బ్రిటన్ ప్రధాన మంత్రిపై ఎంపీల తిరుగుబాటు ఎందుకు? లిజ్ ట్రస్ పీఎంగా ఇంకెంత కాలం మనుగడ సాగించగలరు?

లిజ్ ట్రస్

ఫొటో సోర్స్, PA Media

    • రచయిత, నిక్ ఈర్డ్‌లీ
    • హోదా, బీబీసీ చీఫ్ పొలిటికల్ కరెస్పాండెంట్

బ్రిటన్‌లో రాజకీయ గందరగోళం, మార్కెట్లు కుదేలు కావడంతో కొంతమంది కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలు నిరాశలో ఉన్నారు.

గత 72 గంటలుగా అక్కడ ఒకటే చర్చ నడుస్తోంది. బ్రిటన్ ప్రధానిగా లిజ్ ట్రస్ ఎంతకాలం మనుగడ సాగించగలరు? అనేదానిపైనే ఈ చర్చంతా.

కొంతమంది కన్జర్వేటివ్ ఎంపీలు ఇప్పటికే బహిరంగంగా ప్రధాని ట్రస్ వైదొలగాలంటూ పిలుపునిచ్చారు. దీనికి త్వరలోనే మరికొంతమంది ఎంపీలు కూడా జత కూడనున్నారు.

వారాంతంలో బీబీసీతో సంభాషణ సందర్భంగా, లిజ్ ట్రస్ వచ్చే ఎన్నికల కంటే ముందే ప్రధాని పీఠాన్ని వదిలిపెట్టాల్సి ఉంటుందని చాలామంది వాదించారు.

మరికొన్ని నెలలు ఆమె ప్రధానిగా కొనసాగగలరని కొంతమంది నమ్ముతున్నారు. కానీ, ఆమె కొన్ని వారాల పాటు లేదా కొన్ని రోజుల పాటు మాత్రమే ప్రధానిగా ఉంటారని వాదించే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే ఇది ఎలా జరుగుతుంది? ఆమె స్థానంలో ఎవరు వస్తారనే దానిపై ఎలాంటి స్పష్టత లేదు.

''ఇది ముగిసిపోయిందని ప్రజలకు తెలుసు. ఇక ఎలా, ఎప్పుడు జరుగుతుందనేది ఇప్పుడు మిగిలిఉన్న ప్రశ్న'' అని మాజీ మంత్రి ఒకరు అన్నారు.

తాము ఇదంతా వింటున్నట్లు డౌనింగ్ స్ట్రీట్ నుంచి సందేశం వచ్చింది.

లిజ్ ట్రస్

ఫొటో సోర్స్, UK GOVERNMENT

ఇంకా ఇది ముగియలేదని ఎంపీలను, మంత్రులను ఒప్పించే పనిలో సోమవారం లిజ్ ట్రస్ ఉన్నారు.

పార్లమెంట్‌లో సెంట్రిస్ట్ టోరీ ఎంపీలతో, రిసెప్షన్‌లో క్యాబినెట్ మంత్రులతో ట్రస్ చర్చిస్తారు. పరిస్థితులను సమన్వయం చేయడానికి వారి నుంచి అభిప్రాయాలను, సూచనలను కోరతారు. ఇతర ఎంపీలను కూడా కాఫీకి ఆహ్వానించి వారితో చర్చలు జరుపుతారు.

మరోవైపు కొత్త చాన్స్‌లర్ జెరెమీ హంట్, తాను వచ్చే పదిహేను రోజుల్లో తీసుకోవాల్సిన కఠిన నిర్ణయాల గురించి కన్జర్వేటివ్ నేతలతో ఈ వారంలో చర్చలు జరుపనున్నారు.

హంట్ నియామకం వల్ల ఆమెకు కొంత సమయం దొరకుతుంది. కానీ ఆ సమయం సరిపోతుందా?

ఆయన నియామకాన్ని కొంతమంది టోరీ ఎంపీలు హర్షించారు. ఆర్థిక వ్యవస్థను హంట్ గాడిన పెడతారని చాలామంది విశ్వసిస్తున్నారు. 'ఆయన నిజమైన ప్రధానమంత్రి' అని ఒక మాజీ మంత్రి వ్యాఖ్యానించారు.

హంట్ ప్రవేశపెట్టబోయే హాలోవీన్ ఆర్థిక బడ్జెట్ వరకు రెబెల్ నేతలంతా ఓపికగా ఎదురు చూడాలని పార్టీలోని ప్రభావశీలురైన నేతలు కొందరు కోరారు. అప్పటిలోగా పరిస్థితులను చక్కదిద్దుకోవడానికి ప్రభుత్వానికి కనీసం పదిహేను రోజుల సమయం దొరకుతుంది.

కొంతకాలం పాటు శాంతంగా ఉండాలంటూ విజ్ఞప్తి చేసే ఎంపీలు కూడా ఉన్నారు. అలాగే ఈ రాజకీయ వేడి తగ్గించాలని చూస్తున్నట్లు చెప్పిన ఎంపీలు కూడా చాలామంది ఉన్నారు. పార్టీలోని వివిధ విభాగాలను పునర్వవస్థీకరించడం ద్వారా ఈ గందరగోళాన్ని తగ్గుముఖం పట్టించవచ్చని కొందరు వాదిస్తున్నారు.

లిజ్ ట్రస్

ఫొటో సోర్స్, Reuters

లిజ్ ట్రస్ సారథ్యంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ కారణంగా ఆర్థిక వ్యవస్థ కుదేలై తలెత్తిన గందరగోళం ఈ వారానికి మరింత తీవ్రంగా మారవచ్చని కొందరు హెచ్చరిస్తున్నారు.

''మార్కెట్లపై ఇది ఆధారపడి ఉంటుంది. మార్కెట్లు యథాతథంగా ఉంటే ఆమె సమయం కాస్త పెరుగుతుంది. అలా కాకుండా మార్కెట్లు ఫ్రీఫాల్‌లోకి వెళితే, ఆమె వారంలోనే వెళ్లిపోవాల్సి ఉంటుంది'' అని బోరిస్ జాన్సన్ హయాంలో పనిచేసిన ఒక మాజీ మంత్రి అన్నారు.

ఈ వారాంతంలో బీబీసీతో మాట్లాడిన ఇతర ఎంపీలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

1922 కమిటీ నిబంధనల ప్రకారం, మరో ఏడాది పాటు లిజ్ ట్రస్‌, అవిశ్వాస తీర్మానం ఎదుర్కొనే అవసరం ఉండదు. నిబంధనలను మార్చవచ్చు. కానీ, నిబంధనలు మార్చడానికి కమిటీ విముఖత చూపుతుందని తాజా ఘటనలు సూచిస్తున్నాయి.

సభ్యుల మధ్య మరో సుదీర్ఘ నాయకత్వ చర్చ జరిగే అవకాశం ఉన్నందున చాలామంది ఎంపీలు భయపడుతున్నారు. అందుకే 'కరోనేషన్' గురించి చర్చలు కూడా వినిపిస్తున్నాయి. ఈ పద్ధతిలో సభ్యులను సంప్రదించకుండానే ఎంపీలు రెండు రోజుల వ్యవధిలో తమ తదుపరి నాయకుడిని ఎన్నుకుంటారు.

ఈ నేపథ్యంలో బెన్ వాలెస్, రిషి సునాక్, పెన్నీ మోర్డాంట్‌ల పేర్లు బాగా వినిపించాయి. కానీ, వీరందరికీ సమస్యలు ఉన్నాయి.

వీడియో క్యాప్షన్, కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ పదవికీ, బ్రిటిష్ ప్రధాని పదవి పోటీలో రిషి సునక్,లిజ్ ట్రస్

బెన్ వాలెస్ ఇప్పుడే ఇది జరగాలని కోరుకోవట్లేదని ఆయన సన్నిహితులు చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో స్థిరత్వంపై దృష్టి సారించాలని, ప్రధానికి మరికొంత సమయం ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నట్లు తెలిపారు.

రిషి సునాక్‌ను నాయకునిగా ఎన్నుకుంటే పార్టీ చీలిపోతుందని కొందరు హెచ్చరిస్తున్నారు. బోరిస్ జాన్సన్ పతనానికి ఆయనే కారణమని నమ్మేవారి మనసులు గెలవడం కష్టమే.

ఆర్థిక సంక్షోభం తలెత్తిన ఈ సమయంలో దేశాన్ని నడిపించడానికి అనుభవం లేని వ్యక్తిగా పెన్నీని చూస్తున్నారు.

ఈ పేర్లే కాకుండా జెరెమీ హంట్, గ్రాంట్ షాప్స్ గురించి కూడా మాట్లాడుతున్నాయి. కానీ, వీరిలో ఎవరైనా ఇంత చీలిపోయిన పార్టీని మళ్లీ ఏకం చేయగలరా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)