ఆంధ్రప్రదేశ్: గ్రామ పంచాయతీల్లోని నిధులు ఎలా మాయం అవుతున్నాయి, సర్పంచులు ఎందుకు రోడ్డెక్కారు

ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ
    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

"నా పేరు డి. రత్నబాబు. అధికార పార్టీ మద్దతుతో సర్పంచ్‌గా ఎన్నికయ్యాను. బాపట్ల జిల్లా పిడపర్రు గ్రామం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాను. సర్పంచ్‌గా ఎన్నికై రెండేళ్లు గడుస్తోంది. కానీ ఎటువంటి పనులు చేయలేకపోతున్నాం.

చివరకు మంచినీటి కోసం పంపుసెట్ రిపేర్ చేయించడానికి నిధులు లేవు. రోడ్డు పక్కన శుభ్రం చేయిద్దామంటే పంచాయతీ సిబ్బందికే జీతాలు చెల్లించలేని పరిస్థితి. అదనంగా ఖర్చు చేసేందుకు అవకాశం లేదు. అప్పటికీ ప్రజల నుంచి ఒత్తిడి రావడం వల్ల మా సొంతంగా కొన్ని పనులు చేసినా ఆ నిధులు కూడా విడుదల కావడం లేదు. అసలు ఎందుకు సర్పంచ్ అయ్యానో నాకే అర్థం కావడం లేదు."

ఇదీ ఓ సర్పంచ్ ఆవేదన. అందులోనూ వైఎస్సార్‌సీపీ తరపున గెలిచిన ప్రజాప్రతినిధి ప్రభుత్వ తీరు మీద ఈస్థాయిలో ఆందోళన వ్యక్తం చేయడం విశేషం.

ఆయన ఒక్కరే కాదు, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ అత్యధిక పంచాయతీల్లో ఈ సమస్య ఉంది. సర్పంచులు ఆందోళన చెందుతున్నారు. మేజర్ పంచాయతీలకు కొంత ఆదాయ మార్గాలున్నప్పటికీ చిన్న పంచాయతీలకు మాత్రం నిధుల సమస్య తీవ్రంగా ఉంది. అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న వారంతా పార్టీలకు అతీతంగా రాష్ట్ర ప్రభుత్వ వైఖరి మీద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ సర్పంచ్‌ల నిరసన

పంచాయతీ నిధులు మాయం

తమ పంచాయతీకి నిధులు అందుబాటులో ఉన్నాయనే ధీమాతో పనులు చేయాలని భావించిన తరుణంలో అకౌంట్ ఖాళీ అయిపోయిందని కడప జిల్లా జమ్మలమడుగు మండలం మొరగుడి సర్పంచ్ సీజే కొండయ్య అన్నారు. ఆయన కడప జిల్లా సర్పంచుల సంఘం కోశాధికారిగా కూడా ఉన్నారు.

"పంచాయతీలో జనరల్ ఫండ్ ఐదారు లక్షల వరకు మాత్రమే వస్తుంది. వాటితో సిబ్బంది జీతాలు, తాగునీటి సరఫరా, ఫాగింగ్ వంటి పనులు చేయడమే గగనం. అందుకే కేంద్రం నుంచి వచ్చే నిధులతో మాత్రమే కొన్ని పనులు చేయగలుగుతాం. కానీ ఇప్పుడు మాకు తెలియకుండానే, వచ్చిన నిధులు వచ్చినట్టే మాయమైపోతున్నాయి. మేం ఇక ఏం పని చేయగలం. ఇప్పటికే రూ.10 లక్షల వరకు పంచాయతీలో చేసిన పనులకు బిల్లులు పెండింగులో ఉన్నాయి. 2021 వరకు ఉన్న ఆర్థిక సంఘం నిధులు రూ. 80 లక్షలు మాయమయ్యాయి. ఇప్పుడు 15 ఆర్థిక సంఘం నిధులు మూడు రోజుల క్రితం రూ. 12.12 లక్షలు పడింది. అవి కూడా అకౌంట్‌లో ఉంటాయా? లేక మాయం అవుతాయా?అనేది తెలియడం లేదు. పంచాయతీలో తిరగలేకపోతున్నాం. మమ్మల్ని ఎన్నుకున్న ప్రజలకు ఏం సమాధానం చెప్పాలి" అంటూ కొండయ్య తన ఆవేదనను బీబీసీకి చెప్పారు.

8వేల జనాభా ఉన్న పంచాయతీలో పనులు జరగక ప్రజల ముందు తలెత్తుకోలేకపోతున్నామని ఆయన అన్నారు. రోజువారీ పనులకు కూడా నిర్వహణ ఖర్చులు లేవని తెలిపారు.

విజయవాడలో సర్పంచ్‌ల ఆందోళన
ఫొటో క్యాప్షన్, విజయవాడలో సర్పంచ్‌ల ఆందోళన

వాలంటీర్‌కు ఉన్న విలువ సర్పంచ్‌కి లేదు

పెద్దపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ ఆనెపు వరలక్ష్మీ కూడా తమ సమస్యల గురించి బీబీసీతో మాట్లాడారు.

''మా గ్రామ పంచాయతీ నిధులు ప్రస్తుతం సున్నా. 14వ ఆర్థిక సంఘం నిధులు మా గ్రామ పంచాయతీకి రూ. 8 లక్షలు వచ్చాయి. వచ్చినవి వచ్చినట్లే వెనక్కి వెళ్లిపోయాయి. అసలు అలా ఎందుకు జరిగిందో మాకు ఇప్పటికీ అర్థం కాలేదు'' అని ఆమె చెప్పారు.

7 గ్రామాలు, 4వేల జనాభా ఉన్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఈ పంచాయతీలో పారిశుద్ధ్య పనులు, సీసీ రోడ్లు, బోర్లు డ్రైనేజీ పనులు వంటి వాటి నిమిత్తం తాము రూ. 9 లక్షలు ఖర్చు చేసి అప్పుల పాలయ్యామని ఆమె తెలిపారు.

''కేంద్రం నిధులు విడుదల చేస్తున్నప్పటికీ ఎందుకు నిధులు రావడం లేదో తెలియడం లేదు. అసలు గ్రామ పంచాయతీ నిధులను విత్ డ్రా చేయాలంటే సర్పంచ్, పంచాయతీ రాజ్ కార్యదర్శి అనుమతి తప్పనిసరి. కానీ అసలు మా సంతకాలే లేకుండా గ్రామ పంచాయతీ అకౌంట్‌లోని డబ్బులు విత్ డ్రా అయిపోతున్నాయి. గ్రామ సచివాలయంలో పని చేస్తున్న వాలంటరి ఉద్యోగి సంతకానికి ఉన్నంత విలువ కూడా గ్రామ పంచాయతీ సర్పంచ్ సంతకానికి లేదు'' అని ఆవేదన వ్యక్తం చేశారు.

వీడియో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించాల్సిన పరిస్థితి వచ్చిందా?

అసలు సమస్య ఏంటి?

పంచాయతీలకు సొంతంగా పన్నుల రూపంలో వచ్చే ఆదాయం తక్కువగా ఉంటుంది. అందులోనూ మైనర్ పంచాయతీలకు నామమాత్రం. పంచాయతీ పరిధిలో చెరువులు, ఇతర మార్గాల ద్వారా లభించే ఆదాయం కూడా అత్యధిక పంచాయతీలకు స్వల్పంగా ఉంటుంది.

కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘాల తరపున విడుదల చేసే నిధులే పంచాయతీలకు ప్రధాన వనరులుగా మారాయి. అయితే కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా స్థానిక సంస్థలకు విడుదల చేసే ఆర్థిక సంఘం నిధులు దారి మళ్లిస్తున్నారనే ఆరోపణలున్నాయి. గత ప్రభుత్వ హయంలో కూడా ఇలాంటి ప్రక్రియ కొంత వరకు సాగింది.

గత మూడేళ్లుగా ఇది మరింత ఎక్కువగా కనిపిస్తోంది. మొత్తం నిధులన్నీ రాష్ట్ర ప్రభుత్వమే దారి మళ్లిస్తుందనే ఆరోపణలు పంచాయతీ ప్రతినిధుల నుంచి వస్తున్నాయి. ఇలాంటి సమస్య అనేక రాష్ట్రాల్లో పంచాయతీలు ఎదుర్కొంటున్నాయి. తెలంగాణాలో కూడా సర్పంచులు తమ నిధుల విషయమై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి మీద ఆందోళనలు నిర్వహించారు.

రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా నిధులు ఇతర ఖాతాలకు మళ్లించకుండా నేరుగా పంచాయతీలకు వాటిని అందించేందుకు అనుగుణంగా ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాలు తెరవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ట్రెజరీల ద్వారా నిధులు అందించే ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయనే విమర్శలు వస్తున్న తరుణంలో సొంతంగా పంచాయతీలకు ఖాతాలు తెరిచి వాటిలో జమచేయాలని కేంద్రం నిర్ణయించింది.

నిరసన వ్యక్తం చేస్తున్న సర్పంచులు

ఫొటో సోర్స్, UGC

సమస్య అలానే ఉంది..

కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో పంచాయతీలకు బ్యాంకు ఖాతాలు తెరిచినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో కాంప్రహెన్సివ్ ఫైనాన్స్ మేనేజ్ మెంట్ సిస్టమ్(సీఎఫ్ఎంఎస్) ద్వారా పంచాయతీల నిధులను పీడీ ఖాతాలకు మళ్లించడం మరో వివాదానికి దారి తీసింది.

ఈ ఆగస్టులోనే రెండు విడతలుగా నిధులు విడుదలయ్యాయి. 15వ ఆర్థిక సంఘం పేరుతో మొత్తం రూ. 948.35 కోట్లను కేంద్రం విడుదల చేసింది. ఆ నిధుల్లో పంచాయతీలకు 70 శాతం.. మండల, జిల్లా పరిషత్తులకు 15 శాతం చొప్పున చేరాల్సి ఉంది.

తొలి విడత నిధులు రూ. 379.34 కోట్లను పీడీ ఖాతాలకు మళ్లించాలని ఆదేశిస్తూ సెప్టెంబర్ 28న ఉత్తర్వులు ఇచ్చారు. దాంతో స్థానిక సంస్థలకు ఆర్థిక సంఘం కేటాయించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిందంటూ సర్పంచుల సంఘం ఆందోళనకు దిగింది.

"పంచాయతీలకు చేరాల్సిన నిధులపై రాష్ట్ర ప్రభుత్వాల తీరు మూలంగా కేంద్రం ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాలు తెరిచినప్పటికీ పీడీ ఖాతాల పేరుతో ఆ నిధులను మళ్లించడం అన్యాయం. పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేసే రీతిలో ఈ చర్య ఉంది. ఇప్పటికే పంచాయతీలకు సమాంతరంగా సచివాలయ వ్యవస్థ వచ్చింది. ఈ రీతిలో నిధులు పంచాయతీలకు చేరకుండా చేయడం ప్రజాస్వామ్య విరుద్ధం. స్థానిక ప్రభుత్వాలను బలోపేతం చేస్తేనే ప్రజలకు పాలన చేరువవుతుంది. కానీ అందుకు విరుద్ధంగా ఏపీలో ప్రభుత్వ తీరు ఉంది" అంటూ ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం ప్రతినిధి ఎం.వెంకట రమణా రెడ్డి అభిప్రాయపడ్డారు.

15వ ఆర్థిక సంఘం నిధులన్నీ పంచాయతీలకు కేటాయించాలని ఆయన కోరారు. ప్రభుత్వం తీరు మార్చుకోవాలని అన్నారు.

ధర్నా చేస్తున్న సర్పంచులు

ఫొటో సోర్స్, UGC

పీడీ ఖాతాలకు మళ్లిస్తే ఏమవుతుంది?

ఆర్థిక సంఘం కేటాయించిన నిధులన్నీ జిల్లా ట్రెజరీ అధికారి ద్వారా పీడీ ఖాతాలకు మళ్లించేలా జిల్లా పంచాయతీ అధికారులు బిల్లులు ఆమోదించాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

తద్వారా పంచాయతీ పాలకవర్గాల నిర్ణయంతో సంబంధం లేకుండా ఆ నిధులను విద్యుత్ బకాయిల కింద ప్రభుత్వం జమ చేసుకునే అవకాశం ఉంటుందనేది సర్పంచుల అభిప్రాయం. ఇప్పటికే గత ఏడాది నిధులను ఇదే రీతిలో విద్యుత్ బకాయిల పేరుతో జమ చేసుకున్నట్టు ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. అయినప్పటికీ తమ పంచాయతీల్లో విద్యుత్ బకాయిలు అలానే ఉన్నాయని కొందరు చెబుతున్నారు.

"పంచాయతీలు విద్యుత్ సంస్థలకు చెల్లించాల్సిన బకాయిల పేరుతో నిధులు జమ చేసుకుంటున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. కానీ రెండోవైపు కరెంటు బిల్లులు కట్టలేదని మాకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. మా పంచాయతీకి రావాల్సిన రూ. 16 లక్షలు ఆ విధంగా జమ చేసుకున్నారు. పంచాయతీలో కాలువలు శుభ్రం చేయాలన్నా, తుప్పలు కొట్టించాలన్నా చేతిలో పైసాలేకుండా పోయింది. వీధి దీపాల నిర్వహణలో ట్యూబ్ లైట్ మార్చాలన్నా కూడా పంచాయతీలో దిక్కులేకుండాపోయింది. ఇలా ఆర్థిక సంఘం నిధులు ప్రభుత్వమే జమ చేసుకుంటే పంచాయతీ పాలకవర్గాలు ఏమి చేయాలి" అంటూ అల్లూరి సీతారామరాజు జిల్లా టేకూరు సర్పంచ్ కె.మోషియా ప్రశ్నించారు.

తాము ఎన్నికైన నాటి నుంచి పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిధులు ఇవ్వలేదని, ఇప్పుడు మళ్లీ సచివాలయాల ద్వారా నిధులు కేటాయించి పంచాయతీ రాజ్ వ్యవస్థను పరిగణలోకి తీసుకోకుండా చేస్తోందని ఆయన వాపోయారు.

సర్పంచుల నిరసన

ఫొటో సోర్స్, UGC

రాజ్యాంగ విరుద్ధం అంటున్న ప్రతిపక్షాలు

కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తున్న నిధులను వాటాల ప్రకారం స్థానిక సంస్థలకు అందించాల్సి ఉండగా, వాటిని దారి మళ్లించే ప్రయత్నం రాజ్యాంగ విరుద్ధం అంటూ ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శిస్తున్నారు. ఇటీవల పంచాయతీ రాజ్ కమిషనర్ ఉత్తర్వులు ఉపసంహరించాలంటూ సర్పంచుల సంఘం పిలుపుతో తాడేపల్లిలోని కార్యాలయం ముట్టడించే ప్రయత్నం జరిగింది.

ఆ సందర్భంగా దాదాపు వివిధ జిల్లాల నుంచి వచ్చిన 50 మంది వరకూ సర్పంచులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంక్షలు ఉల్లంఘించారంటూ కొందరిపై కేసులు కూడా నమోదయ్యాయి.

"ఇదంతా ప్రభుత్వం ఏకపక్షంగా చేస్తున్న ప్రయత్నం. రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వం మాదిరిగానే పంచాయతీలకు స్థానికంగా పాలకవర్గాలను ప్రజలే ఎన్నుకున్నారు. వారికి కూడా హక్కులుంటాయి. స్థానిక ప్రభుత్వాల అధికారాలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి. కానీ అందుకు విరుద్ధంగా రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోంది. ఇలాంటి చర్యలు ప్రతీ ఏటా సాగించడం సరికాదు. కొన్ని పంచాయతీలకు ఎటువంటి ఆదాయం లేని పరిస్థితుల్లో పూర్తిగా ఆర్థిక సంఘం నిధుల మీదనే ఆధారపడి ఉంటాయి. అక్కడ పాలన పూర్తిగా నీరుగార్చేసేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది" అంటూ టీడీపీకి చెందిన స్థానిక సంస్థల మాజీ ఎమ్మెల్సీ వైబీ రాజేంద్ర ప్రసాద్ అన్నారు.

జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మైనర్ పంచాయతీలు నిధులు లేక అల్లడిపోతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ప్రభుత్వం రూ. 7వేల కోట్లకు పైగా నిధులు దారి మళ్లించిందని ఆరోపించారు.

వీడియో క్యాప్షన్, ఆరు నెలలుగా బాణసంచా తయారీ నిలిచిపోయింది. మాకు ఉపాధి లేదు

పల్లెల్లో అభివృద్ధి జరుగుతోంది..

గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు లేక నిలిచిపోయాయనే విమర్శలు అర్థరహితమంటూ ప్రభుత్వం చెబుతోంది. ఆర్థిక సంఘం నిధులను ఆయా పంచాయతీల అవసరాలకు మాత్రమే ఖర్చు చేస్తున్నట్టు ఏపీ ఉపముఖ్యమంత్రి, గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖల మంత్రి బూడి ముత్యాల నాయుడు చెబుతున్నారు.

"పంచాయతీలకు చెందిన విద్యుత్ బకాయిల విషయంలో గత ప్రభుత్వం తీరు వల్ల సమస్య వచ్చింది. దానిని సరిదిద్దే ప్రయత్నాలు చేస్తున్నాం. అటు విద్యుత్ సంస్థలు, ఇటు పంచాయతీలకు కూడా సమస్య రాకుండా చూస్తున్నాం. ప్రతీ సచివాలయం పరిధిలో ఇటీవల రూ. 20లక్షల చొప్పున వ్యయంతో అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. ప్రజల అవసరాలు తీర్చేందుకు ప్రయత్నిస్తున్నాం. అన్ని గ్రామాల్లో సచివాలయం, ఆర్బీకే, విలేజ్ క్లినిక్ వంటి వివిధ భవనాలు వచ్చాయి. ప్రజలకు అందుబాటులో ప్రభుత్వ కార్యక్రమాలు తీసుకెళ్లాం. పల్లెల్లో అభివృద్ధికి ఆటంకం లేదు" అంటూ ఆయన పేర్కొన్నారు.

పంచాయతీ సర్పంచులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మంత్రి బీబీసీకి తెలిపారు. రాజకీయ విమర్శలను ప్రజల హర్షించరని ఆయన అన్నారు.

(ఉత్తరాంధ్ర నుంచి లక్కోజు శ్రీనివాస్, రాయలసీమ నుంచి తులసీ ప్రసాద్ ఇన్‌పుట్స్‌తో)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)