Formula Milk - Formula Food: చిన్న పిల్లల ఫార్ములా పాలు, ఆహారంలో విషపూరితమైన పెస్టిసైడ్స్, హెవీ మెటల్స్ అవశేషాలు ఉన్నాయా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అనా టర్న్స్
- హోదా, బీబీసీ ఫ్యూచర్
నా ఇద్దరు పిల్లలకు వారి జీవితంలోని మొదటి సంవత్సరం మొత్తం తల్లిపాలే ఇచ్చాను. ఎలాంటి ఇన్‌స్టంట్ ఫుడ్ ఫార్మలానూ ఉపయోగించలేదు.
శిశువులకు చనుబాలే ఆదర్శవంతమైన బలవర్ధకమైన ఆహారం. మెదడు, రోగ నిరోధక శక్తి, జీర్ణ వ్యవస్థల పెరుగుదలలో ఇవి ఎంతగానే ఉపకరిస్తాయి. నా పిల్లలకు ఆ పోషకాహారాన్ని ఇచ్చానని ఆనందంగా చెప్పగలను.
కాలుష్యంపై పుస్తకం రాయడం కోసం చేస్తున్న పరిశోధనలో భాగంగా నా రక్తాన్ని పరీక్షించుకున్నప్పుడు వచ్చిన అనూహ్యమైన ఫలితాలు నాలో ఆలోచనలు కలిగించాయి. నా రక్తంలో వదలిపెట్టకుండా ఉన్న విషపూరిత రసాయనాలను గుర్తించడం కోసం ఈ పరీక్షలు చేశారు. 40 ఏళ్లకు ముందుగానే నిషేధించిన క్రిమి సంహారక మందుల అవశేషాలు నా శరీరంలో ఇంకా ఉన్నట్టు కనుగొన్నాను.
కొద్ది మొత్తంలోని రసాయనాల అవశేషాలు తల్లి నుంచి ఆమె చనుబాలు కూడా పాకినట్టు ఆధారాలు లభించాయి.
ఫార్ములా మిల్క్ కూడా విషపూరిత రసాయనాలతో కలుషితమయ్యే ప్రమాదం ఉంది. హాని కలిగించే బాక్టీరియా కూడా చేరే అవకాశం ఉంది. అందువల్లనే ఇటీవల కాలంలో ఆ పాలు అంటే విపరీతమైన భయం కలగడం, వాటిని వెనక్కి రప్పించుకోవడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి.
అందుకే మన పిల్లలు నిజంగా ప్రథమ ఆహారం కింద ఏమి తీసుకుంటున్నారన్నదానిపై నాకు ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే పాలలో ఎంతో ప్రయోజనకరమైన పదార్థాలతో పాటు అదృశ్యరూపంలో అవాంఛనీయ, కొన్నిసార్లు విషపూరితమైనవీ ఉన్నాయి.
వాటి వల్ల కలిగే ముప్పును గమనించిన తరువాత పిల్లల ముందు ఉన్న ప్రత్యామ్నాయాలను ఎలా మెరుగుపరచాలన్నదానిపై ఆలోచించాల్సి ఉంటుంది. అవి చనుబాలుగానీ, ఫార్మలా మిల్క్‌గానీ...జీవితం ప్రారంభ దశలో అత్యంత మేలైనది ఎలా ఇవ్వాలన్నది నిర్ణయించాల్సిన అంశం.

ఫొటో సోర్స్, Getty Images
ప్రతి రోజూ మార్పులకు లోనయ్యే పాలు
శిశువుల ప్రథమ ఆహారం కింద మొదటి ప్రాధాన్యంగా చనుబాలునే పరిగణిస్తారు. (మొదటి ఆరు నెలల పాటు శిశువులను కేవలం చనుబాలు మాత్రమే ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా సిఫార్సు చేసింది.)
దీంట్లో నీరు, కొవ్వులు, ప్రొటీన్లు, అన్ని రకాల విటమిన్లు, జీర్ణ ప్రక్రియ ఎంజైమ్‌లు, హార్మోన్లు ఉన్నాయి. మెటర్నల్ యాంటీ బాడీస్ పుష్కలంగా ఉన్నాయి. అంటు వ్యాధులను నిరోధించే లక్షణాలు కలిగి ఉంది.
చనుబాలు డైనమిక్ ఆహారమే కాదు, అనుసరణీయమైనది కూడా. ఉదాహరణకు చనుబాలు ఉదయం పూట కన్నా మధ్యాహ్నం. సాయంత్రం వేళల్లో చిక్కగా ఉంటాయి. తాగే సమయంలోనూ మార్పు చెందుతుంది. శిశువు స్థనాన్ని పట్టుకొని మొదటి ధార కోసం ప్రయత్నించినప్పుడు వచ్చే ఆ ప్రథమ ధార (తొలి పాలు) పలచగా ఉంటాయి. లాక్టోజ్ మాత్రం అధికంగానే ఉంటుంది. అది శిశువులో దాహాన్ని పెంచుతుంది. తాగడాన్ని సులభతరం చేస్తుంది.
అనంతరం హిండ్ మిల్క్‌గా పిలిచే "తదుపరి పాలు'' వస్తాయి. దీంట్లో మీగడ, కొవ్వు అధికంగా ఉంటుంది. అందుకే పొట్ట నిండినట్టవుతుంది.
తల్లిపాలు లాంటివి మరొకదాన్ని తయారు చేయలేకపోవడానికి చనుబాలుకు ఉన్న ఈ డైనమిక్ లక్షణాలు ఒక కారణం. శిశువుల ఆహారం కోసం ఉద్దేశించిన ఇన్ ఫాంట్ ఫార్ములాల నాణ్యతలో చెప్పుకోదగిన పురోగతి ఉంటున్నప్పటికీ చనుబాలులాంటివి మాత్రం తయారు కావడం లేదు.
"పాలు స్రవించే కాలమంతటా దాని స్వరూపం మారుతూ ఉంటుంది. ప్రతి రోజూ మారుతుంది. తాగించే సమయంలో.. మొదటి దశలో ఉన్న పరిస్థతి చివరిదాకా ఉండదు. తల్లి తీసుకునే ఆహారంపైనా ఇవి ఆధారపడి ఉంటాయి. దేన్ని ఎంత మొత్తంలో కలిపితే ఇలాంటిది వస్తుందో తెలుసుకోవడం చాలా కష్టం. అందుకే ఫార్ములా మిల్క్‌లో అలాంటి లక్షణాలేవీ ఉండవు. శిశువు వయసులో పెరుగుదలకు అనుగుణంగా ఫార్ములా మిల్క్‌లో మాత్రం ఎలాంటి మార్పులు ఉండదు '' అని యూనివర్సిటీ కాలేజీ లండన్‌లోని పిడియాట్రిక్ న్యూట్రిషన్ ప్రొఫెసర్ మేరీ ఫ్యూట్రెల్ చెప్పారు. చనుబాలుపై ఆమె చేసిన పరిశోధనలు ప్రఖ్యాత వైజ్ఞానిక మ్యాగజైన్లలో ప్రచురితమయ్యాయి.
చనుబాలులో నాన్ న్యూట్రియెంట్ పదార్థాలు కూడా దానికి అపూర్వ లక్షణాలను కల్పిస్తున్నాయని ఫ్యూట్రెల్ తెలిపారు. దాంట్లో హార్మోన్లు, కణాలు (స్టెమ్ సెల్స్ సహా), మైక్రో ఆర్ ఎన్ ఏలు (జీవ పదార్థానికి చెందిన సన్నని పోగుల్లాంటివి) ఉన్నాయి. "వీటి ప్రయోజనం ఏమిటన్నది ఇంతవరకు పూర్తిగా అర్థం కాలేదు. బహుశా వీటి ద్వారా తల్లి తన బిడ్డకు సమాచారాన్ని చేరవేయడానికి అవకాశం ఉంది. తన సొంత అనుభవాలు, పర్యావరణానికి సంభందించిన విషయాలను అందజేస్తుందేమో! అందుకే చనుబాలు తాగించడాన్ని కొన్నిసార్లు 'పర్సనలైజ్డ్ న్యూట్రిషన్'గా అభివర్ణిస్తుంటారు'' అని వివరించారు.
యూఎస్ సెంటర్స్ ఫర్ డీసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అధ్యయనం ప్రకారం 80 శాతానికిపైగా నవజాత శిశువులు ప్రారంభంలో తల్లిపాలను పొందుతారు. ఆరు నెలల తరువాత అలాంటి వారి సంఖ్య 58 శాతానికి పడిపోతుంది.
వివిధ ప్రోత్సాహకాలు ఇచ్చి ఆ శాతాన్ని పెంచడానికి ఆరోగ్య శాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తునే ఉన్నారు. చనుబాలు ఇచ్చే మహిళలకు అందజేస్తున్న ప్రయోజనాలను పెంచడం, మాటలు రాని పిల్లలకు పరీక్షలు జరిపి, చికిత్సలు అందించడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు.
మరోవైపు ఫార్ములా మిల్క్‌ను ఉపయోగిస్తున్న తల్లిదండ్రులు కూడా చనుబాలు వల్ల కలిగే లాభాలను అర్థం చేసుకొని మరింతగా ఉపయోగించాల్సి ఉంటుంది.
"శిశువులకు మానవ క్షీరమే ఆదర్శవంతమైన నమూనా. అది తల్లీ బిడ్డలు ఇద్దరికీ మేలు చేస్తుంది. కానీ కొందరు మహిళలకు చనుబాలు ఇచ్చే సామర్థ్యం ఉండడం లేదు. మరికొందరు ఇవ్వకూడదని అనుకుంటున్నారు. ఇంకొందరయితే పాక్షికంగానే ఇస్తున్నారు. శిశువులకు తల్లిపాలు తాగించకపోయినా, పాక్షికంగా తాగించినా..అలాంటి వారికి ఉన్న ప్రత్యామ్నాయం ఇన్‌ఫాంట్ ఫార్ములా ఫుడ్ మాత్రమే. అయితే అది అన్ని న్యూట్రిషన్లను కలిగి ఉండి శుశువు అభివృద్ధికి సహకరించేదిగా ఉండాలి. దీని రూపకల్పన కొంత ఫ్లెక్సిబుల్‌గా ఉండాలి. ఎందుకంటే అందరికీ పనికొచ్చే సూత్రం అంటూ ఏమీ లేదు" అంటూ ఫ్యూట్రెల్ శిశు ఆహారం తయారీపై తన అభిప్రాయాలను వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
మెరుగైన ఫార్ములా రూపకల్పన దిశగా...
శిశు ఆహార తయారీ సూత్రాలు గత దశాబ్దాల కాలంలో బాగా అభివృద్ధి చెందాయి. 19, 20 శతాబ్దాల కాలంలో సీసాల ద్వారా పాలు పట్టడం సురక్షితమైన మార్గం కాదని విశ్వసించేవారు. 1900 సంవత్సరాల తొలినాళ్లలో అనాథ శరణాలయాల్లోని పిల్లలకు సీసాల ద్వారా పాలు పట్టేవారు. వారిలో 80 శాతం మంది మొదటి సంవత్సరంలోనే మరణించేవారు. స్టెరిలైజ్ చేసిన సీసాలు వాడకపోవడం, పోషక పదార్థాలు లేకపొవడమే ఇందుకు కారణాలు.
1865లో తొలిసారిగా వాణిజ్య సరళిలో శిశు ఆహారాన్ని తయారు చేశారు. అప్పుడు కేవలం నాలుగు పదార్థాలను ఉపయోగించారు. ఆవు పాలు, గోధుమ పిండి, మాల్ట్ (బార్లీ) పిండి, పొటాషియం బైకార్బనేట్ ను వినియోగించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు న్యూట్రీషనల్ కంటెంట్ లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి.
మరి ప్రస్తుత ఫార్ములాలో ఏమున్నాయి?
ఇప్పటి ఫార్ములాల్లో కొవ్వు (ఫ్యాట్) లభించే పలు దినుసులను ఉపయోగిస్తున్నారు. ఆవు పాలు లేదా మేక పాలు (సాధారణంగా మీగడ తీసినవే అయి ఉంటాయి. తల్లిపాలులో ఉన్నంత కొవ్యు కూడా ఉండదు), పామ్ఆయిల్, పొద్దుతిరుగుడు పువ్వుల నూనె, ఆవ నూనె వంటి వెజిటబుల్ ఆయిల్స్, ఫ్యాటీ యాసిడ్‌లను వాడుతున్నారు.
ఒక ఫ్యాటీ ఆసిడ్ అయిన డీహెచ్ఏ (డోకోసహెక్సానిక్ యాసిడ్ - ఒమేగా 3 ఫ్యాట్‌లో ఒకరకమైనది)ని తప్పకుండా వాడలంటూ యూరోపియన్ యూనియన్ నిబంధన విధించింది. ఎందుకంటే శిశువు పెరుగుదలలో ఇదే కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి.
చనుబాలులో ప్రధాన కార్బోహైడ్రేట్‌గా లాక్టోజ్ ఉంటుంది. దీన్ని ఫార్ములాలో మీగడ తీసిన పాల పొడి రూపంలో వాడుతారు. మాల్టోడెక్స్ట్రిన్ (మొక్క జొన్న నుంచిగానీ, బంగాళదుంపల నుంచిగానీ తీసిన కార్బోహైడ్రేట్)ను కలుపుతారు. యునైటెడ్ కింగ్‌డంలో అయితే గ్లూకోజ్ (ఒక రకమైన చక్కెర)ను సాధారణంగా కలపరు. అదే అమెరికాలో వివిధ ధాన్యాల సిరప్ నుంచి తయారు చేసిన గ్లూకోజ్ సుగర్‌ను కలుపుతుంటారు.
కానీ దీనితో ఒక సమస్య ఉంది. శిశువులకు దంత క్షయం సమస్యను తెచ్చి పెడుతుంది. వారికి దంతాలు వచ్చిన తరువాత ఇబ్బంది మొదలవుతుంది.
తల్లి పాలలోని ప్రధాన ప్రొటీన్ల విషయానికి వస్తే వాటి పేర్లు వెయ్, కాసెయిన్‌లు. పాలు విరిగినప్పుడు మిగిలే నీటిలో ఈ ప్రొటీన్లు కనిపిస్తాయి. శిశువు పెరిగే కొద్ది వీటి నిష్పత్తి మారుతుంది. లాక్టో ఫెర్రియిన్ కూడా ఉంటుంది. బిడ్డకు జన్మనిచ్చిన తరువాత చనుబాలులో ఉండే కొలొస్ట్రమ్‌లో ఇది అధికంగా కనిపిస్తుంది.
ఫార్ములాలను బట్టి వినియోగించాల్సిన ప్రొటీన్ల మొత్తం, వాటి సమ్మేళనం తీరు మారుతుంది. ఆవుపాలను ఉపయోగించామా, మేక పాలను వాడామా అన్నదానిపైనా ఆధారపడి ఉంటుంది. వెయ్, కాసెయిన్ ప్రొటీన్ల మధ్య ఉండే నిష్పత్తి తల్లిపాల కంటే ఆవు, మేక పాలలోనే అధికంగా కనిపిస్తుంది.
వృక్ష సంబంధమైన ప్రొటీన్లకు వస్తే సోయా ప్రొటీన్‌ను ఉపయోగిస్తారు. ఎ, డి, బి, కె వంటి వివిధ రకాల విటమిన్లు, కాల్షియం, మెగ్నీషియం, జింక్ వంటి మెటల్స్ ఇతర పదార్థాలు కూడా ఈ ఫార్ములాలో చోటుచేసుకుంటాయి.
దుదృష్టవశాత్తూ ఈ ఫార్ములాల్లో ప్రచ్ఛన్న, అవాంఛనీయ పదార్థాలు కూడా ఉంటున్నాయి. నా శరీరంలో ఉన్నమలినాలు మాదిరిగానే ఈ ఫార్ములా ఫుడ్‌లోనూ అలాంటివి చొరబడుతున్నాయి.

భార లోహాల మిశ్రమాలు
అమెరికాకు చెందిన లాభాపేక్ష రహిత సంస్థ క్లీన్ లేబుల్ ప్రాజెక్టు 2017లో ఇన్‌ఫాంట్ ఫార్ములాలపై పరీక్షలు జరిపింది.
విషపూరితమైన పెస్టిసైడ్స్, హెవీ మెటల్స్ అవశేషాలు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవడానికి 86 శాంపిల్స్‌ను పరిశీలించగా అందులో 80శాతం వాటిలో ఆర్సెనిక్ లక్షణాలు కనిపించాయి.
సోయాబీన్ ఆధారంగా రూపొందించిన ఫార్ములాల్లో ఏడు రెట్లు అధికంగా కాడ్మియం ఉంది. కేన్సర్‌ను వ్యాపింపజేసే ఈ ఖనిజాన్ని ఫార్ములాల్లో కన్నా బ్యాటరీల్లోనే అధికంగా ఉపయోగిస్తుంటారు.
అక్కడికి రెండేళ్ల తరువాత క్లీన్ లేబుల్ ప్రాజెక్టు, యూనివర్సిటీ ఆఫ్ మియామీలో న్యూరాలజీ విభాగానికి చెందిన పరిశోధకులు తమ అధ్యయన నివేదికను ప్రచురించారు. 91 ఇన్‌ఫాంట్ ఫార్ములాల్లో హెవీ మెటల్స్ అవశేషాలు ఉన్నట్టు గుర్తించారు.
22 శాతం శాంపిల్స్‌లో సీసం అధికంగా ఉంది. ఇది కాలిఫోర్నియా రాష్ట్ర చట్టం విధించిన పరిమితులను మించిపోయింది. 23శాతం శాంపిల్స్‌లో కాడ్మియం అవశేషాలు పరిమితులను దాటాయి.
లో లెవల్ హెవీ మెటల్స్ మలినాలు విసృతంగా కనిపించాయని అధ్యయనంలో తేలింది. ప్రతి రోజూ తీసుకునే బేబీ ఫుడ్‌లో ఉండే ఈ లో లెవల్ హెవీ మెటల్స్ కారణంగా దీర్ఘకాలంలో పిల్లల ఆరోగ్యంపై చూపించే ప్రభావాన్ని మరింతగా అధ్యయనం చేయాల్సి ఉంటుందని తెలిపింది.
బేబీ ఫుడ్‌పై స్వీడన్‌లోనూ పరిశోధన జరిగింది. ఫార్ములాల్లోని కాడ్మియం తల్లిపాలలో ఉన్నదానికన్నా 12 శాతం అధికంగా ఉంది. అయితే అది భరించదగ్గ పరిమితిగానే ఉంది. ప్రతివారానికి ఎంత ఉండాలనేదానిపై డబ్ల్యూహెచ్ఓ, ఎఫ్ఏఓ సూచించిన పరిమితులకు లోబడే ఉంది.
అధ్యయన పత్రానికి సహ రచయితగా ఎన్విరాన్మెంటల్ బయోలజిస్ట్, క్లీన్ లేబుల్ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జాకీ బోవెన్ వ్యహరించారు. మనం తినే ఆహారం ముఖ్యంగా ఇన్‌ఫాంట్ ఫార్ములాల్లో అంతర్గతంగా ఉన్న మలినాల విషయమై మరింత పారదర్శకత ఉండాలంటూ ఆమె ప్రచారం చేస్తున్నారు.
బోవెన్ అభిప్రాయం ప్రకారం ఈ కంటామినేషన్ వ్యవహారం ఫుడ్ సేఫ్టీ రెగ్యులేటర్ల పరిశీలనకు వచ్చే అవకాశం లేదు. వారు ప్రధానంగా మైక్రోబియల్ పాథోజెన్స్ అయిన ఈ.కోలీ లాంటి వాటిపైనే దృష్టి పెడుతుంటారు. ఈ పాథోజెన్స్ తీవ్రమైన, స్వల్పకాలిక ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమవుతుండడంతో వారి శ్రద్ధ అంతా వాటిపైనే ఉంటుంది.
ఫుడ్ సేఫ్టీ రెగ్యులేటర్లు మాత్రం తాము బేబీ ఫుడ్‌లో హెవీ మెటల్స్ కలుస్తున్న సమస్యను పరిష్కరించడానికి చురుగ్గా పనిచేస్తున్నట్టు నొక్కి చెబుతున్నారు.
ఉదాహరణకు బేబీ ఫుడ్‌లో విషపూరిత అంశాలు ఉన్నదీ లేనిదీ తెలుసుకోవడానికి నిరంతరం పరీక్షలు జరిపించుకోవాలని యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) ఒత్తిడి తెస్తుంటుంది. ఒకవేళ ఆరోగ్యానికి హాని కలిగించేవి ఉంటే తగిన చర్యలు తీసుకుంటుంది.
బేబీ ఫుడ్స్‌లో హెవీ మెటల్స్, విషపూరిత పదార్థాలను సాధ్యమైనంత కనిష్ఠ స్థాయిలో ఉంచేందుకు ఫుడ్ కంపెనీలు, ఇతర భాగస్వాములతో కలిసి పనిచేస్తున్నట్టు ఆ సంస్థ తెలిపింది.
అయితే ఈ విషయంలో ఎఫ్‌డీఏ, ఫుడ్ కంపెనీలు తగినంత చేయడం లేదంటూ ఇటీవల యూఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌కు చెందిన ఓవర్‌సైట్ అండ్ రిఫార్మ్స్ కమిటీ ఇటీవల వెలువరించిన నివేదికలో విమర్శించింది.
ఎఫ్‌డీఏ మాత్రం తాను పరిశ్రమకు మార్గదర్శనం చేస్తున్నట్టు తెలిపింది. "ఆహారంలో విషపూరిత పదార్థాలు అర్థవంతంగా, నిరంతరంగా తగ్గే విధంగా ఈ సూచనలు ఉపయోగపడుతున్నాయి '' అని పేర్కొంది. దాంతో పాటుగా శాంపిళ్లు సేకరించి పరిపాలన పరమైన విధులు నిర్వర్తిస్తున్నట్టు తెలిపింది.
"ఆహార పదార్థాల్లోని విషతుల్యాలపై వస్తున్న ఆందోళనలను పేరెంట్స్‌గా, కేర్ గివర్స్‌గా మేం గుర్తించాం. అర్థం చేసుకున్నాం. పిల్లల ఆరోగ్యంపై అవి ఏవిధంగా ప్రభావితం చేస్తున్నాయన్నదాన్నీ తెలుసుకున్నాం'' అని ఆ సంస్థ అధికార ప్రతినిధి ఒకరు బీబీసీకి తెలిపారు.
"వినియోగదారుల్లో అవగాహన పెరిగింది. మనం ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాం. దశాబ్దాల అనంతరం కనిపించే దీర్ఘకాలిక వ్యాధులైన కేన్సర్, వంధత్వం వంటివాటితో ఎలాంటి సంబంధం ఉంది అనే విషయాలపై ఆందోళన చెందుతున్నారు '' అని బోవెన్ వివరించారు.
హెవీ మెటల్ కంటామినేషన్ విషయంలో అమెరికాలోని ఆహార భద్రత నిబంధనలు మౌనంగా ఉన్నాయని అన్నారు. " సురక్షితమైన ఆహారానికి నిర్వచనం చెప్పడంలో కోర్ట్ ఆఫ్ లా, కోర్ట్ ఆఫ్ పబ్లిక్ ఒపీనియన్ మధ్య విభజన పెరుగుతోంది '' అని వివరించారు.
భార లోహాలు (హెవీ మెటల్స్) అయిన కాడ్మియం, సీసంలు భూమి పైపొరలోనే లభిస్తాయి. అందువల్ల వాటిని పూర్తిగా తొలగించడం అసాధ్యం.
అయితే మానవ చర్యలైన గనుల తవ్వకం, ఆయిల్ తవ్వకం వంటి ఫ్రాకింగ్ పనులు, పారిశ్రామిక తరహా వ్యవసాయం, మురికి నీటిని సాగునీరుగా ఉపయోగించడంతో పాటు కాలుష్యం రూపంలో గాలి, నీరు, భూమిలో ఉండిపోయే హెవీ మెటల్స్ ఆహారంపై ప్రభావం చూపుతున్నాయని బోవెన్ వివరించారు.
వీటిని నివారించడం కూడా కష్టం. అధిక ఉష్ణోగ్రత, ఇతర చర్యల ద్వారా మైక్రోబియల్ పాథోజెన్స్‌ను నాశనం చేయవచ్చు. కానీ ఆహారంలోకి ఒకసారి హెవీ మెటల్ మలినాలు వస్తే వాటిని తొలగించడానికి ఎలాంటి విధానం లేదని ఆమె చెప్పారు.
ఇలాంటివాటిని వదిలించుకోవాలంటే ప్రారంభ దశ నుంచే జాగ్రత్తలు తీసుకోవాలి. మట్టిని పరిశుభ్రంగా, కలుషితం లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఫార్ములా మిల్క్ ప్రక్రియ వ్యవసాయం నుంచే ప్రారంభమవుతుంది కాబట్టి. దీంట్లోని ఉత్పత్తులు పాడి పశువులు, పంటల నుంచే వస్తాయి మరి.
"హై క్వాలిటీ ఫినిష్డ్ ప్రోడక్ట్ రావాలని మీరు కోరుకుంటే ఇన్‌గ్రేడియంట్స్ కూడా మంచి నాణ్యమైనవే ఉండాలి. ఆరోగ్యకరమైన పోషకవిలువలు ఉన్న భూముల నుంచే అలాంటి ఉత్పత్తులు వస్తాయి. ఇందుకు మంచి పర్యావరణ విధానం అవసరం. ఈ సమస్యకు మూల కారణమైన అంతటి స్థాయి కాలుష్యాన్ని అనుమతించని విధానం ఉండాలి'' అని వివరించారు.
కొన్ని ఫార్ములాల ఇన్‌గ్రేడియంట్స్‌లో హెవీ మెటల్ కంటామినేషన్ ముప్పు అధికంగా ఉంది. ఆవు పాలుకు ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తున్న సోయా పాలలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. ప్రధాన స్రవంతిలోనే ఉన్న ఈ వృక్ష సంబంధ ఉత్పత్తిలో బయోఎక్యుములేట్ హెవీ మెటల్స్ ఉన్నాయి. భూమి, నీరు రూపంలో పంట దశలోనే వాటిలో చేరాయి. జనపనారలోనూ ఇదే పరిస్థితి. బటానీ ఆధారిత ప్రొటీన్లలో మాత్రం ఇంతగా లేదు.
ఫార్ములా మిల్క్‌లో కనిపించకుండా ఉండే ఈ మలినాలు సమస్యలో ఒక భాగం మాత్రమే. ఇన్‌ఫాంట్ మిల్క్‌ను తయారు చేయడానికి పాల పొడిలో కుళాయి నీటిని కలుపుతుంటారు. ఇది కూడా ఆరోగ్యపరంగా రిస్క్ కలిగించేదే.
నీటి సరఫరాకు పాతవైన సీసం పైపులు ఉపయోగిస్తుంటే ఆ జలం కలుషితమవుతుంది. ఉదాహరణకు ఫ్లింట్, మిషిగన్‌లలో ఇలాగే జరిగింది. (నీటిలో సీనం ప్రభావం కనిపిస్తే అది బాలింతలకు కూడా ముప్పు కలిగిస్తుంది.)
నీటిని పరీక్షించే సమయంలో వాటిలోని మైక్రోబ్స్ పైనే దృష్టి పెడుతున్నారు తప్పితే అందులోని హెవీ మెటల్స్ గురించి ఆలోచించడం లేదని బోవెన్ అభిప్రాయపడ్డారు.
"ఇన్‌ఫాంట్ మిల్క్ ఫార్ములాలోని సమస్యలను పరిష్కరించడంలో ఇది ఒక భాగం మాత్రమే. తాగునీటిలోని హెవీ మెటల్ మలినాల బెడదను పరిష్కరించకపోతే సమస్యను సగమే గుర్తించినట్టవుతుంది. ఎందుకంటే ఈ మలినాలు ఉన్న తాగునీటినే పాలపొడిలో కలిపి పిల్లలు తాగడానికి పంపిణీ చేస్తున్నారు. అసలు ముందు దీనిని నివారించడానికి మనం ఏమి చేస్తున్నాం?'' అని బోవెన్ ప్రశ్నించారు.
క్లోజర్ టు జీరో పేరుతో యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. శిశువులు, పిల్లలు తినే ఆహారంలోని ఆర్సెనిక్, లెడ్, కాడ్మియం, మెర్కురీ స్థాయిలను తగ్గించడమే దీని లక్ష్యం. స్వచ్ఛమైన ఆహారం దిశగా వేసే ఓ ముందడుగులాగా కనిపిస్తోంది.
ఫార్ములా మిల్క్‌లో సాధారణంగా ఉపయోగించే పామాయిల్, సోయాబీన్ విషయంలోనూ పర్యావరణ పరమైన ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక సహజసిద్ధ అడవులను ధ్వంసం చేసి వీటిని పండిస్తున్నారన్నదే ఆ భయాలకు కారణం.
దీనిని పరిష్కారంగా సాధ్యమైనంత వరకు స్థానికంగా దొరికే పంటలనే సేకరించి వాటిని ఆర్గానిక్ ఫార్ములా ఇన్‌గ్రేడియంట్స్‌గా ఎంచుకోవాలని కొందరు సూచిస్తున్నారు.
ఉదాహరణకు ఆస్ట్రేలియాలకు చెందిన ఫార్ములా మిల్క్ తయారీ సంస్థ బబ్స్ స్థానికంగానే మేక పాలు, ఇతర జంతువుల పాలను సేకరిస్తోంది. అందువల్ల పెంపకందార్లు దాణాలో ఏమి ఉపయోగించారో తెలుసుకోవడం సాధ్యమవుతుందని ఆ సంస్థ చెబుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
మైక్రోబయోమ్‌ల పోషణ
ఇటీవల కాలంలో హ్యూమన్ మైక్రోబయోమ్‌లు పోషించే కీలక పాత్రపై అవగాహన పెరిగింది. వాటి జీవావరణ వ్యవస్థ మన శరీరంలోనే ఉంది. జీర్ణ ప్రక్రియ వ్యవస్థ, ఇతర చోట్ల పెరుగుతుంటాయి.
వీటిపై లండన్‌లోని సిటీ డైడీషియన్స్‌కు చెందిన ఎమిలీ బ్లొక్సామ్ తన అభిప్రాయలను చెప్పారు.
పిడియాట్రిక్ డైటీషియన్‌గా పని చేస్తున్న ఆమె నియానాటల్ న్యూట్రిషన్, అలెర్జీ రంగాల్లో స్పెషలిస్టు.
ప్రస్తుతం గతంలో ఎన్నడూ లేని విధంగా ఫార్ములా మిల్క్‌లోని న్యూట్రిషన్‌ల సమ్మేళనం తల్లిపాలులో ఉన్న మాదిరిగా ఉంటోంది.
అయితే శిశువుల్లో గట్ మైక్రోబయోమ్‌ల పెరుగుదలకు తల్లి పాలే కీలక చోదక శక్తి. తల్లిపాలలో ఉన్న కంపోనెంట్సే ఈ పెరుగుదలకు సహకరిస్తాయి. తల్లి నుంచి వచ్చే మెటర్నల్ యాంటీ బాడీస్, ఆరోగ్యకరమైన గట్ బాక్టీరియా వంటివి కీలక పాత్ర పోషిస్తాయి. అయితే వీటిని ఇంతవరకు కృత్రిమంగా తయారు చేసే విధానమేదీ రాలేదు.
"తల్లి పాలలో బిఫిడో బాక్టీరియా అనే చాలా ముఖ్యమైన ప్రోబయోటిక్ (మిత్ర బాక్టీరియా) ఉంటుంది. ఇది మొదటి 1000 రోజుల్లోనే నవజాత శిశువు పేగుల్లోకి వలస వచ్చేస్తుంది. రోగ నిరోధక శక్తి పెరుగుదలకు సహకరిస్తుంది. ఆస్త్మా, ఎజీమా, అతిసార వ్యాధి లక్షణాలను తగ్గిస్తుంది'' అని బ్లొక్సామ్ చెప్పారు.
"చనుబాలులో ప్రెబోటిక్‌లు ఉంటాయి. వీటిని హ్యూమన్ మిల్క్ ఆలిగోసాచిరైడ్స్ (హెచ్ఎంఓలు)గా వ్యవహరిస్తుంటారు. ఇవి బిఫిడో బాక్టీరియాను పోషించి వాటి పెరుగుదలకు సహకరిస్తాయి'' అని వివరించారు.
హెచ్ఎంఓల్లో దాదాపు 150కిపైగా రకాలు ఉన్నాయి. నిజానికి తల్లి పాలు తాగిన పిల్లల్లోని గట్ మైక్రోబియోమ్స్ ఫార్ములా మిల్క్ తాగిన శిశువుల్లో ఉన్నవాటి కంటే చాలా డిఫరెంట్‌గా కనిపించాయి.
అలర్జీల ముప్పు ఉందని హెచ్చరికలు ఉండే హైపోఅలెర్జినిక్ ఫార్ములాల్లో ఇప్పుడు ప్రిబయోటిక్, ప్రొబయోటిక్ లు ఉండే వాటిని కలుపుతున్నారు. పాలు అంటే అలర్జీ ఉన్న పిల్లల్లో తల్లిపాలు తాగే శిశువుల్లో మాదిరిగా గట్ మైక్రోబయోమ్‌లు పెరిగేలా దీన్ని డిజైన్ చేశారు.
కొత్తగా ప్రోబయోటిక్ బిఫిడోబాక్టీరియా సప్లిమెంట్స్‌ను అభివృద్ధి చేశారు. వీటిని ఫార్ములా మిల్క్‌లోగానీ, చనుబాలులోగానీ కలుపుకోవచ్చు. సి-సెక్షన్ ఆపరేషన్ల ద్వారా జన్మించిన పిల్లలకు ఇది ఉపకరిస్తుంది.
యోని మార్గం ద్వారా జన్మించక తల్లి నుంచి రావాల్సిన కొన్ని రకాల గట్ బాక్టీరియాను పొందని శిశువులకు ప్రయోజనం కలిగిస్తుంది.
కొన్ని రకాల హెచ్ఎంఓలను రసాయనాల రూపంలో ఫార్ములా మిల్క్‌లో కలుపుతున్నారు.
ఎన్ని రకాల పదార్థాలు కలుపుతున్నా ఆ ఫార్ములాలు ఏవీ తల్లి పాలలో ఉన్న కొన్ని ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉండడం లేదు. నిరంతరం మార్పు చెందడం, ఎలాంటి పరిస్థితులు వచ్చినా దానికి అనుకూలంగా మారిపోవడం వంటి లక్షణాలు మాత్రం కనిపించడం లేదు.
అందుకే తల్లిపాలను "సంక్లిష్ట నిరంతర ధార'' అని బ్లొక్సామ్ అభివర్ణించారు.
"చనుబాలులో ఉండే ఈ ప్రయోజనకర పదార్థాల మొత్తం, కలయిక తీరు మహిళ మహిళకూ మారుతుంటాయి. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి. జన్యువులు, ప్రాంతం, పాలు స్రవించే దశ, తీసుకునే ఆహారం తదితర అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఒక మహిళలో కూడా చనుబాల కాంపోజిషన్ ప్రతి రోజూ మారుతుంటుంది. శిశువు అవసరాలను తీర్చే విధంగా ఈ మార్పు ఉంటుంది'' అని వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రయోగశాలలో పాల రూపకల్పన?
తల్లిపాలలోని ఈ విశిష్ట లక్షణాలను సాధ్యమైనంతవరకు అనుకరించడానికి ఓ మార్గం ఉంది. అది చనుబాలును ఉత్పత్తి చేసే కణాలను ప్రయోగశాలలో రూపొందించడమే. ఈ దిశగా కొందరు శాస్త్రవేత్తలు ప్రయోగాలను ప్రారంభించారు.
లైలా స్ట్రిక్‌లాండ్ అనే సెల్ బయాలజిస్ట్ నార్త్ కరోలినాలో బయో మిల్క్ అనే స్టార్ట్ అప్ సంస్థను ఏర్పాటు చేశారు. తన మొదటి బిడ్డకు తగినన్ని చనుబాలు ఇవ్వలేక ఇబ్బంది పడడంతో ఆమెకు ఈ ఆలోచన వచ్చింది.
ఆమె బృందంలోని సభ్యులు స్థనాల టిష్యూలు, చనుబాలులోని కణాలు సేకరించి ప్రయోగశాలలోని ఫ్లాస్కుల్లో ఉంచి పెరిగేలా చేస్తుంటారు. వాటిని ఇంకుబేటర్‌లాంటి బయోరియాక్టర్‌లో పెడుతారు. వాటికి న్యూట్రియంట్స్, విటమిన్ల మిశ్రమాన్ని ఆహారంగా ఇస్తుంటారు. అనంతరం అవి సహజసిద్ధ మానవ క్షీరంలో ఉండే పాల కాంపోనెంట్లను స్రవిస్తాయి.
వీటిని బయోమిల్క్ మార్కెట్‌లోకి తీసుకురావడానికి ఇంకా కొన్నేళ్లు పడుతుంది.
అయితే ఈ ప్రయోగశాల పాలు కూడా ఏ శిశువుకు ఆ శిశువుకు అన్నట్టుగా వ్యక్తిగత ప్రత్యేకతలతో ఉండవు. సొంత తల్లిపాలు శిశువు అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మారిపోతుంటుంది. ఆ లక్షణాలు ఇంతవరకు ప్రయోగ శాల పాలులో కనిపించడం లేదు.
మరికొన్ని బయోటెక్ కంపెనీలు కూడా ల్యాబ్-గ్రోన్ మిల్క్ ప్రాజెక్టులపై కసరత్తు చేస్తున్నాయి. అంటే భవిష్యత్తులో శిశు ఆహారం ఎలా ఉండాలన్నదానిపై మన ఆలోచనలు పూర్తిగా మారిపోతాయి.
సింగపూర్‌లో టర్టల్ ట్రీ ల్యాబ్స్ అనే సంస్థ వివిధ క్షీరదాల కణాలు సేకరించి కల్చరింగ్ రూపంలో అభివృద్ధి చేస్తున్నాయి.
ఆవులు, గొర్రెలు, మేకలు, ఒంటెలు, ఇప్పుడు మానవుల సెల్స్‌ను కూడా సేకరిస్తోంది. మిల్క్ కాంపోనెంట్లను తయారు చేయడమే దీని ఉద్దేశం.
న్యూయార్క్‌లోని హెలీనాలో ఉన్న మరో స్టార్టప్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఇంకో ప్రయోగం చేస్తున్నారు. ఈస్ట్ సెల్స్ ద్వారా మానవ క్షీరంలోని క్రియాశీల హ్యూమన్ మిల్క్ ప్రొటీన్లను తయారు చేసే పనిలో ఉన్నారు. ఇందుకు ఫెర్మెంటేషన్ విధానాన్ని ఉపయోగిస్తున్నారు. ఇలా తయారు చేసిన వాటిని ఇన్‌ఫాంట్ ఫార్ములాలు, ఇతర ఫుడ్ ప్రోడక్టుల్లో వినియోగిస్తారు.

చనుబాలు నిరంతం మార్పు చెందే ద్రవంలాంటిది. ఒక విధంగా చలనశీల లక్ష్యంలాంటిది. అందుకే ఇందులోని కొన్ని కాంపోనెంట్లు ఇప్పటికీ పూర్తిగా అర్థం కావడం లేదని యూనివర్సిటీ కాలేజీ లండన్‌లో పిడియాట్రిక్ న్యూట్రిషన్ విభాగం ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న మేరీ ఫ్యూట్రెల్ చెప్పారు
"మనం అనుకున్న విధంగా శిశువు పెరుగుదల, అభివృద్ధి జరిగేందుకు సమృద్ధిగా, సురక్షితంగా న్యూట్రిషన్లను అందించడం కోసం చాలా విజయంతంగా ఫార్ములాలను రూపొందించగలం. నిజానికి ఇటీవల కాలంలో ఫార్ములాల్లోని కంపోజిషన్ల విషయంలో చాలా ఇంప్రూవ్‌మెంట్స్ ఉన్నాయి. తల్లిపాలు తాగిన పిల్లల్లో ఎటువంటి పెరుగుదల కనిపించిందో దాదాపుగా అలాంటే అభివృద్ధే వీటిని తాగిన శిశుల్లోనూ కనిపిస్తోందనడానికి ఆధారాలు చూపించవచ్చు. కానీ నాన్-న్యూట్రియెంట్ కాంపోనెంట్స్‌ను అనుకరించడం ఎప్పటికీ అసాధ్యంగానే ఉంటుందని అనుకుంటున్నా. ఎందుకంటే ఇది సంక్లిష్టమైన ద్రవ పదార్థం'' అని ఆమె చెప్పారు.
నా సొంత శరీరంలోని విషపదార్థాల విషయమై జరిగిన పరీక్షల గురించి డైటీషియన్ బ్లొక్సెమ్‌కు చెప్పాను. నా చనుబాలులోనూ హానికర విషపదార్థాలు ఉంటాయా అని అడిగాను.
అందుకు ఆమె సమాధానం చెబుతూ "అవకాశం ఉన్నప్పుడల్లా ఈ పాలు ఇవ్వాలనే చెబుతుంటాను. ఎందుకంటే దీని వల్ల తల్లీ బిడ్డలకు మలినాల వల్ల కలిగే రిస్కుల కన్నా ప్రయోజనాలే చాలా ఎక్కువ'' అంటూ భరోసా ఇచ్చారు.
నా సొంత పాలలో ఎలాంటి ఇన్‌గ్రేడియంట్లు ఉన్నాయో అని ఆశ్చర్య పడే మహిళను నేనొక్కదాన్నే కాదు. చాలా మందిలో ఇలాంటి ఆందోళన ఉంటుంది. తమ పాలను పరీక్షలు చేయిస్తుంటారు కూడా.
దీనిపై కాలిఫోర్నియోకు చెందిన స్టెఫానీ కెనాలే తన అభిప్రాన్ని చెప్పారు. ఆమె ఒకప్పుడు ఫ్యామిలీ డాక్టరుగా పనిచేశారు. ప్రస్తుతం లాక్టేషన్ లాబ్ అనే ప్రైవేట్ కంపెనీని ఏర్పాటు చేసుకున్నారు. చనుబాలులో ఏమేరకు న్యూట్రిషన్ కంటెంట్లు ఉన్నాయి, పర్యావరణ పరంగా వచ్చిన విష పదార్థాలు ఏమైనా ఉన్నాయా అని పరీక్షలు జరిపి విశ్లేషణ జరపడమే దీని పని.
చాలా మంది తల్లులు తమ చనుబాల శాంపిల్స్‌ను ఫ్రీజ్ చేసి ఈ ల్యాబ్‌కు పరీక్షల నిమిత్తం పంపించారు. మినరల్స్, విటమిన్లు, ఇతర ఇన్‌గ్రేడియంట్లు ఎంతవరకు ఉన్నాయో తెలుసుకోగోరారు. నివేదిక ఆధారంగా తమ ఆహారంలో మార్పులు చేసుకోవాలన్నదే వారి ఉద్దేశం.
దీనిపై కేనల్ మాట్లాడుతూ "శిశువుకు అందుతున్న న్యూట్రిషన్ల విషయంలో చాలా అంశాలను పరిశీలిస్తాం. తల్లిలో సహజంగా ఉండే పేరంటల్ విటమిన్లు, ఆమె తీసుకుంటున్న ఆహారం, పాలు తాగడానికి విముఖం చూపే శిశువు తీసుకుంటున్న ఆహారం ఇంకా చాలా విషయాలను చూస్తాం. ఇందులో ఫార్ములా మిల్క్ కూడా ఉండొచ్చు '' అని తెలిపారు.
ఈ ఆచరణాత్మక విధానాల కారణంగానే ఆమె అమెరికాలోని ఫార్ములాల కంటెంట్లపై కఠినమైన నియంత్రణలు ఉండాలని కోరుకుంటున్నారు.
"నాది కెనడా. అమెరికాలోని ఉత్పత్తుల్లో ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ ఇంత ఎక్కువగా ఉంటుందేమిటా అని ఆశ్చర్య పోతుంటా. దీనిని మార్చాలని తల్లులు కోరుకుంటున్నారు. ఆ ఉత్పత్తుల్లో ఏముందో తమకు తెలియాలని అంటున్నారు. ముఖ్యంగా ఫార్ములాల విషయంలో. ..ఎందుకంటే శిశువులు ప్రతి రోజూ ఒకటే తింటున్నారు. ఎలాంటి మార్పు ఉండడం లేదు. (అదే చనుబాలయితే ప్రతి రోజూ మార్పులు ఉంటాయి)'' అని చెప్పారు.
విషపూరిత రసాయనాల విషయానికి వస్తే.. అవి చనుబాలులో ఉన్నా, ఫార్ములా మిల్క్‌లో కనిపించినా.. అడగాల్సిన ప్రశ్న ఒక్కటే లేదు. మన పిల్లలకు సురక్షితమైన పౌష్టికాహారాన్ని ఎలా అందిస్తామన్న ఒక్క ప్రశ్నే కాదు భవిష్య తరాలకు సురక్షితమైన ఆహార గొలుసును ఎలా అందిస్తామన్నది కూడా ఉంది.
సురక్షితమైన, జీవించే యోగ్యత ఉన్న వాతావరణం. కాలుష్య రహితంగా ఉండే సంపూర్ణ ఆహార గొలుసును ఇవ్వాల్సి ఉంది. దీనికి సమాధానం తప్పకుండా ఉంది. మొదటగా తక్కువ హాని కలిగించే రసాయనాలతో పనులు ప్రారంభించడమే ఆ ప్రశ్నలకు జవాబు.
ఇవి కూడా చదవండి:
- సీఐ నాగేశ్వర రావు అరెస్ట్... వివాహితను బెదిరించి, అత్యాచారం చేసిన ఆరోపణల కేసులో కొత్త కోణం
- క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటి, అమర్నాథ్ యాత్రలో జరిగిన ప్రమాదాల్లాంటివి ముందే పసిగట్టలేమా
- Shinzo Abe: జపాన్ మాజీ ప్రధాని విజయ రహస్యం ఏమిటి, సుదీర్ఘ కాలం ప్రధానిగా ఎలా కొనసాగారు?
- SpiceJet: ఈ విమానయాన సంస్థను మూసేయాలని ఎందుకు డిమాండ్లు వస్తున్నాయి?
- కోనోకార్పస్: భారత్, పాకిస్తాన్ దేశాలను ఈ మొక్క ఎందుకు భయపెడుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















