కాంగ్రెస్‌పై గాంధీల పట్టు ఎలా సడలిపోయింది, నేతలు మారారా, పరిస్థితులు మారాయా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఫైజల్ మహమ్మద్ అలీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
రాజస్థాన్‌లో ముఖ్యంమత్రి అశోక్ గహ్లోత్ మద్దతుదారుల చర్యలను గమనిస్తే, కాంగ్రెస్‌పై గాంధీ కుటుంబం పట్టు పూర్తిగా సడిలిపోయిందా? అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.
రెండేళ్ల క్రితం రాజస్థాన్‌లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ''ఆపరేషన్ లోటస్'' నుంచి తమ ప్రభుత్వాన్ని అశోక్ గహ్లోత్ వర్గం కాపాడుకుంది. అయితే, ఈ వర్గమే ఇప్పుడు కాంగ్రెస్ అధినాయకత్వంపై ఒత్తిడి తీసుకువస్తోంది. దీంతో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దిల్లీ నుంచి ఒక ప్రత్యేక బృందాన్ని జైపుర్‌కు పంపించారు.
అసలు జైపుర్‌లో ఏం జరుగుతుందని అడిగితే, ఒక్కొక్కరు ఒక్కోలా సమాధానం చెబుతున్నారు.
ప్రజాస్వామ్య పునాదులపై తమ పార్టీ నిలబడి ఉందని కాంగ్రెస్ నాయకులు తరచూ చెబుతుంటారు. అయితే, కాంగ్రెస్ అనేది కొందరు అగ్ర నాయకుల చేతుల్లో ఉంటుందని, గహ్లోత్ తమ పార్టీ పగ్గాలు చేపట్టాల్సిన అవసరంలేదని, ఆయన సీఎంగానే కావాలని గహ్లోత్ వర్గం నాయకులు అంటున్నారు.
మరోవైపు ముందు పార్టీలో సమస్యలు పరిష్కరించి, ఆ తర్వాత భారత్ జోడో యాత్ర చేపట్టాలని రాహుల్ గాంధీని బీజేపీ ఎద్దేవా చేస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
అయితే, కాంగ్రెస్ రాజకీయాలను ఏళ్ల నుంచి పరిశీలిస్తున్న వారు మాత్రం.. ''కాంగ్రెస్ హైకమాండ్'' ప్రభావం క్రమంగా తగ్గుతూ వచ్చిందని అంటున్నారు. నేడు పార్టీలోని అగ్రనాయకుల అవివేకం స్పష్టంగా బయటకు కనిపిస్తోందని చెబుతున్నారు.
''మనం రాజకీయాలు, రాజకీయ నాయకుల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ మనకు ఇచ్చే హోదా అనేది ఎన్నికల్లో ఫలితాలపైనే ఆధారపడి ఉంటుంది''అని రాజకీయ విశ్లేషకుడు, రచయిత రషీద్ కిడ్వాయి అన్నారు.
''ఒకవేళ నరేంద్ర మోదీ తరహాలోనే పార్టీని విజయాల వైపు నడిపించినట్లయితే, ఓటమికి కారణమైన పుష్కర్ సింగ్ ధామి లాంటి వారిని కూడా ముఖ్యమంత్రి (ఉత్తరాఖండ్)గా కూర్చోబెట్టొచ్చు''అని ఆయన అన్నారు.
''మధ్యప్రదేశ్‌లోనూ ఎన్నికల్లో బీజేపీ వెనుకబడినప్పటికీ, శివరాజ్ సింగ్ చౌహాన్‌కు అధికారం అప్పగించొచ్చు. ఎందుకంటే మొత్తంగా చూసుకుంటే పార్టీ హవా నడుస్తోంది''అని రషీద్ వివరించారు.
''1990ల్లో బిహార్‌లో లాలూ ప్రసాద్ ప్రభుత్వం ఏర్పాటుకు ముందు తక్కువ సమయంలోనే నలుగురు ముఖ్యమంత్రులు మారారు. అయితే, అందరి ఆమోదంతో కాంగ్రెస్ ఇక్కడి పరిస్థితులు చక్కబెట్టేది. ప్రజలు, నాయకులు కూడా దానికి అలవాటు పడ్డారు. కానీ, నేడు పరిస్థితులు పూర్తిగా మారాయి''అని ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images

పార్టీని వీడిపోయిన పెద్ద నాయకులు

- గులాం నబీ ఆజాద్ - 26 ఆగస్టు 2022
- కపిల్ సిబల్ - 25 మే 2022
- హార్దిక్ పటేల్ - 18 మే 2022
- సునిల్ జాఖడ్ - 14 మే 2022
- ఆర్‌పీఎన్ సింగ్ - 25 జనవరి 2022
- కెప్టెన్ అమరీందర్ సింగ్ - 2 నవంబరు 2021
- జ్యోతిరాదిత్య సింథియా - 10 మార్చి 2020


ఫొటో సోర్స్, Getty Images
నేడు పరిస్థితులు మారాయి..
నేటి పరిస్థితుల గురించి మాట్లాడుతూ.. పార్టీలో లోటుపాట్లు గురించి వివరిస్తూ 23 మంది కాంగ్రెస్ అగ్ర నాయకులు ఒక బహిరంగ లేఖను కూడా విడుదల చేశారు. ఈ లేఖ రాసిన వారిలో గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్ ఇప్పటికే పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారు. మరోవైపు ఆనంద్ శర్మ కూడా పార్టీకి దూరం జరిగారు.
రాహుల్ గాంధీకి ఒకప్పుడు నమ్మినబంట్లుగా భావించిన జ్యోతిరాదిత్య సింథియా, ఆర్‌పీఎన్ సింగ్, జితిన్ ప్రసాద లాంటి వారు కూడా బయటకు వెళ్లిపోయారు.
ప్రజలను ఆకర్షించడంలో రాజకీయ పార్టీలు రెండు ప్రధాన అంశాలపై దృష్టి సారించాల్సి ఉంటుందని ఇంగ్లిష్ పత్రిక డెక్కన్ హెరాల్డ్ మాజీ ఎడిటర్ కె.సుబ్రమణియన్ అన్నారు. వీటిలో మొదటిది సిద్ధాంతాలు, రెండోది అధికారం అని ఆయన చెప్పారు.
''ఆరేళ్లుగా కేంద్రంలో అధికారానికి కాంగ్రెస్ దూరంగా ఉంది. 2024లో పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఎవరైనా భావిస్తున్నారా?''అని ఆయన ప్రశ్నించారు.
''నేడు 60ల వయసులో ఉన్నవారు 2029నాటికి 70లలోకి వెళ్తారు. ఇప్పుడు 70లలో ఉన్నవారు అప్పటికి 80లలోకి వెళ్తారు. అప్పటికి వారికి రాజకీయ భవిష్యత్ ఉంటుందా? వారికి ఏమైనా అవకాశాలు ఉంటాయా?''అని ఆయన వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, PTI
నేడు కాంగ్రెస్ ఇలా అభాసుపాలు కావడానికి రాహుల్ గాంధీనే కారణమని పార్టీకి చెందిన ఒక సీనియర్ నాయకుడు బీబీసీతో అన్నారు. ''నిజానికి రాహుల్ చుట్టూ కొంతమంది నాయకులు ఉంటారు. వారి ద్వారానే అన్ని పనులూ జరుగుతాయి. కనీసం ఎంపీలు కలవడానికి కూడా ఆయన సమయం ఇవ్వరు''అని ఆయన వ్యాఖ్యానించారు.
''కాంగ్రెస్ పార్టీకి నిబద్ధుడిగా ఏళ్లపాటు సేవలు అందించిన సీనియర్ నాయకు ఏకే ఆంటొనీ రాజకీయాల నుంచి పదవీ విరమణ తీసుకున్నప్పుడు ఆయనకు వీడ్కోలు పలికేందుకు రాహుల్ లేదా ప్రియాంకలకు తీరిక దొరకలేదు. ఇటీవల కాలంలో సోనియా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమె అన్ని కార్యక్రమాలకూ హాజరు కావాలని కోరుకోవడం సరికాదు''అని ఆయన వ్యాఖ్యానించారు.
''ఏళ్ల నుంచీ పార్టీకి నిబద్ధుడిగా ఉండే టామ్ వడక్కన్‌ను అందరిముందే రాహుల్ గాంధీ అవమానించారు. దీంతో ఆయన కూడా పార్టీ వదిలివెళ్లిపోయారు. రాహుల్ చెడ్డవారని నేను చెప్పడం లేదు. ప్రజలను ఎలా కలుపుకొని పోవాలో ఆయనకు తెలియదు''అని ఆయన విశ్లేషించారు.
అధికారానికి దూరం కావడం వల్లే ఇలాంటి కథలన్నీ పెద్దవిగా కనిపిస్తున్నాయని, ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తే, ఇలాంటివి ఎవరూ పట్టించుకోరని రషీద్ అంటున్నారు.
''నేడు రాహుల్ లేదా ప్రియాంకల గురించి, వారి వ్యక్తిత్వాల గురించి చాలా కథలు వస్తున్నాయి. నిజానికి వారేమీ మారిపోలేదు. వారు ఎప్పటిలానే ఉన్నారు. కానీ, వారి చుట్టుపక్కల పరిస్థితులే మారాయి''అని ఆయన విశ్లేషించారు.
అయితే, కాంగ్రెస్ సంస్థాగత నిర్మాణంలోనూ 1970ల నుంచి చాలా మార్పులు వచ్చాయని సుబ్రమణియన్ అంటున్నారు.
''అప్పట్లోనే సిద్ధాంతాల కంటే ఇందిరకు నిబద్ధుడిగా ఉండేవారికి ప్రాధాన్యం ఇవ్వడం మొదలైంది. ఆ తర్వాత కూడా గాంధీ కుటుంబానికి నమ్మినబంట్లుగా ఉండేవారికి మంచి పదవులు దక్కేవి. ఈ విధానం రానురాను మరింత బలపడింది''అని ఆయన వివరించారు.
''అయితే, దీని వల్ల దిగువ స్థాయిలో.. అంటే గ్రామ, పంచాయతీ, బ్లాక్, జిల్లా స్థాయిలో పార్టీ బలహీనపడింది''అని ఆయన చెప్పారు.
''నేడు సోనియాకు ఆరోగ్యం బాలేదు. రాహుల్ గాంధీతో ఎన్నికల్లో విజయం సాధించడం అంత తేలిక కాదు. ప్రయాంకా గాంధీ ప్రభావం కూడా ఇటీవల మనం యూపీ ఎన్నికల్లో చూశాం''అని ఆయన విశ్లేషించారు.
అయితే, కాంగ్రెస్ కోటరీ సంస్కృతి క్రమంగా బీజేపీకి కూడా విస్తరిస్తోందని సుబ్రమణియన్ అన్నారు.
''ఇక్కడ ఒకే ఒక తేడా ఉంది. అది ఏమిటంటే బీజేపీ వెనుక సిద్ధాంతాలకు ప్రాధాన్యమిచ్చే ఆరెస్సెస్ లాంటి సంస్థ ఉంది. పార్టీ ఆ సిద్ధాంతాలను అనుసరిస్తుందో లేదో ఆరెస్సెస్ నిత్యం పర్యవేక్షిస్తుంటుంది''అని ఆయన చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ప్రముఖ టీవీ యాంకర్, రచయిత రాజ్‌దీప్ సర్దేశాయ్ ఇటీవల ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. '' ఇది రెండు హైకమాండ్‌ల కథ. కాంగ్రెస్ అధ్యక్షుడిని ఎన్నుకొనేందుకు ఇబ్బంది పడుతుంటే, జేపీ నడ్డాకు మరోసారి అధ్యక్ష పదవి ఇచ్చేందుకు బీజేపీ సిద్ధం అవుతోంది. దిల్లీలో అధికారంలో ఉన్నపార్టీ వారిదే హైకమాండ్. విపక్షంలో ఉంటే హై ఉండదు. కమాండ్ కూడా ఉండదు''అని ఆయన వ్యాఖ్యానించారు.
నిజానికి మన మొత్తం కథనం ఈ అంశం చుట్టూనే తిరుగుతోంది.
ఇవి కూడా చదవండి:
- డేటింగ్ సైట్లలో అందమైన అమ్మాయిల పేరుతో నకిలీ ప్రొఫైల్స్‌ను ఎలా నడిపిస్తారు?
- టీవీ చానెళ్లలో చర్చలే దేశంలో విద్వేషాలకు ఆజ్యం పోస్తున్నాయా, యాంకర్లు ఏం చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది ?
- డిజిటల్ రేప్‌కు పాల్పడిన 75 ఏళ్ల వ్యక్తికి జీవిత ఖైదు, అసలేమిటీ కేసు?
- OSCAR: అమెరికన్ సినిమాల అవార్డులకు ఇంత క్రేజ్ ఎలా వచ్చింది? ఆస్కార్‌లో విదేశీ చిత్రాల ఎంట్రీకి నిబంధనలు ఏమిటి?
- ఇస్లాం నుంచి హిందూమతంలోకి మారిన ఒక కుటుంబం ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉంది?- గ్రౌండ్ రిపోర్ట్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













