Space Debris: పనికిరాని శాటిలైట్లు, రాకెట్ల ముక్కలు మనుషుల మీద పడే ప్రమాదం ఎంత, జాగ్రత్తపడటం సాధ్యమేనా?

- రచయిత, ఫాబియన్ జాండర్
- హోదా, బీబీసీ కోసం
అంతరిక్షంలోకి వెళ్లే ఉపగ్రహాల ప్రయాణం భూమి మీదకు ముక్కలై పడిపోవడంతో అంతమవుతుంది. స్పేస్‌లో ఉపగ్రహాల రద్దీ పెరిగిపోవడంతో అవి ఎప్పుడు, ఎక్కడ పడిపోతాయో అంచనా వేయడం పెద్ద సవాలుగా మారింది.
ఈ ఏడాది ప్రారంభంలో రెండుసార్లు అంతరిక్ష శిథిలాలు ఊహించని ప్రదేశాల్లో జారిపడ్డాయి. చైనీస్ లాంగ్ మార్చ్ 5బీ రాకెట్ మలేసియాలో పడింది. జూలైలో ఒక స్పేస్‌క్రాఫ్ట్ తునకలు ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్‌వేల్స్‌లో పడ్డాయి. అవి స్పేస్ఎక్స్ క్రూ-1 మిషన్ నుంచి పడ్డాయని తరువాత తెలిసింది.
స్పేస్ ఇండస్ట్రీ రోజుజురోజుకూ పెరిగిపోతోంది. భవిష్యత్తులో అంతరిక్షంలోకి పంపే స్పేస్‌క్రాఫ్ట్‌లు, ఉపగ్రహాల సంఖ్య పెరుగుతుంది. అలాంటప్పుడు, ఇలా శకలాలు పడే ఘటనలు కూడా పెరుగుతాయని అంచనా వేయవచ్చు. అవి ప్రమాదకారకం కావచ్చు.
ఎంత ప్రమాదకరం? ఇదీ ప్రశ్న.
అంతరిక్ష వ్యర్థాలు అంటే స్పేస్ సిస్టంలో మిగిలిపోయిన, పనికిరాని భాగాలు. కాలం చెల్లిన ఉపగ్రహం కావచ్చు. లేదా రాకెట్ సిస్టంలోని భాగాలు కావచ్చు. లక్ష్యాలను పూర్తిచేసుకుని పనికిరానివిగా మిగిలిపోయినవి ఏవైనా కావచ్చు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఆపరేషన్ 2031లో ముగుస్తుంది. అంటే దాని జీవితకాలం ముగింపుకు వచ్చేసరికి అది వ్యర్థంగా మారుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఇప్పటివరకు చైనా మూడు లాంగ్ మార్చ్ 5బీ రాకెట్లను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది. మూడింటినీ ఉద్దేశపూర్వకంగానే అనియంత్రిత కక్షల్లో విడిచిపెట్టారు. అంటే, వాటి శకలాలు ఎక్కడ పడతాయో తెలుసుకోవడం అసాధ్యం.
స్పేస్ఎక్స్ వ్యర్థాలు ఆస్ట్రేలియాలోని మంచుకొండల్లో కనిపించించాయి. స్పేస్ఎక్స్ దాని రాకెట్ భాగాలను నియంత్రిత పద్ధతిలో కక్ష నుంచి తప్పిస్తుంది. మిగతా భాగాలను భూమికి వచ్చే దారిలోనే కాలిపోయేలా డిజైన్ చేస్తుంది. అయితే, ఇదంతా అనుకున్న ప్రకారం జరగకపోవచ్చని తాజా ఘటన చెబుతోంది.
కాబట్టి, నిజంగా అంతరిక్ష వ్యర్థాలు ఎంత ప్రమాదకరం అనేది తెలుసుకోవడం ముఖ్యం.
ఇప్పటివరకు మనకు తెలిసిన సమాచారం మేరకు, కేవలం ఒక్క వ్యక్తికి మాత్రమే అంతరిక్ష వ్యర్థాలు తగిలాయి.
1997లో అమెరికాలోని ఓక్లహామా రాష్ట్రంలో టుల్సాకి చెందిన లొట్టీ విలియమ్స్‌కు అంతరిక్షం నుంచి పడిన ఓ ముక్క భుజానికి తగిలింది. అది దాదాపు ఆమె చేతి పరిమాణంలో ఉంది. అది డెల్టా 2 రాకెట్ తునక అయి ఉండవచ్చని భావించారు. ఆమె ఆ ముక్కను ఇంటికి తీసుకెళ్లి, మర్నాడు ప్రభుత్వ అధికారులకు తెలియజేశారు.
స్పేస్‌లోకి వెళ్లే ఉపగ్రహాల సంఖ్య పెరుగుతున్నకొద్ది, ఇలా రాలి పడే తునకలు మనుషులకు తగిలే అవకాశాలు పెరుగుతాయి. ముఖ్యంగా లాంగ్ మార్ 5బీ లాంటి పెద్ద, అనియంత్రిత పరికరాలైతే వాటి తునకలు మనుషులకు తగిలే అవకాశాలు ఉంటాయి.
ఈ మోడల్ రాకెట్‌ను చైనా మూడుసార్లు లాంచ్ చేసింది. మొదటి మోడల్ వ్యర్థాలు 2020 మే 11న ఆఫ్రికాలో ఐవరీ కోస్ట్‌లోని రెండు గ్రామాల్లో పడ్డాయి. రెండవది 2021 మే 9న మాల్దీవ్స్‌లో పడింది. మూడవది ఈ ఏడాది ఇండోనేసియా, మలేసియాలలో పడింది.

ఫొటో సోర్స్, Getty Images
మనం ఆందోళన చెందాలా?
అంతరిక్ష వ్యర్థాలు పైనుంచి కిందకు పడి, మనుషులకు తగిలే అవకాశాలపై వివిధ రకాల అంచనాలు ఉన్నాయి. కానీ, చాలావరకు అధ్యయనాలు 10,000లలో ఒక అవకాశం ఉందనే చెబుతున్నాయి. అది కూడా ప్రపంచంలో ఎక్కడైనా, ఏమూలైనా ఎవరికైనా తగిలే అవకాశాలు పదివేలల్లో ఒకటి. ప్రత్యేకంగా మీకో, నాకో తగిలే అవకాశాలు కోట్లలో ఒకటి.
ఇది కాకుండా, అంతరిక్ష వ్యర్థాలు స్పేస్‌లోకి వెళ్లే పరికరాల సంఖ్యను ప్రభావితం చేయవచ్చు.
ప్రస్తుతం ప్రపంచంలో వివిధ స్పే ఏజెన్సీలు అంతరిక్షంలోకి రాకెట్లు, ఉపగ్రహాలు,స్పేస్‌షిప్‌లను పంపే ఏర్పాట్లు చేస్తున్నాయి.
చైనా టియాంగాంగ్ స్పేస్ స్టేషన్ 2022 చివరికల్లా పూర్తి కానుంది. ఇటీవల సౌత్ కొరియా ఒక టన్ను కన్నా ఎక్కువ బరువున్న ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిన ఏడవ దేశంగా అవతరించింది. అలాగే, తమ స్పేస్ సెక్టర్‌ను విస్తరించుకునే ప్లాన్‌లో ఉంది. జపాన్, రష్యా, భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇప్పటికే ఆపనిలో ఉన్నాయి.
వీటన్నింటి వల్ల అంతరిక్ష వ్యర్థాల తునకలు మనుషులకు తగిలే అవకాశాలు పెరుగుతాయిగానీ, ఆ శాతం చాలా చిన్నదిగానే ఉంటుందని ఆశిస్తున్నారు.
మనం దీనికి ఎలా సిద్ధపడాలి?
ఇక్కడ రెండు ప్రశ్నలు. వ్యర్థాలు భూమి మీద ఎప్పుడు పడతాయో అంచనా వేయగలమా? రిస్క్ తగ్గించడానికి మనమేం చేయగలం?
వ్యర్థాల తునకలు ఎప్పుడు పడతాయో చెప్పడం దాదాపు అసాధ్యం. ఒక సాధారణ నియమం ఏమిటంటే, భూమి మీదకు వచ్చే సమయాన్ని అంచనా వేయడంలో అనిశ్చితి, మిగిలిన కక్ష సమయంలో 10 నుంచి 20 శాతం ఉంటుంది.
అంటే ఒక పది గంటల్లో వ్యర్థాలు కిందకు పడతాయి అనుకుంటే సుమారు గంట అటూ ఇటుగా అవి భూమి మీద పడవచ్చు.
వ్యర్థాలు భూమి మీదకు వచ్చే సమయాన్ని సరిగా అంచనా వేయాలంటే ఇంకా చాలా పరిశోధన జరగాలి. అలాగే, ఏ ప్రదేశంలో పడుతుందో చెప్పడం కూడా కష్టమే. 1,000 కిమీ పరిధి లోపల అంచనా వేయడం కష్టమే.
ప్రమాదాన్ని తగ్గించే పద్ధతులు
రిస్క్ తగ్గించడం సవాలే. కానీ, కొన్ని మార్గాలున్నాయి.
ముందుగా, భూమి మీదకు వచ్చేవి సురక్షితంగా, జనాభా ఎక్కువలేని ప్రాంతాల్లో ల్యాండ్ అయేలా చూసుకోవాలి. సాధారణంగా దీని కోసం సౌత్ పసిఫిక్ ఓషన్ అన్ఇన్‌హాబిటేటెడ్ ఏరియా (SPOUA)ను ఎన్నుకుంటారు. దీన్నే స్పేస్‌క్రాఫ్ట్ స్మశానం అని కూడా అంటారు.
అలాగే, భూమి మీదకు వచ్చేటప్పుడు పరికారల్లో భాగాలు పూర్తిగా విచ్ఛిన్నమయేలా డిజైన్ చేయడం. భూమి ఉపరితల వాతారణంలోకి రాగానే కాలిపోయేవైతే ఏ ప్రమాదం ఉండదు.
అంతరిక్ష వ్యర్థాల గురించి అమెరికా ఇప్పటికే కొన్ని గైడ్‌లైన్స్ రూపొందించింది.
అయితే, ఈ గైడ్‌లైన్స్ అంతర్జాతీయంగా చెల్లుబాటు అవుతాయా, వాటిని ఎవరు అమలుచేయాలి లాంటి ప్రశ్నలకు జవాబులు తెలియాల్సి ఉంది.
చివరిగా, అంతరిక్ష వ్యర్థాలు మనుషులకు తగిలే అవకాశం ఉంటుందా? అనే ప్రశ్నకు ఒక్క ముక్కలో జవాబు చెప్పాలంటే.. ప్రస్తుతానికి లేదు.
అంతరిక్ష వ్యర్థాలపై ఇంకా చాలా పరిశోధన జరగాల్సి ఉంది.
(ఈ కథనాన్ని మొదట 'ది కాన్వర్జేషన్'లో ప్రచురించారు. క్రియేటివ్ కామన్స్ లైసెన్స్ కింద తిరిగి దీన్ని ప్రచురిస్తున్నాం.)
ఇవి కూడా చదవండి:
- 'దత్తతకు దరఖాస్తు చేసుకుని మూడేళ్లయినా మాకు బిడ్డ దొరకలేదు'- ఇండియాలో ఇలాంటి మాటలు ఎందుకు వినిపిస్తాయి
- పోల్‌పాట్ క్రూర పాలన: 20 లక్షలమందిని చంపిన కేసుల్లో నిందితులు ఎందరు, ట్రిబ్యునల్ ఏం సాధించింది
- నరేంద్ర మోదీ వరల్డ్ లీడర్ అయ్యారా, భారత్ అంతర్జాతీయ శక్తిగా మారిందా...
- లెస్టర్‌లో హిందూ, ముస్లింల మధ్య హింసకు ‘భారత్ కనెక్షన్’ ఏంటి?
- మెక్సికో: 8 ఏళ్లుగా 43 మంది విద్యార్థులు మిస్సింగ్.. ఏమి జరిగిందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













