ఇరాన్ నిరసనలు: ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న జెన్ Z అమ్మాయిలు

ఇరాన్ నిరసనలు:

ఫొటో సోర్స్, SARINA ESMAILZADEH

ఫొటో క్యాప్షన్, చనిపోయే ముందు16 ఏళ్ల సరీనా ఎస్మాయిల్‌జాదే
    • రచయిత, పర్హం గోబాడి
    • హోదా, బీబీసీ పర్షియన్

ఇరాన్‌లో మునుపెన్నడూ లేని విధంగా మతపరమైన పాలనకు వ్యతిరేకంగా కొత్త తరం మహిళలు, బాలికలు గొంతు విప్పుతున్నారు. వారి తల్లిదండ్రులు, తాతలు అక్కడి వ్యవస్థను మార్చడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. ప్రస్తుత నిరసనలు దేశమంతటా వ్యాపించాయి.

ఇరాన్ ప్రభుత్వం ఈ నిరసనలను అణచివేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

ప్రాణాలను పణంగా పెట్టి మరీ యువత నిరసనలకు ఎందుకు దిగుతున్నారో సోషల్ మీడియా ద్వారా, వీడియో సందేశాల ద్వారా వివరిస్తున్నారు.

"మతపెద్దల్లారా, ఇక్కడి నుంచి వెళ్లిపోండి" .. ఇరాన్‌లోని క్లాసురూముల్లో 11 ఏళ్ల బాలికలు సైతం చేస్తున్న నినాదమిది.

ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ చిత్రాలను పెరికివేస్తూ, చింపేస్తూ, కాల్చివేస్తూ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి.

"ఇప్పుడు మేమంతా ఏకం కాకపోతే, ఒకరి తరువాత ఒకరికి మహసా అమీనీకి పట్టిన దుర్గతే పడుతుంది".. ఇది మరో నినాదం.

హిజాబ్ సరిగ్గా ధరించలేదని ఇరానియన్-కుర్దు మహిళ అమీనీని ఇరాన్ మొరాలిటీ పోలీసులు రాజధాని తెహ్రాన్‌లో అదుపులోకి తీసుకున్నారు. వారి నిర్బంధంలో ఉన్నప్పుడే ఆమె స్పృహ కోల్పోయి, కోమాలోకి వెల్లిపోయారు. మూడు రోజుల తరువాత ఆస్పత్రిలో చనిపోయారు.

దాంతో, ఇరాన్‌లో ఆగ్రహ జ్వాలలు ఎగిశాయి. అధికారులు హింసాత్మకంగా ప్రతిస్పందిస్తున్నప్పటికీ నిరసనలు తగ్గుముఖం పట్టట్లేదు.

ఇరాన్ నిరసనలు

ఫొటో సోర్స్, HADIS NAJAFI

ఫొటో క్యాప్షన్, నిరసనల్లో ప్రాణాలు కోల్పోయిన హదీస్ నజాఫీ

ప్రాణాలకు సైతం లెక్క చేయక...

టిక్‌టాకర్, 22 ఏళ్ల హదీస్ నజాఫీ నిరసనల్లో పాల్గొంటూ ఒక వీడియోను రికార్డ్ చేశారు. మంచి భవిష్యత్తు కోసం కలలు కంటూ ఆమె ఆందోళనలలో పాలుపంచుకుంటున్నారు.

"కొన్నేళ్ల తరువాత నేను వెనక్కి తిరిగి చూసుకుంటే సంతోషంగానే ఉంటాను. మార్పంతా మన మంచికే అని ఆనందిస్తాను" అని ఆమె ఆ వీడియోలో చెప్పారు. అప్పుడే చీకటి పడుతున్నట్టు వీడియోలో తెలుస్తోంది.

ఆ తరువాత ఒక గంటకు ఆమెను కాల్చి చంపేశారని హదీస్ కుటుంబం బీబీసీకి చెప్పింది.

హదీస్ తల్లి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియోలో, హదీస్ గుండె, కడుపు, మెడపై బుల్లెట్ గాయాలు ఉన్నాయని తెలిపారు.

"తను ఆఫీసు నుంచి ఇంటికొచ్చింది. ఆకలేస్తోంది అంది. కానీ, ఏమీ తినకుండానే మహాసా అమీనీ కోసం చేస్తున్న నిరసనలలో పాలుపంచుకునేందుకు వెళ్లింది. ఆకలితో వెళ్లింది" అని హదీస్ తల్లి చెప్పారు.

ప్రభుత్వ హింసాత్మక అణచివేతల్లో ఎంతోమంది యువత, చిన్నపిల్లలు చనిపోయారని మానవ హక్కుల సంఘాలు చెబుతున్నాయి. మరెంతోమందిని అరెస్ట్ చేశారు.

అంతిమంగా ఇరాన్ జనరేషన్ Z భారీ మూల్యం చెల్లిస్తోంది.

వీడియో క్యాప్షన్, ఇరాన్ హిజాబ్ ఆందోళనలకు పెరుగుతోన్న అంతర్జాతీయ మద్దతు

'జీవితాలను ఇంతకంటే భిన్నంగా జీవించవచ్చని వాళ్లు గ్రహించారు'

ఇరాన్ సామాజిక శాస్త్రవేత్త హుసేన్ ఘాజియన్ మాట్లాడుతూ, సోషల్ మీడియా ప్రాబల్యం నిరసనలకు ఒక కారకంగా ఉందన్నారు. దానితో పాటు, మార్పు దిశగా ఏ రకమైన అవకాశాలు లేవన్న నిరాశ కూడా నిరసనలు పుంజుకోవడానికి ఊతమిస్తోందని అన్నారు.

"ఈ తరం యువతకు అంతా తెలుసు. తాజా సమాచారం వారి చేతిలో ఉంది. వాళ్లు ఎలాంటి ప్రపంచంలో నివసిస్తున్నారో వారికి బాగా తెలుసు. జీవితాలను ఇంతకంటే భిన్నంగా జీవించవచ్చని వాళ్లు గ్రహించారు. ఈ పాలనలో భవిష్యత్తుపై వారికి ఎలాంటి ఆశలు లేవు. అందుకే ఇంత ధైర్యం చేసి నిరసనల్లో పాల్గొంటున్నారు" అని ఆయన అన్నారు.

సరీనా ఎస్మాయిల్‌ జాదే అనే 16 ఏళ్ల వీడియో బ్లాగర్ ఇరాన్ యువత నిర్భీతి వైఖరిని విప్పిచూపారు.

"మేం మా ముందు తరంలా కాదు. 20 ఏళ్ల క్రితం మా ముందు తరాలవారికి ఇరాన్ బయట జీవితం ఎలా ఉంటుందో తెలీదు. న్యూయార్క్ లేదా లాస్ ఏంజెలెస్‌లోని యువతలా మేమెందుకు సరదాగా గడపలేకపోతున్నామని మమ్మల్ని మేం ప్రశ్నించుకుంటున్నాం" అని ఆమె తన యూట్యూబ్ చానెన్‌లోని ఒక వీడియోలో అన్నారు.

గౌరవప్రదమైన జీవితం కోసం ఈ అమ్మాయిలు ఏదైనా పణంగా పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు.

సరీనా నిరసనలలో ప్రాణాలు కోల్పోయారు. ఆమె తలపై బలమైన గాయాలు ఉన్నాయని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తెలిపింది.

అయితే, ఇరాన్ ప్రభుత్వం ఈ వాదనను ఖండిస్తోంది. ఆమె ఒక భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారని చెబుతోంది.

ఆమె కుటుంబం ఒత్తిడిలో ప్రభుత్వం చెప్పిన మాటలను అంగీకరించింది. మీడియాతో మాట్లాడడానికి ఇష్టపడలేదు.

ఆజాదే పౌర్జాండ్‌
ఫొటో క్యాప్షన్, ఆజాదే పౌర్జాండ్‌

'వాళ్లకేం కావాలో వాళ్లకు స్పష్టంగా తెలుసు'

మానవ హక్కుల పరిశోధకురాలైన ఆజాదే పౌర్జాండ్‌కు ఈ నిరసనలు మార్పు దిశగా వేస్తున్న బలమైన అడుగులు. ఇరాన్ యువతులకు ఉన్న స్పష్టత, వారి డిమాండ్లు ఆమెను కదిలించాయి.

"వారు ఒకరితో ఒకరు సరళంగా, సూటిగా మాట్లాడుకుంటున్న విధానం చూస్తుంటే, తమ డిమాండ్లను, ఆశలను ప్రపంచానికి తెలియజేయడంలో వారు మాకంటే విజయవంతమయ్యారని చెప్పవచ్చు" అని ఆమె అన్నారు.

తమ తల్లిదండ్రులు, తాతల తరం ఇస్లామిక్ వ్యవస్థను మార్చడంలో ఎలా విఫలమైందో వీరంతా గమనించారని, వాటి నుంచి పాఠాలు నేర్చుకున్నారని ఆజాదే అభిప్రాయపడ్డారు.

"ముందు తరాలకు భవిష్యత్తు వీరు. దేనికీ భయపడని జీవితాన్ని వారు కోరుకుంటున్నారు" అంటూ ఇరాన్ యువతుల ధైర్యాన్ని ప్రశంసించారామె.

ఈ నిరసనలతో ఆమెకు వ్యక్తిగత అనుబంధం కూడా ఉంది. ఆమె తల్లి మెహ్రంగీజ్ కర్ ఇరాన్‌లోని ప్రముఖ మానవ హక్కుల న్యాయవాదులలో ఒకరు. కానీ, ఆమె దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది. తన తల్లి ఈ క్షణాన్ని ఒకవైపు విచారంతో, మరోవైపు గర్వంగా గమనిస్తున్నారని ఆజాదే అన్నారు.

యూనివర్సిటీ విద్యార్థులు లంచ్ టైంలో జెండర్ పరంగా విడిగా కూర్చుని భోజనం చేసే నియమాన్ని వ్యతిరేకించినందుకు ఆమె తల్లి చాలా సంతోషించారు.

యూనివర్సిటీ కెఫెటీరియా బయట వారంతా కింద కూర్చుని కలిసి భోజనం చేసారు.

"నా కానుక నాకు దక్కింది. జీవితాంతం నేను చేసిన పోరాటానికి బహుమతి నాకు దక్కింది" అని తన తల్లి అన్నారని ఆజాదే చెప్పారు.

ఇప్పుడు, ఇరాన్‌లో అన్ని తరాలవారూ జరుగుతున్నది చూస్తున్నారు, మార్పు కోసం వేచి చూస్తున్నారు.

వీడియో క్యాప్షన్, హిజాబ్‌ను తప్పనిసరిగా ధరించాలన్న నిబంధనను వ్యతిరేకిస్తూ పోరాటం...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)