఖండ్‌లోని ఒక దళిత విద్యార్థి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఒంటి మీద కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకుంది.
టీచర్ బట్టలు విప్పించి, దూషించడమే ఇందుకు కారణమన ఆరోపణలు వస్తున్నాయి. జంషెడ్‌పుర్‌కు చెందిన ఆ బాలిక తొమ్మిదో తరగతి చదువుతోంది. ఇటీవల జరిగిన పరీక్షలో కాపీంగ్ చేస్తుందనే కారణంతో టీచర్ ఆ బాలికను కొట్టడంతోపాటు బట్టలు విప్పించారనేది ఆరోపణ.
విద్యార్థిని దళిత వర్గానికి చెందినదే కాబట్టి ఇలా చేశారని కొందరు విమర్శిస్తున్నారు.
టీచర్ చేసిన తీరుకు మనస్థాపానికి గురైన బాలిక ఆత్మహత్యకు పాల్పడినట్లుగా బంధువులు చెబుతున్నారు. ఆ అమ్మాయి శరీరం 70శాతం కాలిపోయినట్లు వైద్యులు చెబుతున్నారు.
ఈ ఘటనలో పోలీసులు కేసు నమోదు చేసి టీచర్‌ను అరెస్టు చేశారు.

ఫొటో సోర్స్, Mohammad Sartaj Alam
'ఇంట్లో అందరినీ బయటకు పంపి...'
బాధిత బాలిక రాధ సోదరి పూనం ముఖి చెప్పిన వివరాల ప్రకారం...
జంషెడ్‌పుర్‌లోని శారదమణి గర్ల్స్ హై స్కూల్ నుంచి శుక్రవారం సాయంత్రం రాధ ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన తరువాత 'మీ అందరినీ పెద్దమ్మ పిలుస్తోంది' అంటూ తన సోదరి పూనం ముఖీకి చెప్పింది.
దాంతో పూనం ముఖి మరో ఇద్దరు సిస్టర్స్‌తో కలిసి తమ పెద్దమ్మ ఇంటికి వెళ్లింది. కానీ నేను మిమ్మల్ని పిలవలేదంటూ వాళ్ల పెద్దమ్మ చెప్పింది.
పెద్దమ్మ ఆ మాట చెప్పిన వెంటనే పూనం ముఖీ తమ ఇంటికి పరుగులు తీసింది.
'మా వీధిలోకి నేను రాగానే రాధ అరుస్తూ నా వైపు పరుగులు తీస్తూ వచ్చింది. ఒంటి నిండా మంటలతో తను కాలిపోతూ ఉంది. నేను, పక్కింటిలోని ఆంటీ కలిసి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించాం.
తను ఇలా చేసుకుంటుందని నేను అనుకోలేదు. లేదంటే పెద్దమ్మ ఇంటికి వెళ్లేదాన్నే కాదు. మేమంతా పెద్దమ్మ ఇంటికి వెళ్లిన తరువాత తను ఇలా చేసింది' అని పూనం తెలిపారు.
ఆసుపత్రికి తీసుకెళ్లే దారిలో 'ఇలా ఎందుకు చేశావు?' అని రాధను అడిగినట్లు పూనం చెప్పారు.
'ఇవాళ పరీక్ష రాసేటప్పుడు నేను కాపీ చేస్తున్నానని చంద్ర దాస్ మేడం అనుమానించారు. ఆ కారణంతో ఆమె నన్ను దూషించారు. తీవ్రంగా కొట్టారు. క్లాసులో బాలికల అందరి ముందు నన్ను నిలబెట్టి బట్టలు విప్పించారు. అది నాకు చాలా అవమానంగా అనిపించింది. అందుకే ఇలా చేశాను' అని రాధ చెప్పినట్లు పూనం వివరించారు.
చావుబతుకుల్లో ఉన్న తన సోదరికి అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదని పూనం చెబుతున్నారు.
ప్రస్తుతం బాధిత బాలిక రాధకు టాటా స్టీల్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వారు పేద వాళ్లు కావడంతో ఉచితంగా వైద్యం అందించాల్సిందిగా ఈస్ట్ సింగ్‌భూమ్ కలెక్టర్‌కు లేఖ రాసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి నిర్మల బరేలియా బీబీసీకి తెలిపారు.
జిల్లా అధికారుల జోక్యంతో చికిత్స ఉచితంగానే అందిస్తున్నట్లు రాధ సోదరుడు సాగర్ తెలిపారు. ప్రస్తుతం బాలిక శరీరం 70శాతానికి పైగా కాలిపోయిందని, పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, MOhammad Sartaj Alam
బాధిత బాలిక క్లాస్‌మేట్స్ ఏమంటున్నారు?
బాధిత బాలిక రాధతోపాటు చదువుకుంటున్న విద్యార్థినుల్లో కొందరితో బీబీసీ మాట్లాడింది.
'రాధను బట్టలు విప్పమని చంద్ర దాస్ మేడం చెప్పినప్పుడు క్లాసులో సుమారు 50 మంది అమ్మాయిలు ఉన్నారు. అందరూ ఆ అమ్మాయిని చూసి నవ్వారు. అందువల్లే తను బాగా మనస్థాపానికి లోనైంది' అని రాధ క్లాస్‌మేట్ అనీశా సాహు తెలిపింది.
'బట్టలు విప్పించిన ఘటన తరువాత రాధను ప్రిన్సిపాల్ దగ్గరకు చంద్ర మేడం తీసుకెళ్లారు. ఆ తరువాత తిరిగి ఆ అమ్మాయిని ఎగ్జామ్ హాలులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు పరీక్ష రాసి చూపించు అంటూ మేడం అన్నారు. అప్పటికే రాధ ఎడుస్తూ ఉంది. భయంతో వణికిపోతూ ఉంది' అని మనీషా నాయక్ అనే స్టూడెంట్ చెప్పింది.
'బాలికలను చంద్ర మేడం ఎప్పుడూ వేధిస్తూ ఉంటారు. మేం ఇంట్లో చెప్పిన ప్రతిసారీ మా తల్లిదండ్రులు ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసేవారు. కానీ ఇవన్నీ చాలా చిన్న విషయాలని ప్రిన్సిపాల్ అనే వారు' అని మరొక విద్యార్థి ప్రియాంక కుమారి ఆరోపించారు.
జంషెడ్‌పుర్‌లోని ఛాయానగర్ బస్తీలో రాధ కుటుంబం ఉంటోంది. అక్కడ సుమారు మూడు వందల ఇళ్లు ఉంటాయి. వాటిలో పక్కా ఇళ్లు చాలా తక్కువ. రాధ ఇంటి పైకప్పు రేకులతో వేశారు.

ఫొటో సోర్స్, MOhammad sartaj alam
'10 ఏళ్ల కిందట తండ్రి చనిపోయాడు'
కూలీగా పని చేసే రాధ వాళ్ల నాన్న సుమారు 10 ఏళ్ల కిందట చనిపోయినట్లు వారి బంధువు లక్ష్మన్ ప్రసాద్ తెలిపారు. దాంతో నలుగురు కూతుళ్లు, ఒక కొడుకు బాధ్యత వారి తల్లి సరస్వతి దేవి మీద పడింది. ఒక ప్రైవేటు కంపెనీలో పని చేసే ఆమెకు నెలకు రూ.6వేల జీతం.
రాధ సోదరుడు సాగర్, చదువుకుంటూనే పని చేస్తున్నాడు. నలుగురు అమ్మాయిలు చదువుతున్నారు.
'సరస్వతి దేవి పిల్లలంతా బాగా చదువుకుంటారు. వాళ్లందరిలో కల్లా రాధ బాగా చదువుతుంది. పిల్లలను చదివించమని ప్రభుత్వం చెబుతోంది. మరి స్కూల్లో ఇలాంటి ఘటనలు జరిగితే పిల్లలను పంపించడానికి ఎవరు ధైర్యం చేస్తారు?' అని వాళ్ల పక్కింట్లో ఉండే అనిత ప్రామాణిక్ ప్రశ్నించారు.
ఈ ఘటన మీద నలుగురు సభ్యులతో విచారణకు కమిటీ వేశామని జిల్లా విద్యా అధికారి నిర్మల బరేలియా తెలిపారు.
అలాగే జంషెడ్‌పుర్‌లోని సీతారాం డేరా స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆమెను అరెస్టు చేసి జైలుకు తరలించినట్లు జషెండ్‌పుర్ ఎస్‌ఎస్‌పీ ప్రభాత్ కుమార్ బీబీసీతో చెప్పారు.
'రాధ దళిత వర్గానికి చెందిన బాలిక. పాఠశాలల్లో దళిత విద్యార్థుల మీద సవితి ప్రేమ చూపించడం చాలా సార్లు జరుగుతోంది' అని ముఖీ సముదాయానికి చెందిన మాజీ మంత్రి దులాల్ భుయాన్ అన్నారు.
గమనిక: గోప్యత కోసం బాధిత బాలిక పేరును రాధగా మార్చాం. ఇది ఆ అమ్మాయి అసలు పేరు కాదు.
ఇవి కూడా చదవండి:
- కాంతార మూవీ రివ్యూ: సినిమా అంతా ఒక లెవెల్లో ఉంటే చివరి పది నిమిషాలది మరో లెవెల్
- PM BJP-జనరిక్ మందులు: కీళ్ల నొప్పుల నుంచి క్యాన్సర్ చికిత్స దాకా ఏ మందులైనా 50 నుంచి 90 శాతం తక్కువ ధరకే.. అయినా వీటిని ఎందుకు కొనట్లేదు?
- Income Tax: ఆదాయ పన్నును మ్యాగ్జిమం తగ్గించుకోవడం ఎలా?
- ఆవు తేన్పుల మీద పన్ను... ఎక్కడ, ఎందుకు?
- బాలీవుడ్ ఎందుకు దక్షిణాది సినిమాల వెంట పడుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












