భారత నౌకాదళం జెండాలో బ్రిటిష్ వలస పాలన ఆనవాళ్ళు ఎలా కొనసాగాయి... ఇప్పుడు మోదీ ఆవిష్కరించిన పతాకంలో మార్పులేంటి?

నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Indian Navy

    • రచయిత, పృథ్వీరాజ్
    • హోదా, బీబీసీ తెలుగు

భారత నౌకాదళం కోసం రూపొందించిన కొత్త జెండాను ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం ఉదయం ఆవిష్కరించారు.

భారత్ దేశీయంగా నిర్మించిన అతిపెద్ద యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌ను మోదీ కేరళలోని కొచ్చిలో జాతికి అంకితమిచ్చారు.

భారతీయ నౌకాదళం డిజైన్ చేసిన ఈ నౌకను కొచ్చి షిప్‌యార్డ్ నిర్మించింది. ఆత్మనిర్భర భారత్‌కు చుక్కానిగా భావిస్తున్న ఈ నౌకను ప్రధాని మోదీ శుక్రవారం నాడు నౌకా దళానికి అధికారికంగా అప్పగించారు.

ఈ సందర్భంగా భారత నౌకా దళానికి కొత్త జెండాను కూడా ఆవిష్కరించారు.

బ్రిటిష్ పాలనలోని నౌకా దళం జెండాలో కొనసాగుతున్న 'సెయింట్ జార్జిస్ క్రాస్'ను తొలగించి.. ఒక అష్టభుజి లోపల.. ముదురు నీలి రంగు మీద భారత నౌకాదళ చిహ్నాన్ని ముద్రించారు.

భారత నేవీ కొత్త జెండా

ఫొటో సోర్స్, Indian Navy

ఫొటో క్యాప్షన్, భారత నౌకాదళం కొత్త జెండా

జెండాలో ఈ మార్పును 'వలస పాలన వాసనకు ఉద్వాసన'గా ప్రధాని మోదీ గతంలో అభివర్ణించారు.

నిజానికి భారత నౌకాదళ జెండాను గతంలోనూ.. వాజపేయి ప్రధానిగా ఉన్న బీజేపీ ప్రభుత్వ హయాంలో ఒకసారి మార్చారు. కానీ మూడేళ్ల తర్వాత ఆ జెండా స్థానంలో పాత జెండానే స్వల్ప మార్పులతో మళ్లీ తీసుకువచ్చారు. ఇప్పుడు మరోసారి నౌకాదళ జెండాను మార్చారు.

భారత నౌకాదళం ఏర్పడినప్పటి నుంచీ నౌకాదళ జెండాలు ఎలా మారుతూ వచ్చాయో ఓసారి చూద్దాం.

నేటి భారత నౌకాదళ మూలాలు బ్రిటిష్ పాలనకన్నా ముందు ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో బలపడుతున్న కాలంలో ఉన్నాయి.

భారతదేశంలో వ్యాపారం మీద ఆధిపత్యం కోసం పోర్చుగీసు వారితో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తలపడింది. అదే సమయంలో తమ వర్తక నౌకలకు సముద్రపు దొంగల నుంచి రక్షణ కల్పించాల్సిన అవసరం వచ్చింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

ఇందుకోసం 1612లో నేటి గుజరాత్‌లోని సూరత్ వద్ద ఈస్ట్ ఇండియా కంపెనీ నౌకా దళాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత క్రమంగా ముంబై నుంచి ప్రధానంగా పని చేయటం ప్రారంభించింది. అప్పుడు 'ఈస్ట్ ఇండియా కంపెనీస్ మెరైన్'‌గా వ్యవహరించేవారు.

1686లో ఈ నౌకాదళానికి 'బాంబే మెరైన్'గా పేరు మార్చారు. దాదాపు ఒకటిన్నర శతాబ్దాల తర్వాత..

1830లో 'హర్ మెజెస్టీస్ ఇండియన్ మెరైన్'గా పేరు మార్చారు. అనంతరం 1892లో ఈ నౌకాదళానికి 'రాయల్ ఇండియన్ మెరైన్' అని పేరు పెట్టారు. 1934లో దీనిని 'రాయల్ ఇండియన్ నేవీ'గా మార్చారు.

1947లో బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్ర్యం పొందిన భారతదేశం.. 1950 జనవరి 26న గణతంత్ర దేశంగా ఆవిర్భవించినపుడు.. 'రాయల్' పదాన్ని తొలగించారు. అలా 'ఇండియన్ నేవీ' అయింది.

భారతీయ నౌకాదళ జెండాలు

ఫొటో సోర్స్, BBC/Wikimedia Creative Commons

ఫొటో క్యాప్షన్, భారతీయ నౌకాదళ జెండాలు మారుతూ వచ్చాయిలా

'హర్ మెజెస్టీస్ ఇండియన్ మెరైన్‌'గా ఉన్నపుడు.. 1879 నుంచి 1928 వరకూ హయాంలో ముదురు నీలిరంగు మీద ఎడమవైపు పై భాగంలో బ్రిటిష్ పతాకం ఉంటుంది. దాని పక్కన.. కుడివైపు మధ్య భాగంలో 'స్టార్ ఆఫ్ ఇండియా' చిహ్నం ఉంటుంది.

1928లో ఈ జెండాలో కొన్ని మార్పులు చేశారు. తెల్ల జెండాను నాలుగు భాగాలుగా విభజిస్తున్నట్లుగా.. ఎరుపు రంగులోని 'సెయింట్ జార్జెస్ క్రాస్' ఉంటుంది. ఆ క్రాస్ ఎడమవైపు పై భాగంలో బ్రిటిష్ పాతకం ఉంటుంది.

భారతదేశం స్వాతంత్ర్యం పొందిన 1947 ఆగస్టు 15 తర్వాత కూడా దాదాపు మూడేళ్ల పాటు 'రాయల్ ఇండియన్ నేవీ' పేరు, ఆ పతాకం అలాగే కొనసాగాయి.

భారత్ 1950లో గణతంత్రదేశంగా మారినపుడు.. 'రాయల్ ఇండియన్ నేవీ' పేరులో రాయల్‌ను తొలగించి 'ఇండియన్ నేవీ'గా పేరు మార్చారు. అలాగే నౌకా దళ జెండాలో.. ఎడమవైపు పై భాగంలో అప్పటి వరకూ ఉన్న బ్రిటిష్ జెండాను తొలగించి, ఆ స్థానంలో భారత జాతీయ జెండాను చేర్చారు.

ఆ జెండాలో ఎరుపు రంగులోని 'సెయింట్ జార్జెస్ క్రాస్'ను అలాగే ఉంచారు.

అయితే.. 1998లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వ హయాంలో.. 2001లో నౌకాదళ జెండాలో మార్పులు చేశారు. జెండాలోని ఎరుపు రంగు 'సెయింట్ జార్జెస్ క్రాస్'ను తొలగించారు. నీలి రంగులోని భారత నౌకాదళ చిహ్నాన్ని చేర్చారు.

భారత నేవీ కొత్త జెండా

ఫొటో సోర్స్, Indian Navy

ఫొటో క్యాప్షన్, భారత నేవీ కొత్త జెండా

అంటే, తెల్ల జెండాను నాలుగు భాగాలుగా విభజిస్తే ఎడమవైపు పై భాగంలో భారత జాతీయ జెండా ఉంటుంది. కుడివైపు రెండు భాగాలను కలుపుతూ నీలి రంగులో భారత నౌకాదళ చిహ్నం ఉంటుంది.

అయితే, ఈ జెండా నీలి రంగు ఆకాశం నేపథ్యంలో సరిగా కనిపించటం లేదంటూ నౌకాదళం నుంచి అనేక ఫిర్యాదులు అందటంతో మూడేళ్లలోనే ఈ జెండాను మళ్లీ మార్చారు. కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మార్పు చేశారు.

తెల్ల జెండాను నాలుగు భాగాలుగా విభజిస్తున్నట్లుగా ఉండే ఎరుపు రంగు 'సెయింట్ జార్జెస్ క్రాస్', అందులో ఎడమవైపు పైభాగంలో భారత జాతీయ జెండా చిహ్నంతో కూడిన పాత జెండాను పునరుద్ధరించారు. అయితే.. ఈసారి 'సెయింట్ జార్జెస్ క్రాస్' మధ్య భాగంలో.. భారత రాజముద్ర అయిన మూడు సింహాల ముద్రను చేర్చారు.

మళ్లీ 2014 బీజేపీ అధికారంలోకి వచ్చిన అనంతరం.. ఈ జెండాలో స్వల్ప మార్పు చేశారు. 'సెయింట్ జార్జెస్ క్రాస్' మధ్య భాగంలో చేర్చిన భారత రాజముద్ర కింద దేవనాగరి లిపిలో 'సత్యమేవ జయతే' అనే మాటలను చేర్చారు.

నౌకాదళ జెండాలో కొనసాగుతున్న 'వలస పాలన గతాన్ని' శాశ్వతంగా తొలగిస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ ఏడాది ఆగస్టులో ప్రకటించారు. 'సుసంపన్నమైన భారతీయ నౌకాదళ వారసత్వాన్ని' ప్రతిబింబించేలా సరికొత్త పతాకాన్ని రూపొందిస్తామని చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు ఐఎన్ఎస్ విక్రాంత్‌ను జాతికి అంకితమిస్తున్న సందర్భంగా భారత నౌకాదళం కొత్త జెండాను కూడా ప్రధాని మోదీ ఆవిష్కరించారు.

తెల్ల జెండా మీద ఎడమవైపు చతుర్భాగంలో భారత జాతీయ జెండా ఉండగా, కుడి అర్థభాగంలో నీలిరంగు అష్టభుజి మధ్యలో భారత నౌకాదళ చిహ్నాన్ని ముద్రించారు. ఈ అష్టభుజికి జంట బోర్డర్లు, దాని మధ్యలోని నౌకాదళ చిహ్నం బంగారు రంగులో ఉన్నాయి.

ఈ అష్టభుజి చిహ్నాన్ని ఛత్రపతి శివాజీ రాజముద్ర నుంచి స్ఫూర్తితో రూపొందించినట్లు జెండా ఆవిష్కరణ సందర్భంగా వెల్లడించారు. శివాజీ స్థాపించిన నౌకాదళం విదేశీ దండయాత్రల నుంచి తీరాన్ని కాపాడిన తొలి నౌకాదళమని పేర్కొన్నారు.

వీడియో క్యాప్షన్, స్పెషల్ మిషన్‌తో దూసుకుపోతున్న మహిళా స్క్వాడ్రన్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)