PFI: ‘పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా’ను నిషేధించిన కేంద్రం

PFI

ఫొటో సోర్స్, Getty Images

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) దాని అనుబంధ సంస్థలు 'చట్టవిరుద్ధమైన సంస్థలు' అని కేంద్రం ప్రకటించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద పీఎఫ్ఐపై అయిదేళ్ల పాటు నిషేధం విధిస్తున్నట్టు కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.

పీఎఫ్ఐ "రహస్య ఎజెండాను అమలుచేస్తూ ఒక వర్గాన్ని ప్రభావితం చేస్తోందని" ఈ నోటీసులో పేర్కొంది.

"పీఎఫ్ఐ, దాని అనుబంధ సంస్థలు లేదా సంబంధిత సంస్థలు సామాజిక, ఆర్థిక, రాజకీయ సంస్థలుగా పనిచేస్తాయి. అవి ఒక రహస్య ఎజెండాను అమలుచేస్తూ చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్నాయి. ఇది దేశ సమైక్యతకు, సార్వభౌమాధికారానికి, భద్రతకు ముప్పు కలిగిస్తుంది. ప్రజా శాంతికి, సామరస్యానికి ఆంటకం కలిగిస్తుంది. దేశంలో ఉగ్రవాద చర్యలకు ఊతమిస్తుంది" అని నోటిఫికేషన్‌లో రాసినట్లు ఏఎన్ఐ తెలిపింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

అంతే కాకుండా, "పీఎఫ్ఐకి క్రిమినల్, ఉగ్రవాద కేసులతో సంబంధం ఉంది. ఇది దేశ రాజ్యాంగ అధికారాన్ని అగౌరవపరుస్తుంది. దేశం బయటి నుంచి నిధులు తీసుకుంటూ దేశ అంతర్గత భద్రతకు ముప్పుగా పరిణమించవచ్చు" అని పేర్కొంది.

గతంలో భారతదేశం, బంగ్లాదేశ్‌లలో నిషేధం విధించిన రెండు సంస్థలతో పీఎఫ్ఐకి సంబంధాలు ఉన్నాయని కేంద్రం తెలిపింది.

"పీఎఫ్ఐకి ఉగ్రవాద సంస్థ 'జమాత్-ఉల్-ముజాహిదీన్ బంగ్లాదేశ్‌'తో కూడా సంబంధాలు ఉన్నాయి. పీఎఫ్ఐ వ్యవస్థాపక సభ్యులలో కొందరు 'స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా' (సిమి) నాయకులుగా ఉన్నారు. ఈ రెండూ నిషేధిత సంస్థలు" అని పేర్కొంది.

"అంతర్జాతీయ టెర్రరిస్ట్ గ్రూపులతో పీఎఫ్ఐకి సంబంధాలు ఉన్నాయని చెప్పడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. కొంతమంది పీఎఫ్ఐ సభ్యులు ఐఎస్ఐఎస్‌లో చేరారు. సిరియా, ఇరాక్, అఫ్గానిస్తాన్‌లలోని తీవ్రవాద కార్యకలాపాలలో పాలుపంచుకున్నారు. ఈ ఘర్షణల్లో కొందరు పీఎఫ్ఐ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు. అనేకమంది పీఎఫ్ఐ కార్యకర్తలను కేంద్ర, రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు" అని హోంశాఖ తన నోటిఫికేషన్‌లో తెలిపింది.

pfi

ఫొటో సోర్స్, Pfi

పీఎఫ్ఐపై హోంశాఖ వ్యాఖ్యలు - 10 పాయింట్లు

1. పీఎఫ్ఐ, దాని అనుబంధ సంస్థలు, సంబంధిత సంస్థలు - రిహాబ్ ఇండియా ఫౌండేషన్ (RIF), క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (CFI), ఆల్ ఇండియా ఇమామ్ కౌన్సిల్ (AIIC), నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ (NCHRO), నేషనల్ వుమెన్స్ ఫ్రంట్, జూనియర్ ఫ్రంట్, ఎంపవర్ ఇండియా ఫౌండేషన్‌, కేరళలోని రిహాబ్‌ ఫౌండేషన్‌లపై అయిదేళ్ల పాటు నిషేధం విధించారు.

2. చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం, 1967లోని సెక్షన్ 3లో సబ్ సెక్షన్ (1) కింద, పీఎఫ్ఐ దాని అనుబంధ సంస్థలు, సంబంధిత సంస్థలపై కేంద్రం అయిదేళ్ల పాటు నిషేధం విధించింది.

3. పీఎఫ్ఐ దాని అనుబంధ సంస్థలు, సంబంధిత సంస్థలు సామాజిక, ఆర్థిక రాజకీయ సంస్థలుగా పనిచేస్తాయి. ఇది రహస్య ఎజెండాతో సమాజంలోని ఒక వర్గంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తద్వారా ప్రజాస్వామ్య భావనను అణగదొక్కే ప్రయత్నాలు చేస్తోంది.

4. పీఎఫ్ఐ తన కార్యకలాపాలతో రాజ్యాంగ అధికారం, రాజ్యాంగ నిర్మాణాన్ని అగౌరవపరుస్తోంది.

5. పీఎఫ్ఐకు అనేక క్రిమినల్, తీవ్రవాద కేసులలో ప్రమేయం ఉంది. ఇది బయటి నుంచి నిధులు తీసుకుంటూ దేశ అంతర్గత భద్రతకు పెద్ద ముప్పుగా పరిణమించింది.

6. అంతర్జాతీయ్ టెర్రరిస్టు గ్రూపులతో పీఎఫ్ఐకి సంబంధాలు ఉన్నాయనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. కొంతమంది పీఎఫ్ఐ సభ్యులు ఐఎస్ఐఎస్‌లో చేరారు. సిరియా, ఇరాక్, అఫ్గానిస్తాన్‌లలోని తీవ్రవాద కార్యకలాపాలలో పాలుపంచుకున్నారు. ఈ ఘర్షణల్లో కొందరు పీఎఫ్ఐ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు. అనేకమంది పీఎఫ్ఐ కార్యకర్తలను కేంద్ర, రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు.

7. పీఎఫ్‌ఐకి ఉగ్రవాద సంస్థ 'జమాత్-ఉల్-ముజాహిదీన్ బంగ్లాదేశ్‌'తో కూడా సంబంధాలు ఉన్నాయి. పీఎఫ్ఐ వ్యవస్థాపక సభ్యులలో కొందరు 'స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా' (SIMI)కి నాయకులుగా ఉన్నారు. ఈ రెండూ నిషేధిత సంస్థలు.

8. పీఎఫ్ఐకు అనేక తీవ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉంది. పలువురు వ్యక్తుల హత్యలతో సంబంధం ఉంది. సంజిత్ (నవంబర్ 2021), వి. రామలింగం (2019), నందు (2021), అభిమన్యు (2018), బిబియన్ (2017), శరత్ (2017), ఆర్. రుద్రేశ్ (2016), ప్రవీణ్ పూజారి (2016), శశికుమార్ (2016), ప్రవీణ్ నేతారు (2022) హత్యలతో పీఎఫ్ఐకి సంబంధం ఉంది. ప్రజా శాంతికి విఘాతం కలిగించి ప్రజల మనసుల్లో భయాందోళనలు రేకెత్తించే ఉద్దేశంతో ఈ హత్యలు జరిగాయి.

9. పీఎఫ్ఐ పదాతిదళాలు, కేడర్‌లు, దానితో అనుబంధం ఉన్నవారు.. బ్యాంకింగ్ మార్గాలు, హవాలా, విరాళాల ద్వారా ఒక ప్రణాళికతో భారతదేశం లోపల, వెలుపల నిధులను సేకరిస్తున్నారు. ఆ డబ్బును చట్టబద్ధం చేయడానికి బహుళ ఖాతాల ద్వారా లేయరింగ్ చేస్తున్నారు. దేశంలో వివిధ నేర, చట్టవిరుద్ధమైన తీవ్రవాద కార్యకలాపాలకు ఈ నిధులను ఉపయోగిస్తారు.

10. పీఎఫ్ఐ సంబంధిత బ్యాంకు ఖాతాలలో జమ చేసిన డబ్బు మూలాలు ఖాతాదారుల ఆర్థిక ప్రొఫైల్‌తో సరిపోలడం లేదు. అలాగే పీఎఫ్ఐ విధులు అది పేర్కొన్న లక్ష్యాలకు అనుగుణంగా లేవు. అందువల్ల, ఆదాయపు పన్ను శాఖ, ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 12-ఆ కింద 2021 మార్చిలో దాని రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసింది. పీఎఫ్ఐ సంబంధిత సంస్థ రిహాబ్ ఇండియా ఫౌండేషన్ రిజిస్ట్రేషన్ కూడా రద్దు చేసింది.

PFI

ఫొటో సోర్స్, MINISTRY OF HOME AFFAIRS

ఎన్ఐఏ సోదాల తరువాత నిషేధం

గత వారంలో దేశవ్యాప్తంగా పీఎఫ్‌ఐ కార్యాలయాలు, నాయకులు, సభ్యుల ఇళ్లపై పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. సెప్టెంబర్ 22న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సంయుక్తంగా 11 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించి 106 మంది పీఎఫ్ఐ సభ్యులను అరెస్ట్ చేశాయి.

కేరళ, తమిళనాడులో ఈ అరెస్టులకు వ్యతిరేకంగా పీఎఫ్ఐ సభ్యులు నిరసనలు చేశారు.

సెప్టెంబర్ 27న దిల్లీ, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, అస్సాం, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించి, పీఎఫ్ఐతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై 150 మందికి పైగా అరెస్టు చేశారు.

''పీఎఫ్ఐ జాతీయ, రాష్ట్రస్థాయి, స్థానిక సభ్యుల ఇళ్లలో ఎన్‌ఐఏ సోదాలు చేస్తోంది. అసమ్మతి గళాలను అణచివేయడానికి కేంద్ర ఏజెన్సీలను వాడుకుంటున్నారు'' అని ప్రభుత్వంపై పీఎఫ్ఐ ఆరోపణలు చేసింది.

అయిదు కేసులకు సంబంధించి 45 మందిని అరెస్ట్ చేసినట్లు ఒక పత్రికా ప్రకటనలో ఎన్ఐఏ చెప్పింది. సోదాల సమయంలో పలు కీలక డాక్యుమెంట్లు, నగదు, పదునైన ఆయుధాలు, పెద్ద సంఖ్యలో డిజిటల్ పరికరాలు లభ్యమైనట్లు తెలిపింది.

పీఎఫ్ఐ ఎప్పుడు ఏర్పడింది, లక్ష్యం ఏంటి?

పీఎఫ్ఐ 2006లో ఏర్పాటైంది. తమది ఒక సామాజిక, స్వచ్ఛంద సంస్థ అని, పేదలు, అణగారిక వర్గాల కోసం సేవలు అందించడం, దోపిడీపై పోరాడటం తమ లక్ష్యమని ఆ సంస్థ చెబుతోంది.

1992లో బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం, కేరళకు చెందిన వివాదాస్పద నేషనల్ డెవలప్‌మెంట్ ఫ్రంట్ (ఎన్‌డీఎఫ్) ఏర్పాటైంది. దీనితోపాటు మరికొన్ని దక్షిణ భారత సంస్థలను కలిపి పీఎఫ్ఐ ఏర్పాటుచేశారు. అదనంగా మరికొన్ని సంస్థలు కూడా కలవడంతో పీఎఫ్ఐ పరిధి విస్తరించింది.

ప్రస్తుతం కేరళ, కర్నాటకల్లో పీఎఫ్ఐకు ప్రాతినిధ్యం ఉంది. దాదాపు 20కిపైగా రాష్ట్రాల్లో వేల మంది కార్యకర్తలు ఉన్నారు.

కాగా, 2008లో ఏర్పాటైన జాతీయ దర్యాప్తు సంస్థ పీఎఫ్ఐ కార్యకలాపాలను గమనించడం ప్రారంభించింది.

ఎర్నాకుళానికి చెందిన మలయాళ ప్రొఫెసర్ టీజే జోసెఫ్‌పై దాడి కేసును కూడా 2011లో ఎన్ఐఏకు అప్పగించారు.

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా

ఫొటో సోర్స్, FACEBOOK@POPULARFRONTOFINDIAOFFICIAL

‘సిమి’కి మరో రూపమా?

నిషేధిత రాడికల్ ఇస్లామిస్ట్ సంస్థ 'స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా' (సిమి)కి పీఎఫ్ఐ మరో రూపమని ఆ సంస్థ ఏర్పడినప్పటి నుంచి ఆరోపణలు ఉన్నాయి.

'ఉగ్రవాద సంస్థ’గా ప్రకటించి, భారత ప్రభుత్వం నిషేధించిన సంస్థలలో 'సిమి' ఒకటి. 2001లో దీనిని ప్రభుత్వం నిషేధించింది.

ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ 'ఇండియన్ ముజాహిదీన్'తో సిమికి సంబంధాలు ఉన్నట్లు కూడా అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నదంటూ అప్పట్లో ఇండియన్ ముజాహిదీన్‌‌పై భారత ప్రభుత్వం నిషేధం విధించింది.

పీఎఫ్ఐ, సిమి మధ్య సంబంధాలు స్పష్టంగా కనిపిస్తాయి. చాలామంది సిమి సభ్యులు పీఎఫ్ఐలో యాక్టివ్‌గా ఉన్నారు. అలాంటి వ్యక్తులలో ప్రొఫెసర్ కోయా ఒకరు.

అయితే, 1981లోనే సిమితో సంబంధాలు తెగిపోయాయని, 1993లో తాను ఎన్‌డీఎఫ్‌ను స్థాపించానని ప్రొఫెసర్ కోయా అన్నారు. పీఎఫ్ఐ స్థాపనలో పాలుపంచుకున్న సంస్థల్లో ఎన్‌డీఎఫ్ ఒకటి.

ప్రభుత్వం సిమిని నిషేధించినందున, దాని స్థానంలో 'పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా'ను స్థాపించారని, అందుకే చాలామంది సిమి కార్యకర్తలు ఇందులో సభ్యులుగా ఉన్నారని పలువురి విశ్వాసం.

పీఎఫ్ఐ

ఫొటో సోర్స్, Getty Images

పీఎఫ్ఐ ఎందుకు వివాదాస్పదమైంది?

సంస్థ వెబ్‌సైట్‌లో పేర్కొన్న మిషన్ స్టేట్‌మెంట్ ప్రకారం, ‘‘స్వేచ్ఛ, న్యాయం, భద్రతకు సంబంధించి అందరికీ సమాన హక్కులు అందేలా చూడటం’’ తమ విధి అని పీఎఫ్ఐ చెబుతోంది. దళితులు, గిరిజనులు, మైనారిటీలకు హక్కులు అందేలా చూసేందుకు ఆర్థికపరమైన విధానాల్లో మార్పులు చేయడం అవసరమని సంస్థ వివరిస్తోంది.

అయితే, సంస్థతోపాటు సంస్థ సభ్యులపై ప్రభుత్వం వరుస అభియోగాలు మోపుతోంది. రాజ్యద్రోహం, రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టడం, భారత్‌ను అస్థిర పరచడం లాంటి ఆరోపణలు ఈ సంస్థపై ఉన్నాయి.

గత జూన్‌లో రాజస్థాన్‌లో ఒక హిందూ వ్యక్తి తల నరికిన కేసులో పీఎఫ్ఐ సభ్యుల ప్రమేయముందని పోలీసులు ఆరోపణలు మోపారు.

కొన్ని నెలల క్రితం, భారత్‌ను ఇస్లామిక్ దేశంగా మారుస్తామంటూ చెప్పే ఒక పత్రాన్ని బిహార్‌లో ఈ సంస్థ పంచినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఆ పత్రంతో తమకు సంబంధంలేదని పీఎఫ్ఐ చెబుతోంది.

పీఎఫ్ఐకి సిమీతో సంబంధాలు ఉన్నాయన్నది ప్రధాన ఆరోపణ కాగా, మరో నిషేధిత సంస్థ ఇండియన్ ముజాహిదీన్‌తోనూ సంబంధాలున్నాయని ఆరోపణలు వచ్చాయి.

గత ఏప్రిల్‌లోనే నిషేధించే యోచన

గత ఏప్రిల్‌లోనే, పీఎఫ్ఐను నిషేధించే యోచనలో కేంద్రం ఉన్నట్లు సుప్రీం కోర్టులోని ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనానికి సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పారని పీటీఐ వార్తా సంస్థ ఒక కథనాన్ని ప్రచురించింది.

''ఈ విషయంలో ఎన్ఐఏ నుంచి కేంద్ర హోం శాఖకు ప్రతిపాదన వచ్చింది, అయితే, దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు'' అని ఆ కథనంలో పేర్కొన్నారు.

పీఎఫ్ఐను నిషేధించే అంశంపై ప్రొఫెసర్ కోయ మాట్లాడుతూ, ''నిషేధం అనేది పూర్తి రాజకీయ నిర్ణయం. అలా నిషేధించడంలో ఎలాంటి అర్థమూ లేదు. గతంలో కమ్యూనిస్టు పార్టీని, ఆరెస్సెస్‌లనూ ఇలానే బ్యాన్ చేశారు. కానీ, తర్వాత ఏమైంది?'' అని అన్నారు. పీఎఫ్ఐ వ్యవస్థాపకుల్లో ఆయన కూడా ఒకరు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)