క్యారెట్ రుచికి నవ్వి, క్యాబేజీ రుచికి ముఖం చిట్లించిన గర్భస్థ శిశువులు...ఈ ప్రయోగంలో ఏం తేలిందంటే..

తల్లులు, క్యారట్ క్యాప్సూల్ తిన్న 20 నిమిషాల తర్వాత చేసిన అల్ట్రాసౌండ్ స్కానింగ్‌లో గర్భంలోని శిశువు నవ్వుతున్నట్లుగా కనిపించింది

ఫొటో సోర్స్, Fetal and Neonatal Research Lab, Durham University

ఫొటో క్యాప్షన్, తల్లులు, క్యారట్ క్యాప్సూల్ తిన్న 20 నిమిషాల తర్వాత చేసిన అల్ట్రాసౌండ్ స్కానింగ్‌లో గర్భంలోని శిశువు నవ్వుతున్నట్లుగా కనిపించింది
    • రచయిత, అహ్మన్ ఖవాజా
    • హోదా, బీబీసీ న్యూస్

కాలే (లీఫ్ క్యాబేజీ) రుచి చూడగానే మీరు ముఖాన్ని చిట్లిస్తారా? అయితే, ఇలా చేసేది మీరొక్కరే కాదు. గర్భస్థ శిశువులు కూడా ఇలా చేస్తున్నారు.

తల్లి, క్యారెట్ తిన్న తర్వాత గర్భంలోని శిశువులు నవ్వుతున్నట్లుగా... కాలే తిన్నప్పుడు ముఖం చిట్లిస్తున్నట్లుగా కనిపించినట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

గర్భంలోని పిండాలు, విభిన్న రుచులకు స్పందిస్తున్నట్లుగా చూపించే తొలి ప్రత్యక్ష సాక్ష్యం ఇదేనని యూకేలోని డర్హమ్ యూనివర్సిటీకి చెందిన 'ది నియోనేటల్ రీసెర్చ్ ల్యాబ్' పేర్కొంది. వారు శిశువుల స్పందనలను రికార్డ్ చేశారు.

ఇంగ్లండ్‌లోని పరిశోధకులు 100కు పైగా గర్భిణులపై, వారి గర్భస్థ శిశువులపై అధ్యయనం చేశారు.

ఈ అధ్యయనంలో భాగంగా 35 మంది మహిళలకు క్యారెట్ పొడి క్యాప్సూల్, 34 మందికి కాలే పొడి క్యాప్సూల్‌ను ఇచ్చారు. మిగతా 30 మందిని మరో గ్రూపులో చేర్చి వారికి ఎలాంటి క్యాప్సూల్‌ను ఇవ్వలేదు.

కాలే (లీఫ్ క్యాబేజీ) రుచి చూసిన తర్వాత ముఖం చిట్లించుకున్న గర్భస్థ శిశువు

ఫొటో సోర్స్, Fetal and Neonatal Research Lab, Durham University

ఫొటో క్యాప్షన్, కాలే (లీఫ్ క్యాబేజీ) రుచి చూసిన తర్వాత ముఖం చిట్లించుకున్న గర్భస్థ శిశువు

4డి ద్వారా రియల్ టైమ్ స్పందనలు

ఈ పరిశోధన గురించి 'సైకలాజికల్ సైన్స్' జర్నల్‌లో ప్రచురించారు. తల్లులు, క్యాప్సూల్స్‌ను తీసుకున్న 20 నిమిషాల తర్వాత 4డి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేశారు. లీఫ్ క్యాబేజీ క్యాప్సూల్ తిన్న తల్లుల గర్భంలోని శిశువులు ముఖం చిట్లిస్తున్నట్లుగా కనిపించింది. అదే సమయంలో క్యారెట్ క్యాప్సూల్ తిన్న తల్లుల గర్భంలోని పిండాలు నవ్వుతున్నట్లుగా కనిపించాయని ఆ జర్నల్‌లో పేర్కొన్నారు.

ఎలాంటి క్యాప్సూల్ తీసుకోని తల్లుల గర్భంలోని శిశువుల్లో ఇలాంటి స్పందనలు కనిపించలేదని చెప్పారు.

పుట్టక ముందే మనం ఆహారపు ప్రాధాన్యతలు ఏర్పరచుకుంటామని గత అధ్యయనాలు సూచించాయి. గర్భిణుల డైట్ ఆధారంగా పిండం చుట్టూ ఉండే ఉమ్మనీరు వివిధ రుచులను కలిగి ఉంటుంది.

వివిధ రుచులకు గర్భస్థ శిశువులు స్పందించడాన్ని నేరుగా చూడటం ఇదే మొదటిసారి అని డర్హమ్ యూనివర్సిటీ అధ్యయనం తెలిపింది.

గర్భస్థ శిశువు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పిండం చుట్టూ ఉండే ఉమ్మనీరు రుచి కారణంగా పుట్టుకకు ముందే పిల్లల్లో ఆహార ప్రాధాన్యాలు ఏర్పడతాయని గత అధ్యయనాలు సూచించాయి

పిండం, ఆహారం రుచిని చూడటం ఎప్పుడు ప్రారంభిస్తుంది?

''గర్భిణిగా ఉన్నప్పుడు తల్లి తీసుకునే ఆహారం, తర్వాత బిడ్డ ఆరోగ్యంగా ఎదగడానికి ఎంతో కీలకమని ముందు అధ్యయనాలు తెలిపాయి. కానీ, పిండం ఎప్పటినుంచి రుచిని అనుభూతి చెందుతుందనే విషయం మనకు తెలియదు" అని డర్హమ్ యూనివర్సిటీలోని ఫీటల్ అండ్ నియోనేటల్ రీసెర్చ్ ల్యాబ్ హెడ్ నజా రీస్‌లాండ్ చెప్పారు.

''గర్భధారణ జరిగాక 14వ వారంలోనే గర్భస్థ శిశువులు, చక్కెరకు ప్రాధాన్యత ఇస్తారు'' అని ఆమె బీబీసీతో చెప్పారు.

''మా ప్రయోగం కోసం మేం 32, 36 వారాల గర్భస్థ శిశువులకు క్యాప్యూల్స్ ఇచ్చాం. ఈ ప్రయోగాన్ని కొనసాగించాలి అనుకుంటున్నాం. పిల్లలు జన్మించిన తర్వాత కూడా డేటా రికార్డ్ చేయాలని అనుకుంటున్నాం. గర్భంలో ఉన్నప్పటి తరహాలోనే బయటకు వచ్చిన తర్వాత కూడా క్యారెట్, లీఫ్ క్యాబేజీలకు పిల్లలు అదే విధంగా స్పందిస్తారా? లేదా అనేది పరిశీలించాలి. పుట్టిన తర్వాత వారు ఆకుపచ్చ కూరగాయలు, ఆకుకూరలకు అలవాటుపడతారని మేం ఆశిస్తున్నాం'' అని ఆమె చెప్పారు.

పిల్లల్లో రుచి గురించి ఈ ప్రయోగం ఏం చెబుతోంది.

పిల్లల్లో రుచి చాలా త్వరగా అభివృద్ధి చెందుతుందని ఈ ప్రయోగం సూచిస్తోందని రీస్‌లాండ్ చెప్పారు. ఇది తల్లులు తినే ఆహారంపై ఆధారపడి ఉంటుందని అన్నారు.

''గర్భంలో ఉన్నప్పుడు తల్లి నుంచి స్వీకరించిన ఆహారాన్నే, పుట్టిన తర్వాత కూడా పిల్లలు స్వీకరించడానికి ఇష్టపడతారు. ఆ ఆహారానికి అలవాటు పడి, దాన్నే తినడం కొనసాగిస్తారు'' అని తెలిపారు.

క్యారట్స్, కాలే

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, క్యారెట్లు, కాలే (లీఫ్ క్యాబేజీ)

చేదు రుచులు

పిల్లలు చేదు రుచులను తిరస్కరించడానికి గల కారణాన్ని కూడా ఆమె చెప్పారు.

''చేదు రుచిని మనం ఇష్టపడం. చేదు వాటిని తిన్నప్పుడు అలాగే స్పందిస్తాం. కానీ, చేదు రుచులన్నీ విషపదార్థాలు కాదు. కాబట్టి ఈ విషయంలో మనమే పిల్లల్ని మచ్చిక చేయాలి. చేదు రుచిని కలిగి ఉండే కొన్ని రకాల ఆహార పదార్థాలు ఆరోగ్యానికి చాలా మంచివి. పిల్లలు ఆరోగ్యంగా ఉండేలా అవి దోహదపడతాయి.

మనం చేదు రుచి చూసినప్పుడు ప్రతిస్పందించినట్లుగానే గర్భస్థ శిశువులు కూడా స్పందించారని ఆల్ట్రాసౌండ్ ఇమేజ్‌లు సూచిస్తున్నాయని ఆమె అన్నారు.

అయితే, గర్భస్థ శిశువులు నిజంగానే ఉద్వేగాలను, రుచులను అనుభవిస్తారా అనే సంగతి ఇంకా పూర్తిగా తెలియదని చెప్పారు.

అల్ట్రాసౌండ్ స్కానింగ్‌లో కనిపించే నవ్వులు, ముఖం చిట్లించడాలు... చేదు రుచికి ప్రతిస్పందించే కండరాల కదలికలు అయిండొచ్చని రీస్‌లాండ్ అన్నారు.

వీడియో క్యాప్షన్, ఈ బార్బీ బొమ్మలు మీ మాటలు వింటాయి

ఇతర శాస్త్రవేత్తలు ఏం అనుకుంటున్నారు?

అమెరికాలోని నార్త్‌వెస్ట్రన్ యూనివర్సిటీ ఫెయిన్‌బెర్గ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన నియోనేటాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ డేనియల్ రాబిన్సన్ ఈ అధ్యయనంలో పాల్గొనలేదు. కానీ, ఆయన దీని గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

గర్భస్థ శిశువుల ఆనందాన్ని, అసహ్యాన్ని ఆల్ట్రాసౌండ్ ఇమేజ్‌లు చూపిస్తున్నాయని ప్రజలు భావించకూడదని ఎన్‌బీసీతో ఆయన చెప్పారు.

ఫిలడెల్ఫియాలోని మోనెల్ కెమికల్ సెన్సెస్ సెంటర్‌కు చెందిన డాక్టర్ జూలీ మెనెలా కూడా ఈ అధ్యయనంలో పాల్గొనలేదు. కానీ, ఆమె ఈ విభాగంలో నిపుణురాలు.

ఈ అధ్యయనం మునుపటి పరిశోధనలకు మద్దతుగా ఉందని ఆమె అన్నట్లుగా గార్డియన్ తెలిపింది. ఉమ్మనీరులోని వివిధ రుచుల ఆధారంగా తల్లి డైట్‌ గురించి గర్భస్థ శిశువులు తెలుసుకుంటారని గార్డియన్ పేర్కొంది.

తల్లుల ఆహారాన్ని బట్టి గర్భంలోని పిండాలు ఎలా స్పందిస్తాయో అనే దానిపై తదుపరి పరిశోధనలకు ఈ అధ్యయనం ఉపకరంగా ఉందని వర్జీనియాలో కాలేజ్ ఆఫ్ విలియం అండ్ మేరీకి చెందిన ప్రొఫెసర్ క్యాథరిన్ పోర్‌స్టెల్‌ను ఉటంకిస్తూ గార్డియన్ వ్యాఖ్యానించింది.

వీడియో క్యాప్షన్, ఆటలమ్మ, అమ్మవారు వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

సరిగా తినకపోవడం

తాజా అధ్యయనం బేజా యుత్సున్ నేతృత్యంలో జరిగింది. ''పిల్లలు, గర్భంలో ఉన్నప్పుడే రుచిని, వాసనను గ్రహిస్తారని చాలా అధ్యయనాలు సూచించాయి. అయితే, ఇవన్నీ వారు జన్మించిన తర్వాత చేసిన ప్రయోగాలే. గర్భంలో ఉండగా శిశువుల స్పందనల గురించి చెప్పిన తొలి అధ్యయనం ఇదే.

గర్భంలో ఉన్నప్పుడే శిశువులకు పదే పదే ఇలాంటి రుచులను చూపించడం ద్వారా, పుట్టిన తర్వాత వారు ఆహార ప్రాధాన్యతలు ఏర్పరచుకోవడంలో సహాయం చేసినట్లు అవుతుంది. రుచులను బట్టి పిల్లలు ఆహారాన్ని పక్కకు పెట్టకుండా అన్నీ తినేలా చేయాలంటే ఇది చాలా కీలకం'' అని యుత్సున్ చెప్పారు.

ప్రాక్టికల్‌గా చెప్పాలంటే ఈ అధ్యయనం కొత్తగా తల్లిదండ్రులైన వారికి తమ పిల్లల ఆహారపు అలవాట్ల గురించి ఒక అవగాహనను కల్పిస్తుందని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)