అఖిలేష్ రాజకీయ చదరంగంలో తండ్రి ములాయంకు సరితూగలేకపోయారా?

అఖిలేష్‌తో ములాయం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అఖిలేష్‌తో ములాయం
    • రచయిత, రేహాన్ ఫజల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

యోగి ఆదిత్యనాథ్ కంటే ఏడాది చిన్నవాడైన 48 ఏళ్ల అఖిలేష్ యాదవ్ ఆయన్ను తిరిగి గోరఖ్‌పూర్‌కు పంపిస్తాననే నినాదంతో ఎన్నికల బరిలోకి దిగారు. కానీ అలా చేయలేకపోయారు.

2017లో వచ్చినన్ని స్థానాలు గెలుచుకోకపోయినా, భారీ ఆధిక్యం సాధించిన బీజేపీ 1985 తర్వాత ఉత్తర్‌ప్రదేశ్‌లో వరుసగా రెండోసారి ఎన్నికల్లో గెలిచిన పార్టీగా చరిత్ర సృష్టించింది.

అఖిలేష్ యాదవ్ నేతృత్వంలో సమాజ్‌వాదీ పార్టీ ఇప్పటివరకూ మూడు ఎన్నికల్లో పోటీ చేసింది 2017 అసెంబ్లీ, 2019 లోక్‌సభ, 2022 అసెంబ్లీ ఎన్నికలు. ఈ మూడింటిలో ఆయన అంచనాలకు తగినట్లు సీట్లు సాధించలేకపోయారు.

2012లో ఎన్నికల్లో ఆయన కచ్చితంగా గెలిచారు. కానీ ఆ ఎన్నికల్లో ఆయన తన తండ్రి ములాయం సింగ్ యాదవ్ నేతృత్వంలో పోటీచేశారు.

"ఈసారీ ఎన్నికల్లో ఆయన తన రాజకీయేతర టీమ్‌పై అవసరం కంటే ఎక్కువ నమ్మకం ఉంచారు. రాజకీయ వ్యూహాల విషయంలో తండ్రితో పోటీపడలేకపోయారు. మొత్తం ఎన్నికల ప్రచారంలో అఖిలేష్ వన్ మాన్ ఆర్మీలా పనిచేశారు. తన తండ్రిలా రెండో శ్రేణి నేతలకు నాయకత్వం ఇవ్వకపోవడమే కాదు, వారిని ఆ దరిదాపుల్లోకి కూడా రానీయలేదు" అని అఖిలేష్ విమర్శకులు అంటున్నారు.

వీడియో క్యాప్షన్, లఖీంపుర్ ఖేరీ: రైతులను జీపుతో తొక్కించారంటూ వీడియో వైరల్

ములాయం తిరుగులేని రాజకీయాలు

ప్రముఖ జర్నలిస్ట్, ద ప్రింట్ ఎడిటర్ శేఖర్ గుప్తా చాలా ఏళ్ల క్రితమే ములాయం సింగ్ యాదవ్‌కు 'మెరిసే రాజకీయ వేత్త' అనే మాట ఉపయోగించారు.

2012లో ఆయన కన్నోజ్ నుంచి తన కోడలు అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్‌ గెలుపు ఖాయం చేయడమే ఆయన రాజకీయాల పదునెంతో చెబుతాయి. అది కూడా ఇప్పటి రాజకీయాల్లో అసలు ఊహించలేని విధంగా జరిగింది.

ఉత్తరప్రదేశ్ రాజకీయాలను నిశితంగా గమనించే హిందుస్తాన్ టైమ్స్ స్థానిక జర్నలిస్ట్ సునీతా ఎరాన్ తన అఖిలేష్ యాదవ్ విండ్స్ ఆఫ్ చేంజ్‌లో ఆ విషయం చెప్పారు.

"ఆమెకు వ్యతిరేకంగా ఏ రాజకీయ పార్టీ కూడా తమ అభ్యర్థిని దించలేదు. ఆయన శత్రువు అయిన మాయావతి కూడా ఎవరినీ నిలబెట్టలేదు. డింపుల్ మీద బీజేపీ జగదేవ్ యాదవ్‌ను తమ అభ్యర్థిగా రంగంలోకి దించింది. కానీ యాదృచ్చికంగా ఆయన కూడా తన నామినేషన్ వేయడానికి సమయానికి అక్కడికి చేరుకోలేకపోవడంతో ఆమె విజయానికి అడ్డే లేకుండాపోయింది.

వీడియో క్యాప్షన్, హాథ్‌రస్ కేసు: 'ఆమె కరోనాతో చనిపోతే పరిహారం వచ్చేదా అని కలెక్టర్ అన్నారు'

ములాయంతో పోలిస్తే అఖిలేష్‌కు అనుభవం లేదు

ఒకప్పుడు ములాయం సింగ్ యాదవ్‌కు అత్యంత సన్నిహితుడు, ఇటీవలే సమాజ్‌వాదీ పార్టీ వదిలి బీజేపీలో చేరిన నరేంద్ర బాటీ కూడా ఒక విషయం చెప్పారు.

"ములాయం సింగ్, అఖిలేష్ యాదవ్ నాయకత్వానికి అసలు పోలికే లేదు. ములాయం పొలాల్లో నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన పేదరికాన్ని చాలా దగ్గరనుంచి చూశారు. ఆయనకు ప్రతి దాని గురించీ తెలుసు. ఆయన పార్టీ ప్రతి కీలక నిర్ణయాన్ని సీనియర్ నేతలను సంప్రదించి తీసుకునేవారు. పార్టీకి కార్యకర్తలు ఎంత ముఖ్యం అనేది ఆయనకు తెలుసు" అన్నారు.

"అఖిలేష్ ఆస్ట్రేలియా నుంచి చదువుకుని వచ్చారు. తర్వాత నేత అయ్యారు. ఆయనకు రాజకీయాల్లో ఎలాంటి అనుభవం లేదు. రెండు, మూడు వందల కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేస్తే ఎవరైనా నేత అయిపోతారా? ఓట్లు ఎక్కడ నుంచి వస్తాయో ఆయనకు తెలీదు. 2017, 2019 ఎన్నికల్లో అనుభవం ఎస్పీ 'సింగిల్ హాండ్ పార్టీ' అయిపోయిందనే విషయం చెబుతోంది. ఇప్పుడు పార్లమెంటరీ బోర్డు కూడా లేదు"

"రాజకీయాలతో దాదాపు ఏ సంబంధం లేనివారు చెప్పిన వారికే ఆయన టికెట్లు ఇచ్చారు. ఆయన మొదట ముఖ్తార్ అన్సారీని పార్టీలోచేర్చుకోడానికి వ్యతిరేకించినా, తర్వాత అఖిలేష్ ఆయన కుటుంబాన్ని పార్టీలో చేర్చుకున్నారు" అంటారు బాటీ.

మాయావతితో అఖిలేష్ పొత్తు

ఫొటో సోర్స్, Getty Images

అఖిలేష్ కూటమి రాజకీయాలపై ప్రశ్నలు

గత మూడు ఎన్నికల్లోనూ కూటమి ఏర్పాటు చేసిన అఖిలేష్ అధికారం దక్కించుకోవాలని ప్రయత్నించారు. 2017లో కాంగ్రెస్‌తో, తర్వాత 2019లో పార్టీ ప్రధాన శత్రువు మాయావతితో పొత్తు కుదుర్చుకున్నారు. అధికారంలో ఉంటూ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవానలే అఖిలేష్ నిర్ణయంపై ఎంతోమంది రాజకీయ విశ్లేషకులు ప్రశ్నలు లేవనెత్తారు. దానివల్ల అఖిలేష్ ఒంటరిగా తన విజయాల గురించి ప్రజల ముందుకు వెళ్లే ఆత్మవిశ్వాసం లేదనే సందేశం వెళ్తుందని అభిప్రాయపడ్డారు.

2017లో మొదటిసారి ఆ పార్టీకి ఎప్పుడూ లేని విధంగా 50 కంటే తక్కువ సీట్లు వచ్చాయి.

కాంగ్రెస్‌తో పొత్తుపై గానీ, 2019లో బహుజన్ సమాజ్ వాదీ పార్టీతో పొత్తు గురించి ఆయన తండ్రి ములాయం సింగ్ యాదవ్ పెద్దగా ఉత్సాహం చూపించలేదు. లోక్‌సభ ఎన్నికల ప్రచారం సమయంలో అయితే, నరేంద్ర మోదీ మళ్లీ గెలవాలని ఆయన అభినందనలు కూడా తెలిపారు.

రాజకీయంగా నిలదొక్కుకోడానికి కొడుకు అఖిలేష్ అన్ని శక్తులూ ఒడ్డుతున్న అదే ఎన్నికల సమయంలో ఆయన మోదీ విజయం సాధించాలని కోరుకున్నారు.

అంటే, ఆ సమయంలో ములాయం సింగ్ యాదవ్ నోరు జారారా? కానీ ఉత్తరప్రదేశ్ రాజకీయాలను గమనించే చాలామంది రాజకీయ విశ్లేషకులు అలా భావించడం లేదు.

బీఎస్పీతో పొత్తుతో తాను సంతోషంగా లేననే విషయాన్ని ఆయన ఈ వ్యాఖ్య ద్వారా తన కొడుక్కు చెప్పాలనుకున్నారని వారంతా భావిస్తున్నారు. నిజానికి ఆ ఎన్నికల్లో చాలా దూకుడుగా ప్రచారం చేసినప్పటికీ అఖిలేష్ ఓడిపోయారు. ఆయన కూటమి కూడా పరాజయం పాలవడంతో మాయావతి స్వయంగా ఆయన పార్టీతో పొత్తు తెంచుకున్నారు.

అఖిలేష్ యాదవ్

ఫొటో సోర్స్, TWITTER/ AKHILESH YADAV

పార్టీ ఫిరాయింపుదారులకు టికెట్లు ఇవ్వడం ప్రజలకు మింగుడు పడలేదు

ఈ ఎన్నికల్లో అఖిలేష్ కోర్ టీమ్‌లో ఉదయవీర్ సింగ్, రాజేంద్ర చౌధరి, అభిషేక్ మిశ్రా, నరేష్ ఉత్తమ్ పటేల్ లాంటి వారు ఉన్నారు. వారి ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఎస్పీ టికెట్ల పంపిణీ చేసింది. కొన్ని స్థానాల్లో ఆ పార్టీ కొత్త అభ్యర్థులను బరిలోకి దించింది.

ఫలితంగా ఆ టికెట్ ఆశించిన వారు పార్టీ అధికారిక అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేయడం లేదంటే తమ పార్టీని వదిలి మరో పార్టీలో చేరడం జరిగింది. దాంతో పార్టీ అభ్యర్థులు ఓటమి రుచిచూడాల్సి వచ్చింది.

ఎన్నికల ప్రచారంలో సభలకు భారీగా జనాన్ని తీసుకొచ్చినా, మీడియా ఆయనకు మద్దతివ్వడంలో వెనకాడడం కనిపించింది. చివరి సమయంలోబీజేపీ నుంచి వచ్చిన కొందరు మంత్రులను ఆయన తమ పార్టీలో చేర్చుకోవడంతోపాటూ వారికి టికెట్ ఇవ్వడం ప్రజలకు మింగుడుపడలేదు. స్వామీ ప్రసాద్ మౌర్య స్వయంగా ఫాజీల్‌నగర్ నుంచి ఓడిపోయారు. తన వదిన అపర్ణా యాదవ్ ఎస్పీ వదిలి బీజేపీలో చేరినప్పుడు కూడా ఆమెను అడ్డుకోడానికి అఖిలేష్ ఎలాంటి ప్రయత్నాలూ చేయలేదు.

అఖిలేష్‌తో ములాయం

ఫొటో సోర్స్, Getty Images

చిన్న పార్టీలతో పొత్తు, ఆశించిన ఫలితాలు రాలేదు

ఎన్నికల ప్రచారం సమయంలో ఆయన మిగతా బంధువులు కూడా నామమాత్రంగా ప్రచారం చేశారు. ఆయన చిన్నాన్న శివపాల్ సింగ్ తన నియోజకవర్గంతోపాటూ ఒకటి రెండు సభల్లో పాల్గొన్నారు.

ఈ ఎన్నికల్లో అఖిలేష్ ములాయం సింగ్‌ను ప్రచారం కోసం ఒప్పించలేకపోయారు. ఆయన కేవలం రెండు ప్రాంతాల్లో మాత్రమే ప్రచారం చేశారు. అయితే ఆయనకు 84 ఏళ్లు వచ్చేశాయి. వేదికపై ఆయన కనపడ్డం వల్ల కేవలం సమాజ్ వాదీ పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపుండేది.

తన కుటుంబ సభ్యులను ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంచిన అఖిలేష్ యాదవ్, బహుశా బీజేపీ తనపై మోపిన బంధుప్రీతి ఆరోపణలను తుడిచిపెట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ దానివల్ల ఆయనకు రాజకీయంగా చాలా నష్టం జరిగింది.

బీజేపీని అనుసరించిన అఖిలేష్ కొన్ని చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. అయినా ఎన్నో ఆశలు పెట్టుకున్న నాన్ యాదవ్, వెనకబడిన వర్గాల ఓట్లు ఆయనకు పడలేదు.

అందుకే, ఆయన తండ్రికి సన్నిహితంగా ఉన్న ఒక వ్యక్తి వ్యంగ్యంగా "మేక పాలుతో బక్కెట్ నిండుతుందా ఏంటి?" అని కూడా అన్నారు.

అఖిలేష్ యాదవ్

ఫొటో సోర్స్, TWITTER @YADAVAKHILESH

సమస్యలను ప్రజల దృష్టికి తీసుకురాలేకపోయిన అఖిలేష్

వెనకబడిన కులాలకు ఎక్కువ టికెట్లు ఇవ్వడం వల్ల వారి మద్దతు పొందచ్చని అఖిలేష్ అనుకున్నారు. కుల గణన నిర్వహించి, వెనుకబడిన ఓబీసీ వర్గాల రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేస్తానని చెప్పే అవకాశం ఆయనకు ఉంది. కానీ ఆయనకు ఆ దిశగా ఎలాంటి చొరవ తీసుకోలేదు.

మాయావతికి దళితుల మద్దతు తగ్గుతోందనే విషయం కూడా చూసిన అఖిలేష్‌కు దళిత ఓటర్లను కూడా తనవైపు తిప్పుకునే అవకాశం కూడా వచ్చింది.

హాథ్‌రస్‌లో దళిత మహిళ అత్యాచారం, హత్య కేసును ప్రచారంలో బలంగా లేవనెత్తడానికి అఖిలేష్ చొరవ చూపించి ఉండచ్చు. కానీ, ఆయన ఆ విషయంలో ప్రియాంకా గాంధీకి లీడ్ ఇచ్చేశారు.

వీటితోపాటూ ఉత్తరప్రదేశ్‌లో చాలా పెద్ద నేర ఘటనలు జరిగాయి. కానీ, ఆయన వాటి గురించి కేవలం ట్వీట్లు చేస్తూ, ప్రెస్ రిలీజ్‌లు విడుదల చేస్తూ, ఒకటిరెండు సార్లు ప్రెస్‌మీట్ ఏర్పాటు చేయడం తప్ప, తనకు అనుకూలంగా ఉపయోగించుకోడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు.

సమాజ్‌వాదీ పార్టీ వాటిని పెద్ద ప్రచారాంశాలుగా మార్చుకోకపోవడమే కాదు, ఆ పార్టీ కార్యకర్తలు కూడా రోడ్లపైకి రాలేదు. అఖిలేష్ లఖ్‌నవూ దాటి బయటకెందుకు రావడం లేదంటూ ఆ పార్టీ వర్గాల్లో కూడా ఆశ్చర్యం వ్యక్తమైంది.

ఎన్నికలకు రెండు మూడు నెలల ముందే ప్రచారం జోష్ చూపించాలనే అఖిలేష్ ఆలోచనపై కూడా విమర్శలు వచ్చాయి. ములాయం సింగ్ యాదవ్ ఆలోచన దీనికి భిన్నంగా ఉండేది.

వీడియో క్యాప్షన్, అయోధ్య: భక్తులు పంపిన ఇటుకలను ఏం చేశారంటే..

పశ్చిమ ఉత్తర ప్రదేశ్ వ్యూహం విఫలం

ఎన్నికల ఫలితాలను నిశితంగా గమనిస్తే పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో అఖిలేష్ కూటమి ప్రదర్శన ఆశించినంత మెరుగ్గా లేదనే విషయం తెలుస్తుంది.

జాట్లలో అసంతృప్తి ఉన్నప్పటికీ ఆయన దాని నుంచి రాజకీయ ప్రయోజనం పొందలేకపోయారనడంలో ఎలాంటి సందేహం లేదు.

జాట్ల ఓట్లపై అవసరానికి మించి దృష్టి పెట్టడంతో సైనీ, గుర్జర్లు సమాజ్‌వాదీ పార్టీకి దూరమై బీజేపీ వైపు వెళ్లిపోయారు.

జాట్ ఆధిపత్యం ఉన్న స్థానాల్లో ముస్లిం అభ్యర్థులను నిలబెట్టడం వారికి నచ్చలేదని, అందుకే జాట్లు బీజేపీ చెంతకు చేరడం తప్ప వేరే దారి లేకుండా పోయిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ సమీకరణాలన్నీ ములాయం సింగ్ యాదవ్ రాజకీయ అనుభవాన్ని నిర్లక్ష్యం చేసుండకూడదు అనే విషయాన్ని చెబుతున్నాయి. దీనితోపాటూ అఖిలేష్ ఎన్నికల ప్రచారంలో జిన్నా, పాకిస్తాన్ గురించి ప్రస్తావించడం వల్ల కూడా బీజేపీ వైపు ఓట్లు వెళ్లాయి.

సమాజ్ వాదీ పార్టీ

ఫొటో సోర్స్, TWITTER @SAMAJWADIPARTY

సీట్లు తక్కువైనా ఓట్ల శాతంలో వృద్ధి

ఉత్తరప్రదేశ్ ఎన్నికలు యోగి ఆదిత్యనాథ్‌కు చాలా కష్టమైన ఎన్నుకలు అవుతాయని ఎన్నికల ప్రచారం సమయంలో రాజకీయ విశ్లేషకులతోపాటూ, పేరు వెల్లడించవద్దని కోరిన కొందరు బీజేపీ నేతలు కూడా చెప్పారు.

2017 ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో బీజేపీకి చాలా కష్టాలు తప్పవని ఈ ఎన్నికల ప్రచారం ఒక సందేశం కూడా ఇచ్చింది.

అధికారంలో ఉండడం వల్ల నష్ట జరిగినప్పటికీ, బీజేపీ సపోర్ట్ బేస్‌లో చిన్న పగులు మాత్రమే వచ్చిందని ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైంది. అయితే, ఇబ్బందులు ఎదురైనా అఖిలేష్ కూటమికి పడాల్సిన ఓట్లలో ఒక పెద్ద భాగాన్ని తమకు అనుకూలంగా పొందడంలో బీజేపీ విజయవంతమైంది.

2022 ఎన్నికల్లో బీజేపీ ఓట్ షేర్ 2019 ఎన్నికలతో పోలిస్తే తగ్గింది. బీఎస్పీ ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొనకపోవడంతో, రాష్ట్రమంతటా ఎస్పీకి మంచి ఆదరణ లభించిందని భావించారు. అఖిలేష్ కడ్హల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బలమైన బీజేపీ అభ్యర్థి ఎస్పీఎస్ బఘేల్‌ను 60 వేల ఓట్ల తేడాతో ఓడించారు.

దేశంలో అతిపెద్ద రాష్ట్రంలో బీజేపీని సవాలు చేసే ఏకైక రాజకీయ నేత తనేనన్న విషయం అఖిలేష్‌కు కచ్చితంగా సంతోషాన్ని ఇస్తుంటుంది. ఆయన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బహుజన్ సమాజ్ పార్టీ ఉనికిని రాష్ట్రంలో ఒక విధంగా తుడిచిపెట్టేశారు. తన ఓట్ల శాతాన్ని కూడా 21 శాతం నుంచి 34 శాతానికి పెంచుకోగలిగారు.

అఖిలేష్ పార్టీ సీట్లు కూడా 47 నుంచి 124కు మూడు రెట్లు పెరిగాయి. కానీ, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవి కూడా సరిపోలేదు. మెరుగైన రాజకీయ అవగాహనతో గెలిచుండాల్సిన ఎన్నికల్లో అఖిలేష్ ఓటమి మూటగట్టుకున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)