వారణాసి: ప్రధాని మోదీ లోక్‌సభ నియోజకవర్గంలో ఎంఎల్‌సీ ఎన్నికల్లో బీజేపీ ఎందుకు ఓడిపోయింది?

మోదీ

ఫొటో సోర్స్, Reuters

    • రచయిత, అనంత్ ఝణాణే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఉత్తర్‌ప్రదేశ్ శాసన మండలిలోని 36 స్థానాలకు మంగళవారం జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 33 స్థానాలను కైవసం చేసుకుంది.

అయితే, వారణాసి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన బీజేపీ అభ్యర్థి సుదామా పటేల్‌ మాత్రం స్వతంత్ర అభ్యర్థి అన్నపూర్ణా సింగ్ చేతిలో ఓటమి పాలయ్యారు.

అన్నపూర్ణా సింగ్‌కు మొత్తంగా 4,234 ఓట్లు వచ్చాయి. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఉమేశ్ యాదవ్‌కు 345 ఓట్లు రాగా, సుదామా పటేల్‌కు 170 ఓట్లు వచ్చాయి. తూర్పు ఉత్తర్ ప్రదేశ్‌లో ‘‘బాహుబలి’’గా పిలుచుకునే బ్రిజేశ్ సింగ్ భార్య అన్నపూర్ణా సింగ్.

ఎంఎల్‌సీ ఎన్నికల్లో బీజేపీ ఏకపక్షంగా విజయం సాధించినప్పటికీ, వారణాసిలో పార్టీ ఓటమి గురించే ఎక్కువగా మీడియాలో చర్చ జరుగుతోంది. దీనిపై చాలా ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.

ప్రధానమంత్రి సొంత నియోజకవర్గమైన వారణాసిలో బీజేపీ అభ్యర్థి ఎందుకు ఓడిపోయారు?

సుదామా

ఫొటో సోర్స్, Twitter/Sudama Patel

సుదామా ఏమంటున్నారు?

ఉత్తర్‌ప్రదేశ్ శాసన మండలిలోని 100 సీట్లలో 36 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషించే పంచాయతీలు, నగరపాలికల్లో బీజేపీకి మంచి పట్టుంది. అయినప్పటికీ వారణాసిలో బీజేపీ ఓటమి పాలైంది.

అయితే, ప్రస్తుతం జైలులోనున్న అన్నపూర్ణా సింగ్ భర్త బ్రిజేశ్ తన ధన బలాన్ని ఉపయోగించి ఎన్నికల్లో విజయం సాధించారని సుదామా ఆరోపించారు.

‘‘అలాంటి మాఫియా నాయకుడి భార్య బరిలో ఉండటంతో చాలా మంది కార్యకర్తలు పనిచేయడానికి ముందుకు రాలేదు’’అని ఆయన విలేఖరులతో సుదామా చెప్పారు.

‘‘ఆయన వారణాసి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఆయన్ను కలవడానికి చాలా మంది జైలుకు వెళ్తున్నారు. నాకు ఎవరైనా మద్దతు పలికితే, అక్కడి నుంచి బెదిరింపులు వస్తాయి.’’

‘‘ఆయన్ను కలవడానికి ఎవరెవరు వెళ్తున్నారంటే ఏం చెబుతాను? మీకు తెలుసు. వారు డబ్బులు పంచారు. వారి దగ్గర కోట్ల రూపాయల నల్ల ధనముంది. డబ్బులు పంచడం వారికి పెద్ద లెక్కేమీ కాదు. కానీ, నాలాంటి కార్యకర్తల దగ్గర అంత డబ్బు ఎలా ఉంటుంది?’’అని ఆయన ప్రశ్నించారు.

బ్రిజేశ్‌పై జిల్లా అధికారులకు తాను ఫిర్యాదు చేస్తానని సుదామా అన్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తోనూ ఈ విషయంపై మాట్లాడతానని అన్నారు.

ఎన్నికల ఫలితాల రోజు బీజేపీ మీకు పూర్తిగా సహకరించలేదా? అని సుదామాను విలేఖరులు ప్రశ్నించారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. ‘‘అలా ఏమీ లేదు. పార్టీనే నాకు టికెట్ ఇచ్చింది. వారు చేయాల్సిందంతా చేశారు’’అని ఆయన వివరించారు.

‘‘ఈ ఎన్నికల్లో మాఫియా పాత్ర ఉంది. ఇది ప్రజలకు చెడు సందేశాన్ని ఇస్తోంది. డబ్బుంటే ఏదైనా చేయొచ్చనే సందేశం దీని ద్వారా ప్రజల్లోకి వెళ్తోంది’’అని ఆయన అన్నారు.

యోగి, మోదీ

ఫొటో సోర్స్, ANI

అన్నపూర్ణా సింగ్ ఏం అంటున్నారు?

అయితే, ఎన్నికల్లో గెలిచిన బ్రిజేశ్ భార్య అన్నపూర్ణా సింగ్.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు క్రెడిట్ ఇచ్చారు.

మోదీ, అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్‌ల అడుగుజాడల్లో నడుచుకుంటానని ఆమె అన్నారు.

‘‘సుదామా ఆరోపణలు నిరాధారమైనవి. మేం ఎలాంటి ధన బలాన్ని ఉపయోగించలేదు. ఆయన ఎలాంటి ఆరోపణలైనా చేసుకోవచ్చు. అది ఆయన ఇష్టం. కానీ, ప్రజలు మమ్మల్ని అభిమానిస్తున్నారు. మేం అభివృద్ధి కార్యక్రమాలపైనే దృష్టి పెడతాం’’అని ఆమె వివరించారు.

అన్నపూర్ణా సింగ్

ఫొటో సోర్స్, Aman

ఫొటో క్యాప్షన్, అన్నపూర్ణా సింగ్

బ్రిజేశ్ ఎవరు?

బ్రిజేశ్ సింగ్‌తోపాటు ఆయన కుటుంబ నేపథ్యంపై వారణాసికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ అసద్ కమల్ లారీ బీబీసీతో మాట్లాడారు.

‘‘ప్రస్తుతం అన్నపూర్ణ గెలిచిన ఈ నియోజకవర్గానికి గత ఎంఎల్‌సీ బ్రిజేశ్. ఆయన పదవి కాలం పూర్తైంది. ఇదివరకు బ్రిజేశ్ సోదరుడు ఉదయనాథ్ కూడా ఇక్కడి నుంచే ఎంఎల్‌సీగా పనిచేశారు. మరోవైపు బ్రిజేశ్ మేనల్లుడు సుశీల్ సింగ్.. సయ్యద్‌రాజా స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన కుటుంబానికి చెందిన చాలా మంది ప్రస్తుతం వివిధ పదవుల్లో ఉన్నారు’’అని కమల్ చెప్పారు.

గత 24 ఏళ్లుగా వారణాసి ఎంఎల్‌సీ స్థానాన్ని బ్రిజేశ్ కుటుంబమే గెలుచుకుంటూ వస్తోంది.

‘‘ఇక్కడ ఎంఎల్‌సీ, ఎమ్మెల్యే, జిల్లా పంచాయతీ, బ్లాక్ ప్రముఖ్ స్థాయిల్లో ప్రతినిధులున్న ఏకైక కుటుంబం ఇదే అయ్యుండొచ్చు. బ్రిజేశ్ మేనల్లుడు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.’’

వీడియో క్యాప్షన్, యోగి ఆదిత్యనాథ్: విద్యార్థి నాయకుడి నుంచి 'ముఖ్యమంత్రీ మహారాజ్' వరకు..

ఈ సారి కూడా బ్రిజేశ్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు. దీని కోసం నామినేషన్ కూడా వేశారు. అయితే, చివరి నిమిషంలో నామినేషన్ వెనక్కి తీసుకొని, తన భార్యతో మళ్లీ నామినేషన్ వేయించారు.

ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో తనపై ఎనిమిది క్రిమినల్ కేసులు ఉన్నట్లు బ్రిజేశ్ వెల్లడించారు. ఆయనపై హత్య, హత్యాయత్నం లాంటి ఆరోపణలు కూడా ఉన్నాయి.

బ్రిజేశ్ మేనల్లుడు ఎమ్మెల్యే అయినప్పుడు.. బీజేపీ సుదామాకు ఎందుకు టికెట్ ఇచ్చింది? అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.

‘‘బ్రిజేశ్ జైలులో ఉన్నారు. అందుకే ఆయన మేనల్లుడు బీజేపీ టికెట్‌పై పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు బ్రిజేశ్ భార్యకు బీజేపీ టికెట్ ఇవ్వలేదు. ఎందుకంటే ఒకే కుటుంబంలో అంత మందికి టికెట్ ఇవ్వడం సరికాదని బీజేపీ భావించి ఉండొచ్చు. దీంతో ఆమె స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేశారు’’ అని కమల్ లారీ చెప్పారు.

వీడియో క్యాప్షన్, రూ. 50కే చీప్ లిక్కర్ ఇస్తాం: సోము వీర్రాజు

బీజేపీ ఏమంటోంది?

బీజేపీ ఓటమితో ఇక్కడ చాలా ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయని సీనియర్ జర్నలిస్టు కమల్ లారీ అన్నారు.

‘‘రాష్ట్రంలోని నగర పంచాయత్, నగర పాలిక, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో బీజేపీ గెలిచింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమెకు ఓట్లు వేసింది కూడా బీజేపీ మద్దతున్నవారేనా? అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది’’అని ఆయన చెప్పారు.

మరోవైపు స్వతంత్ర అభ్యర్థి చేతిలో బీజేపీ అభ్యర్థి ఓడిపోయిన స్థానం ఇదొక్కటేనని వివరించారు.

ధన బలం ఉపయోగించారన్న వార్తలపై స్పందిస్తూ.. ‘‘అధికారిక పార్టీ అభ్యర్థి ఓడిపోయినప్పుడు కూడా ప్రత్యర్థి ధన బలం వల్లే ఓడిపోయారని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది’’అని కమల్ వ్యాఖ్యానించారు.

సుదామా ఓటమిపై పార్టీ అధికార ప్రతినిధి రాకేశ్ త్రిపాఠి మాట్లాడుతూ.. ‘’36 సీట్లలో 33 చోట్ల గెలిచి బీజేపీ చరిత్ర సృష్టించింది. సుదామా ఓటమిపై సమీక్ష చేస్తాం. అయితే, అన్ని ఫలితాలను చూసుకుంటే బీజేపీకి ఇవి పూర్తి అనుకూలమైనవిగా భావించొచ్చు’’అని అన్నారు.

‘‘మాకు ప్రతి సీటూ ముఖ్యమైనదే. ఒక సీటును వీఐపీ సీటని.. వేరొకటి సాధారణ సీటని మేం అనుకోము. ప్రతి సీటూ దేనికదే ప్రత్యేకమైనది. ఓటమి పాలైనప్పుడు కారణాలు ఏమైనా, మేం సమీక్షిస్తాం’’అని ఆయన వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)