మునుగోడు: ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల ఖర్చు పరిమితి ఎంత? ఓటర్లకు డబ్బులు పంచితే ఎన్నికల సంఘం విధించే శిక్ష ఏంటి?

voter

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సురేఖ అబ్బూరి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మునుగోడు ఎన్నికలలో ఎవరు పోటీచేస్తున్నారు, ఎవరు గెలుస్తారనేదే కాదు అక్కడ ఓటర్లను ఆకట్టుకోవడానికి పార్టీలు ఏం చేస్తున్నాయి, ఎలాంటి పాట్లు పడుతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది.

ఎప్పటిలా డబ్బు, మద్యమే కాదు ఈ ఎన్నికలలో బంగారం కూడా ఓటర్లను ఆకట్టుకునే సాధనంగా మారిపోయింది. ముఖ్యంగా మహిళలను ఆకట్టుకునేందుకు బంగారమూ పంచుతున్నారనీ ఆరోపణలు వస్తున్నాయి.

అందుకే... మునుగోడు ఉప ఎన్నిక అత్యంత ఖరీదైన ఎన్నిక అంటున్నారు విశ్లేషకులు.

మరి, ఎలక్షన్ కమిషన్ నిబంధనలు ఏం చెబుతున్నాయి? మునుగోడులో ఈ నిబంధనలు పట్టించుకుంటున్నారా? పట్టించుకోకపోతే చర్చలేం ఉండవా? అసలు మునుగోడులో ఓటర్ల లెక్కలేంటో చూద్దాం..

వీడియో క్యాప్షన్, ఫోన్ నుంచి ఓటు ఎలా వేయొచ్చు? ఇందుకోసం ఓటర్లు ఏం చేయాలి?
red line

మునుగోడు నియోజకవర్గం

మునుగోడు నియోజకవర్గం నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో విస్తరించి ఉంది.

మండలాలు: 7

ఓటర్ల సంఖ్య: 2,41,367 (ఎన్నికల కమిషన్ లెక్కల ప్రకారం)

పోలింగ్ కేంద్రాలు: 298

red line

1) సామాజిక సమీకరణలు

ఓటర్లలో ఎక్కువ శాతం మంది ఇక్కడ బీసీ వర్గాలకు చెందినవారు.

గౌడ్, ముదిరాజ్ కమ్యూనిటీలు ఓటర్లలో దాదాపు 30 % ఉండగా, యాదవులు దాదాపు 10% ఉన్నారు.

పద్మశాలి ఓటర్లు 5% మంది ఉన్నారు. రెడ్డి సామాజికవర్గం ఓటర్లలో దాదాపు 3.5% ఉండగా, ఎస్సీ ఓటర్లు 16.5%. ఎస్టీలు 10% ఉన్నారు. ముస్లింల ఓట్ల శాతం దాదాపు 3.5%. మిగిలిన ఓటర్లలో కమ్మలు, మున్నూరుకాపులు, వెలమలు, ఇతర కులాల వారు ఉన్నారు.

ఓటర్లు

ఫొటో సోర్స్, Getty Images

2) ఈసారి ఎందుకింత ఆసక్తి

ఉప ఎన్నికలను పార్టీలు అన్ని సందర్భాలలోనూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవు. కానీ, తెలంగాణలో గత మూడు ఉప ఎన్నికలను పరిశీలిస్తే దేనికదే రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపే స్థాయిలో సాగాయి. మునుగోడు ఉప ఎన్నిక విషయంలోనూ పార్టీలు అంతే పట్టుదలగా ఉన్నాయి.

టీఆర్ఎస్, కాంగ్రెస్ తమ బలాన్ని కొనసాగించాలనే పట్టుదలతో ఉంటే.. బీజేపీ మాత్రం పార్టీ విస్తరణ వ్యూహాలతో సాగుతోంది. 2023 ఎన్నికలలో వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకునే దిశగా పార్టీని బలీయం చేయడానికి ఈ ఎన్నికను ఉపయోగించుకోవాలని చూస్తోంది.

‘మూడు ప్రధాన పార్టీలకు రాజకీయ భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికగా మారింది. అందుకే ఎన్ని వందల కోట్లు ఖర్చుపెట్టి అయినా గెలవాలనే పరిస్థితి మూడు పార్టీలకు ఏర్పడింది’ అన్నారు రాజకీయ విశ్లేషకుడు కటారి శ్రీనివాస్.

బీబీసీతో మాట్లాడిన ఆయన... ‘‘ఒక వైపు కాంగ్రెస్ తన సిటింగ్ స్థానాన్ని పోగొట్టుకోకూడదు అన్న పట్టుదలతో ఉంది, అందుకే ఆ పార్టీ తన ప్రచారంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, ప్రజలకు ద్రోహం చేశారంటూ ఆరోపిస్తోంది. మునుగోడు నుంచి అత్యధికసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పాల్వాయి గోవర్దన్ రెడ్డి కుమార్తె స్రవంతికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి ఉద్ధృతంగా ప్రచారం చేస్తోంది ఆ పార్టీ. మరోవైపు బీజేపీ కేసీఆర్ పాలనపై విమర్శలు చేస్తూ మోదీ పాలనలోనే అభివృద్ధి సాధ్యమంటూ ఓట్లు అడుగుతోంది. ఇక పాలక టీఆర్ఎస్ 2014లో గెలిచిన కూసుకుంట్లకు మరో ఛాన్స్ ఇవ్వాలంటూ ఓట్లు అడుగుతోంది. అదే సమయంలో బీజేపీ, కాంగ్రెస్‌లపై విమర్శలు కురిపిస్తోంది’ అంటూ మునుగోడులో పార్టీల ప్రచార తీరును విశ్లేషించారు.

500

ఫొటో సోర్స్, Getty Images

3) ఖరీదైన ఎన్నికలు ఇవేనా

ఎన్నికలలో డబ్బు, మద్యం పంపిణీ అన్నది దాచలేని నిజం అంటున్నారు విశ్లేషకులు.

గత మూడు ఉపఎన్నికలలో వందల కోట్లలో ఖర్చుపెట్టిన పార్టీలు , ఇప్పుడు ఆ వందల కోట్లను వేల కొట్లాగా మారుస్తున్నాయి అంటున్నారు వారు.

సాధారణ ఎన్నికలు దగ్గర పడే కొద్దీ, ఉప-ఎన్నికలలో గెలుపే లక్ష్యముగా పార్టీలు ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనుకాడట్లేదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు కటారి శ్రీనివాస్.

‘అయిదేళ్లకోసారి వచ్చే సాధారణ ఎన్నికల్లో ఇంత ఖర్చు ఉండదు. ఉప ఎన్నికలకు వచ్చేసరికి పార్టీలు సర్వశక్తులూ కేంద్రీకరిస్తున్నాయి .ఈ ఎన్నికలు సాధారణ ఎన్నికలకు పైలట్ ఎన్నికలుగా భావిస్తున్నారు. ప్రధాన పార్టీలు ఒక్కొక్కటి రూ. 300 కోట్ల నుంచి రూ. 500 కోట్లు ఈ ఒక్క ఉప ఎన్నికకు ఖర్చు పెడుతున్నాయి. ప్రత్యర్థి పార్టీల నేతలను కొనడానికే కాకుండా సొంత పార్టీలోని నేతలు చేజారకుండా కూడా భారీ మొత్తాలు ఖర్చు చేస్తున్నారు’’ అన్నారు శ్రీనివాస్.

ECI

ఫొటో సోర్స్, Getty Images

4) నిబంధనలు ఏం చెబుతున్నాయి?

ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం.. అసెంబ్లీ ఎన్నికలలో పెద్ద రాష్ట్రాలలో అయితే ఒక్కో అభ్యర్థి గరిష్ఠంగా రూ. 40 లక్షలు, చిన్న రాష్ట్రాలలో అయితే గరిష్ఠంగా రూ. 28 లక్షలు ఖర్చు చేయొచ్చు.

పార్లమెంటు స్థానాల విషయానికొస్తే పెద్ద రాష్ట్రాలలో ఒక్కో అభ్యర్థి గరిష్ఠంగా రూ. 95 లక్షలు , చిన్న రాష్ట్రాలలో అయితే రూ. 75 లక్షలు ఖర్చుపెట్టవచ్చు.

మద్యం

ఫొటో సోర్స్, Getty Images

5) ఎంత నిఘా పెట్టినా

నిబంధనలు ఉల్లంఘిస్తే ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? గతంలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎన్నికల సంఘం చర్యలు తీసుకుందా?

దీనిపై న్యాయవాది రచన రెడ్డి ‘బీబీసీ’తో మాట్లాడారు.

‘తెలంగాణలో గతంలో ఒక పార్లమెంట్ స్థానానికి జరిగిన ఎన్నికలలో డబ్బులు పంచారని కేసు నమోదు కాగా ఓ అభ్యర్థి దోషిగా తేలారు. ఆయనపై చర్యలు తీసుకున్నారు కానీ ఎన్నికల కమిషన్ ఆ అభ్యర్థిని అనర్హులుగా ప్రకటించలేదు. అయితే ఎన్నికల కమిషన్ అభ్యర్థులు ప్రచారానికి ఎంత ఖర్చుపెడుతున్నారు అనేదానిపై ఎప్పుడు కఠినమైన నిఘా ఉంచుతుంది . అభ్యర్థులపై నిఘా ఉంచడానికి ఎన్నికల పరిశీలకులు ఉంటారు. ఎన్నికల ప్రచారంలో డబ్బులు చేతులు మారకుండా , మద్యం సరఫరా కాకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి వ్యయ పరిశీలకులు టీం, వీడియో సర్వేలెన్సు టీమ్స్, వీడియో రివ్యూయింగ్ టీమ్స్ , అకౌంటింగ్ టీమ్స్ , కంప్లైంట్ మోనిటరింగ్ , కాల్ సెంటర్ మోనిటరింగ్ టీమ్స్ వంటివి పనిచేస్తాయి. ఎప్పటికప్పుడు అభ్యర్థులు వారి పార్టీ పెట్టె ఖర్చు , వారి కార్యకలాపాలపై ఒక కన్ను వేసే ఉంచుతారు . అంతేకాకుండా మీడియా మోనిటరింగ్ టీమ్స్, పెయిడ్ న్యూస్‌ ఖర్చుల వివరాలూ సేకరిస్తుంటారు. అయినప్పటికీ అభ్యర్థులు విచ్చలవిడిగా డబ్బులు, మద్యం పంచుతున్నారు’ అన్నారు రచనా రెడ్డి.

ఎంపీ మాలోత్ కవిత

6) ఓటర్లకు డబ్బులు పంచిన కేసులో తెలంగాణ ఎంపీకి జైలు శిక్ష

2019 ఎన్నికల సందర్భంగా ఓటర్లకు రూ.500 చొప్పున పంచుతూ పట్టుబడిన కేసులో మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవితకు స్పెషల్ సెషన్స్ కోర్టు 2021 జూలై నెలలో రూ.10 వేలు జరిమానా, ఆరు నెలలు జైలు శిక్ష విధించింది.

మాలోత్ కవిత అనుచరుడు, టీఆర్ఎస్ నాయకుడు షౌకత్ అలీని ఎన్నికల సంఘం ఫ్లయింగ్ స్క్వాడ్‌లు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాయి. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో షౌకత్ అలీని మొదటి ముద్దాయిగా, ఎంపీ మాలోత్ కవితను రెండవ ముద్దాయిగా పేర్కొన్నారు.

ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఓటర్లను ప్రలోభపెట్టిన అభ్యర్థులకు శిక్షగా గరిష్ఠంగా రూ.10 వేల జరిమానా కానీ, ఆరు నెలల జైలు శిక్ష కానీ, రెండూ కలిపి కానీ విధించవచ్చు.

కాగా, ఎన్నికలు శాంతియుతంగా జరగాలనే అంశంపైనే ఎన్నికల సంఘం, పోలీసులు ఎక్కువ శ్రద్ధ పెడుతుంటారని, ప్రలోభాలను పట్టించుకోరని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

తనకు జరిమానా, జైలు శిక్ష విధించడంపై మాలోత్ కవిత తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. స్పెషల్ సెషన్స్ కోర్టు తీర్పును రద్దు చేస్తూ, ఎంపీకి ఉపశమనం కలిగిస్తూ 2021 సెప్టెంబర్‌లో హైకోర్టు తీర్పు చెప్పింది.

వీడియో క్యాప్షన్, ఓటర్ ఐడీని ఆధార్ నంబర్‌తో అనుసంధానించే చట్టాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎందుకు తెస్తోంది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)