నాసా: ఆర్టెమిస్ మూన్ రాకెట్ ప్రయోగం రెండో ప్రయత్నం

ఎస్‌ఎల్‌ఎస్ రాకెట్
    • రచయిత, జోనాథన్ ఆమోస్
    • హోదా, బీబీసీ సైన్స్

చంద్రుడి మీదకు అత్యంత శక్తిమంతమైన రాకెట్‌‌ను ప్రయోగించేందుకు అమెరికా శనివారం నాడు రెండో ప్రయత్నం చేయబోతోంది. మొదటిసారి గత సోమవారం ఈ రాకెట్‌ను ప్రయోగించాలనుకున్నప్పుడు నాసాకు సాంకేతిక సమస్యలతో పాటు వాతావరణ సమస్యలు కూడా ఎదురయ్యాయి.

యాభై ఏళ్ళ తరువాత మనిషిని చంద్రుడి మీదకు పంపించే ప్రయత్నాలను మళ్ళీ ప్రారంభించిన నాసా ఈ 'ఆర్టెమిస్ మూన్ రాకెట్' ప్రయోగంపై ఎంతో ఉత్తేజంగా ఉంది. దీన్ని ఫ్లోరిడాలోని కెనెడీ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించబోతున్నారు.

"మేం ఈ ప్రయోగానికి సిద్ధంగా ఉన్నాం. ఈ ప్రయోగం ఎలా ఫలిస్తుందో చూడాలి" అని నాసా ఆర్టెమిస్ మిషన్ మేనేజర్ మైక్ సారాఫిన్ విలేఖరులకు తెలిపారు.

భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి 11 గంటలకు ఆర్టెమిస్ ప్రయోగం ప్రారంభం అవుతుంది.

చంద్రుడి మీదకు వ్యోమగాములను పంపించడమే ఈ 100 మీటర్ల ఆర్టెమిస్ ఉద్దేశ్యం. 1972లో ప్రాజెక్ట్ అపోలో ముగిసిన తర్వాత ఈ ప్రయత్నం జరగలేదు.

ఆర్టెమిస్-1 కేవలం సాంకేతిక ప్రయోగం మాత్రమే. ఈ స్పేస్ క్యాప్సూల్‌లో మనుషులు ప్రయాణించరు. కానీ, అన్నీ ఊహించినట్లుగా జరిగితే, 2024లో ప్రయోగించనున్న ఆర్టెమిస్-2 చంద్రుని పైకి కచ్చితంగా వ్యోమగాములను తీసుకుని వెళుతుంది.

ఆర్టెమిస్ ప్రయోగం పట్ల ప్రతి ఒక్కరు కాస్త సహనం వహించాలని, ఒకవేళ ఇది మరింత వాయిదా పడినా కూడా ఆశ్చర్యపోవద్దని నాసా వ్యోమగామి జెస్సికా మైయర్ చెప్పారు.

"నాసాలో పని చేసే తీరు ఇదే విధంగా ఉంటుంది. ఈ స్పేస్ లాంచ్ సిస్టం (ఎస్‌ఎల్‌ఎస్) లో వ్యోమగాములు ప్రయాణిస్తారు. ఇందులో చివరకి నా స్నేహితులు, సహోద్యోగులు కూడా ప్రయాణిస్తారు. ఈ ప్రయోగం కచ్చితంగా విజయవంతం అయ్యేలా చూడాలి" అని ఆమె అన్నారు.

ఎస్‌ఎల్‌ఎస్ గ్రాఫిక్

రాకెట్లో ఉన్న నాలుగు ఇంజన్లలో ఒక ఇంజన్‌లో తగినంత ఉష్ణోగ్రతలు లేకపోవడంతో సోమవారం జరగాల్సిన ప్రయోగాన్ని నిలిపేశారు.

ఈ అంశాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు ప్రస్తుతం రాకెట్ లాంచ్‌కి సిద్ధంగా ఉందని తేల్చారు.

ఎస్‌ఎల్‌ఎస్ భూమి ఉపరితలం నుంచి పైకి దూసుకుని వెళ్లేందుకు 8 నిమిషాల సమయం పడుతుంది.

లాంచ్ చేయటానికి 10 సెకన్ల ముందు రాకెట్‌ కింద అమర్చివున్న నాలుగు ఆర్ఎస్-25 ఇంజన్లు మండుతాయి. కౌంట్‌డౌన్ జీరోకు చేరగానే.. రాకెట్‌కు ఇరువైపులా అమర్చిన బూస్టర్లు మండుతాయి. సరిగ్గా అదే సమయంలో రాకెట్‌ను లాంచ్ ప్యాడ్‌లో నిలబెట్టి ఉంచిన బోల్టులు కూడా విడిపోతాయి.

దీంతో, రాకెట్ తన పైభాగంలో అమర్చిన ఓరియాన్ క్యాప్సూల్‌ సహా.. నేల మీది నుంచి నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళుతుంది. కొన్ని క్షణాల్లోనే దాదాపు గంటకు 30,000 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

ఓరియాన్ స్పేస్‌క్రాఫ్ట్ పైన ఉన్న 'లాంచ్ అబార్ట్ సిస్టమ్' కాలిఫోర్నియాలోని సాన్ డియోగో సముద్ర తీరంలో అక్టోబరు11న పడిపోతుంది.

ఈ ప్రయోగం మొత్తం 38 రోజుల పాటు కొనసాగుతుంది. అయితే, ఈ స్పేస్ క్రాఫ్ట్ పరిమితులను అర్ధం చేసుకునేందుకు ఈ ప్రయోగ నిడివిని మరింత పెంచాలని ఇంజనీర్లు కోరుతున్నారని నాసాలో ఓరియాన్ ప్రోగ్రాం సీనియర్ సలహాదారుడు అనెట్ హాస్ బ్రూక్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)