ప్రెస్‌రివ్యూ: ఏపీలో ఒక్కొక్కరిపై రూ. 55,430 రుణభారం!

ఏపీ ప్రజలపై రుణభారం పెరిగిపోయింది. ఆంధ్రప్రదేశ్ అప్పు రూ. 2.49 లక్షల కోట్లకు చేరింది. గత ఏడాది కన్నా ఇది రూ. 33 వేల కోట్లు ఎక్కువ.
ప్రభుత్వం తీసుకున్న అప్పుల ప్రభావం రాష్ట్ర ప్రజలపై పడుతోంది. ఒక్కొక్కరిపై రూ. 55,430 రుణ భారం పడుతోంది అని ప్రజాశక్తి ఒక కథనం ప్రచురించింది.
గత ఏడాది ఒక్కొక్కరిపై రూ. 48 వేల రుణ భారం ఉండగా.. అది ఈసారి మరింత పెరిగింది.
తాజా బడ్జెట్ ప్రతిపాదనల్లో ఏపీ అప్పులు రూ. 2,49,435 కోట్లుగా లెక్క తేల్చారు. ఇది మొత్తం జీఎస్‌డీపీలో 28.66 శాతంగా ఉంది.
గత బడ్జెట్‌లో రూ. 2,16,026 కోట్ల అప్పులుండగా ఈ ఏడాది అవి రూ. 2.49 లక్ష కోట్లకు చేరుకున్నాయి.
తాజా అప్పుల్లో మార్కెట్ రుణాల ద్వారా రూ.1.57 లక్షల కోట్లు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రుణాలు రూ. 9,218 కోట్లు, ఇతర సంస్థల నుంచి తీసుకున్నవి రూ. 15,028 కోట్లు, చిన్న మొత్తాల పొదుపు నుంచి రూ. 12,367 కోట్లు, పీఎఫ్ ఖాతాల నుంచి రూ. 15,272 కోట్లు, డిపాజిట్లు, ఇతర నిధుల నుంచి తీసుకున్నవి రూ. 39,770 కోట్లుగా ఉన్నాయి.
గత ఏడాది బడ్జెట్‌లో మొత్తం అప్పును రూ.2.16 లక్షల కోట్లుగా చూపించగా, సవరణ అంచనాల్లో అది రూ. 2.25 లక్షల కోట్లకు చేరినట్లు ఏపీ ప్రభుత్వం తాజా గణాంకాల్లో వివరించింది.

ఫొటో సోర్స్, Prasit photo
ఆడవారికి సగం ధరకే శానిటరీ ప్యాడ్లు!
ఆడవారి ఆత్మగౌరవం కోసం మహిళలకు సబ్సిడీపై శానిటరీ ప్యాడ్లు సరఫరా చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినట్లు ఆంధ్రజ్యోతి ఒక కథనం ప్రచురించింది.
ఆ కథనం ప్రకారం.. రూ.120 కోట్ల వ్యయంతో 50 శాతం సబ్సిడీపై మహిళలకు శానిటరీ ప్యాడ్లు పంపిణీ చేయనున్నట్లు సీఎం తెలిపారు.
ఇందులో భాగంగా మాతాశిశు ఎక్స్‌ప్రెస్, మహిళలకు మాస్టర్ హెల్త్ చెకప్, అమ్మకు వందనం వంటి పథకాలను అమలు చేస్తున్నట్లు సీఎం వివరించారు.
తాడేపల్లిలోని తన నివాసంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. విద్యతోనే మహిళా సాధికారికత సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.
మహిళల్లో రాజకీయ చైతన్యం రావాలన్నారు. చట్టసభల్లో మహిళా సభ్యుల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందన్నారు. దీనికిగాను 33 శాతం మహిళా రిజర్వేషన్ అమలు కావాలని స్పష్టంచేశారు.

ఫొటో సోర్స్, Getty Images
కర్ణాటక రాష్ట్రం కోసం ప్రత్యేక మువ్వన్నెల జెండా!
కర్ణాటక రాష్ట్రం కోసం రూపొందించిన ప్రత్యేక మువ్వన్నెల జెండాను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆవిష్కరించారని ఈనాడు ఒక కథనం ప్రచురించింది. దాని ప్రకారం..
'కర్ణాటకకు ప్రత్యేక పతాకం కన్నడిగులందరి ఆకాంక్ష. ఇందుకు మా ప్రభుత్వం కూడా గొంతు కలిపింది. రాష్ట్రానికి ప్రత్యేకంగా జెండా ఆవిష్కరించాం' అని సిద్ధరామయ్య వివరించారు.
'ఇదివరకటి కన్నడ బావుటాలో ఉన్న ఎరుపు, పసుపు రంగులతో కొత్తగా తెలుపు రంగును చేర్చారు.
తెలుపు శాంతికి సంకేతం. తెలుపు రంగులో ప్రభుత్వ లాంఛనాన్ని ముద్రించాం. ప్రత్యేక జెండాను గుర్తించాల్సిందిగా కోరుతూ కేంద్రానికి ప్రతిపాదన పంపిస్తాం. దేశంలోకెల్లా కర్ణాటకకే ప్రత్యేక బావుటా ఉంది. ఇది కన్నడిగుల ఉనికికి సూచిక. రాష్ట్రాలు ప్రత్యేకంగా బావుటాల్ని కలిగి ఉండరాదనే ఆంక్షలేవీ రాజ్యాంగంలో లేవు. జాతీయ పతాకం కంటే కాస్త దిగువనే రాష్ట్ర జెండా ఎగురుతుంది'అని సిద్ధరామయ్య పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Thinkstock
వైఫై ఆపేసిందని చితకొట్టాడు!
అశ్లీల చిత్రాలు చూడొద్దంటూ వైఫై ఆపేసిన భార్యను ఓ భర్త చితకొట్టాడంటూ ఈనాడు కథనం రాసింది. దాని ప్రకారం..
ఉమర్‌పాషా (30), రేష్మాసుల్తానా దంపతులు హైదరాబాద్ దుండిగల్ ఠాణా పరిధిలోని ఖైజర్‌నగర్‌లో నివసిస్తున్నారు. ఉమర్‌పాషా డ్రైవర్‌గా పనిచేస్తున్నారు.
పంజాగుట్ట పోలీసుల కథనం ప్రకారం.. బుధవారం అర్ధరాత్రి ఉమర్‌పాషా ఇంటికి వచ్చి తన మొబైల్‌లో అశ్లీల చిత్రాలు చూస్తున్నాడు. చూడొద్దని రేష్మ చెప్పింది. ఇంకా అలానే చూస్తుండటంతో వైఫై బంద్ చేసింది.
దీంతో కోపోద్రిక్తుడైన ఉమర్‌పాషా కర్రతో ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఛాతిపై పిడిగుద్దులతో దాడి చేసి, సున్నిత ప్రదేశాల్లో కర్రతో తీవ్రంగా కొట్టాడు.
ఆమె పడిపోవడంతో పుట్టింట్లో వదిలేసేందుకు బలవంతంగా కారులో ఖైరతాబాద్‌లోని రాజ్‌నగర్‌కు తీసుకెళ్లాడు. కారు నడుస్తుండగానే అందులోంచి తోసేసి వేగంగా వెళ్లిపోయాడు.
కుమార్తె పరిస్థితి చూసి ఆందోళన చెందిన తల్లి షబానా మొదట దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు యత్నించారు. అక్కడ సరైన స్పందన లేదని పంజాగుట్ట ఠాణాను ఆశ్రయించారు.
పంజాగుట్టలో కేసు నమోదు చేసిన పోలీసులు బాధితురాలిని సోమాజిగూడ యశోదా ఆసుపత్రిలో చేర్పించారు.
ఆడపిల్లలు పుట్టారని తరచూ భర్త వేధిస్తున్నాడని షబానా పోలీసులకు తెలిపారు.
8 నెలల క్రితం జన్మించిన చివరి పాపను తమకు తెలియకుండా ఉమర్ పాషా ఎవరికో ఇచ్చాడని చెప్పారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








