'మా అబ్బాయిని లైంగికంగా వేధించారు.. మాకు న్యాయం కావాలి '

బాలలపై లైంగిక నేరాలు

ఫొటో సోర్స్, ALEXLINCH

    • రచయిత, సుశీలా సింగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

"మా బాబు నుదుటిపై, ఛాతీ, కాళ్లపై కమిలిన గాయాలు ఉన్నాయి. తనపై బలత్కారం చేశారని బాబు చెప్పాడు. బాగా భయపడిపోయాడు. తనను చంపేస్తారని చెబుతూ వణికిపోయాడు. నా బిడ్డ ప్రాణాలతో పోరాడుతున్నాడు. వాళ్లని వదిలేయాలా? నాకు న్యాయం కావాలి."- సర్వైవర్ తల్లి

"ఈ కేసులో ఇద్దరు పట్టుబడ్డారు. ఒకరు పరారీలో ఉన్నారు. అమ్మాయిలే కాదు, అబ్బాయిలు కూడా లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారు. అలాంటి సంఘటనలను రిపోర్ట్ చేయడం చాలా ముఖ్యం." - సంజయ్ కుమార్ సైన్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, నార్త్ ఈస్ట్ ఢిల్లీ

"బాలుడి పరిస్థితి విషమంగా ఉంది" - డాక్టర్ రీతూ సక్సేనా, లోక్‌నాయక్ ఆస్పత్రి

పిల్లలపై లైంగిక వేధింపులు

ఫొటో సోర్స్, Getty Images

బాబు తల్లి చెప్పిన వివరాల ప్రకారం, బాబు ఇంటికి వచ్చేటప్పటికే కుంటుతున్నాడు. ఏమైందని ఎన్నిసార్లు అడిగినా ఏదో గొడవ అయిందని చెప్పాడే తప్ప నిజం చెప్పలేదు. అడగ్గా అడగ్గా ఆఖరుకి 22వ తేదీన అసలు విషయం చెప్పాడు.

దేశ రాజధాని దిల్లీలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాబుకు 11-12 ఏళ్లు ఉంటాయి. బాబును వేధించిన ముగ్గురిలో ఒకరు బాబు తల్లికి తెలిసిన వ్యక్తే.

"అసలు ఏమైందో చెప్పమని మా బాబుని మళ్లీ మళ్లీ అడుగుతూనే ఉన్నా. చివరికి 22న నోరు విప్పాడు. అమ్మా, నువ్వు చంపేస్తావు అన్నాడు. నేనేమీ అనను, ఏం జరిగిందో నిజం చెప్పమని బుజ్జగించాను. ఆ కుర్రాళ్లు నన్ను చంపేస్తారన్నాడు. వాళ్లేం చేయరని చెప్పాను. ముగ్గురు కుర్రాళ్ల పేర్లు చెప్పాడు. వాళ్లు తనతో తప్పుడు పని చేశారని చెప్పాడు. ఆడుతూ పాడుతూ తిరిగే నా బిడ్డ జీవితాన్ని నాశనం చేశారు. నేనేం చేయాలో మీరో చెప్పండి" అంటూ బాబు తల్లి ఆవేదన వ్యక్తం చేశారు.

పోక్సో, ఐపీసీ సెక్షన్ 376 కింద నమోదైన మొత్తం కేసులు

ఫొటో సోర్స్, NCRB

దిల్లీలోని లోక్‌నాయక్‌ ఆస్పత్రిలో అత్యవసర వార్డులో ప్రధాన వైద్యురాలు రీతూ సక్సేనా బీబీసీతో మాట్లాడుతూ, "బాబు పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ప్రస్తుతం ఆ చిన్నారి ఆస్పత్రిలోని పీడియాట్రిక్స్ విభాగం ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు" అని చెప్పారు.

నిందితులపై ఐపీసీ 377, 34 సెక్షన్లు విధించినట్లు ఈశాన్య దిల్లీ డిప్యూటీ కమిషనర్ సంజయ్ కుమార్ సైన్ తెలిపారు. బాబు మైనర్ కావడం వలన పోక్సో చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు.

"ఈ ఘటన ఈ నెల 18వ తేదీన జరిగింది. కేసు నమోదు చేయడానికి కుటుంబం వెనుకాడింది. ఐఓ, సఖి సెంటర్ కౌన్సెలర్ బాబు తల్లికి కౌన్సిలింగ్ ఇచ్చారు. తరువాత, ఆమె స్టేట్‌మెంట్ తీసుకున్నాం. నిందితుల్లో ఇద్దరిని అరెస్ట్ చేశాం. ఒకరు పరారీలో ఉన్నారు. ఈ ముగ్గురూ బాబుకు తెలిసినవారే. ఒకరు బాబుకి కజిన్ అవుతారు" అని డిప్యూటీ కమిషనర్ సంజయ్ కుమార్ సైన్ చెప్పారు.

పోక్సో, ఐపీసీ సెక్షన్ 376 కింద నమోదైన కేసులు

ఫొటో సోర్స్, NCRB

శిక్షలేమిటి?

భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 377 'ప్రకృతి విరుద్ధమైన నేరాలు'కు వర్తిస్తుంది. ఒకే ఉద్దేశంతో అనేక మంది వ్యక్తులు నేరపూరిత చర్యకు పాల్పడినప్పుడు సెక్షన్ 34 వర్తిస్తుంది. లైంగిక నేరాల నుంచి పిల్లలను రక్షించే చట్టం పోక్సో (2012).

18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నవారిని పిల్లలు (మైనర్లు)గా పరిగణిస్తారు. వీరిపై లైంగిక వేధింపులు జరిగితే పోక్సో చట్టం కింద కేసు నమోదు చేస్తారు.

"నిర్భయ కేసు తరువాత ఇలాంటి కేసులపై మరింత అవగాహన వచ్చింది. పాఠశాలల్లో పిల్లలకు అవగాహన కల్పిస్తున్నారు. శారీరక, మానసిక లేదా లైంగిక వేధింపుల గురించి చెబుతున్నారు. కానీ ఇలాంటి కేసులు రిపోర్ట్ అయ్యేది తక్కువ. సమాజంలో ఉన్న లోపాలే దీనికి కారణం. తమపై వేధింపులు జరిగాయని పిల్లలు చెప్పినా, తల్లిదండ్రులు అలాంటి విషయాలను దాచిపెట్టడానికి ప్రయత్నిస్తారు. సమాజంలో ఆర్థికంగా అట్టడుగు వర్గాల వారి పిల్లలతో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. వాళ్లకు కూలికి వెళ్లకపోతే పూట గడవని పరిస్థితి. పొద్దున్న వెళ్లి సాయంత్రం ఇంటికొస్తారు. ఇలాంటి విషయాలు వారు అంతగా పట్టించుకోరు. ఇదే కాకుండా, చాలా కేసుల్లో తెలిసినవారే ఎక్కువగా ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారు" అని డాక్టర్ రీతూ సక్సేనా అన్నారు.

సంజయ్ కుమార్ సైన్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, ఈశాన్య దిల్లీ
ఫొటో క్యాప్షన్, సంజయ్ కుమార్ సైన్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, ఈశాన్య దిల్లీ

ఇంకో సమస్య ఏమిటంటే, అబ్బాయిలపై జరిగే లైంగిక వేధింపుల కేసులు తక్కువగా రిపోర్ట్ అవుతాయి.

మరోవైపు, అబ్బాయిలు ఏడవకూడదని, దృఢంగా ఉండాలని, పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవాలని చిన్నతనం నుంచే నూరిపోస్తారు.

ఇదే అంశంపై సామాజిక కార్యకర్త, 'సమాధాన్ అభియాన్' అనే స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ అర్చన అగ్నిహోత్రి మాట్లాడుతూ, 2007లో మహిళ, సాంఘిక సంక్షేమ శాఖ చేసిన ఒక అధ్యయనాన్ని ఉదహరించారు. 13 రాష్ట్రాల్లో పిల్లలపై లైంగిక వేధింపుల కేసులు ఉన్నాయని చెప్పారు.

"53 శాతం పిల్లలు లైంగిక వేధింపులకు గురవుతున్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. ఇందులో చాలా కేసులు అబ్బాయిలపై జరిగిన వేధింపులవే. ఈ విషయం బయటకు వచ్చేది తక్కువ. అందుకే, రిపోర్టు అయ్యే కేసులు కూడా తక్కువ. దీనికి కారణం, మగపిల్లలకు పుట్టిన దగ్గర నుంచి ఒక రకమైన కండిషనింగ్ చేస్తారు. పురుషుడే ఇంటి పెద్ద అని, మగపిల్లలు ఏడవకూడదని చెప్తారు. ఇవన్నీ మానసికంగా అబ్బాయిలపై ఒత్తిడి తెస్తాయి. తమపై అఘాయిత్యాలు, వేధింపులు జరిగితే బయటకు చెప్పుకోలేరు. బయటికి చెబితే పురుష లక్షణం కాదని గేలిచేస్తారని భయపడతారు" అని అర్చన అన్నారు.

డాక్టర్ రీతు సక్సేనా, లోక్‌నాయక్ హాస్పిటల్
ఫొటో క్యాప్షన్, డాక్టర్ రీతు సక్సేనా, లోక్‌నాయక్ హాస్పిటల్

ఆలోచనల్లో మార్పు రావాలి

సమాజం ఆలోచనల్లో మార్పు రావాలి. ఆడపిల్లయినా, మగపిల్లయినా సున్నితత్వం ఉంటుంది. మగపిల్లలు కూడా ఏడవవచ్చు. వాళ్లేం గంభీరంగా ఉండక్కర్లేదు. బాధను బయటికి చెప్పుకోవచ్చు. దీన్ని సమాజం అర్థం చేసుకుని, అంగీకరించాలి.

ఇదే విషయంపై సంజయ్ కుమార్ సైన్ మాట్లాడుతూ, "ఇలాంటి సందర్భాల్లో మగపిల్లలు భయంతో తల్లిదండ్రుల దగ్గర విషయం దాస్తారు. ఒకవేళ చెప్పినా, రిపోర్ట్ చేయడానికి తల్లిదండ్రులు వెనుకాడతారు.

బ్యాడ్ టచ్, గుడ్ టచ్ అంటూ అవగాహన కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నా, సమాజంలో అమ్మాయిల విషయంలో సెన్సిటైజేషన్ కనిపిస్తోంది కానీ, అబ్బాయిల విషయంలో అంతగా కనిపించదు. అబ్బాయిలకు కూడా లైంగిక వేధింపుల గురించి అవగాహన కలిగించాలి. తల్లిదండ్రులు ముందుకొచ్చి రిపోర్ట్ చేయాలి.

పిల్లలపై లైంగిక వేధింపులు

ఫొటో సోర్స్, Getty Images

ఇటీవల కాలంలో పోక్సో చట్టం కింద నమోదైన కేసుల సంఖ్య పెరుగుతోందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాలు చెబుతున్నయి. 2021లో 33,348 కేసులు నమోదయ్యాయి. అమ్మాయిలపైనే కాక అబ్బాయిలపైన కూడా లైంగిక వేధింపుల కేసులు పెరిగాయి.

పిల్లలపై లైంగిక వేధింపుల కేసులు పెరగడానికి ఒక ముఖ్య కారణం ఆన్‌లైన్‌లో ఇటువంటి మెటీరియల్ అందుబాటులో ఉండటమేనని నిపుణులు భావిస్తున్నారు.

"అమ్మాయి అయినా, అబ్బాయి అయినా లైంగిక వేధింపులకు గురైనప్పుడు బాగా షాకవుతారు. దీని గురించి బయటకు చెప్పడానికి కష్టపడతారు. మగపిల్లలకు చిన్నతనం నుంచి గంభీరంగా ఉండాలని నూరిపోస్తారు. అందువల్ల తమకేమైనా జరిగితే మరింత షాక్‌లోకి వెళ్లిపోతారు. అలాంటి పిల్లలు డిప్రెషన్ లేదా పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్‌కి గురవుతారు. తమకు జరిగిన వేధింపులు మళ్లీ మళ్లీ గుర్తొచ్చి వేదన అనుభవిస్తారు. పూర్తిగా నిస్సహాయులైపోతారు" అని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (నోయిడా) ప్రెసిడెంట్ డాక్టర్ సునీల్ అవానా అన్నారు.

అర్చన అగ్నిహోత్రి, సామాజిక కార్యకర్త
ఫొటో క్యాప్షన్, అర్చన అగ్నిహోత్రి, సామాజిక కార్యకర్త

ఇలాంటి పిల్లలను ఎలా గుర్తించాలి?

పిల్లల మానసిక స్థితి ఎలా ఉందో పరిశీలించాలి. ఈ కింది లక్షణాలుంటే వెంటనే అప్రమత్తం కావాలి.

  • ఆకలి లేకపోవడం
  • నిద్ర లేకపోవడం
  • ఎప్పుడూ మౌనంగా ఉండడం
  • మనం మాట్లాడినా, జవాబు ఇవ్వకపోవడం
  • ఉండుండి ఏడవడం

ఇలాంటి సంకేతాలు కనిపిస్తే, పిల్లలతో అనునయంగా మాట్లాడేందుకు ప్రయత్నించాలని డాక్టర్ సునీల్ అవానా చెబుతున్నారు. క్రమక్రమంగా వారిలో మనోధైర్యాన్ని పెంచుతూ, వాళ్లు ఏ తప్పు చేయలేదని, భయపడాల్సిన అవసరం లేదనే నమ్మకం కలిగించాలి. వాళ్లు మాట్లాడటం మొదలెట్టినప్పుడు, కచ్చితంగా మానసిక వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లి చికిత్స చేయించాలి.

వీడియో క్యాప్షన్, మానసిక వైకల్యంతో ఉన్న చిన్నారులను ఆమె అమ్మలా చూసుకుంటారు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)