బురదలో ఆడుకోవడం పిల్లల ఆరోగ్యానికి మంచిదా?

బురదలో ఆడుకోవడం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అలెసియా ఫ్రాంకో, డేవిడ్ రాబ్సన్
    • హోదా, బీబీసీ కోసం

పిల్లలకు మట్టిలో ఆడడం అంటే చాలా సరదా. బురదలో గెంతడం, నీటి గుంటల్లో కాలు పెట్టడం అంటే మహా ఇష్టం. బట్టలు పాడైపోతాయా, చెప్పులు తెగిపోతాయా అన్న చింత వాళ్లకు ఉండదు. హాయిగా ఆడుకుంటారు. బురదలో ఆడడం వారి ఆరోగ్యానికి మేలు చేస్తుందంటున్నారు నిపుణులు.

"మట్టిలో ఆడకు, ఒళ్లంతా మురికి చేసుకోకు" అని పిల్లలకు చెప్పని తల్లిదండ్రులు ఉండరు. వాళ్ల బట్టలు పాడైపోతాయని బెంగపడతారు కూడా. పొలం గట్ల మీద ఆడినా, చెట్లెక్కి, పుట్టలెక్కి గంతులేసినా, తూనీగలు పట్టుకోవడానికి పరిగెత్తినా పిల్లల తెల్లటి బట్టలు మట్టి రంగులోకి మారిపోవడం ఖాయం.

అయితే, ఇది ఒకప్పటి పరిస్థితి. ఈ కాలంలో ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోని పిల్లలకు ఇలా ఆడుకునే అవకాశాలు చాలా తగ్గిపోయాయి. ఇప్పటి తరం తల్లిదండ్రులు తమ పిల్లలకు కాస్త మట్టిలో ఆడుకునే వెసులుబాటు ఉంటే బావుందును అని కోరుకుంటున్నారు. ఇంటర్నెట్ ప్రపంచం విస్తరించడం, వీడియో గేమ్స్, సోషల్ మీడియా కారణంగా పిల్లలకు ప్రకృతితో సంబంధాలు తెగిపోతున్నాయి. కొంతమందికి మట్టిలో, బురదలో ఆడుకోవడమంటే ఏమిటో అసలు తెలీదు. వాళ్లకెప్పుడూ అలాంటి అవకాశమే రాదు.

బట్టలు పాడవ్వవు కాబట్టి లాండ్రీ బిల్లు తగ్గుతుంది సరే, మరి వాళ్ల శ్రేయస్సు మాటేమిటి?

బయట ఉన్న దుమ్ము, ధూళిలో ఆరోగ్యానికి మేలు చేసే సూక్ష్మజీవులు ఉంటాయని ఇటీవల ఒక పరిశోధనలో తేలింది. ఈ సూక్షజీవులు రోగనిరోధక శక్తిని పెంపొందించేందుకు సహాయపడతాయని, అలర్జీలు, ఆస్తమా, డిప్రెషన్, ఆందోళన వంటి శారీరక, మానసిక రోగాలను ఎదుర్కునే శక్తిని అందిస్తాయని తేలింది.

ఆరుబయట ఆడుకోవడం, వ్యాయామం చేయడం వలన అనేక రకాల ప్రాకృతిక ప్రయోజనాలు పొందవచ్చని, మట్టి, బురదలో ఉండే సూక్ష్మజీవులు పిల్లల ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతాయని ఈ అధ్యయనంలో తేలింది.

బురదలో ఆడుకోవడం

ఫొటో సోర్స్, Getty Images

మానసిక ఆరోగ్యం

ఆరుబయట ఆడుకోవడం వలన కలిగే మానసిక ప్రయోజనాల గురించి ఇప్పటికే ఎన్నో పరిశోధనలు వివరించాయి. మన మెదళ్లు ప్రకృతి సహజ వాతావరణంలోనే పరిణామం చెందాయి. మన ఇంద్రియాలన్నీ ఆరుబయట ప్రదేశాలకు బాగా అలవాటుపడ్డవి.

అంటే ప్రకృతి దృశ్యాలు మనకు సరైన ప్రేరణను అందిస్తాయి. దీనివలన మెదడు రీచార్జ్ అవుతుంది. అలసిపోయినప్పుడు లేదా పరధ్యానంగా ఉన్నప్పుడు సహజసిద్ధమైన దృశ్యాలు మెదడుకు సేద కలిగిస్తాయి.

ఈ సిద్ధాంతాన్ని సమర్థిస్తూ 2009లో ఒక అధ్యయనం వెలువడింది. అటెన్షన్ డెఫిసిట్ హైపర్ఏక్టివిటీ డిసార్డర్ (ఏడీహెచ్‌డీ) ఉన్న పిల్లలు 20 నిమిషాలు నగరంలో కాంక్రీటు భవనాల మధ్య వీధుల్లో నడిస్తే కుదిరిన ఏకాగ్రత కన్నా, ఆరుబయట పార్కులో 20 నిమిషాలు నడిస్తే వాళ్ల ఏకాగ్రత మెరుగ్గా ఉందని ఈ అధ్యయనంలో తేలింది.

నేలపై గడ్డి, చుట్టూ చెట్లు ఉండడం ఈ పిల్లల మెదడుపై సానుకూల ప్రభావం చూపింది. ముఖ్యంగా, ఏడీహెచ్‌డీ ఉన్న పిల్లలను ఆరుబయట పార్కుల్లో తిప్పడం ఉపయోగకరంగా ఉంటుందని ఈ అధ్యయనకర్తలు సిఫార్సు చేసారు.

ఇదే కాకుండా, ఆరుబయట ఆడుకోవడం పిల్లలకు మంచి అనుభవాలను అందిస్తుంది. పాఠాలను నేర్పుతుంది. ఉదాహరణకు, మట్టిముద్దలు పిసకడం, బొమ్మలు చేయడం, ఇసుకతో ఇల్లు కట్టడం మొదలైనవి ఇంద్రియాలు, కదలికల మధ్య సమన్వయం మెరుగుపడడానికి దోహదపడుతుంది, దీన్నే సెన్సోరిమోటర్ అభివృద్ధి అంటారని డాక్టర్ ఫ్రాన్సిస్కో విట్రానో చెప్పారు. ఫ్రాన్సిస్కో విట్రానో ఇటలీలోని పలెర్మో విశ్వవిద్యాలయంలో చైల్డ్ న్యూరోసైకియాట్రిస్ట్, సైకోథెరపిస్ట్, లెక్చరర్‌గా వ్యవహరిస్తున్నారు.

ఆయన చాలాకాలం నుంచి పిల్లలకు ఈ రకమైన థెరపీలు అందిస్తున్నారు. దీనివలన పిల్లలకు తమ శరీరం అందించే సంకేతాలను అర్థం చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది. అలాగే, వారిలో కలిగే భావోద్వేగాలను ఎదుర్కోవడానికి మార్గాలు తెలుస్తాయి.

ఉదాహరణకు తమకు కలిగే భావోద్వేగాలను నోటి ద్వారా చెప్పడానికి కష్టపడే పిల్లలకు "సాండ్ ట్రే థెరపీ" అని పిలిచే చికిత్సను అందిస్తారు. ఇందులో భాగంగా పిల్లలకు ఇసుక, కొన్ని చిన్న చిన్న బొమ్మలు ఇచ్చి తమ ఆలోచనలు, భావాలను వ్యక్తపరచమంటారు.

ఇక శారీరక ప్రయోజనాలు మనకు తెలిసినవే. ఆరుబయట ఆడుకోవడం వలన శరీరానికి తగినంత వ్యాయామం అందుతుంది. శరీరానికి కావలసిన బలాన్ని, శక్తిని పెంచుకోవడానికి, ఊబకాయం బారిన పడకుండా ఉండడానికి ఆటలు సహకరిస్తాయని అమెరికాలోని టెక్సాస్ విశ్వవిద్యాలయంలో జరిపిన ఒక అధ్యయనంలో వివరించారు. మానవ అభివృద్ధి, కుటుంబ శాస్త్రాల ప్రొఫెసర్ ఎలిజబెత్ గెర్‌షాఫ్ ఈ అధ్యయనానికి నేతృత్వం వహించారు.

తాజా అధ్యయనంలో ప్రకృతి సహజ వాతావరణంలో ఆడుకోవడం వలన వీటికి మించిన ప్రయోజనాలు చేకూరుతాయని తేలింది. ఆ రహస్యం బహుసా మట్టి, బురదలోనే ఉండవచ్చు.

బురదలో ఆడుకోవడం

ఫొటో సోర్స్, Getty Images

పాత స్నేహితులు

1980ల చివరలో "పరిశుభ్రత పరికల్పన"పై వచ్చిన మౌలిక సూత్రాలకు తాజా అధ్యయనం కొత్త దృక్కోణాన్ని జోడించింది. ఈ సిద్ధాంతం ప్రకారం, 20వ శతాబ్దంలో చిన్నవయసులో వచ్చే ఇంఫెక్షన్లను తగ్గించాలనే తాపత్రయం, ప్రజల రోగ నిరోధక వ్యవస్థపై దెబ్బ కొట్టిందని, దీనివలన ఏ చిన్న మార్పులకైనా శరీరం తీవ్రంగా స్పందిస్తోందని చెబుతున్నారు. ఉబ్బసం, గవత జ్వరం (హే ఫీవర్), ఫుడ్ అలెర్జీలు పెరగడానికి ఇదే కారణం అంటున్నారు.

నేటి కాలంలో చాలామంది సైనిటిస్టులు పరిశుభ్రత సిద్ధాంతాన్ని ఇష్టపడరు. ప్రకృతిలో ఇంఫెక్షన్ కలిగించని సూక్ష్మజీవులు ఉంటాయని, మానవ పరిణామ క్రమంలో అవి మన పాత స్నేహితుల్లాంటివని వీరు అంటున్నారు. ఇవి మనకు హాని కలిగించవు. పైగా రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి.

మనం ఆరుబయట సమయం గడిపినప్పుడు శరీరం, తన పాత స్నేహితులను కలుసుంది. అయితే, నగరీకరణ పెరగడం, ఆరుబయట ఆటలు తగ్గడంతో చాలామంది పిల్లలకు ఈ స్నేహం అందట్లేదు. అందువల్ల వారి రోగ నిరోధక వ్యవస్థ మరింత సున్నితమైపోతోంది. ఏ చిన్న మార్పుకైనా అతిగా స్పందిస్తోంది.

ఈ దృక్కోణాన్ని పలు అధ్యయనాలు సమర్థిస్తున్నాయి. పొలాల్లో తిరిగే పిల్లలకు ఉబ్బసం, అలెర్జీలు, ఆటో-ఇమ్యూన్ రోగాలు వచ్చే అవకాశాలు తక్కువని నిపుణులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పెరిగే పిల్లలు చిన్నవయసులోనే అనేక రకాల సూక్ష్మజీవులకు అలవాటుపడడం వలన వారి రోగ నిరోధక వ్యవస్థ బలపడుతోందని ఈ అధ్యయనాలు చెబుతున్నాయి.

వీటిలో చాలా జీవులు జీర్ణవ్యవస్థ ద్వారా మనకు మేలు చేస్తాయి. కొన్ని రకాల సూక్ష్మజీవులు కడుపుకు మేలు చేస్తాయనే సిద్ధాంతం ఇప్పటికే చాలాసార్లు నిరూపణ అయింది.

అయితే, ఇవి చర్మం ద్వారా కూడా మేలు చేస్తాయని ఇటలీలోని రెజియో ఎమిలియాకు చెందిన డాక్టర్ మిచెల్ ఆంటోనెల్లి అంటున్నారు. బురద, మట్టి ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుస్తాయనే అంశంపై ఆయన పరిశోధనలు జరిపారు.

మన శరీరంపై చర్మం బయటిపొరల్లో అనేక రకాల సూక్ష్మజీవులు ఉంటాయని, తామర, గజ్జి, పొలుసుల వంటి చర్మ వ్యాధులు ఉన్నవారి చర్మంపై ఈ సూక్ష్మజీవులు తక్కువగా ఉంటాయని డాక్టర్ ఆంటోనెల్లి వివరిస్తున్నారు.

"ఈ సూక్ష్మజీవులు అనేక దీర్ఘకాలిక వ్యాధుల లక్షణాలను తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి" అని ఆయన చెప్పారు.

పిల్లలు

ఫొటో సోర్స్, Getty Images

ఆరోగ్యమైన శరీరం ఉంటే మెదడు ఆరోగ్యంగా ఉంటుంది

ఆసక్తికరంగా, ప్రకృతిలో ఉండే స్నేహపూర్వక సూక్ష్మజీవులు మెదడుపై కలిగించే ఒత్తిడిని కూడా నియంత్రిస్తాయి.

మనకు హాని కలుగుతుంది అనుకున్నప్పుడు లేదా భయపడినప్పుడు రోగ నిరోధక వ్యవస్థ శరీరంలో ఇంఫ్లమేషన్ పెంచుతుంది. ఇంఫెక్షన్లను నిరోధించేందుకు సహకరించే మొదటి సాధనం ఈ ఇంఫ్లమేషనే. అయితే, నేటి కాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఒత్తిడికి ఇది ఎక్కువ సహాయం చేయదు.

పట్టణాల్లో పెరిగినవారికన్నా చిన్నతనంలో గ్రామీణ ప్రాంతాలో ఎక్కువ సమయం గడిపినవారు ఒత్తిడిని మెరుగ్గా ఎదుర్కుంటున్నారు. బహిరంగంగా మాట్లాడాల్సి వచ్చినప్పుడు భయం కారణంగా పెరిగే ఇంఫ్లమేషన్ స్థాయిలు వీరిలో తక్కువగా ఉన్నాయి. వారి ఆర్థిక, సాంఘిక స్థితిగతులను పక్కనపెట్టి చూసినా ఇవే ఫలితాలు కనిపిస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇది దీర్ఘకాలిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపిస్తుంది. ఇంఫ్లమేషన్ పెరగడం అనేది డిప్రెషన్‌కు దారితీయవచ్చు.

"శారీరక, మానసిక ఒత్తిడి పరంగా చూస్తే నగరాల్లో పెరుగుతున్నవారు ఒక రకంగా నడిచే టైం బాంబుల్లాంటివారు" అని తాజా అధ్యయనం పరిశోధకుల్లో ఒకరైన లౌరీ అన్నారు.

వీడియో క్యాప్షన్, బాలబాలికల మధ్య సమానత్వ భావనను పెంచడం కోసమే అంటున్న స్కూలు యాజమాన్యం

మైకోబాక్టీరియం వ్యాకే, హెల్మిన్త్స్ మొదలైన సూక్ష్మజీవులు మన స్నేహితులు

ఓవైపు, "పాత స్నేహితుల సిద్ధాతాన్ని" సమర్థించే అధ్యయనాలు వెలువడుతుండగా, మరోవైపు, ఈ ప్రయోజనాలను చేకూర్చే ప్రత్యేకమైన సూక్ష్మజీవులేమిటో కనిపెట్టేందుకు శాస్త్రవేత్తలు నడుం కట్టారు. ఆ దిశగా పరిశోధనలు జరుపుతున్నారు.

ముఖ్యంగా మట్టిలో ఉండే 'మైకోబాక్టీరియం వ్యాకే'పై లౌరీ ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ దిశలో ఎలుకలపై ప్రయోగాలు చేశారు. ఎలుకలకు మైకోబాక్టీరియం వ్యాకే ఉన్న ఇంజెక్షన్లు ఇచ్చారు. దానివల్ల వాటిల్లో రోగ నిరోధక వ్యవస్థకు అవసరమయ్యే టీ కణాల్లో ఏక్టివిటీ పెరిగినట్లు కనిపించింది. ఇది వాటిల్లోని ఒత్తిడిని తగ్గించినట్టు గమనించారు. ఇతర ఎలుకలతో ఘర్షణ పడినప్పుడు లేదా బలమైన ఎలుకలు ఎదురుపడినప్పుడు వాటిలో కలిగే ఒత్తిడిపై దీని ప్రభావం కనిపించింది.

"ఒత్తిడిని ఎదుర్కోవడంలో నాటకీయ ప్రభావాలు కనిపించాయి. ఇంజెక్షన్ ఇచ్చిన ఒక నెల తరువాత కూడా దాని ప్రభావం కనిపించింది" అని లౌరీ చెప్పారు.

అయితే, ఎలుకలకు, మానవులకు తేడా ఉంటుంది. కానీ, ఈ ప్రయోగం వలన మానవుల ఆరోగ్యంపై సూక్ష్మజీవుల ప్రభావాన్ని సూచించే కొన్ని ఆధారాలు దొరికాయి.

అలాగే "హెల్మిన్త్స్" అని పిలిచే సూక్ష్మజీవులు, అంటే మట్టిని తవ్వే వానపాముల్లాంటివి కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయని కొందరు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

హెల్మిన్త్స్ బారిన పడిన వ్యక్తుల్లో పేగుల్లో ఇంఫ్లమేషన్ లాంటివి తక్కువగా ఉన్నట్టు కనిపించింది. హెల్మిన్త్స్ ఒక రకమైన పరాన్నజీవులు. కొందరికి హెల్మిన్త్స్ ఎక్కించి, వారి శరీరంలో కలిగే మార్పులను గమనించారు. మిశ్రమ ఫలితాలు వచ్చాయి. అయితే, వీటి వలన కలిగే దుష్ప్రభావాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కొందరికి ఇలా సూక్ష్మజీవులను శరీరంలోకి ఎక్కించడం అసహ్యం కూడా కలిగించవచ్చు. దాన్నీ పరిగణించాలి.

స్పా థెరపీలు, మడ్ బాత్ (మట్టి స్నానం), థెర్మల్ మినరల్ వాటర్ బాత్ మొదలైనవి ఆరోగ్యానికి ప్రయోజనం కలిగించవచ్చని ఆంటోనెల్లి సూచిస్తున్నారు.

పైన చెప్పినవే కాకుండా మట్టి, బురదలో ఉండే పలు రకాల సూక్ష్మజీవులు, స్టెఫిలోకాకస్ ఎపిడెర్మిడిస్ లాంటివి కూడా ఇంఫ్లమేషన్‌ను తగ్గించి రోగ నిరోధక శక్తిని పెంపొందించేందుకు సహాయపడవచ్చు.

పిల్లలు

ఫొటో సోర్స్, Getty Images

'అడవి స్నానం'

చిన్నప్పుడే అడవి ప్రాంతాల్లో ఎక్కువగా తిరగడం కూడా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. "అడవి స్నానం" అంటే గుబురుగా ఉండే చెట్ల మధ్య మెల్లగా నడుచుకుంటూ వెళ్లడం వలన ప్రయోజనాలు ఉంటాయని ఆంటోనెల్లి అంటున్నారు. ఉదాహరణకు, అటోపిక్ డెర్మటైటిస్‌తో బాధపడుతున్న పిల్లలు, యుక్తవయస్కులు గుబురు చెట్ల మధ్య నడవడం వలన రోగ లక్షణాలు నెమ్మదించాయని పరీక్షలో తేలింది.

చెట్ల ఆకులను, మట్టిని చేత్తో తడమడం వలన స్నేహపూర్వక సూక్ష్మజీవులు వారి చర్మ రంధ్రాల్లోకి చేరి ఉంటాయని ఆంటోనెల్లి అన్నారు.

ఫిన్‌లాండ్‌లో ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమంలో పిల్లలను ప్రకృతికి దగ్గరగా తీసుకువచ్చే ప్రయోగాలు చేపట్టారు. నాలుగు డే కేర్ సెంటర్లలో ఆరుబయట కంకర తీసివేసి, మట్టితో నింపారు. అడవి నుంచి తెచ్చిన చెట్లను నాటారు.

నెల తరువాత, పిల్లల కడుపులో, చర్మంపై ప్రకృతి సహజ సుక్ష్మజీవులు పెరగడం గమనించారు. వారి ఆరోగ్యం, రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందినట్టు గమనించారు. వాళ్లల్లో టీ కణాలు పెరిగాయి. రక్తంలోని ప్లాస్మాలో యాంటీ-ఇంఫ్లమేషన్ కణాలు కూడా పెరిగాయి. ఇదంతా రోగ నిరోధక వ్యవస్థకు మేలు చేసేదే.

భవిష్యత్తులో కూడా దీని ప్రభావాలను పరీక్షిస్తారని, వ్యాధులు తగ్గే అవకాశాలు ఉంటాయని అంచనా వేస్తున్నట్టు ఈ అధ్యయన పరిశోధకుల్లో ఒకరైన, హెల్సింకి యూనివర్సిటీ ప్రొఫెసర్ అకీ సింకోనెన్ అన్నారు.

మట్టి వంటిళ్లు

మట్టి, బురద వలన మానసిక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిరూపణ కావడంతో, పశ్చిమ దేశాల్లో ఇప్పటికే చాలా స్కూళ్లు, డే కేర్ సెంటర్లలో ప్రకృతి సహజ వాతావరణాన్ని పెంపొందించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆరుబయట పాఠాలు చెప్పడం, తరచూ చెట్లున్న ప్రాంతాల్లో నడకకు తీసుకెళ్లడం, మట్టి వంటిళ్లు తయారుచేయడం వంటివి చేస్తున్నారు.

మడ్ కిచెన్.. మట్టి వంటిల్లు అంటే అక్కడ పిల్లలు ఇసుక, మట్టిలో చేతులు పెట్టి ఆడుకోవచ్చు. వంటింట్లో పాడైపోయిన పాత సామాన్లు తెచ్చి, మట్టిలో నీళ్లు కలిపి ముద్ద చేసి దానితో ఆ ఆకారాలను తయారుచేయాలి. ఇది పిల్లలకు సరదాగా ఉంటుంది.

భవిష్యత్తులో ఇళ్లు, స్కూళ్లల్లో మట్టి ప్రదేశాలు, చెట్లు పెరగవచ్చు. ప్రస్తుతానికి తల్లిదండ్రులు, టీచర్లు పూనుకుని పిల్లలను మట్టిలో ఆడేలా ప్రోత్సహించాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

వీడియో క్యాప్షన్, మానసిక వైకల్యంతో ఉన్న చిన్నారులను ఆమె అమ్మలా చూసుకుంటారు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)