Blue Eyes: కనుపాపల రంగు ఎందుకు మారుతుంటుంది- ఇది సాధారణమేనా.. ట్యూమర్లకు సంకేతమా?

అప్పుడే పుట్టిన పిల్లల కళ్ల రంగు కొన్నేళ్లలో మారుతుందని తల్లిదండ్రులు కూడా భావిస్తారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అప్పుడే పుట్టిన పిల్లల కళ్ల రంగు కొన్నేళ్లలో మారుతుందని తల్లిదండ్రులు కూడా భావిస్తారు
    • రచయిత, మార్తా హెన్రిక్స్
    • హోదా, ఎడిటర్, బీబీసీ ఫ్యూచర్ ప్లానెట్

మా కుటుంబంలో అప్పుడే పుట్టిన శిశువు మొదటి ఫొటోలు.. ముద్దులొలుకుతూ ఆశ్చర్యంగా చూస్తున్న ముఖాన్ని చూపుతున్నాయి. ఆ పిల్లాడి కళ్లు విప్పారి ఉన్నాయి. ఊదా రంగులో ఉన్న ఆ కళ్లు ఆకారంలో అతడి తండ్రి గోధుమరంగు కళ్లను పోలి ఉన్నాయి. కానీ వాటి రంగు అతడి తల్లి ఆకుపచ్చ రంగు కళ్లకు దగ్గరగా ఉంది.

అయితే ఆ బాబు రెండో పుట్టిన రోజు నాటికి.. అతడి కళ్ల రంగు తండ్రి కళ్ల రంగుకు దగ్గరగా గోధుమవన్నె మారినట్లు కనిపించాయి. తొలినాళ్లలోని ఫొటోల్లో కనిపించిన ఊదా రంగు ఇప్పుడు లేదు.

మన కళ్ల రంగు మన శారీరక లక్షణాలను నిర్వచించే లక్షణాల్లో ఒకటిగా మనం భావించవచ్చు. మన ముక్కు ఆకారం లాగానే, మన చెవుల ఆకారం లాగానే మన కళ్ల రంగు కూడా మనకే విశిష్టమైన లక్షణమని అనుకోవచ్చు.

మన కళ్ల రంగు మన మీద శాశ్వత అభిప్రాయాన్ని కూడా ఏర్పరచగలవు. ఎవరినైనా ఎంతవరకూ విశ్వసించవచ్చుననే అభిప్రాయాన్ని ఆ వ్యక్తి కళ్ల రంగు కూడా ప్రభావితం చేయగలదు.

కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. మన కళ్ల రంగు మన జీవితాంతం ఒకేలా ఉండిపోదు. నిజానికి బయటి నుంచి అనేక ప్రభావాలు మన కళ్లు రంగు మారేలా చేయగలవు. గాయం, ఇన్ఫెక్షన్, సూర్యరశ్మితో కలిగే నష్టం.. ఇవన్నీ మన కళ్ల రంగు మీద ప్రభావం చూపగలవు. కొన్నిసార్లు ఈ రంగు మారటం అకస్మాత్తుగా అప్పటికప్పుడు జరిగినట్లు కనిపిస్తుంది.

వీడియో క్యాప్షన్, కంప్యూటర్, ఫోన్ స్క్రీన్ల నుంచి మన కళ్ళను కాపాడుకోవడం ఎలా?

కంటి రంగు మారడంపై స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో బైర్స్ ఐ ఇన్‌స్టిట్యూట్‌లో ఆప్తాలమాలజిస్ట్‌గా పనిచేస్తున్న కేసీ లుడ్విగ్ సారథ్యంలో ఒక అధ్యయనం నిర్వహించారు. కాలిఫోర్నియాలోని లూసైల్ పాకార్డ్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో జన్మించిన 148 మంది శిశువుల కంటిపాపల రంగు వారు పుట్టినపుడు ఎలా ఉందో నమోదు చేశారు.

ఆ శిశువుల్లో దాదాపు మూడో వంతు మంది గోధుమరంగు కళ్లతో పుట్టారు. ఐదో వంతు మంది నీలి రంగు కళ్లతో పుట్టారు.

రెండేళ్ల తర్వాత లుడ్విగ్, ఆమె సహచరులు ఆ పిల్లలను మళ్లీ పరిశీలించారు. పుట్టినపుడు నీలి రంగు కళ్లు గల 40 మంది చిన్నారుల్లో 11 మంది కళ్లు రెండేళ్లు నిండే సరికి గోధుమరంగులోకి మారాయి. ముగ్గురి కళ్లు కపిలవర్ణం (హేజెల్ కలర్)లోకి మారాయి. ఇద్దరి కళ్లు ఆకుపచ్చ రంగులోకి మారాయి.

ఇక గోధుమరంగు కళ్లతో పుట్టిన 77 మంది చిన్నారుల్లో దాదాపు అందరి కళ్లూ.. అంటే 73 మంది శిశువుల కళ్లు రెండేళ్ల వయసు వచ్చేసరికి గోధుమరంగులోనే ఉన్నాయి.

దీనినిబట్టి.. మన జీవితపు తొలి దశల్లో బూడిదరంగు కళ్ల కన్నా నీలి రంగు కళ్లు రంగు మారే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ, అలా ఎందుకు జరుగుతుంది?

కళ్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పిల్లల కళ్ల రంగు మారినపుడు అవి ముదురు రంగులోకి మారుతున్నాయి కానీ లేత రంగులోకి మారటం తక్కువ

ఒక క్లూ ఏమిటంటే.. పిల్లల కళ్ల రంగు మారినపుడు అవి ఎక్కువగా ముదురు రంగులోకి మారుతున్నాయి కానీ లేత రంగులోకి మారటం చాలా తక్కువగా ఉంది. లుడ్విగ్ నిర్వహించిన అధ్యయనంలో.. మూడో వంతు మంది పిల్లల కళ్ల రంగు వారి తొలి రెండేళ్లలో మారింది. ప్రధానంగా ఆ కళ్ల రంగు ముదురు రంగులోకి మారింది.

ఈ అధ్యయనం 148 మంది పిల్లలపై నిర్వహించగా.. వారిలో కేవలం ఐదుగురు (3.4 శాతం) పిల్లల కళ్లు మాత్రమే వయసుతో పాటు లేత రంగులోకి మారాయి.

కళ్ల రంగు ఎక్కువగా ముదురు రంగులోకి మారటానికి కారణం.. కంటిపాపల్లో రక్షణాత్మక వర్ణం (ప్రొటెక్టివ్ పిగ్మెంట్) కావచ్చునని పరిశోధకులు భావిస్తున్నారు.

అయితే.. సాధారణంగా కనిపించే ఈ ఆరోగ్యవంతమైన రంగు మార్పు ప్రధానంగా శైశవ దశ తొలి నాళ్లకు పరిమితంగా ఉంది. అమెరికాలో నిర్వహించిన మరొక అధ్యయనంలో 1,300 మందికి పైగా కవల పిల్లలను శైశవ దశ నుంచి వయోజనులయ్యే వరకూ పరిశీలించారు. ఈ అధ్యయనంలో.. కంటి రంగు మారటం సాధారణంగా ఆరో ఏడు వచ్చేసరికి ఆగిపోయిందని గుర్తించారు. అయితే కొన్ని ఉదంతాల్లో (10 నుంచి 20 శాతం వరకూ) కౌమార దశలోనూ, వయోజన దశలోనూ కళ్ల రంగు మారటం కొనసాగింది. సారూప్యత గల కవలల్లో కన్నా.. సారూప్యత లేని కవలల్లో కళ్ల రంగు వయసు పెరిగిన తర్వాత మారే అవకాశం ఎక్కువగా కనిపించింది.

ఇది.. కంటి రంగు మారే అవకాశంలో జన్యుపరమైన అంశం పాత్ర కూడా ఉన్నట్లు సూచిస్తోందని యూనివర్సిటీ ఆఫ్ వెస్టర్న్ ఆస్ట్రేలియాలోని లయన్స్ ఐ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ఆప్తాల్మాలజీ ప్రొఫెసర్ డేవిడ్ మాకీ చెప్తున్నారు.

వీడియో క్యాప్షన్, ఆటలమ్మ, అమ్మవారు వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

కంటి రంగు మార్పు మీద ఆసక్తితో ఈ అంశంపై అధ్యయనం చేసిన ప్రొఫెసర్ మాకీ.. బాల్యంలో కంటి రంగు మార్పుపై జరిగిన అధ్యయనాలు ప్రధానంగా పై రెండు అధ్యయనాలేనని గుర్తించారు.

అయితే.. తమ పిల్లల కళ్ల రంగు మారుతుందని తల్లిదండ్రులు ముందుగానే అంచనా వేయటం కూడా మామూలు విషయమేనని ఆయన గమనించారు.

''హా, అవును.. మా పిల్లలు నీలి కళ్లతో పుట్టారు.. కానీ కొన్నేళ్లలో వారి కళ్ల రంగు మారుతుంది' అని తల్లిదండ్రులు, వారి స్నేహితులు చెప్తుండగా నేను విన్నాను'' అని ఆయన పేర్కొన్నారు.

''అప్పుడు నేను.. ఈ అంశంపై సమాచారం దొరకదని అనుకున్నాను. ఆ క్రమంలో ఈ రెండు అధ్యయనాలు నాకు దొరికాయి. కానీ ఇవి చాలా చిన్న పరిశోధనలు. అయితే కళ్ల రంగు నిజంగానే మారుతుందని ఇవి చూపుతున్నాయి'' అని ప్రొఫెసర్ మాకీ వివరించారు.

ఈ సమాచారం పరిమితంగానే ఉన్నప్పటికీ, కేవలం అమెరికా ఒక్క దేశంలోనే నిర్వహించినప్పటికీ.. ఉత్తర యూరోపియన్, పసిఫిక్ ఐలాండర్, లేదా మిశ్రమ జాతి వారసత్వం గల జనాభాలో కంటి రంగు మార్పు చాలా సాధారణంగా కనిపిస్తోంది.

ఈ జనాభాల్లో వీరి బాల్యమంతటా కొన్నిసార్లు కనిపించే జుట్టు రంగు మారటానికి, కంటి రంగు మారటానికి సారూప్యతలు ఉన్నాయి.

''బాల్యంలో తెల్ల జుట్టు ఉన్న కొందరు పిల్లలకు.. కాస్త పెద్దయ్యాక గోధుమ రంగు జుట్టు ఉండటం మనం ఫొటోల్లో చూడవచచు. మన జుట్టులో పిగ్మెంట్ (వర్ణం) కాలం గడిచేకొద్దీ క్రమంగా పెరుగుతూ పోవచ్చు. మన శరీరంలో పిగ్మెంట్ తయారు చేసే కణాల సంఖ్య పెరుగుతూ, ఆ ప్రాంతానికి వలసవస్తూ ఉండటం దీనికి కారణం కావచ్చు'' అని ప్రొఫెసర్ మాకీ అభిప్రాయపడ్డారు.

కంటి రంగు విషయంలో కూడా ఇలాగే జరుగుతూ ఉండవచ్చునని ఆయన సూచిస్తున్నారు. పుట్టిన తర్వాతి నెలలు, లేదా సంవత్సరాల్లో పిగ్మెంట్ పరిమాణం పెరుగుతూ పోతుండవచ్చునని విశ్లేషించారు.

వీడియో క్యాప్షన్, ఫోర్టిఫైడ్ రైస్ అంటే ఏమిటి, ఈ బియ్యం తింటే ఆరోగ్యానికి మంచిదా?

''కళ్లలో ప్రధానమైన పిగ్మెంట్ మెలానిన్. ఆ మెలానిన్ పంపిణీ అయ్యే విధానం.. మనకు విభిన్నమైన కంటి రంగులను అందిస్తుంది'' అని ఆయన చెప్పారు.

''నీకు నీలి కళ్లు ఉన్నాయి' అని కొందరు అంటారు. కొందరు ఊదా రంగు గురించి మాట్లాడినపుడు.. నిజానికి వారు నీలి రంగులో ఒక రకం గురించి మాట్లాడుతున్నారు. ఇక కపిలవర్ణం, ఆకుపచ్చ రంగుల మిశ్రమాలు కూడా ఉన్నాయి. ఆపైన గోధుమ రంగు ఉంది. అది లేత గోధుమరంగు కావచ్చు, ముదురు గోధుమ రంగు కావచ్చు. ఇదంతా.. ఆ కళ్లలో ఎంత మోతాదులో మెలానిన్ ఉందనే దాని మీద ఆధారపడి ఉంటుంది'' అని ప్రొఫెసర్ మాకీ వివరించారు.

మెలానిన్ ఎక్కువ మోతాదుల్లో ఉంటే.. తీవ్రమైన సూర్యరశ్మిలో అది ప్రయోజనకరంగా పనిచేయవచ్చు. చర్మంలో పిగ్మెంట్ ఎక్కువగా ఉంటే సూర్యరశ్మి వల్ల చర్మం దెబ్బతినకుండా అది రక్షణ కల్పించినట్లుగా అన్నమాట.

మెలానిన్ స్వల్ప మోతాదులో ఉన్న కంటిపాపలు నీలి రంగులో కనిపిస్తాయి. వాతావరణంలో వెలుతురు వ్యాపించిన తీరును బట్టి ఆకాశం నీలి రంగులో కనిపించినట్లే.. కంటిపాప వెనుకవైపు ఉండే కొల్లేజెన్ పీచు వెలుతురును వ్యాపింపజేసే తీరును బట్టి ఆ కళ్లకు కూడా ఆ నీలి రంగు వస్తుంది.

అయితే.. కొందరు పిల్లల కళ్లలో కాలం గడిచేకొద్దీ ఎక్కువ మెలానిన్ ఎందుకు కనిపిస్తుందనేది ఇంకా అంతుచిక్కలేదని ప్రొఫెసర్ మాకీ అంటారు.

''ఈ రంగు మార్పులను ప్రభావితం చేసేది ఏమిటనేది నిజానికి మనకు తెలియదు'' అంటారు మాకీ. అయితే పర్యావరణ అంశం ప్రభావం ఉండవచ్చునని చెప్తారు. ''ప్రతి విషయంలోనూ జన్యువులు, పర్యావరణం మిశ్రమ ప్రభావం ఉందని చెప్పొచ్చు. అయితే కంటి రంగు మార్పులో ఎలాంటి పర్యావరణ అంశాల ప్రభావం ఉంటుంది? ఈ విషయంలో మన దగ్గర సమాచారం లేదు'' అని ఆయన పేర్కొన్నారు.

కంటి రంగు మార్పుల్లో చాలా వరకూ నిరపాయకరమైనవే అయినా.. కొన్ని సందర్భాల్లో గాయం, ఇన్ఫెక్షన్ లేదా సూర్యుడి వల్ల దెబ్బతినటం వంటి అనారోగ్యాలకు కూడా ఈ మార్పుతో సంబంధం ఉండవచ్చు.

డేవిడ్ బోవీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డేవిడ్ బోవీ కళ్లు రెండూ వేర్వేరు రంగుల్లో కనిపిస్తాయి

గాయం వల్ల కంటి రంగు మార్పు చెందటానికి బాగా తెలిసిన ఒక ఉదాహరణ డేవిడ్ బోవీ ఎడమ కన్ను. ఆయన ఎడమ కన్ను ముదురు రంగులో ఉంటే, కుడి కన్ను లేత నీలి రంగులో ఉంటుంది. ఈ తేడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. దీనికి కారణం.. ఆయన తలకు తగిలిన ఒక పంచ్. దానివల్ల ఆయన ఎడమ కన్నులోని కనుపాప శాశ్వతంగా వ్యాకోచించింది. ఈ పరిస్థితిని 'అనిసోకోరియా' అని పిలుస్తారు. కానీ.. ఆ పంచ్ వల్ల డేవిడ్ బోవీ కనుపాపల నీలి రంగు మారలేదు. కనుపాప విస్తరించటం వల్ల ఆయన ఎడమ కన్ను ముదురు రంగులో కనిపిస్తుంది.

అయితే, గాయం వల్ల కనుపాప రంగు మారటం సాధ్యమేనని ప్రొఫెసర్ మాకీ చెప్తున్నారు. ''అలా జరగొచ్చు. కంటి లోపలికి చాలా ఎక్కువ రక్తం ప్రసరిస్తే.. కంటిలోని భాగాలు ఒత్తిడికి లోనుకాగలవు. లేదంటే పిగ్మెంట్ మొత్తం కన్ను అంతటా చెల్లాచెదురై అక్కడే స్థిరపడిపోవచ్చు'' అని చెప్పారాయన.

ఇలాంటి పరిస్థితులకు సాధారణంగా ఇన్ఫెక్షన్ మూల కారణంగా ఉంటుంది. కనుపాపల రంగుల మధ్య తేడాలు ఉండటాన్ని 'హెటెరోక్రోమియా' అని పిలుస్తారు. నటి మిలా కునిస్.. ఈ పరిస్థితికి ఒక ప్రముఖ ఉదాహరణ. ఆమె కుడి కన్ను గోధుమ రంగులో ఉంటే, ఎడమ కన్ను నీలి రంగులో ఉంటుంది. ఆమె ఎడమ కంటికి ఇన్ఫెక్షన్ సోకి, అందులోని కొంత పిగ్మెంట్‌ను ధ్వంసం చేయటంతో ఆమెకు 'హెటెరోక్రోమియా' పరిస్థితి వచ్చింది.

''కొన్ని అంటు వ్యాధుల వల్ల పిగ్మెంట్ మాయం కావచ్చు'' అని ప్రొఫెసర్ మాకీ చెప్పారు. అటువంటి వాటిలో ఫుక్స్ హెటరోక్రోమిక్ సిస్లైటిస్. ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. సాధారణంగా రుబెల్లా (జర్మన్ మీజిల్స్ అని కూడా అంటారు) వైరస్ వల్ల వస్తుంది. ''ఈ వైరస్‌కు కంటిలో నివసించటం ఇష్టం. వయసు పెరిగిన తర్వాత ఇది పెరిగిపోయి అక్కడ పిగ్మెంటేషన్ కోల్పోవచ్చు'' అని మాకీ వివరించారు.

వీడియో క్యాప్షన్, కింగ్ కోబ్రా: మనుషుల ప్రాణాలు కాపాడుతోందా?

మరికొన్ని ఇతర వైరస్‌లు కూడా కంటి లోపలి భాగంలో పెరగవచ్చు. అవి కళ్ల పిగ్మెంటేషన్‌ను ప్రభావితం చేయవచ్చు. చాలా అరుదైన ఒక ఉదంతంలో.. ఎబోలా వైరస్ సోకి కోలుకున్న ఓ వ్యక్తి కన్ను నీలి రంగు నుంచి ఆకుపచ్చ రంగులోకి మారటం గుర్తించారు. ఆ వ్యక్తి శరీరంలోని ఇతర ప్రాంతాలన్నిటి నుంచీ సదరు వైరస్ తొలగిపోయినప్పటికీ.. ఆ కంటి ద్రవంలో వైరస్ కొనసాగటాన్ని గుర్తించారు.

కొన్నిసార్లు.. కంటి రంగు మార్పు మొత్తం కనుపాప మీద ప్రభావం చూపదు. చిన్న చిన్న మరకల్లాగా ప్రభావం చూపవచ్చు. డౌన్ సిండ్రోమ్ ఉన్న వ్యక్తుల్లో కనుపాపల మీద లేత మరకలు కనిపించవచ్చు. వీటిని 'బ్రష్‌ఫీల్డ్ స్పాట్స్' అని పిలుస్తారు. న్యూరోఫైబ్రోమెటాసిస్ టైప్ 1 అనే జన్యు పరిస్థితి ఉన్నవారి కళ్లలో.. సాధారణంగా గోధుమరంగు మరకలు కనిపిస్తాయి. వీటిని 'లిష్ నాడ్యూల్స్' అని పిలుస్తారు.

చర్మం మీద కనిపించే తరహాలోనే.. మరకలు, మచ్చలు కనుపాల్లోనూ, కంటిలోని ఇతర ప్రాంతాల్లోనూ ఏర్పడవచ్చు.

''మన కళ్లలో ఉండే మరకలు ఏమీ చేయకపోవచ్చు. కానీ కొంతమందిలో ఇవి ట్యూమర్లుగా పెరగవచ్చు. అవి తీవ్ర సమస్యగా మారవచ్చు'' అంటారు ప్రొఫెసర్ మాకీ.

కంటి రంగు మారటం దానిని గమనించే వారికి అద్భుతమైన విషయంగా కనిపించటం నిజమే. అయితే.. సమస్యాత్మకమైన కంటి రంగు మార్పుల మీద ఓ కన్నేసి ఉంచాలని ఆయన సూచిస్తున్నారు.

వీడియో క్యాప్షన్, పసిపిల్లలకు ఎప్పుడు ఏం తినిపించాలి, ఏం తినిపించకూడదు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)