కొడుకు కళ్ల ముందే తిరుగుతున్నాడు, కానీ బతికి ఉన్నట్లు సర్టిఫికెట్ లేదు, మరి ఆ తల్లి ఏం చేసింది?

మున్నీ దేవి

ఫొటో సోర్స్, MUNNI DEVI FAMILY

ఫొటో క్యాప్షన్, మున్నీ దేవి
    • రచయిత, చందన్ కుమార్ జజ్వాడే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

సొంత కొడుకు బతికి ఉన్నాడని నిరూపించుకోవడానికి ఆమె మూడు సార్లు మూడు వేర్వేరు కోర్టులను ఆశ్రయించాల్సి వచ్చింది.

మూడు కోర్టులు, అనేక పత్రాలు, ఏడేళ్ల సుదీర్ఘ న్యాయ పోరాటం తరువాత ఆ తల్లి తన కొడుకు జీవించి ఉన్నాడని నిరూపించింది.

కళ్ల ముందే కొడుకు తిరుగుతున్నాడు, కానీ కాగితంపై ఆ బిడ్డ చనిపోయాడు. ఎలాగైనా కొడుకు బతికి ఉన్నాడని నిరూపించుకునేందుకు తపన పడిన ఓ తల్లి కథ ఇది.

ఏమిటీ కథ?

బిహార్‌లోని గయకు చెందిన మున్నీ దేవి తన భర్తను హత్య చేశారనే అరోపణలు ఎదుర్కొన్నారు. 2015 మే 24న ఆమె భర్త శవం దొరికిన కొన్ని గంటల్లోనే పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.

దీనికి అయిదు నెలల ముందు మున్నీ దేవి ఒక మగబిడ్డకు జన్మనిచ్చారు. అరెస్టుతో ఆమె తన అయిదు నెలల చిన్నారిని విడిచిపెట్టి జైలుకు వెళ్లారు.

ఎనిమిది నెలల తరువాత మున్నీ దేవికి 2016 జనవరిలో బెయిల్ మంజూరైంది. ఆ తరువాత ఆమె తన బిడ్డ కోసం అత్తమామల ఇంటికి వెళ్లారు.

ఆమె బిడ్డ డయేరియా వచ్చి చనిపోయాడని అత్తమామలు చెప్పారు.

బిడ్ద చనిపోయినట్లు రుజువు చేసేందుకు ప్రభుత్వ పత్రాలు సహా గ్రామపెద్దలు, సర్పంచ్‌లు జారీ చేసిన మరణ ధ్రువీకరణ పత్రాన్ని కూడా మున్నీదేవికి చూపించారు.

అయితే ఈ ప్రభుత్వ పత్రాలను ఆ తల్లి నమ్మలేకపోయింది.

చిన్నారులు

ఫొటో సోర్స్, Getty Images

అనుమానం నిజమైనప్పుడు..

అత్తమామల ఇంట్లో ఓ పిల్లవాడు ఆడుకుంటూ కనిపించేవాడు. ఆ బాబుకి తన కొడుకు వయసే ఉంటుందని మున్నీ దేవి సందేహించారు.

"ఆ పిల్లవాడిని చూసినప్పుడల్లా వీడు నా బిడ్డే అని నాకు మనసులో అనిపించేది. అయిదు నెలలు ఉన్నప్పుడు బాబును విడిచివెళ్లాను. ఇప్పుడు వాడికి ఏడేళ్లు. కొంతమంది గ్రామస్థులు, నాకు మరిది వరుస అయ్యే ఒక వ్యక్తి ఆ బిడ్డ నా బిడ్డేనని రహస్యంగా నాకు సమాచారం అందించారు" అని మున్నీ దేవి బీబీసీకి చెప్పారు.

అత్తమామలు, ప్రభుత్వ పత్రాలు, దాదాపు మొత్తం గ్రామం ఒకవైపు.. మున్నీ దేవి మాత్రమే మరోవైపు. ఆమె పోరాటం మొదలైంది.

మున్నీ దేవి రహస్యంగా తన అత్తమామల ఇంటిపై నిఘా ఉంచారు. ఇంటి బయట ఆడుకుంటున్న పిల్లవాడిని జాగ్రత్తగా గమనించసాగారు.

2017లో మున్నీ దేవి తన బిడ్డ కోసం గయా జిల్లా కోర్టులో అర్జీ పెట్టుకున్నారు.

అత్తమామలు తన బిడ్డను అపహరించారంటూ కేసు వేశారు. అయితే గయా జిల్లా కోర్టు ఆమె అత్తమామలకు బెయిల్ మంజూరు చేసింది.

ఒకసారి బతికి న్నాడని, ఒకసారి చనిపోయాడని నివేదికలు

మున్నీ దేవి కోర్టుకు వెళ్లడం మంచిదే అయింది. కోర్టు ఆదేశాలతో పోలీసులు దర్యాప్తు చేశారు. మున్నీ దేవి బిడ్డ బతికే ఉన్నాడని కొందరు గ్రామస్థులు తెలుపగా, మరికొంతమంది బిడ్డ మరణించాడని చెప్పారంటూ ఒక పోలీసు అధికారి రిపోర్టులో తెలిపారు.

దాంతో, మున్నీదేవికి ఆశలు చిగురించాయి. మరొక పోలీసు అధికారి తదుపరి విచారణ చేపట్టారు. రెండో దర్యాప్తులో రిపోర్టు పూర్తిగా మార్చేశారు. ఆమె బిడ్డ చనిపోయాడని రిపోర్టు ఇచ్చారు. దాంతో, ఆమెకు నిరాశ, నిస్పృహలు ఆవరించాయి.

చిన్నారులు

ఫొటో సోర్స్, Getty Images

కేసు ఫ్యామిలీ కోర్టుకు వెళ్లింది

కొడుకు కళ్లెదుటే ఉండి, దగ్గరకు తీసుకోలేకపోతే ఏ తల్లికైనా బాధే. 2019లో మళ్లీ మున్నీ దేవి కోర్టు తలుపులు తట్టారు. ఈసారి కేసు ఫ్యామిలీ కోర్టుకు వెళ్లింది.

గయా ఎస్ఎస్‌పీ తరపున చేసిన దర్యాప్తులో, పిల్లవాడు బతికే ఉన్నాడని ఒక సబ్-ఇన్‌స్పెక్టర్ తెలిపారు.

అక్కడే, ఓ కొత్త ట్విస్ట్ వచ్చింది. ఆ చిన్నారిని కోర్టు ముందు ప్రవేశపెట్టాలని కోర్టు ఆదేశించింది. దాంతో, రెండవసారి దర్యాప్తు జరిపిన సబ్-ఇన్‌స్పెక్టర్ ఆ బాబు చనిపోయాడని రిపోర్ట్ ఇచ్చారు.

చిన్నారి మృతి నివేదికను చూసిన తరువాత కేసును కొనసాగించేందుకు ఫ్యామిలీ కోర్టు నిరాకరించింది.

పోలీసుల విచారణలో ఒకే బిడ్డ రెండుసార్లు చనిపోయి, రెండుసార్లు బతికుండడం ఏమిటి?

బీబీసీ అసలు విషయం తెలుసుకోవడానికి గయా ఎస్ఎస్‌పీ హర్‌ప్రీత్ కౌర్‌ను సంప్రదించింది. ఈ మొత్తం వ్యవహారంలో హర్‌ప్రీత్ కౌర్ పోలీసుల పక్షం వహించారు.

క్యూఆర్ కోడ్ ఈ సమస్యను పరిష్కరించింది

"మా దగ్గర పట్నా మున్సిపల్ కార్పొరేషన్ జారీ చేసిన మరణ ధృవీకరణ పత్రం ఉంది. దానిపై ఒక క్యూఆర్ కోడ్ ఉంది. ఇది కాకుండా, గ్రామ పెద్ద, సర్పంచ్ జారీ చేసిన మరణ ధృవీకరణ పత్రం ఉంది" అని హర్‌ప్రీత్ కౌర్‌ బీబీసీతో చెప్పారు.

2016లో ఇందూ దేవి ఆ గ్రామపెద్దగా ఉండేవారు. బీబీసీ ఆమెను ఫోన్‌లో సంప్రదించింది. ఆమె భర్త అజిత్ బీబీసీతో మాట్లాడారు.

"మున్నీ దేవి అత్తమామలు, ఆమె బిడ్డ చనిపోయాడని గుండు చేయించుకుని మా దగ్గరకు వచ్చారు. వారితో పాటు మరో 100 మంది గ్రామస్థులు కూడా వచ్చారు. వారంతా పిల్లవాడు చనిపోయాడని సాక్ష్యం చెప్పారు. మున్నీ దేవి మామగారు చడీచప్పుడు లేకుండా పిల్లవాడిని తీసుకుని రాంచీకి వెళ్లిపోయారని మాకు ఇప్పుడే తెలిసింది" అని అజిత్ చెప్పారు.

ఫ్యామిలీ కోర్టు నుంచి తనకు అనుకూలంగా తీర్పు రాకపోవడంతో, మున్నీ దేవి తన అత్తమామలకు ఇచ్చిన బెయిల్‌ను వ్యతిరేకిస్తూ పట్నా హైకోర్టును ఆశ్రయించారు. లాయర్ అవినాశ్ కుమార్ సింగ్ సహాయంతో హెబియస్ కార్పస్ కింద పిటిషన్ దాఖలు చేశారు.

మున్నీ దేవి

ఫొటో సోర్స్, MUNNI DEVI FAMILY

పట్నా హైకోర్టులో విచారణ

మున్నీ దేవి తరఫు న్యాయవాది అవినాశ్ కుమార్‌ను బీబీసీ హిందీ సంప్రదించింది.

"మున్నీదేవికి మొదటినుంచి అత్తమామలపై అనుమానం ఉంది. భర్తను హత్య చేశారని ఆమెపై తప్పుడు కేసు బనాయించి జైలుకు పంపారు. తరువాత, ఆమె బిడ్ద చనిపోయాడని నమ్మించారు. మున్నీ దేవికి భర్త ఆస్తిలో భాగం ఇవ్వకుండా ఎగ్గొట్టడానికే ఇదంతా చేశారు. ఈ కేసులో ఒక్కొక్క విషయాన్ని లింకు చేసుకుంటూ పోతే, మాకు మొత్తం విషయం అర్థమైంది. అత్తమామలకు ఊరివాళ్ల మద్దతు ఉంది, కులం మద్దతు ఉంది. దాంతో, మున్నీ దేవి ఒంటరి అయిపోయారు. ధైర్యం చేయలేకపోయారు" అని అవినాశ్ కుమార్ చెప్పారు.

"బిడ్ద చనిపోయాడని పట్నా మునిసిపల్ కార్పొరేషన్ మరణ ధృవీకరణ పత్రం జారీ చేసింది. కానీ, ఈ నివేదికపై నాకు అనుమానం కలిగింది. నేను అక్కడివారిని సంప్రదించినప్పుడు, దీనిపై సమాచారం ఇవ్వలేమని చెప్పారు. మున్నీ దేవి మళ్లీ మళ్లీ ఓడిపోతుండడం చూసి నాకు చాలా బాధ కలిగింది. నేను నా స్థాయిలో మరింత పరిశోధన చేశాను" అని లాయర్ అవినాశ్ వివరించారు.

ఈ మరణ ధ్రువీకరణ పత్రం నకిలీదని మున్సిపల్‌ కార్పొరేషన్‌కు చెందిన ఓ అధికారి అవినాశ్ కుమార్‌కు తెలిపారు.

వాస్తవానికి, దేశంలోని ప్రతి జననం, మరణం గురించిన సమాచారం సివిల్ రిజిస్ట్రీ సిస్టమ్ వెబ్‌సైట్‌ crsorgi.gov.in లో అందుబాటులో ఉంటుంది.

"నేను దాని క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసినప్పుడు, ఈ సర్టిఫికేట్ ఉన్న వెబ్‌పేజీ ఒపెన్ అయింది. అది చూసి షాక్ అయ్యాను. అది ఒక నకిలీ వెబ్‌సైట్" అని లాయర్ అవినాశ్ తెలిపారు.

ఈ ఘటనతో ఆయనకు మొత్తం విషయం బోధపడింది.

జనన, మరణ ధృవీకరణ పత్రాలు

ఫొటో సోర్స్, CRSORGI.GOV.IN

డీఎన్ఏ పరీక్ష ఫలితాల కోసం నిరీక్షణ

2022 సెప్టెంబర్ 8న ఈ కేసు తదుపరి విచారణ జరిగింది.

మున్నీ దేవి, లాయర్ అవినాశ్ కుమార్‌ కలిసి మొత్తం సమాచారాన్ని పట్నా హైకోర్టు న్యాయమూర్తి ముందుంచారు.

పట్నా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, గయ, పట్నా ఎస్ఎస్‌పీలు సెప్టెంబర్ 12న కోర్టు ముందు హాజరు కావాలని కోర్టు కోరింది.

సెప్టెంబర్ 12న విచారణలో, మున్నీ దేవి బిడ్డను 48 గంటల లోపు రికవరీ చేయాలని కోర్టు ఆదేశించింది. అయితే, 16 గంటల్లోనే రికవరీ చేశారు.

ఇప్పుడు ఆ చిన్నారి మున్నీదేవి బిడ్డేనని గ్రామస్తులు కూడా నమ్ముతున్నారు.

మరోవైపు, మోసం, పత్రాల ట్యాంపరింగ్‌ సహా పలు కేసుల్లో మున్నీ దేవి మామగారిని గయలోని మగధ మెడికల్ పోలీస్ స్టేషన్ అరెస్టు చేయగా, మున్నీ దేవి బావ (భర్త అన్న) పరారీలో ఉన్నారు.

"కోర్టు ఆదేశాలతో చిన్నారిని చైల్డ్ కేర్ సెంటర్‌లో ఉంచాం. అక్కడ ఆ బాబును బాగా చూసుకుంటున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న మున్నీదేవి బావ కోసం వెతుకుతున్నాం. ఇలాంటి నకిలీ పత్రాలు తయారు చేసే ముఠా గుట్టు రట్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం" అని హర్‌ప్రీత్ కౌర్‌ చెప్పారు.

ఆ పిల్లవాడికి డీఎన్ఏ పరీక్షలు జరిపాక, బాబుకు ఏడేళ్లు దాటిన తరువాత మున్నీ దేవికి అప్పగిస్తారని భావిస్తున్నారు.

వీడియో క్యాప్షన్, ఝార్ఖండ్: పరీక్షల్లో ఫెయిల్ చేశారంటూ.. టీచర్లను చెట్టుకు కట్టేసి కొట్టిన విద్యార్థులు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)