పాకిస్తాన్: అంటువ్యాధుల సంక్షోభంలో చిక్కుకుంటుందా?

వీడియో క్యాప్షన్, పాకిస్తాన్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పొంచి ఉన్న మరో సంక్షోభం

పాకిస్తాన్‌లో ఇటీవలి వరదలకు మూడో వంతు దేశం నీట మునిగింది.

వరత ప్రభావిత ప్రాంతాల్లో అంటు వ్యాధుల ముప్పు పొంచి ఉందని ఆరోగ్య విభాగపు అధికారులు బీబీసీతో చెప్పారు.

మరింత సాయం అందకపోతే పాకిస్తాన్ మరో సంక్షోభంలో చిక్కుకుంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధిపతి హెచ్చరించారు.

న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి సాధారణ సభ సమావేశాలకు హాజరవుతున్న ప్రధాని షాబాజ్ షరీఫ్, తమకు మరింత సహాయాన్ని అందించాలని ప్రపంచ దేశాలను కోరారు.

బీబీసీ సౌత్ ఏషియా కరస్పాడెంట్ రజినీ వైధ్యనాథన్ అందిస్తున్న కథనం.

పాకిస్తాన్‌లోని చాలా ప్రాంతాలు ఇంకా వరదనీటిలోనే ఉన్నాయి.

తీవ్రంగా దెబ్బతిన్న సింధ్ ప్రావిన్స్‌లోని వేల మంది ప్రజలు నది ఒడ్డునే ఏర్పాటు చేసిన గుడారాల్లో బతుకుతున్నారు.

ఆశ్రయం కోసం వచ్చిన వీళ్లు.. అంటువ్యాధుల వ్యాప్తిపై ఆందోళన చెందుతున్నారు.

వరద నీటికి సమీపంలోనే జీవిస్తూ ఉండడంతో మలేరియా, డెంగ్యూ, డయేరియా వంటి అంటువ్యాధులు పెరిగాయి.

ఒకప్పుడు.. ఇక్కడికి దగ్గర్లోనే రషీదా ఇల్లుండేది.

రషీదా 8నెలల గర్భవతి, ఆమె తన ఏడుగురు పిల్లలతో కలిసి జీవిస్తున్నారు. ఆ పిల్లలు ఇప్పుడు జబ్బుల బారిన పడుతున్నారని రషీదా ఆందోళన చెందుతున్నారు.

‘‘పిల్లలకు జ్వరం వచ్చింది, దగ్గుతున్నారు. వాంతులయ్యాయి. వాళ్లను దోమలు కుడుతూనే ఉన్నాయి. వారిని డాక్టర్‌ దగ్గరకు తీసుకు వెళ్లేందుకు నా దగ్గరడబ్బులు లేవు. నేను గర్భవతిని. అయినా నేను ఆరోగ్యంగా ఉన్నానో లేదో కూడా తెలీదు’’ అని ఆమె బీబీసీతో అన్నారు.

ఆహారం, మంచి నీటి కోసం వీళ్ల పోరాటం కొనసాగుతూనే ఉంది.

పెరుగుతున్న అంటువ్యాధులతో మరో ముప్పు పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది.

నీరంతా ఇంకిపోవడానికి నెలల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. అప్పటి వరకూ ఇక్కడున్న కుటుంబాలన్నీ అనిశ్చితిలో కొనసాగాల్సిందే. తాము ఇంటికి వెళతామో, లేదో వారికి తెలియదు. వ్యాధుల భయాన్ని ఎదుర్కొంటూనే వారంతా భవిష్యత్ ఏంటనే దానిపై స్పష్టత లేక తీవ్రమైన మానసిక ఒత్తిడిలో జీవిస్తున్నారు.

కనీస సదుపాయాలు కూడా లేవి శిబిరాల్లో ఉంటున్నవారు చెబుతున్నారు.

తమ చేతనైంత సహాయాన్ని అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. సాయం అందేవరకూ వేచి చూడడమే ఇక్కడి కుటుంబాలు చేయగలిగేది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)