లక్నవరం లేక్ ట్రిప్: తెలుగు నేల మీద ఉన్న ఈ దీవులను చూస్తే విదేశీ యాత్రకు వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది

లక్నవరం

ఫొటో సోర్స్, Veena/BBC

    • రచయిత, వీణామాధురి సాదినేని
    • హోదా, బీబీసీ కోసం

పచ్చని చెట్లు..

ఎత్తైన కొండలు..

మధ్యలో సరస్సు,

ఆ సరస్సు మధ్యలో వేలాడే వంతెనలు.

లక్నవరం

ఫొటో సోర్స్, Veena/BBC

ఈ ప్రకృతి అందాలను ఆస్వాదించాలంటే లక్నవరం వెళ్లాల్సిందే.

వరంగల్ జిల్లాలో ఉండే ఈ లక్నవరం సరస్సులో హై సస్పెన్షన్ బ్రిడ్జి ప్రత్యేక ఆకర్షణ. నీటిపై తేలుతున్నట్లు కనిపించే ఈ వంతెనపై నడుస్తూ చుట్టూ ఉన్న కొండలను, దీవులను చూస్తుంటే హాయిగా అనిపిస్తుంది. బోటింగ్ చాలా హుషారుగా ఉంటుంది.

లక్నవరం

ఫొటో సోర్స్, Veena/BBC

కాకతీయ రాజుల కాలంలో ఈ సరస్సుపై ఎంతగానో శ్రద్ధ చూపారు. రైతుల కోసం, వ్యవసాయం కోసం ఉపయోగించిన ఈ సరస్సుపై తెలంగాణ స్టేట్ టూరిజమ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీఎస్‌టీడీసీ) ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి చేసింది.

లక్నవరం

ఫొటో సోర్స్, Veena/BBC

దాదాపు 10 వేల ఎకరాలకు ఇప్పటికీ ఈ సరస్సు నీరందిస్తోంది.

బ్రిడ్జి మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలుచుకునే గిరీష్ భరద్వాజ్ డిజైన్ చేసిన ఈ బ్రిడ్జి ఆధారంగానే ఇంకొక వంతెనను కూడా ప్రభుత్వం అక్కడ ఏర్పాటు చేస్తోంది.

లక్నవరం

ఫొటో సోర్స్, Veena/BBC

లక్నవరం ఎలా చేరుకోవాలి?

హైదరాబాద్ నుంచి విజయవాడ మార్గంలో వెళ్లే రైళ్లకు వరంగల్ ప్రధాన కూడలి. విజయవాడ వెళ్లే మార్గంలో వెళ్లే రైళ్లు ఎక్కిన వాళ్లు వరంగల్ లో దిగాలి. దిల్లీ వెళ్లే రైలు ఎక్కిన వాళ్లు కాజీపేట జంక్షన్ లో దిగాల్సి ఉంటుంది. ఇక హైదరాబాద్ నుంచి వరంగల్ కు బస్సులు ఉండనే ఉంటాయి. హైదరాబాద్, లక్నవరం మధ్య దూరం దాదాపు 210 కిలోమీటర్లు.

హైదరాబాద్ నుంచి వరంగల్‌కు రైలుకు అయితే మనిషికి 150 నుంచి 250 రూపాయలు వరకు అవుతుంది. బస్సు అయితే ఉప్పల్, హనుమకొండ నుంచి 80 నుంచి 100 రూపాయలు వరకు అవుతుంది. వరంగల్ నుంచి లక్నవరం చేరుకోవాలంటే 70 కి.మీ. ప్రయాణించాలి. ములుగు వరకు మాత్రమే బస్సులు ఉంటాయి ఆ తర్వాత ఆటోలు మాట్లాడుకుని వెళ్లాలి.

లక్నవరం

ఫొటో సోర్స్, Veena/BBC

సొంత వాహనాల్లో లేదా క్యాబ్స్‌లో వచ్చేవారు.. ములుగు డివిజన్ కేంద్రం దాటిన తరువాత గోవిందరావు పేట మండలంలోని చల్వాయి గ్రామం దగ్గర బుస్సాపూర్ కూడలి నుంచి కుడి వైపుగా ఎనిమిది కిలోమీటర్ల దూరం ప్రయాణించి లక్నవరం చేరుకోవచ్చు.

వానాకాలంలో కాకుండా ఎప్పుడైనా లక్నవరం పర్యటన పెట్టుకోవచ్చు. లక్నవరం సరస్సు చూడటానికి ప్రవేశ రుసుము పది రూపాయలు.

లక్నవరం

ఫొటో సోర్స్, Veena/BBC

ఉండటం, తినడం ఎక్కడ?

ఉండటానికి హరిత హోటల్స్ ఉన్నాయి. ప్రైవేట్ సదుపాయాలు కూడా ఉన్నాయి. హరిత హోటల్స్‌లో అయితే డార్మిటరీ రూమ్స్ ఏసీ, నాన్ ఏసీ ఉన్నాయి.

లక్నవరం

ఫొటో సోర్స్, Veena/BBC

ధరలు రూ.2,016 నుంచి రూ.3,150 వరకు ఉన్నాయి. వీటికి పన్నులు అదనం.

ఇక స్పెషల్‌గా గ్లాస్ రూమ్స్ కూడా ఉన్నాయి. వాటి ధర నాన్ ఏసీ అయితే రూ.3000 , ఏసీ అయితే రూ.5000. పన్నులు అదనం.

లక్నవరం

ఫొటో సోర్స్, Veena/BBC

రూమ్స్‌ను కచ్చితంగా ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకుని వెళ్లాలి. అక్కడికి వెళ్లే వరకు రూమ్‌లు ఉంటాయని గ్యారెంటీ ఉండదు.

పర్యటకుల తాకిడి ఎక్కువ కావడం వల్ల ఆన్‌లైన్‌లోనూ టికెట్స్ అందుబాటులో ఉంచారు.

లక్నవరం

ఫొటో సోర్స్, Veena/BBC

సమీపంలోని హోటల్‌లో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆహార పదార్థాలు అందుబాటులో ఉంటాయి. వీటిని ఆర్డర్ చేసుకుని తెప్పించుకోవచ్చు. బస చేయని సందర్శకులకు మాత్రం సాయంత్రం ఐదున్నర గంటల వరకు అక్కడ ఉండటానికి అనుమతి ఉంటుంది. విజిటర్స్ టైమింగ్స్ ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయత్రం 5:30 గంటల వరకు మాత్రమే.

ప్రభుత్వం చొరవతో లక్నవరంలో ఓ ప్రైవేట్ సంస్థ బోటింగ్, జిప్ సైక్లింగ్, నైట్ క్యాంపింగ్, జంగల్ సఫారీ లాంటివి అందిస్తోంది.

వీడియో క్యాప్షన్, లక్నవరం లేక్ ట్రిప్: కొండల మధ్య అందమైన సరస్సు.. మధ్యలో మూడు ద్వీపాలు

భద్రమేనా?

ఇక్కడ మూడు దీవులు ఉన్నాయి. వాటిని చేరుకునేందుకు లక్నవరం బ్రిడ్జి ద్వారా లోపలికి వెళ్లి బోట్ ఎక్కాలి. ఇక్కడకు వచ్చే పర్యటకుల భద్రత కోసం సిబ్బంది అప్రమత్తంగా ఉంటారు. ముఖ్యంగా మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు.

లక్నవరం

ఫొటో సోర్స్, Veena/BBC

ఇక్కడికి వచ్చినవారు ఏమంటున్నారు ?

“వరంగల్ ఎన్ఐటీ కాలేజీలో మా పాపకు అడ్మిషన్ కోసం వచ్చాం. లక్నవరం గురించి చాలా విన్నాం. సరే అని చూడటానికి వచ్చాము. ఇక్కడి వాతావరణం, ఈ హై సస్పెన్షన్ బ్రిడ్జి చాలా బాగున్నాయి. ఫుడ్ కొంచెం డిఫరెంట్‌గా ఉంది. కానీ బాగుంది” అని మహారాష్ట్రకు చెందిన షిందే చెప్పారు.

లక్నవరంలో బీబీసీ పర్యటిస్తున్నప్పుడు సరస్సు సందర్శనకు వచ్చిన మహిళల్లో ప్రియాంక ఒకరు. ఆమె లక్నవరం సమీప ప్రాంతంలోనే ఉంటారు.

ప్రియాంక, పర్యాటకురాలు

ఫొటో సోర్స్, Veena/BBC

ఫొటో క్యాప్షన్, ప్రియాంక, పర్యాటకురాలు

ప్రియాంక బీబీసీతో మాట్లాడుతూ- “ఇక్కడికి రావడం మాకు ఇది మొదటిసారి. చాలా సంతోషంగా ఉంది. కుటుంబంతో కలిసి రావడానికి లక్నవరం మంచి ఆప్షన్. మేం మా పాపను తొలిసారి బయటికి తీసుకొచ్చాం. తనకు ఈ ప్రాంతం చాలా బాగా నచ్చింది. ఇంత తక్కువ ఖర్చులో ఇలాంటి అందమైన ప్రదేశాన్ని చూడొచ్చని ఊహించలేదు” అని సంతోషం వ్యక్తంచేశారు.

లక్నవరం తనకు బాగా నచ్చిందని జీవన్ అనే సందర్శకుడు చెప్పారు. గ్లాస్ డోర్ రూమ్స్ అనుభూతి చాలా బాగుందని తెలిపారు. లక్నవరంలో అంతా బాగుందని, కానీ యాప్స్ పనిచేయక డిజిటల్ పేమెంట్స్ చేయడానికి, టికెట్ డబ్బులు చెల్లించడానికి ఇబ్బంది పడ్డామని చెప్పారు.

వీడియో క్యాప్షన్, తొమ్మిదో తరగతి చదివి, దేశాలన్నీ తిరుగుతూ నెలకు లక్షకు పైనే సంపాదిస్తున్న యువకుడు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)