యుక్రెయిన్‌లో రష్యా రిఫరెండం: ‘తుపాకీ గురిపెట్టి ఓటు వేయమన్నారు’

ఫొటో సోర్స్, Reuters
యుక్రెయిన్‌లోని రష్యా ఆక్రమిత ప్రాంతాల్లో రిఫరెండం నిర్వహించారు. ఈ ప్రాంతాలను రష్యాలో కలిపేసేందుకు ఈ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. అయితే, రష్యా చర్యలను యుక్రెయిన్ ప్రభుత్వంతోపాటు పశ్చిమ దేశాలు సిగ్గుచేటుగా వ్యాఖ్యానించాయి.
ముఖ్యంగా రష్యా ఆధీనంలోని దక్షిణ, తూర్పు యుక్రెయిన్‌కు చెందిన నాలుగు ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ ప్రాంతాలు యుక్రెయిన్ మొత్తం భూభాగంలో 15 శాతం వరకు ఉంటాయి.
ఈ ప్రాంతాల్లో రష్యా ప్రత్యేక అధికారులను నియమించింది. ఓటింగ్‌లో పాల్గొనేందుకు వచ్చిన వారంతా తాము రష్యాలో చేరేందుకు మద్దతు పలికినట్లు ఆ అధికారులు చెబుతున్నారు.
దోన్యస్క్, లూహాన్సెక్‌లలోని రష్యా అనుకూల వార్తా సంస్థలు కూడా దాదాపు 99.23 శాతం మంది రష్యాలో కలిసేందుకే మొగ్గుచూపినట్లు చెబుతున్నాయి. ఇలాంటి ఓటింగ్‌లో అంత మంది పాలుపంచుకోవడం, పైగా 99 శాతం మందికిపైగా రష్యాలో చేరేందుకే మద్దతు పలకడం అసాధారణంగా అనిపిస్తోంది.
అయితే, ప్రజలను భయపెట్టి ఓటింగ్‌లో పాల్గొనేలా చేశారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఎన్నికల అధికారులు సాయుధులతో కలిసి ఇంటింటికీ వెళ్లి ఓటింగ్ చేపట్టారు.
రష్యా పార్లమెంటులో శుక్రవారం దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ ఓటింగ్ ఫలితాలను ప్రకటించే అవకాశముందని అంతర్జాతీయ మీడియా సంస్థలు చెబుతున్నాయి.
మార్చి 2014లోనూ కూడా క్రైమియా పీఠభూమిలోనూ ఇలానే అనధికార రిఫరెండం నిర్వహించి, ఆ ప్రాంతాన్ని రష్యాలో కలిపేస్తున్నట్లు పుతిన్ ప్రకటించారు.

ఫొటో సోర్స్, Getty Images
యుక్రెయిన్‌లోని ఏ ప్రాంతాలు రష్యాలో కలవబోతున్నాయి?
యుక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య మొదలుపెట్టిన ఏడు నెలల తర్వాత ఈ రెఫరెండం నిర్వహించారు. దీనిపై ప్రకటన చేసిన కొన్ని రోజులకే, సెప్టెంబరు 23 నుంచి 27, మధ్య ఈ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు.
ఫిబ్రవరి 24న రష్యా దండయాత్ర మొదలైన తర్వాత, ప్రస్తుతం యుక్రెయిన్ సైన్యం పుంజుకొని వరుసగా ప్రాంతాలను మళ్లీ తమ ఆధీనంలోకి తీసుకుంటున్న నేపథ్యంలో రష్యా ఈ ప్రజాభిప్రాయ సేకరణను చేపడుతోంది.
దీనిలో తూర్పు యుక్రెయిన్‌లోని ప్రాంతాలైన దోన్యస్క్, లూహాన్సెక్ (ఈ రెండు ప్రాంతాలను కలిపి దోన్బస్‌గా పిలుస్తారు), దక్షిణ ప్రాంతాలైన ఖేర్సన్, జాపోరిఝియా ప్రాంతాలకు చెందిన 40 లక్షల మందికి ఈ రిఫరెండంలో పాలుపంచుకోవాలని రష్యా పిలుపునిచ్చింది.
దీని కోసం వందల సంఖ్యలో పోలింగ్ కేంద్రాలను కూడా రష్యా ఏర్పాటుచేసింది. ఇక్కడ ఉంటున్న వారితోపాటు ఈ ప్రాంతానికి చెందిన, రష్యాకు వచ్చిన శరణార్థులకు కూడా రిఫరెండంలో పాల్గొనవచ్చని సూచించారు.

ఫొటో సోర్స్, EPA
ఎందుకు ఓటింగ్‌లో పాల్గొంటున్నారు?
ఇక్కడ ఎలక్ట్రానిక్ విధానంలో ఓటింగ్ నిర్వహించ లేదు. మరోవైపు బ్యాలెట్ పత్రాల్లో ప్రశ్నలు కూడా ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటున్నాయి.
2014 నుంచీ దోన్యస్క్, లూహాన్స్‌క్‌లలోని కొన్ని ప్రాంతాలను రష్య మద్దతుదారులే నడిపిస్తున్నారు. ఈ ప్రాంతాలను ఇదివరకు స్వతంత్ర ప్రాంతాలుగా ప్రకటించారు.
ఇప్పుడు తమ ప్రాంతాలను ''ఫెడరల్ ప్రాంతం''గా రష్యాలో కలిపేందుకు మీరు ''రిపబ్లిక్''కు మద్దతు పలుకుతున్నారా? అని ప్రజలను అడిగారు.
మరోవైపు ఖేర్సన్, జాపోరిఝియా ప్రాంతాలను ఇటీవల రష్యా ఆక్రమించింది. ఇక్కడ మాత్రం ''యుక్రెయిన్ నుంచి విడిపోయి, కొత్త ప్రాంతంగా ఏర్పాటై, చివరగా రష్యాలో ఫెడరల్ ప్రాంతంగా కలిసేందుకు మద్దతు పలుకుతున్నారా?''అని అడిగారు.
ఇక్కడ బ్యాలెట్ పత్రాలు అటు యుక్రెయిన్, ఇటు రష్యన్ రెండు భాషల్లోనూ ముద్రించారు. తూర్పు ప్రాంతాల్లో మాత్రం కేవలం రష్యన్‌లోనే ముద్రించారు.

ఫొటో సోర్స్, Reuters
ఓటింగ్ ఎలా నిర్వహించారు?
ఈ నాలుగు ప్రాంతాల్లో వందల సంఖ్యలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రాలకు రష్యా లేదా రష్యా మద్దతున్న భద్రతా బలగాలు రక్షణ కల్పించాయి.
మరోవైపు కొన్ని ప్రాంతాల్లో భద్రతా కారణాల దృష్ట్యా ఇంటింటికీ వెళ్లి ఓటింగ్ నిర్వహించారని రష్యా ప్రభుత్వ వార్తా సంస్థ టాస్ వెల్లడించింది.
ఎన్నికల అధికారుల వెంట సైనికులు కూడా వెళ్లి ప్రజల ఇళ్ల తలుపులు కొడుతున్న దృశ్యాలు మీడియా ప్రసారం అయ్యాయి. తుపాకులు పట్టుకొని సైనికులు ఎదురుగా నిలబడుతుంటే స్థానికులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
''మనం నోటితో మన అభిప్రాయం చెప్పాలి. అక్కడ సైనికులు దాన్ని బ్యాలెట్‌పై నోట్ చేసుకుంటారు''అని ఎనెర్‌హోడర్ ప్రాంతంలోని ఓ మహిళ బీబీసీతో చెప్పారు.
అసలు తుపాకులను ప్రజలను కాపాడటానికి తీసుకెళ్లారో లేదా వారిపై ఒత్తిడి చేయడానికి తీసుకెళ్లారో ఎవరికీ అర్థం కావడం లేదు.
జాపోరిఝియాలోని మెలిటోపోల్‌లో తమ తల్లిదండ్రులు ఎలా ఓటింగ్‌లో పాల్గొన్నారో ఒక మహిళ బీబీసీకి వివరించారు.
''ఇద్దరు రష్యా సైనికులతో కలిసి ఇద్దరు ఎన్నికల అధికారులు మా ఇంటికి వచ్చారు. ఒక బ్యాలెట్ ఇచ్చి దానిపై సంతకం చేయమన్నారు''అని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
''రష్యాలో చేరేందుకు ససేమిరా అంటూ నో అని మా నాన్న బ్యాలెట్‌పై రాశారు. మా అమ్మ కూడా పక్కనే ఉన్నారు. నో అని రాస్తే ఏమవుతుందని ఆమె అడిగారు. వెంటనే ఏమీకాదని వారు సమాధానం ఇచ్చారు''అని ఆమె చెప్పారు.
దక్షిణ యుక్రెయిన్‌లో తుపాకీ గురిపెట్టి తమ కుటుంబం ఓటింగ్‌లో పాల్గొనేలా చేశారని యుక్రెయిన్ జర్నలిస్టు మాక్సిమ్ ఎరిస్టావీ ట్వీట్ చేశారు.
ఈ ఓటింగ్‌లో ప్రైవసీ అనేదే కరవైంది.
బ్యాలెట్ పత్రాలను అందరిముందే ప్రజలు నింపి, గాజు డబ్బాల్లో వేస్తున్న దృశ్యాలు స్థానిక మీడియాలో కనిపించాయి.
స్వతంత్ర పరిశీలకులు లేకుండానే ఈ రిఫరెండం నిర్వహించారు. మరోవైపు ప్రమాణాలు పాటించేందుకు, నిబంధనలు అనుసరించే చూసేందుకు ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లూ లేవు.
అసలు రిఫరెండంలను ఎందుకు నిర్వహిస్తున్నారు? బ్యాలెటర్లపై ఏం రాశారు? లాంటి అంశాలను అర్థం చేసుకోవడానికి ప్రజలకు తగిన సమయం కూడా ఇవ్వలేదు.

ఫొటో సోర్స్, Reuters
రష్యా ఏం కోరుకుంటోంది?
యుక్రెయిన్‌లో ప్రాంతాలపై తమ సైన్యం పట్టు కోసం ప్రయత్నిస్తున్న సమయంలో, ప్రజల నుంచి మద్దతు కూడగట్టేందుకు రష్యా ఈ ప్రజాభిప్రాయ సేకరణను నిర్వహించింది.
ఈ విషయంపై ల్యూహాన్స్‌క్ ప్రాంతానికి చెందిన, అజ్ఞాతంలోనున్న గవర్నర్ సెరియ్ హైడాయ్ అసోసియేటెడ్ ప్రెన్స్ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడారు. రిఫరెండం పేరుతో రష్యా సైనికులు ప్రజల ఇళ్లలోకి ప్రవేశించి తనిఖీలు చేపడుతున్నట్లు ఆయన ఆరోపించారు.
ముఖ్యంగా యుక్రెయిన్ అనుకూలంగా ఉండేవారిని గుర్తించేందుకు ఈ ప్రక్రియలు చేపడుతున్నారని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
ఫలితాల ప్రకటన తర్వాత ఏం జరుగుతుంది?
ఈ రిఫరెండం ఫలితాల ప్రకటన తర్వాత, యుద్ధాన్ని రష్యా మరో ఎత్తుకు తీసుకెళ్తుందని కొందరు భావిస్తున్నారు.
ఆక్రమిత ప్రాంతాలను రష్యా తమ భూభాగంలో కలిపేసుకుంటే ఈ యుద్ధం మరింత ప్రమాదకరంగా మారే అవకాశముంది. ఎందుకంటే ఈ ప్రాంతాలను మళ్లీ యుక్రెయిన్ తమ ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తే, తమ మాతృభూమిపై దాడి జరిగినట్లుగా భావించి, మరింత ధీటుగా రష్యా స్పందించే అవకాశముంటుంది.
మరోవైపు తమ భూభాగాన్ని కాపాడుకునేందుకు అణ్వాయుధాలను ఉపయోగించేందుకు కూడా వెనుకాడబోమని రష్య అధ్యక్షుడు ఇటీవల సంకేతాలు ఇచ్చారు.

ఫొటో సోర్స్, EPA
ప్రపంచ దేశాలు ఎలా స్పందిస్తున్నాయి?
ఈ ప్రాంతాల్లోని పరిణామాలపై అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తం అవుతోంది.
ఈ ఓటింగ్ అక్రమమని చాలా పశ్చిమ దేశాలు చెబుతున్నాయి. ఈ ఓటింగ్‌లో తమకు అనుకూలంగానే ఫలితాలు ఉండబోతున్నాయని ఇప్పటికే రష్యా మీడియా చెబుతోంది.
మరోవైపు రష్యా మిత్ర దేశాల్లో ఒకటైన, రష్యాపై ఆంక్షలకు దూరంగా ఉంటున్న సెర్బియా కూడా ఈ ఓటింగ్‌ను తాము గుర్తించబోమని ప్రకటించింది.
దేశాల సార్వభౌమత్వాన్ని, సరిహద్దులను గౌరవించాలనే తమ సూత్రాలకు ఈ ఓటింగ్ పూర్తి విరుద్ధంగా జరిగిందని సెర్బియా విదేశాంగ మంత్రి నికోలా సెలకోవిక్ వ్యాఖ్యానించారు.
అయితే, అంతర్జాతీయంగా వ్యతిరేకత పెరుగుతుండటంతో, ఈ ఓటింగ్‌ను ప్రజలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేయడంగా రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావ్రోవ్ చెప్పారు.
ఈ నాలుగు ప్రాంతాలకు రష్యాలోని మిగతా ప్రాంతాలకు వర్తించే నిబంధనలన్నీ వర్తిస్తాయని ఆయన స్పష్టంచేశారు. ఒకవేళ వీటిపై దాడిచేస్తే, అణ్వాయుధాలను కూడా ఉపయోగించొచ్చని ఆయన అన్నారు.
మరోవైపు ఎప్పటికీ ఈ భూభాగాలు యుక్రెయిన్‌లో అంతర్భాగమేనని అమెరికా చెబుతోంది. మరోవైపు ఓటింగ్ కార్యకలాపాల్లో పాలుపంచుకున్న అధికారులే లక్ష్యంగా మరోసారి బ్రిటన్ కూడా కొత్త ఆంక్షలు విధించింది
ఇవి కూడా చదవండి:
- డేటింగ్ సైట్లలో అందమైన అమ్మాయిల పేరుతో నకిలీ ప్రొఫైల్స్‌ను ఎలా నడిపిస్తారు?
- టీవీ చానెళ్లలో చర్చలే దేశంలో విద్వేషాలకు ఆజ్యం పోస్తున్నాయా, యాంకర్లు ఏం చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది ?
- డిజిటల్ రేప్‌కు పాల్పడిన 75 ఏళ్ల వ్యక్తికి జీవిత ఖైదు, అసలేమిటీ కేసు?
- OSCAR: అమెరికన్ సినిమాల అవార్డులకు ఇంత క్రేజ్ ఎలా వచ్చింది? ఆస్కార్‌లో విదేశీ చిత్రాల ఎంట్రీకి నిబంధనలు ఏమిటి?
- ఇస్లాం నుంచి హిందూమతంలోకి మారిన ఒక కుటుంబం ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉంది?- గ్రౌండ్ రిపోర్ట్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














