World Egg Day: గుడ్డు ఎందుకు తినాలి? గుడ్డులో ఏమేం ఉంటాయి? వాటివల్ల మన ఆరోగ్యానికి జరిగే మేలు ఏంటి? మీకు తెలియాల్సిన 5 విషయాలు..

గుడ్డు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

పౌష్టికాహార లోపం అధిగమించాలనుకునే వారికి వైద్యులు సూచించే పదార్థాల్లో గుడ్డు ఒకటి. ప్రతిరోజూ గుడ్డు తింటే ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

కోవిడ్-19 సమయంలో కూడా కోడి గుడ్లు వినియోగం బాగా పెరిగింది. రోగనిరోధక శక్తిని పెంచుకోవాలనుకునే వారంతా కోడిగుడ్డు తీసుకోవాలని ప్రభుత్వ వర్గాలు కూడా ప్రచారం చేశాయి. తద్వారా వైరస్ వంటి మహమ్మారిని ఎదుర్కొనే శక్తి పెరుగుతుందని సూచనలు చేశాయి.

అదే సమయంలో కోడి గుడ్డు వినియోగం మీద నేటికీ కొద్దిమంది నుంచి భిన్నాభిప్రాయాలు వినిపిస్తుంటాయి. ముఖ్యంగా గుడ్డు తినడం వల్ల ఏం ఉపయోగం? గుడ్డులో ఏ భాగం తినాలి? ఎప్పుడు తినాలి? అసలు గుడ్డులో ఏముంటాయి? అనే ప్రశ్నలు వినిపిస్తూ ఉంటాయి.

ఈ నేపథ్యంలో అక్టోబర్ రెండో శుక్రవారం ప్రపంచ గుడ్డు దినోత్సవం సందర్భంగా కోడి గుడ్డు గురించి అందరికీ తెలియాల్సిన కొన్ని అంశాలు చదవండి.

గుడ్డు

ఫొటో సోర్స్, Getty Images

గుడ్డులో ఏముంటాయి?

ఇండియాలో కోడి గుడ్డు వినియోగం ఎక్కువగా ఉంటుంది. గుడ్డు కూడా వివిధ రూపాల్లో తీసుకుంటారు. ముఖ్యంగా ఉడికించిన కోడిగుడ్లు తినడం అత్యధిక ప్రాంతాల్లో అలవాటు.

  • కోడిగుడ్డు సాధారణంగా 65 గ్రాముల బరువు ఉంటుంది.
  • ఉడికించిన గుడ్డులో పొటాషియం, ఐరన్, జింక్, విటమిన్-ఇ పుష్కలంగా ఉంటాయి.
  • ఒక గుడ్డు నుంచి 6.29 గ్రాముల ప్రోటీన్తో పాటుగా 78 క్యాలరీలు అందుతాయని పరిశోధనల్లో తేలింది.
  • గుడ్డులో మాంసకృత్తులు సమృద్ధిగా ఉండడం వల్ల మనిషి ఆరోగ్యవంతంగా ఎదిగేందుకు దోహదపడుతుంది. ముఖ్యంగా కండర నిర్మాణానికి ఎంతో మేలు చేస్తుంది.

ప్రతిరోజూ ఒక ఉడికించిన గుడ్డును తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన శక్తి అందుతుంది.

గుడ్డు

ఫొటో సోర్స్, Getty Images

గుడ్డు తింటే ప్రయోజనం ఏమిటి?

కోడి గుడ్డులోని ప్రోటీన్ శరీరానికి శక్తిని అందించడమే కాకుండా కంటి చూపు మెరుగ్గా ఉండేందుకు దోహదపడుతుంది. ప్రతి రోజు గుడ్డు తినేవారిలో కంటి సమస్యలు తక్కువగా వస్తాయని విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ చీఫ్ డైటీషియన్ స్వాతి తెలిపారు.

"గుడ్డు తింటే ఐ సైట్, శుక్లాలు వచ్చే అవకాశం బాగా తగ్గుతుంది. గుడ్డులో విటమిన్‌-ఎ ప్రధానమైన పోషకం. కంటి చూపు మందగించడం వంటి సమస్యలను అధిగమించేలా గుడ్డులో ఉండే జింక్‌, సెలీనియం, విటమిన్‌-ఇ వంటివి తోడ్పడతాయి. విటమిన్‌-డీ కూడా గుడ్డులో పుష్కలంగా ఉంటుంది. శరీరానికి ఎండ తగలకపోవటం, సరైన పోషకాహారం తీసుకోకపోవటం వల్ల ప్రస్తుతం అత్యధికులు విటమిన్‌-డీ లోపంతో బాధపడుతున్నారు. అలాంటి సమస్యలను అధిగమించేందుకు గుడ్డు మేలు చేస్తుంది"అని ఆమె వివరించారు.

కోడిగుడ్డులో ఉండే అమైనో ఆమ్లాలు అధికంగా శారీరక శ్రమ చేసిన వారు తిరిగి శక్తిని పుంజుకోవటానికి ఉపయోగపడతాయని ఆమె తెలిపారు.

గుడ్డు

ఫొటో సోర్స్, NORRIE RUSSELL, THE ROSLIN INSTITUTE

కాలేయ జబ్బులు, ధమనులు, నాడీ సమస్యలు ఎదురుకాకుండా చూసేందుకు గుడ్డులో ఉన్న కోలిన్ పనిచేస్తుందని ఆమె చెప్పారు.

గర్భిణులకు కాల్షియం అందించేందుకు గుడ్డు తినడం అవసరమని ఆమె సూచించారు.

గుడ్డు తినడం ద్వారా మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుందని, హెచ్‌డీఎల్ స్థాయి మెరుగవుతుందని ఆమె వివరించారు. ట్రైగ్లిజరైడ్ల మోతాదు తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యంగా ఉండేందుకు నిత్యం కోడిగుడ్డు తినడం ప్రయోజనాన్ని ఇస్తుందన్నారు.

గుడ్డులో ఉన్న సల్ఫర్‌, పలురకాల విటమిన్లు, లవణాల వల్ల జట్టుకి మంచి పోషణ అందుతుందని శాస్త్రీయంగా నిరూపితమైనట్లు డాక్టర్ స్వాతి తెలిపారు.

ఉడికించిన గుడ్డులో విటమిన్ డితో పాటు మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, పుష్కలంగా ఉండి, గోళ్లు పొడి బారిపోకుండా కాపాడుతాయని ఆమె అన్నారు.

గుడ్డు

ఫొటో సోర్స్, NORRIE RUSSELL, THE ROSLIN INSTITUTE

గుడ్డులో పచ్చసొన వల్ల నష్టముందా?

గుడ్డు తినే చాలా మంది పచ్చసొన విషయంలో చాలా సందేహాలు వ్యక్తం చేస్తూ ఉంటారు. పచ్చసొన తినడం మీద అనేక అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉంటాయి. అయితే నిపుణులు మాత్రం పచ్చ సొన కారణంగా నష్టం లేకపోగా అనేక ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు.

"గుడ్డులోని పచ్చసొన పిల్లలతో పాటు గర్భిణులకు కూడా చాలా ఆరోగ్యకరం. అందరికీ అది మేలు చేస్తుంది. అందులో కొంత కొవ్వు ఉన్న మాట నిజమే. గానీ అది గుండెకు మంచి చేసే కొలెస్ట్రాల్. దానిని తీసుకోవడం చాలా అవసరం. గుడ్డు తెల్లని భాగంలో ప్రోటీన్స్, విటమిన్స్‌తో పాటుగా కాల్షియం అధికంగా ఉంటుంది. మహిళల్లో ఎముకల ఆరోగ్యానికి, ఆస్టియోపొరోసిస్‌ను దూరంగా ఉంచడానికి ఇది బాగా సహాయపడుతుంది. అదే సమయంలో పచ్చసొనలో ఉండే కొవ్వులు గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు తోడ్పడతాయి. గుడ్డు అంటే మొత్తం అంతా తినాలి. కొన్ని భాగాల గురించి అపోహలు మంచిది కాదు"అని న్యూట్రీషియనిస్ట్ డాక్టర్ గౌతమీ అభిప్రాయపడ్డారు.

ఒక గుడ్డు తినడం వల్ల 70-80 క్యాలరీలు, 6 గ్రాముల ప్రోటీన్లు, 5 గ్రాముల కొవ్వులు, 190 గ్రాముల కొలెస్ట్రాల్‌ శరీరానికి అందుతాయి అని ఆమె వివరించారు.

అరుదైన లవణాలతో పాటు ఫాస్పరస్‌, అయోడిన్‌, సెలీనియం వంటివి కూడా శరీరానికి ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.

గుడ్డు

ఫొటో సోర్స్, Getty Images

గుడ్డు ఎవరు తినాలి?

పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆరు నెలల వయసున్న శిశువుల నుంచి వృద్ధుల వరకూ ప్రతీ ఒక్కరూ గుడ్డు తినొచ్చు.

గుడ్డు జీర్ణం కావడానికి కొంత ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి తీవ్ర అనారోగ్య సమస్యలున్న వారు వైద్యుల సలహాను అనుసరించి వ్యవహరించాలని డాక్టర్ స్వాతి తెలిపారు.

సాధారణంగా చెప్పాలంటే డెంగీ, కరోనా వంటి సమస్యలతో మంచాన ఉన్న వారు తప్ప మధుమేహం, బీపీ, కిడ్నీ, కాలేయం ఎలాంటి సమస్యతో ఉన్న వారికయినా గుడ్డు తినడం వల్ల హాని కలగదని ఆమె చెప్పారు.

రోజూ ఒక గుడ్డు తినడం వల్ల సమస్య ఉండదని, శరీర అవసరాన్ని బట్టి ఎన్ని గుడ్లు తినాలనేది వైద్యుల సలహాను అనుసరించాలని డాక్టర్ స్వాతి తెలిపారు.

గుడ్డు రోజూ తినడం వల్ల బరువు నియంత్రణలో ఉంచుకోవడానికి, జ్ఞాపకశక్తి మెరుగయ్యేందుకు కూడా తోడ్పడుతుందని ఆమె చెప్పారు.

వీడియో క్యాప్షన్, కొన్ని ఆహార పదార్థాలు ఆకలిని నియంత్రిస్తాయా, పరిశోధనల్లో ఏం తేలింది?

గుడ్డు దినోత్సవం ఎందుకు?

ఇతర ఆహార పదార్థాలతో పోలిస్తే కాస్త చౌకగా లభించే పౌష్టికాహారం గుడ్డు అని వైద్యులు చెబుతుంటారు.

ఎక్కువ మంది ఉడికించిన గుడ్లు తింటే, కొందరు ఆమ్లెట్, ఇంకొందరు కేక్స్ సహా ఇతర పదార్థాలలో ఎక్కువగా గుడ్లు వాడుతుంటారు.

గుడ్ల వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరిస్తూ, అందులో పోషక విలువలను చాటేందుకు ప్రపంచ గుడ్డు దినోత్సవం జరపాలని ఇంటర్నేషన్ ఎగ్ కౌన్సిల్ నిర్ణయించింది. 1996లో వియన్నాలో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఏటా అక్టోబర్ రెండో శుక్రవారం నాడు ప్రపంచ గుడ్డు దినోత్సవం జరుపుకుంటున్నారు.

వీడియో క్యాప్షన్, రూ.3,000 తో కోళ్ల పెంపకం మొదలుపెట్టిన పేద రైతు, ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నారు

గుడ్లు ఉత్పత్తిలో చైనా, అమెరికా తర్వాత ఇండియా ప్రపంచంలోనే మూడోస్థానంలో ఉంది. ఆర్థిక సర్వే నివేదిక ప్రకారం 2021-22లో దేశంలో గుడ్లు ఉత్పత్తి 122.11 బిలియన్లుగా ఉంది. 2014-15లో అది 78.48 బిలియన్లు కాగా దాదాపు ఏడేళ్లలోనే 50 శాతం పైగా ఉత్పత్తి పెరిగింది.

గుడ్లు ఉత్పత్తిలో దేశంలో తమిళనాడు మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ, మహారాష్ట్ర తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

జాతీయ పోషకాహార సంస్థ నివేదిక ప్రకారం సగటున 181 గుడ్లు చొప్పున ఏడాదికి ఒక్కొక్కరు స్వీకరించాల్సి ఉంది. ఈ వినియోగంలో తెలంగాణాది అగ్రస్థానం.

అయితే జాతీయ సగటు మాత్రం ఏడాదికి ఒక్కొక్కరు 91 గుడ్లుగా ఉందని ఆ నివేదిక చెబుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)