Liz Truss: బ్రిటన్ కొత్త ప్రధానమంత్రిగా లిజ్ ట్రస్ ఎన్నిక.. ఆమె గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు..

ఫొటో సోర్స్, Reuters
బ్రిటన్ ప్రధాన మంత్రిగా కన్జర్వేటివ్ పార్టీ సభ్యురాలు లిజ్ ట్రస్ ఎన్నికయ్యారు. మంగళవారం బ్రిటన్ రాణిని కలిసిన తర్వాత లిజ్ తన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తారు.
పార్టీ నాయకత్వానికి జరిగిన ఎన్నికల్లో లిజ్‌కు 81,326 ఓట్లు లభించగా, రిషి సునక్‌కు 60,399 ఓట్లు వచ్చాయి.
బ్రిటన్ పార్లమెంటుకు 2024లో ఎన్నికలు జరుగనున్నాయి.
లిజ్ ట్రస్ ఏడేళ్ల వయసులోనే స్కూలులో జరిగిన మాక్ సార్వత్రిక ఎన్నికల్లో బ్రిటన్ మాజీ ప్రధాని మార్గరెట్ థాచర్ పాత్రలో పోటీ చేశారు. కానీ, ఆ మాక్ ఎన్నికల్లో ఆమె విజయం సాధించలేదు.
"ఆ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వచ్చినందుకు నేను భావోద్వేగమైన ప్రసంగాన్ని చేశాను. కానీ, నా ఓటు హక్కును వినియోగించుకోలేదు" అని చాలా సంవత్సరాల తర్వాత లిజ్ ట్రస్ గుర్తు చేసుకున్నారు.
39 సంవత్సరాల తర్వాత ఐరన్ లేడీ మార్గరెట్ థాచర్‌ను అనుసరిస్తూ ప్రధాని రేసులో పోటీ పడే అవకాశం వచ్చినందుకు ఆమె ఎగిరి గంతేస్తున్నారు.
టోరీ పార్లమెంట్ సభ్యులు చేసిన ఓటింగ్‌లోని ఐదు విడతల్లోనూ ప్రత్యర్థి రిషి సునక్ కంటే లిజ్ ట్రస్ ఆధిక్యంలో ఉన్నారు.
నియోజకవర్గంలోని ప్రజలతో సత్సంబంధాలు పెంపొందించుకుని, బోరిస్ జాన్సన్ కష్టకాలంలో ఆయనకు నమ్మశక్యంగా వ్యవహరించిన ట్రస్ కు ఈ పోటీలో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ముందునుంచే అంచనా వేస్తున్నారు.
చాలా విషయాల్లో ఈమె సంప్రదాయ టోరీ మాదిరిగా వ్యవహరించరు.
మేరీ ఎలిజబెత్ ట్రస్ 1975లో ఆక్స్‌ఫర్డ్‌లో జన్మించారు. ఆమె తండ్రి మ్యాథ్స్ ప్రొఫెసర్, తల్లి నర్సుగా పని చేసేవారు. వీరు లెఫ్ట్ వింగ్ రాజకీయాలకు మద్దతిచ్చేవారు.
పశ్చిమ లండన్ లో ఆర్ఏఎఫ్ గ్రీన్‌హ్యాం కామన్ దగ్గర అమెరికా అణ్వాయుధాలను ఏర్పాటు చేసేందుకు అప్పటి మార్గరెట్ థాచర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా కాంపైన్ ఫర్ న్యూక్లియర్ డిసార్మమెంట్ సంస్థ ప్రచారాన్ని నిర్వహించింది. అణ్వాయుధ నిరాయుధీకరణకు వ్యతిరేకంగా ఈ సంస్థ నిర్వహించే ప్రచారాల్లో ట్రస్ తల్లి పాల్గొనేవారు.

ఫొటో సోర్స్, Getty Images

- లిజ్ ట్రస్
- వయసు: 47
- జన్మస్థలం: ఆక్స్ ఫర్డ్
- నివాసం: లండన్, నార్ఫోక్
- చదువు: లీడ్స్ లోని రౌండ్ హే స్కూల్, ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ
- భర్త: హ్యూ ఓ లీరీ,
- పిల్లలు: ఇద్దరు అమ్మాయిలు
- పార్లమెంటరీ నియోజకవర్గం: సౌత్ వెస్ట్ నార్ఫోక్

ట్రస్‌కు నాలుగేళ్లు ఉన్నప్పుడే ఆమె కుటుంబం పైస్లీకి వలస వెళ్లారు. ఆమెకు బోర్డు గేమ్స్ ఆడటమంటే ఇష్టమని ట్రస్ సోదరుడు బీబీసీ 4 కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు
కానీ, ట్రస్ ఓటమిని ద్వేషించేవారు. ఓటమిని చవి చూడటం ఇష్టం లేక ఆట మధ్యలోనే మాయమైపోతూ ఉండేవారని చెప్పారు.
వారి కుటుంబం కొన్ని రోజులకు లీడ్స్ కు వెళ్లారు. అక్కడ ఆమె రౌండ్ హే స్కూలులో చదువుకున్నారు. అక్కడ చదువులో విఫలమయ్యే విద్యార్థులను లోకువగా చూసేవారని చెప్పారు.
కానీ, ఆమె చెప్పే వాటిలో నిజం లేదని ట్రస్ తో పాటు చదువుకున్న తోటి విద్యార్థులు కొంత మంది అంటారు.
"బహుశా ఆమె బాల్యానికి సంబంధించి కొన్ని విషయాలను మాత్రమే ఎంపిక చేసి చెబుతూ ఉండి ఉంటారు. ఆమె రాజకీయ ప్రయోజనాల కోసం శిక్షణ ఇచ్చిన స్కూలు టీచర్లు, సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా మాట్లాడుతూ ఉండి ఉంటారు" అని
గార్డియన్ విలేఖరి మార్టిన్ పెంగెల్లీ రాశారు.
ఆమె స్కూలు చదువు ఎలా ఉన్నప్పటికీ, ఆమె ఆక్స్ ఫర్డ్ కు మాత్రం వెళ్లారు. అక్కడ ఆమె ఫిలాసఫీ, పాలిటిక్స్, ఎకనామిక్స్ చదువుకున్నారు. ఆమె విద్యార్థి రాజకీయాల్లో చురుకుగా ఉండేవారు. మొదట్లో ఆమె లిబరల్ డెమొక్రాట్స్ తరుపున మాట్లాడేవారు.
1994లో జరిగిన పార్టీ సమావేశంలో ఆమె రాచరిక వ్యవస్థను నిర్మూలించడాన్ని సమర్ధిస్తూ మాట్లాడారు. "లిబరల్ డెమోక్రాట్ లు అందరికీ సమాన అవకాశాలను కల్పించడాన్ని విశ్వసిస్తారు. పరిపాలించేందుకే ఎవరూ పుట్టరు" అని ఆమె ఈ ప్రసంగంలో అన్నారు.

ఫొటో సోర్స్, PA Media
వెస్ట్‌మిన్స్టర్ ఆశయాలు
ఆక్స్ ఫర్డ్ లో ఆమె కన్జర్వేటివ్‌లకు మద్దతుగా మాట్లాడటం మొదలుపెట్టారు. చదువు పూర్తైన తర్వాత షెల్ అండ్ కేబుల్ అండ్ వైర్ లెస్ సంస్థలో అకౌంటంట్ గా పని చేశారు. అక్కడే సహోద్యోగి హ్యూ ఓ లీరీని పెళ్లి చేసుకున్నారు.
వీరిద్దరికీ ఇద్దరు కూతుర్లు.
ట్రస్ 2001లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టోరీ అభ్యర్థిగా వెస్ట్ యార్క్‌షైర్ లోని హెమ్స్‌వర్ధ్ నుంచి పోటీ చేశారు. కానీ, ఆ ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు.
2005లో కాల్డర్ వ్యాలీలో మరో ఓటమిని చవి చూశారు.
కానీ, ఆమె రాజకీయ ఆశయాల సాధన నుంచి ఏ మాత్రం పక్కకు తప్పుకోలేదు.
ఆమె 2006లో ఆగ్నేయ లండన్ లోని గ్రీన్‌విచ్ నుంచి కౌన్సిలర్ గా ఎన్నికయ్యారు. 2008 నుంచి రైట్ ఆఫ్ సెంటర్ రిఫార్మ్ అనే థింక్ ట్యాంక్ కోసం పని చేశారు.
2010లో జరిగిన ఎన్నికల్లో కన్జర్వేటివ్ నాయకుడు డేవిడ్ కెమరూన్ ట్రస్ ను 'ఏ' లిస్ట్‌లో ఉన్న ప్రముఖ అభ్యర్థుల జాబితాలో చేర్చారు.
ఆమె నార్ఫోక్ స్థానం నుంచి పోటీ చేసేందుకు అవకాశమిచ్చారు.
కానీ, ఆమెకు టోరీ పార్లమెంట్ సభ్యుడు మార్క్ ఫీల్డ్ తో వివాహేతర సంబంధం ఉందనే వార్తలు రావడంతో ఆమెను పోటీ నుంచి తప్పించేందుకు జరిగినప్రయత్నం చేసిన వారితో పోరాడాల్సి వచ్చింది.
కానీ, ఆమెను పోటీ నుంచి తప్పించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆమె 13,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు.
ఆమె 2010లో ఎన్నికైన మరో నలుగురు కన్జర్వేటివ్ ఎంపీలతో కలిసి 'బ్రిటానియా అన్ చైన్డ్' అనే పుస్తకాన్ని రాశారు.
ప్రపంచంలో బ్రిటన్ స్థానాన్ని మరింత ఉన్నత స్థాయికి చేర్చేందుకు ప్రభుత్వ నిబంధనలను సడలించాలని ఈ పుస్తకంలో పేర్కొన్నారు. ఈమె టోరీ పార్టీలో స్వేఛ్ఛా వాణిజ్య విధానాలకు అనుకూలంగా ప్రచారం చేసిన వ్యక్తిగా చెబుతారు.
ఆమె ఈ పుస్తకంలో బ్రిటిష్ ఉద్యోగులను "ప్రపంచంలోనే అత్యంత బద్దకస్థులు" అని అనడం పట్ల బీబీసీ డిబేట్‌లో సవాలు చేశారు. అయితే, ఈ విషయాన్ని ఆమె రాయలేదని ఆ డిబేట్‌లో అన్నారు.
2012లో, ఆమె పార్లెమెంటుకు ఎన్నికైన రెండు సంవత్సరాల్లోనే విద్యా శాఖ మంత్రి అయ్యారు. 2014లో పర్యావరణ కార్యదర్శి బాధ్యతలు చేపట్టారు.
2015 కన్జర్వేటివ్ సమావేశంలో, "బ్రిటన్ రెండొంతులు చీజ్ ను దిగుమతి చేసుకుంటోంది. ఇది సిగ్గు చేటు" అని అంటూ ట్రస్ చేసిన ప్రసంగానికి ఆమెను ఎగతాళి చేశారు.

ఫొటో సోర్స్, EPA
బ్రెగ్జిట్ యూ టర్న్
సరిగ్గా ఒక సంవత్సరం తర్వాత బ్రిటన్ చరిత్రలో యూరోపియన్ యూనియన్ అనే భారీ ఘట్టానికి తెర లేచింది.
బ్రిటన్ యూరోపియన్ యూనియన్ లో భాగంగా ఉండటానికి మద్దతిస్తూ ఆమె ప్రచారాన్ని చేపట్టారు. ఆమె సన్ వార్తా పత్రికకు రాసిన వ్యాసంలో "బ్రెక్సిట్ అమలులోకి వస్తే మూడు రెట్లు విధ్వంసం చోటు చేసుకుంటుంది. యూరోపియన్ యూనియన్ కు చేసే క్రయ విక్రయాల్లో మరిన్ని నిబంధనలు, పత్రాలతో పాటు మరింత జాప్యం జరుగుతుంది" అని రాశారు.
కానీ, బ్రిటన్ యూరోపియన్ యూనియన్ నుంచి తప్పుకోవడం వైపే ప్రజలు మొగ్గు చూపడంతో ఆమె కూడా మనసు మార్చుకున్నారు.
"దేశంలో విధానాలు అమలయ్యే తీరును బ్రెక్సిట్ సమూలంగా మార్చేస్తుంది" అని అనడం మొదలుపెట్టారు.
ఆమె ట్రెజరీప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టేందుకు ముందు థెరెసా మే నాయకత్వంలో న్యాయ కార్యదర్శిగా పని చేశారు.
2019లో బోరిస్ జాన్సన్ ప్రధాన మంత్రి బాధ్యతలు చేప్పట్టిన తర్వాత ట్రస్ అంతర్జాతీయ వాణిజ్య కార్యదర్శి అయ్యారు.
వాణిజ్య కార్యదర్శి పాత్రలో ఆమె బ్రిటన్ పబ్లిక్ లిమిటెడ్ సంస్థలకు ప్రచారం కల్పించేందుకు అంతర్జాతీయ రాజకీయ, వ్యాపారవేత్తలతో సమావేశం కావల్సి ఉంటుంది.
2021లో ఆమె ప్రభుత్వంలో కీలకమైన విదేశీ కార్యదర్శి బాధ్యతలను చేపట్టారు.
ఈ సమయంలో . బ్రెక్సిట్ తర్వాత యూరోపియన్ యూనియన్ -బ్రిటన్ మధ్య జరిగిన ఒప్పందంలో కొన్ని అంశాలను రద్దు చేస్తూ సమస్యలతో ముడిపడి ఉన్న నార్తర్న్ ఐర్లాండ్ ప్రోటోకాల్ సమస్యను పరిష్కరించే బాధ్యతలను చేపట్టారు.
అయితే, ఈ చర్యను ఈయూ తీవ్రంగా విమర్శించింది.
బందీలుగా ఉన్న ఇద్దరు బ్రిటిష్ ఇరాన్ జాతీయులను జైలు నుంచి విడుదలయ్యేట్లు చూశారు.
రష్యా యుక్రెయిన్ పై దాడులు మొదలుపెట్టినప్పుడు, పుతిన్ సేనలను దేశం నుంచి పూర్తిగా తరిమికొట్టమని పిలుపునిచ్చారు.
కానీ, యుక్రెయిన్‌లో పోరాడేందుకు సిద్ధంగా ఉన్న బ్రిటన్ ప్రజలను సమర్ధించినందుకు విమర్శలు కూడా ఎదుర్కోవలసి వచ్చింది.
"ఉచిత పథకాలకు వ్యతిరేకం"
ప్రధాని బరిలో పోటీ చేసేందుకు ట్రస్ చేసిన ప్రచారం కూడా విమర్శలు ఎదుర్కొంది.
బ్రిటన్‌లో పెరిగిపోతున్న జీవన వ్యయాన్ని ఎలా నిర్వహిస్తారని అడిగినప్పుడు, "పన్ను భారాన్ని తగ్గించి, ఉచిత పథకాలను ఇవ్వడాన్ని నిలుపుచేస్తాం" అని సమాధానం చెప్పారు.
స్థానికంగా ఉన్న జీవన వ్యయానికి తగినట్లుగా ప్రభుత్వ రంగ ఉద్యోగుల జీతాన్ని నిర్ణయించడం పట్ల సీనియర్ టోరీ సభ్యుల నుంచి ప్రతిఘటన ఎదుర్కోవడంతో ఆమె ఆ ప్రణాలికను రద్దు చేయాల్సి వచ్చింది. ఈ ప్రణాలికను అమలు చేస్తే లండన్ అవతల పని చేస్తున్న కొన్ని లక్షలాది మంది ఉద్యోగుల పై ప్రభావం పడుతుందని విమర్శ చేశారు.
స్కాట్ లాండ్ తొలి మంత్రి నికోలా స్టర్జన్ ఇతరుల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తారని ఆమెను పట్టించుకోకుండా ఉండటమే ఉత్తమం అని అన్నారు.
కానీ, ప్రత్యర్థి రిషి సునక్ కంటే కూడా ఈమెకు పార్టీ సభ్యుల మద్దతు ఎక్కువగా ఉన్నట్లు ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల రౌండ్లు చెబుతున్నాయి.
ట్రస్ జూలు టోపీ, తెల్లని బౌ ధరిస్తూ వస్త్రధారణలో థాచర్ ను అనుకరించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారని కొంత మంది అంటారు.
అయితే, ట్రస్ దీనిని ఖండించారు. "మహిళా రాజకీయ నాయకులను మార్గరెట్ థాచర్‌తో పోలుస్తూ ఉండటం చాలా చికాకుగా ఉంటుంది. పురుషులను మాత్రం టెడ్ హీత్ తో పోల్చరు" అని జీబీ న్యూస్ మీడియా సంస్థతో అన్నారు.
కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల మద్దతు పొందేందుకు ఇలాంటి పోలికల వల్ల ఆమెకు జరిగే నష్టం ఏమీ లేదు.
ఇవి కూడా చదవండి:
- ప్రిజన్ క్యాంప్-120: ఈ జైలులో అసలేం జరిగింది... 50 మంది ఖైదీలు ఎలా కాలి బూడిదయ్యారు?
- కాంగ్రెస్, బీజేపీల్లో పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ఎలా జరుగుతుంది?
- పీరియడ్స్ నొప్పులు మగవాళ్ళకు ఎందుకు వస్తున్నాయి?
- ప్రేమించలేదని నిద్రిస్తున్న విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన యువకుడు, కాలిన గాయాలతో విద్యార్థిని మృతి
- కోబ్రా రివ్యూ: ఏడు గెటప్‌లు... విక్రమ్‌లోని ‘అపరిచితుడు’ ఇంకా బయటపడడం లేదా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














