Tea: ఇష్టం వచ్చినప్పుడల్లా తాగడం భవిష్యత్తులో కష్టమవుతుందా, తేయాకు దిగుబడి తగ్గడానికి కారణాలేంటి

దేబజానీ

ఫొటో సోర్స్, नितिन श्रीवास्तव

ఫొటో క్యాప్షన్, దేబజానీ
    • రచయిత, నితిన్ శ్రీవాస్తవ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఉదయం 6.30 అయింది. అస్సాంలో బరాక్ లోయలో ముందురోజు రాత్రి కురిసిన వర్షం నీటిబొట్లు ఇంకా చెట్లు, మొక్కల ఆకులపై కనిపిస్తున్నాయి.

సిల్‌చర్ పట్టణం నుంచి ఈ టీ తోటలకు చేరుకోవడానికి గంట సమయం పడుతుంది. ఈ టీ తోటల వెనుక ప్రాంతం నుంచి దట్టమైన పొగ ఆకాశంలోకి వస్తోంది.

తేయాకు

ఫొటో సోర్స్, Getty Images

ఇక్కడున్న ఇళ్ల నుంచి మంచి ఆహారం వండుతున్న వాసనలు వస్తున్నాయి. ఇక్కడుండే ప్రజల్లో చాలా మంది చుట్టుపక్కల తేయాకు తోటల్లోనే పనిచేస్తారు.

అలా టీ తోటల్లో పనిచేసేవారిలో 52ఏళ్ల దేబజానీ ఒకరు. త్వరగా వంట పూర్తిచేసుకొని తేయాకు తోటల్లో పనిచేయడానికి వెళ్లాలనే తొందరలో ఉన్నారామె.

అయితే, ఇదివరకు ఉన్నంత పని, ఇప్పుడు ఆమెకు దొరకడం లేదు. నేడు వారిని కొత్త సమస్యలు వెంటాడుతున్నాయి. ఎంతో కష్టించి పనిచేసే వారి చేతులకు నేడు సరిగ్గా పనిదొరకడం లేదు.

‘‘విపరీతమైన వర్షాల వల్ల తేయాకు తోటల్లో కీటకాల బెడద కూడా ఎక్కువ అవుతోంది. ఇప్పటికే తగ్గిపోతున్న దిగుబడిపై ఇది మరింత ప్రభావం చూపుతోంది. ఫలితంగా ఆకులను సేకరించే పని కూడా తగ్గిపోతోంది. ఇవన్నీ జీతాలు తగ్గించడానికి కారణం అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మేం ఏం మాత్రం చేయగలం?’’అని ఆమె ప్రశ్నించారు.

తేయాకు

ఫొటో సోర్స్, NITIN SRIVASTAVA

తగ్గిపోతున్న టీ

ఉదయం, సాయంత్రం కాస్త ప్రశాంతంగా ఉండేందుకు, రీఫ్రెష్ అయ్యేందుకు తాగే టీ ఎలా మన దగ్గరకు వస్తోందో ఎప్పుడైనా ఆలోచించారా?

మన కప్‌ల వరకు వచ్చేందుకు టీ ఎంతో దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. ఒకవేళ టీ ఉత్పత్తి తగ్గిపోయి, మార్కెట్‌లో దీని లభ్యత పడిపోతే ఎలా?

నిజమే మనం తీసుకునే టీ దిగుబడి ఇటీవల కాలంలో క్రమంగా తగ్గిపోతోంది. ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా పండించే తేయాకుపై వాతావరణ మార్పుల ప్రభావం నేడు స్పష్టంగా కనిపిస్తోంది.

ప్రస్తుతం భారత్‌లోని ఈశాన్య ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువయ్యాయి. దీంతో ఇక్కడి మట్టిలో తేమ శాతం పెరుగుతోంది.

కొండల ఎత్తు తక్కువగా ఉండటంతోపాటు చిన్నచిన్న లోయలుండే ఈ ప్రాంతాలు తేయాకు పండించడానికి చక్కగా సరిపోతాయి.

విష్ణు సౌతాల్

ఫొటో సోర్స్, नितिन श्रीवास्तव

ఫొటో క్యాప్షన్, విష్ణు సౌతాల్

తేయాకు పరిశ్రమ

కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఉష్ణోగ్రతలు 35 నుంచి 37 డిగ్రీల కంటే ఎక్కువకు వెళ్లిపోతున్నాయి. దీంతో తేయాకు తోటలపై ప్రభావం పడుతోంది.

తేయాకు దిగుబడి తగ్గిపోవడంతో దేబజాని లాంటి తేయాకు కార్మికుల జీవితాలు ప్రభావితం అవుతున్నాయి.

గత 23ఏళ్లుగా అస్సాం కోఛార్ జిల్లాలోని డోలూ తేయాకు తోటల్లో విష్ణు సౌతాల్ పనిచేస్తున్నారు.

మిగతా కార్మికుల్లానే ఆయన కూడా మొక్కల నుంచి ఆకులను వేరుచేసి, దగ్గరల్లోని తేయాకు పరిశ్రమలకు వాటిని రవాణా చేస్తుంటారు.

‘‘ఈ సారి మొక్కలకు ఆకులు మరీ తగ్గిపోయాయి. దీంతో కార్మికులకు సరిగ్గా పని దొరకడం లేదు. రోజంతా పనిచేస్తే దాదాపు 23 కేజీల ఆకులను సేకరించగలం. అప్పుడు మాకు 212 రూపాయల వేతనం ఇస్తారు. ఒక్కోసారి మాకు పనే దొరకడం లేదు’’అని ఆయన చెప్పారు.

తేయాకు

ఫొటో సోర్స్, NITIN SRIVASTAVA

లైను

భారత్‌లో తేయాకు పంటలకు 200 ఏళ్ల చరిత్ర ఉంది.

అప్పటి బ్రిటిష్ పాలకులు మొదట దార్జీలింగ్‌లో తేయాకు తోటలను పెంచడం మొదలుపెట్టారు. ఆ తర్వాత అస్సాంకు కూడా ఈ తోటలను విస్తరించారు. చైనాలో తేయాకు తోటలను తగ్గించాలని అక్కడి పాలకులు నిర్ణయం తీసుకోవడమే దీనికి కారణం.

ఏటా 50 లక్షల టన్నుల తేయాకును భారత్ పండిస్తోంది. బ్లాక్ టీ ఉత్పత్తిలో భారత్ మొదటి స్థానంలో ఉంది. మొత్తంగా టీ ఉత్పత్తిలో చైనా తర్వాత స్థానం భారత్‌దే.

అయితే, గత కొన్ని సంవత్సరాలుగా వాతావరణం వేగంగా మారుతోంది. ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల టీ దిగుబడి తగ్గిపోతోంది.

లైను
భాస్కర్ ప్రసాద్ చాలిహా

ఫొటో సోర్స్, NITIN SRIVASTAVA

ఫొటో క్యాప్షన్, భాస్కర్ ప్రసాద్ చాలిహా

వాతావరణ మార్పులు

2021తో పోల్చినప్పుడు ప్రస్తుతం తూర్పు బెంగాల్, దక్షిణ అస్సాంలో రెండింతలు ఎక్కువగా వర్షాలు పడ్డాయి. సిల్‌చార్ లాంటి పట్టణాలు కొన్ని రోజులపాటు నీటిలో మునిగే స్థాయిలో వర్షాలు కురిశాయి.

దీనివల్ల తేయాకు వ్యాపారంతో ముడిపడిన ప్రజల జీవితాలపై తీవ్రమైన ప్రభావం పడుతోంది. ఇండియన్ టీ అసోసియేషన్ సెక్రటరీ భాస్కర్ ప్రసాద్ చాలిహా సమాచారం ప్రకారం.. అస్సాం-మిజోరం సరిహద్దుల్లోని బరాక్ లోయలో 2012లో 5.68 కోట్ల కేజీల తేయాకు ఉత్పత్తి అయ్యింది. 2021నాటికి ఈ మొత్తం 4.27 కోట్ల కేజీలకు పడిపోయింది.

‘‘ఇక్కడ ఏడు నెలలుపాటు వర్షాలు పడతాయి. అయితే, సంవత్సరం కాలంలోనే కురిసేంత వర్షపాతం ఈ ఏడు నెలల్లో నమోదు అవుతోంది. దీని వల్ల పొలాల్లోని మట్టి పైపొరలు కొట్టుకుపోతున్నాయి. ఫలితంగా ఏటా 2.5 శాతం చొప్పున తేయాకు దిగుబడిలో తగ్గుదల కనిపిస్తోంది. దీనికి వాతావరణ మార్పులే కారణం. ఇలానే వదిలేస్తే 50 ఏళ్లలో ఇక్కడ తేయాకు పంటలు కనుమరుగు అవుతాయి’’అని ఆయన చెప్పారు.

కమల్‌జీత్ తేలి

ఫొటో సోర్స్, Nitin srivastava

ఫొటో క్యాప్షన్, కమల్‌జీత్ తేలి

బరాక్ లోయ

భారత్‌లోని ఈశాన్య ప్రాంతాల్లో పది వేలకుపైగా తేయాకు తోటలు ఉన్నాయి. మొత్తం తేయాకు దిగుబడుల్లో పశ్చిమ బెంగాల్‌, అస్సాం, సిక్కిం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్‌ల వాటా 80 శాతం వరకు ఉంటుంది.

పది లక్షల మందికిపైగా ఇక్కడి ప్రజలు తేయాకు తోటలపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరి పూర్వీకులు బ్రిటిష్ పాలనా కాలంలో భిన్న ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. భిన్న సంస్కృతులకు చెందిన వీరు నేడు స్థానిక ప్రజల్లో మమేకమై ఉంటారు.

వీడియో క్యాప్షన్, కొన్ని ఆహార పదార్థాలు ఆకలిని నియంత్రిస్తాయా, పరిశోధనల్లో ఏం తేలింది?

కమల్‌జీత్ తేలి తో మాట్లాడినప్పుడు బహుశా తమ తాతలు బిహార్ నుంచి ఇక్కడకి వలస వచ్చి ఉండొచ్చని చెప్పారు. వంద ఏళ్ల నుంచి తరతరాలుగా తమ పూర్వీకులు బరాక్ లోయలో పనిచేస్తున్నట్లు ఆయన వివరించారు.

‘‘నా చిన్నప్పుడు ఇక్కడి తేయాకు తోటల్లో పనిచేయడానికి సిబ్బంది సరిగా దొరకేవారుకాదు. కానీ, నేటి పరిస్థితి పూర్తిగా వేరు. తోటలు తగ్గిపోతున్నాయి. దిగుబడులు పడిపోతున్నాయి. దీంతో ఇక్కడ మా ఉపాధిపై ప్రభావం పడుతోంది. మాకు వేరే ఏ పని చేయడం తెలియదు’’అని ఆయన అన్నారు.

వీడియో క్యాప్షన్, రూ.3,000 తో కోళ్ల పెంపకం మొదలుపెట్టిన పేద రైతు, ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నారు

ఇక్కడి తేయాకు కార్మికులు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తక్కువ వేతనాలకు పనిచేయడం, పారిశుద్ధ్య సదుపాయాల కొరత లాంటి చాలా సమస్యలు వారిని వేధిస్తున్నాయి.

అసలు వాతావరణ మార్పులతో ఎలా పోరాడాలో వారికి అర్థం కావడం లేదు. నేడు తేయాకు దిగుబడి తగ్గిపోవడంతో వారి మొహాల్లో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది.

తేయాకు దిగుబడి తగ్గిపోవడంపై ఏళ్ల నుంచి అస్సాం యూనివర్సిటీలోని ఎన్విరాన్‌మెంట్ డిపార్ట్‌మెంట్ డీన్ ప్రొఫెసర్ జయశ్రీ రౌత్ పరిశోధన చేపడుతున్నారు.

‘‘తేయాకులో మనకు 50కిపైగా రసాయనాలు కనిపిస్తాయి. ఇవి టీకు ప్రత్యేక రుచిని తీసుకొస్తాయి. అయితే, వర్షాలతోపాటు ఉష్ణోగ్రతలు కూడా పెరగడం వల్ల తేయాకులోని రసాయనాలతోపాటు యాంటీ-యాక్సిడెంట్లు కూడా తగ్గిపోతున్నాయి. ఫలితంగా దిగుబడి కూడా తగ్గుతోంది’’అని రౌత్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)