పవన్ కల్యాణ్; 'ప్యాకేజీ అంటే చెప్పుతో కొడతా'- 'ఒక్కసారి కాదు వందసార్లు అంటా' -వైసీపీ మంత్రి అంబటి రాంబాబు

వీడియో క్యాప్షన్, ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతానన్న పవన్, వైసీపీ నేతలు ఏమన్నారంటే..

జనసేన కార్యకర్తల సమావేశంలో వైసీపీ పార్టీ నేతలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు.

మరోసారి ఎవరైనా ప్యాకేజీ అని మాట్లాడితే చెప్పుతో కొడతా అంటూ ఆవేశంతో ఊగిపోయారు.

మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో మంగళవారం పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ వైఎస్సాఆర్‌పార్టీ నాయకులకు సవాల్ విసిరారు.

తాను కూడా బాపట్లలోనే పుట్టానని, గొడ్డు కారం తింటూ పెరగానని వ్యాఖ్యానించిన పవన్ ఇంతకాలం వైసీపీ నేతలను తన సహనమే కాపాడిందని అన్నారు.

సభ్యత, సంస్కారం వల్లే ఇన్నాళ్లు మౌనంగా ఉన్నానని తాను కూడా వైసీపీ నేతల భాష మాట్లాడగలనని అన్నారు. ‘‘నేను అందరినీ గౌరవిస్తా. కానీ, అవతలి వాళ్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. పదే పదే నేను మూడు పెళ్లిళ్లు చేసుకున్నానని అంటున్నారు. వాటి విషయంలో చట్ట ప్రకారం నేను నడుచుకున్నా" అని చెప్పారు.

పవన్ కల్యాణ్

"వైసీపీతో ఎలాంటి యుద్ధానికైనా నేను సిద్ధమే. రాడ్లతోనా.. హాకీ స్టిక్కులతోనా.. దేంతో వస్తారో రండి తేల్చుకుందాం. ఇప్పటివరకు నా సహనం చూశారు. నా భావ ప్రకటన స్వేచ్ఛతో చెబుతున్నా, ఇవాళ్టి నుంచి యుద్ధమే, మీరు రెడీనా? వైకాపాలోని అందరూ చెడ్డవారే అనట్లేదు. కానీ అందులో చెడ్డవారి సమూహం ఎక్కువగా ఉంది. కులాల పేరుతో విమర్శలు చేయడం సభ్యత అనిపించుకుంటుందా?

14 ఏళ్ల వయస్సులోనే ప్రజలకు ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నా. చావో రేవో రాజకీయాల్లోనే ఉంటా. సినిమాలు చేస్తా. పార్టీని పోషించడం కోసం సినిమాలు చేస్తా. నాకు సిమెంటు ఫ్యాక్టరీలు లేవు. దోపిడీ చేయను. అందుకే సినిమాలు చేస్తా.

కానీ, మీరు మాత్రం జగన్‌కు ఊడిగం చేసుకోండి. వైకాపాలోని కాపు నేతలంతా జగన్‌కు ఊడిగం చేసుకోండి. కానీ, కాపులను మాత్రం లోకువ చేయొద్దు’’ అని పవన్ వ్యాఖ్యానించారు.

పవన్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు కూడా ఘాటుగా స్పందించారు.

పవన్ కల్యాణ్

'పవన్ కల్యాణ్ ఒక జోకర్': మంత్రి కాకాణి

పవన్ కల్యాణ్ ఓ పొలిటికల్ జోకర్ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు.

మంగళవారం నెల్లూరులో మీడియాతో మాట్లా డిన మంత్రి కాకాణి... పవన్ కల్యాణ్ సినిమాల్లోనే హీరో, పాలిటిక్స్‌లో జీరో అంటూ ఎద్దేవా చేశారు.

పిల్ల గ్యాంగ్‌ను చుట్టూ పెట్టుకునే పవన్ ఎవరికి సేనాని అని ప్రశ్నించారు. ఒక్కచోట కూడా ప్రజలు ఆయనను గెలించలేదని అన్నారు.

అమరావతిపై పవన్ కల్యాణ్ పూటకో మాట మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు.

గుడివాడ అమర్ నాథ్

ఫొటో సోర్స్, Gudivada Amarnath/fb

'పవన్ ముసుగు తొలిగింది': గుడివాడ అమర్‌నాథ్

ఇన్నాళ్లూ పవన్ వేసుకున్న ముసుగు తొలిగిపోయిందని ఏపీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు.

'మీకు ఆరు శాతం ఓట్లు మాకు 50 శాతం ఓట్లు వచ్చాయి. ఎవరి దగ్గర ఎక్కువ చెప్పులు ఉంటాయో తెలుసు కదా. గాజువాక భీమవరంలో ప్రజలు ఓట్ల రూపం లో చెప్పుతో కొట్టారు' అంటూ ఆయన ధ్వజమెత్తారు.

‘ప్యాకేజీ స్టార్ అని ఒకసారి కాదు, వందసార్లు అంటాం’: మంత్రి అంబటి

పవన్ కల్యాణ్ ఒక ప్యాకేజీ స్టార్. ఒక్కసారి కాదు వందసార్లు అంటాను అని మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ అసలు సిసలు రూపం ఈరోజు బయటపడిందని అన్నారు.

‘‘చంద్రబాబు నాయుడు దగ్గర ప్యాకేజీ తీసుకొని రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్నాడు. కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు. ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని హింసించినప్పుడు, నువ్వు ఎందుకు స్పందించలేదు. జనసైనికులకు హెచ్చరిక. కుక్క తోక పట్టుకొని గోదారి ఈదకండి. చివరికి నువ్వు చూపించే చెప్పే నీ పార్టీ సింబల్ అవుతుంది’’ అని రాంబాబు అన్నారు.

పవన్‌తో చంద్రబాబాు

పవన్‌ను కలిసిన చంద్రబాబు

జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్‌ను కలిసేందుకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విజయవాడ నోవాటెల్ హోటల్‌కు చేరుకున్నారు.

విశాఖలో చోటు చేసుకున్న ఘటనలపై సంఘీ భావం తెలిపేందుకు చంద్రబాబు వచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌లో గత రెండు రోజులుగా ఈ రాజకీయ వేడి రగులుతోంది.

నిజానికి ఆదివారం వైజాగ్‌లోని పోర్టు కళావాహిని స్టేడియంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనవాణి కార్యక్రమం జరగాల్సి ఉంది. దీనికోసం శనివారమే పవన్ కల్యాణ్ విశాఖ పట్నానికి చేరుకున్నారు.

అయితే, పవన్ బస చేసిన నోవాటెల్ హోటల్ నుంచి ర్యాలీ చేయకుండా, మామూలుగా వెళ్లాలని పవన్‌కు పోలీసులు సూచించారు. కానీ, తాను ర్యాలీగానే వెళతానని పవన్ పోలీసులకు చెప్పారు. ఈ విషయంలో పోలీసులు, పవన్ కళ్యాణ్ మధ్య చర్చలు జరిగాయి.

అనంతరం, జనవాణి కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్టు పవన్ కల్యాణ్ మీడియా సమావేశంలో తెలిపారు.

ఆ తర్వాత విజయవాడ వెళ్లిన పవన్ కల్యాణ్ అక్కడ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. దీనిపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందిస్తూ... విశాఖ గర్జన నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు టీడీపీ చేసిన కుట్రలో భాగంగానే పవన్ కల్యాణ్ ఇక్కడకు వచ్చి రచ్చ చేశారని అన్నారు.

వీడియో క్యాప్షన్, పవన్ కల్యాణ్: కమ్యూనిస్టు ఆదర్శాలు.. కాషాయ రోడ్ మ్యాప్.. జనసేన దారెటు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)