‘మీకు అప్పు ఇస్తే తీర్చగలిగే శక్తి ఉందా?‘.. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై ఎస్‌బీఐ సందేహం - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, ccdmc.co.in
ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఆర్థిక సంస్థ లిమిటెడ్ (ఏపీపీఎఫ్‌సీఎల్)కు అప్పు పుట్టడం కష్టంగానే ఉందని 'ఈనాడు' ఒక కథనంలో పేర్కొంది.
ఆ కథనం ప్రకారం.. రుణానికి గ్యారంటీ ఇస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తున్నా కూడా అసలు అప్పును ఎలా తీర్చగలరంటూ ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) సందేహాలు వ్యక్తంచేస్తోంది.
''అసలు మీకు అప్పు ఇస్తే తీర్చగలిగే శక్తి ఉందా? అప్పుగా తీసుకున్న మొత్తంతో ఏం చేస్తారు? ఇప్పటికే తీసుకున్న అప్పుల ద్వారా ఏమైనా సంపాదిస్తున్నారా?'' అంటూ ఏపీపీఎఫ్‌సీఎల్‌ను సూటిగా ప్రశ్నించింది.
మరోవైపు.. రాష్ట్రంలో గత ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను తర్వాత వచ్చే ప్రభుత్వాలు గౌరవించడం లేదని.. రుణ మంజూరు విషయంలో దీనినీ పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని అంటూ సర్కారు మీదా పరోక్షంగా అనుమానాలు వ్యక్తంచేసింది.
రాష్ట్ర ప్రభుత్వ అప్పులు 2018-19 ఆర్థిక సంవత్సరానికి రూ. 2.52 లక్షల కోట్లు ఉన్నాయని.. 2020 నాటికి అవి రూ. 3 లక్షల కోట్లకు పెరుగుతాయని బ్రిక్‌వర్క్ సంస్థ నివేదిక ద్వారా తెలుస్తోందని ఎస్‌బీఐ తన లేఖలో ఉటంకించింది.
''2016-17 ఆర్థిక సంవత్సరంలో ఏపీపీఎఫ్‌సీఎల్ సంస్థ ప్రభుత్వ హామీతో తీసుకున్న రుణాలు రూ. 9,665 కోట్లు ఉంటే.. 2017-18 నాటికి అవి రూ. 35,964 కోట్లకు పెరిగాయని బ్రిక్‌వర్క్ నివేదిక సూచిస్తోంది. ప్రస్తుతం ఏపీపీఎఫ్‌సీఎల్ ప్రతిపాదించిన రూ. 3,000 కోట్ల రుణానికి ప్రభుత్వం హామీగా ఉండటం వల్ల రుణభారం అసాధారణంగా పెరుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని రుణం తిరిగి చెల్లించటం, అందుకు గల ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాలి'' అని ఎస్‌బీఐ పేర్కొంది.
ఈ మేరకు ఏపీపీఎఫ్‌సీఎల్ మేనేజింగ్ డైరెక్టర్‌కు ఎస్‌బీఐ ఒక లేఖ రాస్తూ తమ అనుమానాలకు సమాధానాలు ఇవ్వాలని కోరిందని ఈనాడు దినపత్రిక పేర్కొంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
విమానంలో ఆమ్లెట్‌లో పెంకులు వచ్చాయంటూ ఎంపీ ట్వీట్ - ఎయిర్ ఇండియా చర్యలు
విమానంలో ప్రయాణిస్తుండగా తనకు వడ్డించిన ఆమ్లెట్‌లో గుడ్డు పెంకులు వచ్చాయన్న ఎన్‌సీపీ ఎంపీ ఫిర్యాదు మేరకు ఎయిర్ ఇండియా చర్యలు తీసుకున్నదని ‘నమస్తే తెలంగాణ’ ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. గతవారం పుణె-ఢిల్లీ విమానానికి సరఫరా చేసిన ఆహార పదార్థాల మొత్తం ధరను, నిర్వహణ చార్జీలను క్యాటరింగ్ ఏజెన్సీలే భరించాలని ఆదేశించింది. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
ఎన్‌సీపీ రాజ్యసభ ఎంపీ వందనా చవాన్ గతవారం తాను ఎయిర్ ఇండియాలో ప్రయాణించినప్పుడు ఎదురైన అనుభవాన్ని ఆదివారం ట్విట్టర్‌లో వివరించారు.
'కొన్నాళ్ల కిందట ఎయిర్ ఇండియా విమానంలో పుణె నుంచి ఢిల్లీకి ప్రయాణించాను. బ్రేక్‌ఫాస్ట్ కోసం ఆమ్లెట్‌ను ఆర్డర్ చేశారు. సిబ్బంది నాకు నాణ్యత లేని ఆహారాన్ని సరఫరా చేశారు. ఆమ్లెట్ తింటుంటే చిన్న గుడ్డు పెంకులు తగిలాయి. పుచ్చిపోయిన ఆలుగడ్డలు, ఉడుకని గింజలు వచ్చాయి' అని ట్వీట్ చేశారు.
దీనికి ప్రధానమంత్రి కార్యాలయం, విమానయాన శాఖ మంత్రి, డీజీసీఏ, ఎయిర్‌ఇండియా చైర్మన్‌ను ట్యాగ్ చేశారు. వాస్తవాలను వారి దృష్టికి తెచ్చేందుకే ఈ పోస్ట్ పెట్టినట్టు చెప్పారు. చవాన్ ఫిర్యాదును ఎయిర్‌ఇండియా తీవ్రంగా పరిగణించింది. క్యాటరింగ్ ఏజెన్సీలకు జరిమానా విధించింది.

ఫొటో సోర్స్, Getty Images
వర్షంలో నడిపిస్తారా?: వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులపై రోహిత్ అసహనం
టీమిండియా క్రికెటర్లు విశాఖ విమానాశ్రయంలో వర్షంలో తడిశారని.. దీంతో రోహిత్ శర్మ అసహనానికి లోనయ్యాడని ఆంధ్రజ్యోతి ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. దక్షిణాఫ్రికాతో తొలి టెస్ట్‌లో విజయం సాధించిన కోహ్లీ బృందం పుణె వెళ్లేందుకు సోమవారం మధ్యాహ్నం 2.20కి ఎయిర్‌పోర్టుకు చేరుకుంది.
ఆ సమయంలో అక్కడ వర్షం కురుస్తోంది. పైకప్పులేని మూడో ప్లాట్‌ఫాం వద్ద తమ జట్టు బస్సు ఆగడంతో భారత క్రికెటర్లు, వారి కుటుంబ సభ్యులు వర్షంలో తడుచుకుంటూ ఎయిర్‌పోర్టు లోపలికి వెళ్లాల్సి వచ్చింది.
కెప్టెన్ కోహ్లీ తదితరులు తమ బ్యాగ్‌లను తలపై ఉంచుకొని పరుగుపరుగున లోపలికి వెళ్లారు. ఒకటో ప్లాట్‌ఫాంకు పైకప్పు ఉన్నా అప్పుడు అక్కడ సౌతాఫ్రికా జట్టు ఉండడంతో టీమిండియా బస్సును మూడో ప్లాట్‌ఫాం వద్దకు తీసుకొచ్చారు.
దీనిపై స్థానిక పోలీసు అధికారిని రోహిత్ శర్మ నిలదీశాడు. ఆ అధికారి సమాధానం చెబుతుండగా ‘వర్షంలో నడిపిస్తారా?’ అంటూ అసహనం వ్యక్తం చేస్తూ వేగంగా బస్సు దిగి ఎయిర్‌పోర్టులోకి వెళ్లిపోయాడు.

ఫొటో సోర్స్, Getty Images
హైదరాబాద్‌లో వీధి కుక్క చావుకు కారకుడైన డ్రైవర్ అరెస్ట్
నిర్లక్ష్యంగా కారు నడిపి ఓ కుక్క మరణానికి కారకుడైన క్యాబ్ డ్రైవర్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి డ్రైవర్‌ను అరెస్ట్ చేశారని ‘సాక్షి’ ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. సోమవారం ఉదయం ఎండీ అబ్దుల్ నయీం (24) బంజారాహిల్స్ రోడ్ నంబర్-2లోని కేబీఆర్ పార్కు వైపు నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వైపు క్యాబ్ డ్రైవ్ చేసుకుంటూ వేగంగా దూసుకెళ్తున్నాడు.
అదే సమయంలో కేబీఆర్ పార్కు ఫుట్‌పాత్ వైపు నుంచి ఓ వీధికుక్క రోడ్డు దాటుతుండగా నయీం చూసుకోకుండా ఢీకొట్టాడు. దీంతో ఆ కుక్క అక్కడికక్కడే చనిపోయింది.
కంపాషనేట్ సొసైటీ ఫర్ యానిమల్స్ స్వచ్ఛంద సంస్థకు చెందిన వలంటీర్ అజయ్ ఈ దృశ్యాన్ని చూశాడు. నయీం కారును అనుసరించి అతన్ని పట్టుకొని జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి ఫిర్యాదు చేశాడు.
కుక్క మరణానికి కారకుడైన డ్రైవర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆ సంస్థ చైర్మన్ ప్రవల్లిక ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు నయీంపై ఐపీసీ సెక్షన్ 429, సెక్షన్ 11(1)(ఏ)(ఎల్), ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాల్టీ యానిమల్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








