డిజిటల్ నేటివ్స్: ‘స్మార్ట్ ఫోన్ స్క్రీన్లు, డిజిటల్ పరికరాలతో.. కొత్త తరం పిల్లల ఐక్యూ తగ్గుతోంది’

వీఆర్ హెడ్‌సెట్స్

ఫొటో సోర్స్, Getty Images

"మన పిల్లల భవిష్యత్తు విషయంలో మనం చేస్తున్న పనులకు క్షమాపణ అనేదే లేదు" అంటా ఫ్రెంచ్ న్యూరో శాస్త్రవేత్త మైకెల్ డెస్ముర్గెట్.

డిజిటల్ పరికరాలు పిల్లల మానసిక ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయని ఆయన భావిస్తారు.

‘‘మనం పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తున్నాం’’ అని ఆయన బీబీసీతో చెప్పారు. ఆయన రాసిన "ది డిజిటల్ క్రేటిన్ (ఇడియట్) ఫ్యాక్టరీ" అనే పుస్తకంలో ఈ వివాదాస్పద అంశాన్ని చర్చించారు.

ఆయన పుస్తకంలో రాయడానికి ఎన్నుకున్న పదాలు కాస్త కఠినంగానే ఉన్నప్పటికీ ఆయన అభిప్రాయాలన్నీ కచ్చితమైన సమాచారంతో ధృవీకృతమైనవే.

ఆయన ఫ్రాన్స్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌లో డైరెక్టర్’గా పని చేస్తున్నారు. ఎంఐటీ (మిట్), కాలిఫోర్నియా యూనివర్సిటీ లాంటి పలు ప్రపంచ ప్రఖ్యాత విశ్వ విద్యాలయాలలో కూడా పని చేశారు. ఆయన రాసిన పుస్తకం పిల్లలను ఎలా పెంచాలనే విషయంపై చాలా వివాదం లేవదీసింది.

ఆయన తనకు కొత్తగా లభించిన ఈ ఖ్యాతికి సంతోషిస్తున్నారు కూడా. ఆయన రాసిన పుస్తకం ఫ్రాన్స్‌లో విరివిగా అమ్ముడయింది. ఇటలీ, స్పానిష్ భాషల్లోకి కూడా అనువాదం జరిగింది.

ఇంటర్నెట్ ప్రాచుర్యం పొందిన తర్వాత పుట్టిన పిల్లలను "డిజిటల్ నేటివ్స్"గా అభివర్ణిస్తున్నారు. వారికి తమ తల్లితండ్రుల కంటే తక్కువ ఐక్యూ ఉంటోందని ఈ పుస్తకంలో రచయత చాలా బలంగా రాశారు.

వ్యక్తుల తెలివితేటల సామర్ధ్యాన్ని కొన్ని నిర్ణీత పరీక్షల ద్వారా కొలిచి వారి వారి ఐక్యూ అంచనా వేస్తారు. డిజిటల్ నేటివ్స్ తరానికి ముందు ప్రతీ తరం గత తరం కంటే ఎక్కువ ఐ క్యూ కనబరిచారని ఆయన చెప్పారు.

కానీ డిజిటల్ నేటివ్స్ ఐక్యూ తక్కువగా ఉండటానికి కారణాలేమిటో వివరించాలని బీబీసీ కోరింది.

మొబైల్ ఫోన్

ఫొటో సోర్స్, Getty Images

చరిత్రలోనే గత తరం కంటే ఐక్యూ తక్కువగా కనబరిచినవారు నేటి యువతరం అని చెప్పవచ్చా?

అవును. ఐక్యూని ఒక ప్రామాణికమైన పరీక్ష ద్వారా అంచనా వేస్తారు. అలాగని ఇదేమి ఎప్పుడూ ఒకేలా జరిపే పరీక్ష కాదు. ఎప్పటికప్పుడు ఈ పరీక్షను సవరిస్తూ ఉంటారు.

నేను పాస్ అయిన లాంటి పరీక్షలో నా తల్లితండ్రులు ఉత్తీర్ణత సాధించలేకపోయారు. ఉదాహరణకు పాత తరహా పరీక్షా విధానాన్ని ఒక సమూహానికి నిర్వహించవచ్చు.

ఇలా చేయడం వలన, ప్రతీ తరానికీ తరానికీ ఐక్యూ పెరుగుతూ వస్తోందని ప్రపంచంలో చాలా చోట్ల పరిశోధకులు గమనించారు.

దీనినే ఫ్లిన్ ఎఫెక్ట్ అంటారు. దీనిని ఒక అమెరికా శాస్త్రవేత్త నిర్వచించారు. కానీ, ఈ పరిణామం ఇటీవల కాలంలో మార్పు చెందుతూ వస్తోంది.

ఐక్యూ అనేది ఆరోగ్యం, విద్యా విధానం, పోషకాహారం వలన కూడా ప్రభావితమవుతుందనేది నిజం. కానీ, సామాజిక ఆర్ధిక అంశాలు స్థిరంగా ఉన్న కొన్ని దేశాలలో కూడా ఈ ఫ్లిన్ ఎఫెక్ట్ క్రమంగా కనుమరుగవుతోంది.

ఈ దేశాలలో ఉన్న డిజిటల్ నేటివ్ తరానికి చెందిన పిల్లలు తమ తల్లితండ్రుల కంటే తక్కువ ఐక్యూని ప్రదర్శించారు. ఈ పరిణామం నార్వే, డెన్మార్క్, ఫిన్ ల్యాండ్ , నెథర్లాండ్స్, ఫ్రాన్స్ లాంటి దేశాలలో కనిపించింది.

థింకింగ్ హ్యాట్స్

ఫొటో సోర్స్, Getty Images

క్యూ తగ్గడానికి డిజిటల్ టెక్నాలజీ వాడకమే కారణమా?

దురదృష్టవశాత్తు ఐక్యూ తగ్గడానికి ఏ అంశం ఎంత ప్రభావం చూపిస్తుందో కచ్చితంగా అంచనా వేయడం కష్టం. ఉదాహరణకు ఐక్యూ పై కాలుష్యం, చిన్న వయస్సులో తీసుకునే ఆహారంలో ఎరువుల అవశేషాల వంటివి, డిజిటల్ మాధ్యమాల ప్రభావం ఎంత ఉంటుందనేది కచ్చితంగా చెప్పలేం.

పిల్లలు స్క్రీన్ తో గడిపే సమయం మాత్రమే వారి ఐక్యూ మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని చెప్పలేకపోయినప్పటికీ దాని ప్రభావం ఎంతో కొంత ఉందని మాత్రం చెప్పగలం.

టెలివిజన్ కానీ వీడియో గేమ్ వాడకం గానీ పెరిగినప్పుడు ఐక్యూ, విషయ గ్రాహక శక్తి అభివృద్ధి మాత్రం తగ్గాయని చాలా అధ్యయనాలు తెలిపాయి.

మన మేధస్సుకి పునాదులైన అంశాల లాంటి భాష, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, సంస్కృతి ( ఇవి ప్రపంచాన్ని అర్ధం చేసుకోవడానికి కూడా అవసరం) మీద మాత్రం స్క్రీన్ వాడకం ప్రభావం చూపించింది. ఇది చివరకు విద్యా ప్రమాణాలు తగ్గిపోవడానికి కూడా దారి తీసింది.

టీనేజర్లు

ఫొటో సోర్స్, Getty Images

డిజిటల్ పరికరాల వాడకం ఇలాంటి ప్రభావాన్ని ఎందుకు చూపిస్తున్నాయి?

వీటికి గల కారణాలు చాలా స్పష్టంగా నిర్వచించారు. వీటి వాడకం వలన కుటుంబంతో గడిపే నాణ్యమైన సమయం తగ్గిపోతోంది. ఇది భాష, మానసిక అభివృద్ధికి చాలా అవసరమైన అంశం.

అలాగే మేధస్సును పెంపొందించే పనులైన హోమ్ వర్క్ చేయడం, సంగీతం, చిత్ర లేఖనం, చదవడం లాంటి పనులకు కేటాయించే సమయం తగ్గిపోతోంది.

నిద్రకు అంతరాయం కలగడం, సుఖ నిద్ర లేకపోవడం, ఏకాగ్రత కోసం ఎక్కువగా చైతన్యపర్చుకోవడం, వీటన్నిటి వలన ఏకాగ్రత సాధించడంలో, కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి, ప్రేరణ పొందడానికి అస్తవ్యస్థతకి గురవడం జరుగుతూ ఉంటుంది.

మేధస్సు ఎప్పుడైతే సరిగ్గా పని చేయదో , మెదడు తన పూర్తి శక్తిని వినియోగించడం మానేస్తుంది.

దీంతో శరీర పెరుగుదలతో పాటు ఒక విధమైన చలనం లేని జీవన విధానం తయారు అవుతుంది. ఇదంతా బ్రెయిన్ పరిపక్వం చెందడంపై ప్రభావం చూపిస్తుంది.

ఫోన్లలో ఆడుకుంటున్న చిన్నారులు

ఫొటో సోర్స్, Getty Images

నాడీ వ్యవస్థ పై డిజిటల్ స్క్రీన్ లు ఎలాంటి హానిని కలిగిస్తాయి?

మెదడు ఒక నిశ్చలమైన అవయవం కాదు. వాటి లక్షణాలు మనిషి పొందే అనుభవాల పై ఆధారపడి ఉంటాయి.

మనం నివసిస్తున్న ఈ ప్రపంచం, మనం ఎదుర్కొనే సవాళ్లు మెదడు నిర్మాణాన్ని, పని తీరును మారుస్తూ ఉంటాయి. మెదడులో కొన్ని భాగాలు కొంత ప్రత్యేకంగా ఉంటాయి.

కొన్ని వ్యవస్థలు కొత్తగా పుడతాయి. కొన్ని బలపడతాయి, కొన్ని కోల్పోతాం. కొన్ని మందంగా అయితే కొన్ని పలుచగా అవుతాయి.

భాష ఏకాగ్రత విషయంలో మెదడు దానంతటదే ఎలా పరిపక్వత చెందుతుందో, వినోదం కోసం స్క్రీన్ ముందు గడిపే కాలంలో ఎలా మందకొడిగా మారుతుందో గమనించారు.

మనం చేసే అన్ని పనులు ఒకే విధమైన సామర్ధ్యంతో మెదడు అభివృద్ధి చెందడానికి పోషణ అందించవు.

హాకీ ఆడుతున్న చిన్నారులు

ఫొటో సోర్స్, Getty Images

దీనర్ధం ఏమిటి?

స్క్రీన్ కంటే కూడా స్కూలుకు సంబంధించిన పనులు, మేధస్సుకు సంబంధించిన పని, చదువు, సంగీతం, కళలు, క్రీడలు లాంటి వాటికి మేధస్సును నిర్మాణాత్మకంగా ఉంచి దానికి కావల్సిన పోషకాలను అందించే శక్తిని కలిగి ఉంటాయి.

బాల్యంలో, యుక్త వయస్సులోనూ మేధో వికాసం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ఆ తరువాత ఇది నెమ్మదిగా మందగిస్తుంది. ఇది పూర్తిగా పోదు కానీ, దీని సామర్ధ్యం తగ్గిపోతుంది.

మెదడును ఒక అలంకారప్రాయమైన వస్తువుగా పోల్చి చూడలేం. ఇది మొదట్లో తేమగా ఉంటుంది. దాంతో దానిని చెక్కడం సులభం. కాలం గడిచే కొద్దీ ఇది ఎండిపోతూ ఉండి రూపుదిద్దుకోవడం కష్టంగా మారుతుంది.

ఈ వినోదాన్ని అందించే స్క్రీన్ ల వలన పిల్లల్లో మెదడు అభివృద్ధి చెందే విధానాన్ని మార్చేసి దానిని బలహీనపరిచేలా చేయడమే వీటితో ఉన్న సమస్య.

టీవీ

ఫొటో సోర్స్, Getty Images

స్క్రీన్ లన్నీ హానికారమేనా?

"డిజిటల్ విప్లవం హానికరకం కాబట్టి దానిని పూర్తిగా అంతం చేయాలని ఎవరూ చెప్పటం లేదు".

నేను కూడా నా రోజులో చాలా భాగాన్ని డిజిటల్ పరికరాలతోనే గడుపుతాను. అలాగే మా అమ్మాయి స్కూలులో చేరినప్పడు నేను కొన్ని రకాల సాఫ్ట్ వేర్లనువాడటం, ఇంటర్నెట్లో సమాచారాన్ని ఎలా వెతకాలో కూడా నేర్పడం మొదలు పెట్టాను.

విద్యార్థులకు కంప్యూటర్ నైపుణ్యం, డిజిటల్ పరికరాల వాడకాన్ని నేర్పాలా వద్దా?

నేర్పాలి! అలాగే టీచర్లు కూడా వీటిని వాడాలి. వీటిని వాడటం ద్వారా ప్రభావవంతంగా విద్యను బదిలీ చేయగలిగితే ఇవి ఒక నిర్మాణాత్మకమైన విద్యా వ్యవస్థలో భాగంగా ఉంటాయి.

అయితే, పిల్లల దగ్గర కానీ, యుక్త వయస్సులో ఉన్నవారిలో కానీ స్క్రీన్ చేతిలో ఉందంటే, వారిని బలహీన పరిచే వినోద సాధనాలు వారి దగ్గర ఉన్నట్లే లెక్క.

ఇందులో టెలివిజన్, వీడియో గేమ్స్, సోషల్ మీడియా కూడా ఉన్నాయి.

టీవీ

ఫొటో సోర్స్, Getty Images

పిల్లలు, యుక్త వయస్కులు ఎంత సేపు స్క్రీన్ ముందు గడుపుతారు?

2 సంవత్సరాల పిల్లలు సగటున రోజుకు 3 గంటలు, 8 సంవత్సరాల పిల్లలు సుమారుగా 5 గంటలు, యుక్త వయస్కులు 7 గంటలకు పైగా స్క్రీన్ తోనే గడుపుతారు.

అంటే 18 ఏళ్ళు వచ్చే లోపు 30 సంవత్సరాల పాటు స్కూలులో గడపాల్సిన సమయాన్ని వినోదాన్ని అందించే స్క్రీన్ ల ముందు గడుపుతున్నారు. అంటే వారి జీవితంలో పూర్తిగా 16 సంవత్సరాలు స్క్రీన్ తో గడుపుతున్నట్లే అర్ధం. ఇది చాలా బాధ్యతా రహితమైన , పిచ్చి పని.

వినోదాత్మక సాధనాలతో పిల్లలు ఎంత సేపు గడపవచ్చు?

పిల్లలను ఇందులో భాగస్వామ్యం చేయడం చాలా ముఖ్యం. వాళ్ళు వినోదం కోసం చూసే ఈ సాధనాల వలన మెదడుకు హాని కలిగి, నిద్రకు భంగం కలిగిస్తుందని, భాష నేర్చుకోవడంలో ఇబ్బంది అవుతుందని, విద్యా ప్రమాణాలను బలహీన పరుస్తుందని, ఏకాగ్రతను తగ్గిస్తుందని, ఊబకాయం వచ్చే ముప్పు ఉందని చెప్పాలి.

ఇలా కారణాలను వివరించినప్పుడు పిల్లలు వెంటనే వింటారని కొన్ని అధ్యయనాలు తెలిపాయి.

1947లో ఐక్యూ టెస్ట్

ఫొటో సోర్స్, Getty Images

వయసులోనైనా, ఎంత తక్కువ చూస్తే అంత మంచిది.

అలాగే, పిల్లల వయసును అనుసరించి కొన్ని ప్రత్యేక నియమాలను చెప్పవచ్చు.

6 సంవత్సరాల కంటే ముందు అసలు స్క్రీన్ ఇవ్వకుండా ఉండటం మంచిది.

పిల్లలకు ఎంత చిన్న వయస్సులో స్క్రీన్ ఇస్తే వారి మీద కలిగే ప్రతికూల ప్రభావం అంత ఎక్కువగా ఉంటుంది.

ఆరేళ్ళు వచ్చినప్పటి నుంచి వారు చూసే సమాచారం ఉపయుక్తంగా ఉండి వారు సరిగ్గా నిద్రపోగల్గితే , రోజుకు అరగంట నుంచి గంట వరకు వాడవచ్చు.

ఇవి కాకుండా, స్కూలుకు వెళ్లే ముందు, రాత్రి పూట నిద్ర పోయే ముందు, అలాగే వాళ్ళ చుట్టూ ఇతరులు ఉన్నప్పుడు స్క్రీన్ చూడనివ్వకూడదు.

వీటన్నిటి కంటే ముఖ్యంగా బెడ్ రూమ్ లో స్క్రీన్ ఉండకుండా ఉండటం మేలు.

కానీ, పెద్దవాళ్ళమే నిరంతరం స్మార్ట్ ఫోన్లకు కానీ, గేమ్స్ కి కానీ అతుక్కుపోయి ఉన్నప్పుడు పిల్లలకు చెప్పడం కష్టం అవుతుంది.

స్క్రీన్

ఫొటో సోర్స్, Rebecca Nelson/Getty Images

స్క్రీన్లతో కలిగే ప్రమాదాల గురించి చాలామంది తల్లితండ్రులకు ఎందుకు తెలియదు?

ఎందుకంటే తల్లితండ్రులకు ఇచ్చిన సమాచారం కొంత పక్షపాతంతో, సగం సగమే ఉంది.

మెయిన్ స్ట్రీమ్ మీడియాలో నిరూపితం కాని వాదనలు, తప్పు దారి పట్టించే ప్రచారం, తప్పుడు సమాచారంతో నిండిపోయి ఉంది.

మీడియాలో వచ్చే సమాచారం , శాస్త్రీయ సమాచారం మధ్య ఉన్న వ్యత్యాసాలు చాలా కలవరపరిచేవిగా ఉంటాయి.

అలా అని మీడియా అంతా అబద్ధాల కోరు అని నేను చెప్పటం లేదు. విశ్వసనీయమైన పత్రకారులకు కూడా పొట్టు నుంచి గోధుమను వేరు చేయడం సులభం కాదు.

డిజిటల్ పరిశ్రమ ప్రతీ సంవత్సరం కొన్ని బిలియన్ డాలర్ల లాభాలను తెస్తోంది. దీనికి, పిల్లలు, యుక్త వయస్కులే లాభదాయకమైన వనరులు.

అలాగే, బిలియన్ డాలర్ల నెటవర్త్ ఉన్న కంపెనీలకు శాస్త్రవేత్తలను, మధ్యవర్తులను, అనుమానాలు వ్యక్తం చేసే ఔత్సాహిక వ్యాపారవేత్తలను పట్టుకోవడం సులభమవుతుంది.

ఇందుకొక ఉదాహరణ చెబుతాను.

వీడియో గేమ్స్ లో నిపుణుడు అయిన ఒక మానసిక శాస్త్రవేత్త చాలా మీడియా ప్లాట్ఫారంల పై ఈ గేమ్స్ వలన సానుకూల ప్రభావాలు ఉంటాయని వాటిని రాక్షసంగా చూడకూడదని, వాటిని ఆడకుండా ఉండటం వలన పిల్లల భవిష్యత్తుకు ఆటంకం కలగవచ్చని, కొన్ని హింసాత్మక గేమ్స్ వలన చికిత్స చేసే ప్రభావాన్ని కలిగి ఉంటాయని, దాని వలన కోపం తగ్గుతుందని వివరించారు

అయితే, ఆ నిపుణుడు వీడియో గేమ్ పరిశ్రమ కోసం పని చేశారనే విషయాన్ని ఏ ఒక్క విలేకరీ చెప్పలేదు. ఇలాంటి ఉదాహరణలు నా పుస్తకంలో ప్రస్తావించాను.

అయితే, ఆశకు ఇంకా అవకాశం ఉందని అనుకుంటున్నాను. నిజాన్ని ఖండించడం కష్టం

వీడియో గేమ్స్ వలన పిల్లల చదువు తీరు మెరుగు పడినట్లు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

అది కచ్చితంగా పిచ్చి వాదన అని నేనంటాను.

ఇలాంటివి కేవలం చెడు ప్రచారం కోసమే చేస్తారు. చాలా తప్పుడు సమాచారంతో జరిగిన అధ్యయనాలు అవి. ఇలాంటివి సరైన పత్రికలలో ప్రచురితం కావు.

ఒక ప్రయోగాత్మక పరిశోధనలో చదువులో ప్రతిభను కనబరిచిన పిల్లలకు ఆడుకునేందుకు గేమ్ కన్సోల్ లు ఇచ్చారు. నాలుగు నెలల తర్వాత వాళ్ళు ఎక్కువ సమయం గేమ్స్ తోనూ తక్కువ సమయం స్కూల్ హోమ్ వర్క్ చేయడంలోనూ పెట్టడం మొదలయింది. వాళ్ళకొచ్చే గ్రేడులు 5 శాతం పడిపోయాయి.

ఇంకొక అధ్యయనంలో పిల్లలు ఒక పదాల జాబితాను నేర్చుకోవాలి. ఒక గంట తర్వాత కొంత మంది కార్ రేసింగ్ వీడియో గేమ్ ఆడు కోవడానికి అనుమతి ఇచ్చారు. రెండు గంటల తర్వాత వారు నిద్రపోవడానికి వెళ్లిపోయారు.

చిన్నారి

ఫొటో సోర్స్, Getty Images

ఈ ఆట ఆడని పిల్లలు 80 శాతం పాఠాలను గుర్తు చేసుకోగా, ఆడిన పిల్లలు 50 శాతం మాత్రమే గుర్తు పెట్టుకోగలిగారు.

ఈ వీడియో గేమ్, నిద్ర పైన, జ్ఞాపక శక్తి పైనా ప్రభావం చూపించిందని ఈ అధ్యయనకర్తలు గుర్తించారు.

డిజిటల్ తరానికి చెందిన పిల్లలు పెద్దవారయ్యాక ఎలా ఉంటారని మీరు అనుకుంటున్నారు?

నేనెప్పుడూ డిజిటల్ తరానికి చెందిన పిల్లలకు విభిన్నమైన సమాచారం ఉంటుందని వింటూ ఉంటాను.

వాళ్ళకి భాష, ఏకాగ్రత, జ్ఞానం పరంగా లోపాలు ఉన్నప్పటికీ, వాళ్ళు చాలా ఇతర విషయాల పట్ల చాలా మెరుగ్గా ఉంటారు.

అయితే ఆ ఇతర విషయాలు ఏమిటనేది పెద్ద ప్రశ్న.

అందరూ అనుకున్నట్లుగా వారు కంప్యూటర్ల వాడకం నిపుణులు ఏమి కారు.

వాళ్లకి డిజిటల్ నైపుణ్యం తక్కువగా ఉండటం వలన స్కూల్ లో రక రకాల విద్యాపరమైన సాంకేతికతను అలవర్చుకోవడాన్ని కూడా నిరోధిస్తుందని యూరోపియన్ యూనియన్ అధ్యయనం చెబుతోంది.

అలాగే ఇంటర్నెట్లో లభించే సమాచారాన్ని అంతటినీ గ్రహించే శక్తి కూడా వారికుండదు.

వాళ్ళు డిజిటల్ అప్లికేషన్ల వాడకంలో నైపుణ్యం కలిగి ఉంటారనేది నిజం. అంటే ఆన్ లైన్ లో ఉత్పత్తులు కొనుక్కోవడం, మ్యూజిక్ సినిమాలు డౌన్ లోడ్ చేసుకోవడం లాంటివి.

నాకైతే ఈ పిల్లలు, ఆల్డస్ హక్స్లీ రచన 'బ్రేవ్ న్యూ వరల్డ్'లో నిర్వచించిన "తెలివి తక్కువ వినోదంతో దిమ్మెర పోవడం, భాషా జ్ఞానం లేకపోవడం, ప్రపంచాన్ని ప్రతిబింబించ లేకపోయినప్పటికీ వారికి పట్టిన అదృష్టం గురించి సంతోష పడుతూ ఉంటారు" అనే సూత్రాన్ని పోలి ఉంటారు అనిపిస్తుంది.

స్క్రీన్వాడకంపై ఏవైనా దేశాలు చట్టాలు చేస్తున్నాయా?

అవును. ముఖ్యంగా ఆసియా లాంటి దేశాలలో.

ఉదాహరణకు ఈ స్క్రీన్ వాడకం ఎక్కువగా ఉండటం వలన పిల్లల పై వేధింపులు చోటు చేసుకుంటున్నాయని తైవాన్ భావిస్తోంది.

వయసు 24 నెలల లోపున్న పిల్లలకు డిజిటల్ అప్లికేషన్లకు అలవాటు చేయడం, 2 - 18 సంవత్సరాల వయసు పిల్లల స్క్రీన్ సమయాన్ని తగ్గించని తల్లి తండ్రులకు భారీగా జరిమానాలు విధిస్తామని చట్టాన్ని కూడా ప్రవేశ పెట్టింది.

చైనాలో మైనర్ లు వీడియో గేమ్స్ ఆడే సమయాన్ని నియంత్రించడానికి చాలా కఠినమైన చర్యలు తీసుకుంటోంది. పిల్లలు, యుక్త వయస్కులు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 8 గంటల మధ్యలో ఆటలు ఆడటానికి వీలు లేదు. . అలాగే ఒక వారంలో 90 నిమిషాల కంటే ఎక్కువ సేపు గడపడానికి లేదు.

ఫ్రెంచ్ న్యూరో శాస్త్రవేత్త మైకెల్ డెస్ముర్గెట్

ఫొటో సోర్స్, Michel Desmurget

ఫొటో క్యాప్షన్, ఫ్రెంచ్ న్యూరో శాస్త్రవేత్త మైకెల్ డెస్ముర్గెట్

పిల్లలను స్క్రీన్నుంచి రక్షించడానికి చట్టాలు అవసరమంటారా?

నాకు దేనినైనా నిషేధించడం ఇష్టం ఉండదు. నా కూతురును ఎలా పెంచాలో నాకు ఎవరైనా చెబితే ఇష్టం ఉండదు.

కానీ, తల్లి తండ్రులకు నిజాయితీతో కూడిన సమగ్రమైన సమాచారాన్ని అందించినప్పుడే వారి విద్యకు సంబంధించిన నిర్ణయాలు స్పష్టంగా అమలు చేయగలరు.

స్క్రీన్ ల ప్రభావం పిల్లల అభివృద్ధి పై ఎలా ఉంటుందో సరైన నియమాలతో కూడిన సమాచారాన్ని ప్రచారం చేసినట్లయితే అదొక మంచి ఆరంభం అవుతుంది. పిల్లలు ఆరేళ్ళు వచ్చే వరకు స్క్రీన్ లు వద్దు. తరువాత రోజుకు 30 - 60 నిమిషాలు మించకూడదు.

మీరన్నట్లు డిజిటల్ పిచ్చితనం గనక ఆగకపోతే, ఏం జరగొచ్చు?

ఈ డిజిటల్ పిచ్చితనానికి దూరంగా ఉన్న కొద్ది పాటి పిల్లలు మిగిలిన వారి మధ్య సామాజిక అసమానతలు, సమాజంలో ప్రగతిశీల విభజనలు చోటు చేసుకోవచ్చు.

హక్స్లీ నవలలో ఆల్ఫాస్ లా సంస్కృతి , భాష ద్వారా ప్రపంచాన్ని ప్రతిబింబించే జ్ఞానాన్ని సంపాదించిన వారు, పరిమితమైన సంస్కృతి, గ్రాహక సాధనాల ద్వారా ప్రపంచాన్ని అర్ధం చేసుకోకుండా జ్ఞానోదయం అయినట్లు నటించే గామాల మధ్య వ్యత్యాసంలా మారుతుంది ఈ ప్రపంచం.

ఆల్ఫాస్ టీచర్లు ఉండే ఖరీదైన ప్రైవేటు పాఠశాలలకు హాజరు అవుతారు.

గామాస్ వర్చువల్ పబ్లిక్ స్కూళ్లకు హాజరవుతారు. అక్కడ మనుషుల మద్దతు తక్కువగా ఉంటుంది.

సామాజిక శాస్త్రవేత్త నీల్ పోస్ట్ మాన్ చెప్పినట్లు వాళ్ళు మరణించేవరకు వినోదం పొందుతూ ఉంటారు. బలహీనపరిచే నిరంతర వినోదంతో వాళ్ళ బానిసత్వాన్ని ప్రేమిస్తూ ఉంటారు.

నేను ఈ విషయంలో సానుకూలంగా లేకపోవడం పట్ల క్షమించండి.

ఒక వేళ నా అభిప్రాయాలు తప్పేమో! కానీ, మనం మన పిల్లల భవిష్యత్తుకి, వారి అభివృద్ధికి చేస్తున్న పనులకు క్షమాపణ అయితే లేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)